Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం, 2002(ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ)కు సంబంధించిన 2006 ప్రకటనను 2022 నవంబర్ చివర్లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఎఫ్ఈఎమ్ఏ), పీఎంఎల్ఏల కింద ఉల్లంఘనల విచారణ బాధ్యత గల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు తప్పనిసరిగా సమాచారాన్ని చేరవేసే అవసరమున్న 15 అదనపు సంస్థలతో ఈ సవరణ ద్వారా ఓ జాబితా తయారైంది. దీనికంటే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ద ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్, ఇంటిలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి విచారణా సంస్థలతో పాటు పది సంస్థలు ఈ జాబితాలో ఉండేవి. పీఎంఎల్ఏ, ఎఫ్ఈఎమ్ఏలు అడ్డుకోవాలనుకుంటున్న నేరాల సంబంధిత సమాచారం ఉన్న ఎజెన్సీల నుండి సమాచారాన్ని సాధించడం దీని లక్ష్యం.
గతంలో న్యాయ సాధనాలను అమలు చేసేందుకు సమాచార సేకరణలో ఎక్కువ సంస్థలను చేర్చేవారు. కానీ ఇలాంటి విస్తరణ కూడా, ఈ చట్టాల కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన మార్పులను సూచిస్తుంది. ఆ కారణంగానే ఇటీవల జాబితాలో 15ఏజెన్సీల చేర్పింపు వివాదంగా మారిందని రుజువవుతుంది. పీఎంఎల్ఏను ఒక ఆయుధంగా ఉపయోగించడం ద్వారా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారిని, ఆర్థిక నేరాల్లో భాగస్వామ్యం ఉందనే సాకుతో కోర్టుకు ఈడ్చే చర్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంటున్నది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆమ్ఆద్మీ పార్టీలతో పాటు ఇతర ప్రత్యర్థి పార్టీల నాయకులపై కూడా దాడులు చేసి, అరెస్ట్ చేసి, ప్రశ్నించడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ పాలక పార్టీకి, దాని భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని ఉపయోగించడంలో అంత శ్రద్ధ కనపరచడం లేదు. చట్టాన్ని ఉపయోగించడంలో కనిపిస్తున్న ఈ తేడా వలన చట్టం దుర్వినియోగం అవుతుందనే సందేహం కలగడం న్యాయసమ్మతం అనిపిస్తుంది.
పీఎంఎల్ఏ మూలాలు
ఒకసారి గుర్తు చేసుకుంటే, పీఎంఎల్ఏను మొదటిసారి చట్టంగా తెచ్చినపుడు, నేరాల ద్వారా పొందిన ఆస్తుల్లో భాగస్వామ్యమై, అది కలుషితం కాని ఆస్తిగా దానిని దాచిపెట్టిన వారే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చినట్లు చెప్పారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, లేదా నేరాల ద్వారా సంపాదించిన ఆస్తికి సంబంధించిన ప్రక్రియల్లో భాగస్వామ్యం అవడంతో పాటు, అక్రమ ఆస్తి సంపాదన, రహస్యంగా ఆస్తిని కలిగి ఉండటం, ఆ ఆస్తిని ఉపయోగించడం, ఆ ఆస్తి పీఎంఎల్ఏ కిందకు వచ్చే ఏ నేరం ద్వారా సంపాదించని, కలుషితం కాని ఆస్తిగా చెప్పే వారిని మనీ ల్యాండరింగ్లో పాల్గొన్నట్లు చెప్పారు. చట్టసభలచే గుర్తించబడని నేరాలకు ఈ చట్టాన్ని ఉపయోగించరాదు. వాస్తవానికి మనీ ల్యాండరింగ్ కేసులో సంపాదించిన ఆస్తి అలాంటి ప్రక్రియల్లో భాగస్వామ్యం అవడం ద్వారా సంపాదించినట్లు గుర్తిస్తే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. ఒక నేరంపై ఫిర్యాదు లేదా చార్జ్ షీట్ దాఖలు అయినప్పుడు మాత్రమే పీఎంఎల్ఏ తనిఖీ చేసి, ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రక్రియకు అనుమతి ఉండేది. తమ ఆస్తి నేరాలకు పాల్పడకుండా సంపాదించిన ఆస్తి అని దాచే ప్రయత్నం చేసిన సందర్భంలోనే పీఎంఎల్ఏను ఉపయోగించాలనే స్పష్టమైన పరిశీలన ఉండేది.
మొదట మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2009 ఫిబ్రవరిలో పార్లమెంట్లో తెచ్చిన సవరణ బిల్లు ఆమోదంతో గుర్తించబడిన నేరాల సంఖ్య స్థిరంగా పెరిగింది. ఆస్తులను వశం (అటాచ్మెంట్) చేయకుంటే విచారణకు భంగం కలుగుతుంది కాబట్టి తనిఖీ చేసి స్వాధీనం చేసుకొని, ఆస్తులను వశం చేసుకునే అధికారాలున్న సంస్థల జాబితా కూడా పెరిగింది. ఉగ్రవాద పెట్టుబడులు, మనీ ల్యాండరింగ్లను నిలువరించే అధికారాలున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) లాంటి ఒక అంతర్జాతీయ సంస్థలోకి భారతదేశం ప్రవేశించాలనే కారణంతోనే అప్పటి ప్రభుత్వం ఇలాంటి అనేక మార్పులను సమర్థించింది.
కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఉపయోగించడం ద్వారా దానిని అమలు చేసే విషయంలో కార్యనిర్వహకశాఖ పేర్కొన్న నిరోధ-సమతుల్యతలను (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) నీరుగార్చడమే ఈ సవరణ లక్ష్యంగా మారింది. అంతేకాక, పీఎంఎల్ఏ వర్తించే ''నేరపూరిత చర్యల''ను కూడా ఈ చట్టం విస్తృత పరిచింది.ఈ మార్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఇతర ప్రతిపక్ష పార్టీలకు ప్రతికూలంగా మారింది. కానీ 2019లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఈ చట్టంలోకి క్రూరంగా, బలవంతంగా ప్రవేశించే విధంగా మరిన్ని భారీ మార్పులను చేపట్టింది. ఈ సవరణలు ద్రవ్య బిల్లులు లేదా వార్షిక యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆర్థిక చట్టాల లాంటి బిల్లులుగా ప్రవేశపెట్టి ఆమోదం పొందాయి కాబట్టి ఈ సవరణలు వివాదం అయ్యాయి.
ద్రవ్య బిల్లులు
పన్నుల విధానం, ద్రవ్య వినిమయం లాంటి కోశ సంబంధిత అంశాలకు సంబంధించిన వాటిని ద్రవ్య బిల్లులు అంటాం. రాష్ట్రపతి సంతకం కోసం పంపడానికి ముందు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందాల్సిన ''సాధారణ బిల్లులు'', ''ఫైనాన్షియల్ బిల్లుల''తో పోల్చితే ఈ ద్రవ్య బిల్లులకు ప్రత్యేకమైన హౌదా ఉంటుంది. ఒకవేళ ఈ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందిన తరువాత రాజ్యసభలో తిరస్కరించబడితే, పార్లమెంట్ ఉభయసభలను ప్రత్యేకంగా సమావేశపరచి ఆ బిల్లులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపున కోశ సంబంధ అంశాలకు సంబంధించిన ద్రవ్య బిల్లుల విషయంలో రాజ్యసభ ఆమోదం అవసరం లేదు, కేవలం లోక్సభ మెజారిటీ ఓట్లతో ఆమోదిస్తే సరిపోతుంది. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ సభ్యుల సంఖ్య లేదు కాబట్టి, పీఎంఎల్ఏకు చేసే సవరణకు అధికారిక ఆమోదం కోసం ద్రవ్యబిల్లు మార్గాన్ని ఉపయోగించారు. లేకుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఆ సవరణను తిరస్కరించడం లేదా నిలుపుదల చేసి ఉండెడిది.
ఈ చట్ట సమ్మతం కాని మార్గాన్ని స్వీకరించడానికి కారణం ఉన్నట్లు కనపడింది. పీఎంఎల్ఏను ఏర్పాటు చేసిన సందర్భంలో కార్యనిర్వహకశాఖ అధికారాల విస్తరణకు ఉద్దేశించబడినవే 2019 సవరణలు. నేరాల ద్వారా పొందిన లాభాల లక్షణాలు, చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్న నేరపూరిత చర్యల ద్వారా సంపాదించిన ఆస్తులను చేర్చడానికి వారు చట్టానికి ఉండే అవకాశాలను విస్తరించారు. అన్నింటినీ మించి, చట్ట సవరణ ప్రకారం ఈ చట్టం కింద అరెస్ట్ చేయడం చాలా తేలిక, నిందితుడికి బెయిల్ మంజూరు కావడం చాలా కష్టం. ముఖ్యంగా సవరించిన చట్టం ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్)ను ఈడీ(బెయిల్ పొందకుండా) నిందితుడితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ మార్పుల కారణంగా పీఎంఎల్ఏ కిందకు వచ్చే కేసుల సంఖ్య ఎన్డీఏ పాలనలో చాలా వేగంగా పెరిగింది.
పెరుగుతున్న దాడులు
రాజ్యసభలో శివసేన సభ్యురాలు ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇస్తూ, 2022 మార్చి నాటికి ఎన్డీఏ ప్రభుత్వం ఎనిమిది ఆర్థిక సంవత్సరాలను పూర్తి చేసుకుంది. యూపీఏ పాలనా కాలంలో (2004-2014) ఈడీ చేపట్టిన 112 దాడులతో పోలిస్తే ఎన్డీఏ కాలంలో చేపట్టిన దాడులు 27 రెట్లు అంటే 3010దాడులు జరిగాయని సమాధానం ఇచ్చాడు. కానీ ఎన్డీఏ పాలనా కాలంలో జరిగిన దాడుల్లో కేవలం 992 కేసుల్లో మాత్రమే చార్జిషీట్లు దాఖలు చేశారు, 2022 మార్చి నాటికి అందులో కేవలం 23 కేసుల్లోనే నేర నిరూపణ అయింది. అంతేకాక, పీఎంఎల్ఏ కింద జరిగిన దాడులు, విచారణలు అసమతూకంగా ప్రధానంగా ప్రతిపక్ష రాజకీయ నాయకులకు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే స్వరాల వైపు మాత్రమే గురి పెట్టారు.
మరీ ఇటీవల కాలంలో పెరిగిన ఈడీ అధికారాలు, సుప్రీంకోర్టు తీర్పుతో బాగా బలపడ్డాయి. ఒక కేసుకు సంబంధించిన (ఏ.ఎం.ఖాన్ విల్కర్, దినేష్ మహేశ్వరి, సీ.టీ.రవికుమార్ లతో కూడిన) ప్రత్యేక ధర్మాసనం, ద్రవ్య బిల్లులుగా ఆమోదం పొందిన 2019 సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను, సవరణ బిల్లులోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల నుండి విడగొట్టడానికి ప్రాధాన్యతనిచ్చింది. విడగొట్టిన తరువాత ఆ ధర్మాసనం పీఎంఎల్ఏకు చేసిన ముఖ్యమైన సవరణలను సమర్థించిన ఫలితంగా దాడులు చేసి, అరెస్ట్ చేసే అపరిమితమైన అధికారాలను ఈడీకి కట్టబెట్టారు. అంతేకాక బెయిల్ పొందాలంటే, నిందారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే తాను ఏ నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తీర్పుకు ప్రతిస్పందనగా 17ప్రతిపక్ష పార్టీలు దాని దీర్ఘకాలిక చిక్కుల వల్ల కలిగే ఇబ్బందులను వ్యక్తం చేస్తూ ఒక సంయుక్త ప్రకటన చేశాయి. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని హానికరంగా, దురుద్దేశంతో వారిపై రాజకీయ ప్రతీకారానికి అనుమతించే విధంగా ఈ తీర్పు ప్రభుత్వ యంత్రాంగాలను బలోపేతం చేస్తుందని వారు భావించారు.
పీఎంఎల్ఏ వర్తించే నేరాల పరిధి విస్తతం చేయబడడం, అలాగే రాజకీయ ప్రతీకారం తీర్చుకోడానికి చట్టాన్ని ఒక సాధనంగా దుర్వినియోగం చేస్తున్నారని సూచించే రుజువులు పెరగడం, వెంటనే శరణుగోరే హక్కు లేకుండా వివిధ రూపాల్లో శిక్షల విధింపు అతి సాధారణంగా మారిన మాట నిజం. ఈ నేపథ్యంలోనే ఈడీకి సమాచారాన్నందించే 15సంస్థలను అదనంగా చేర్చే నిర్ణయాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది.
ఇది పాలక పార్టీ రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకొని పోవడాన్ని, నేరపూరిత కార్యకలాపాల అనుమానాన్ని సమర్థించే సమాచార సేకరణను సరళం చేస్తుందనేది స్పష్టం. అంతేకాక ప్రభుత్వం, పెద్ద వ్యాపారానికి కూడా చట్ట పరిధిని విస్తరించింది. ఇది కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాను సమాచార భాగస్వామ్యానికి చెందిన సంస్థల్లో చేర్చడాన్ని బట్టి రుజువు అయింది. అది కార్పొరేట్ గ్రూపుల నుండి వెళ్ళే రాజకీయ విరాళాల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందా లేదా అనేది వేచిచూడాలి. ''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో
- సి.పి. చంద్రశేఖర్
అనువాదం:బోడపట్ల రవీందర్
సెల్:9848412451