Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశం రిపబ్లిక్‌గా మారి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండే మనుస్మృతి అనే చట్టం గద్దె దిగాలి. కాని అలా జరగలేదు. అది మన తలల్లోకి ఎక్కించారాయె అంత సులభంగా ఎలా దిగుతుంది! రాజ్యాంగాన్ని ఆమోదించిన రాజ్యాంగ సభలోనూ మనుస్మృతి కొనసాగాలని బలంగా కోరుకొనేవారు ఉన్నారు. కోర్టులు, ప్రభుత్వ వ్యవహారాలు ఎలా ఉన్నా సమాజంలో అదే చెలామణి కావాలనుకొనే వారికి రాజ్యాంగ సభలో కొదవలేదు. అలాంటి బాపతులున్నారు కనుకనే మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించే బిల్లును న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రవేశపెట్టినప్పుడు ప్రముఖ నాయకులంతా దాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా అంబేద్కర్ మంత్రి పదవిని త్యజించి చట్టసభల వెలుపల తన సామాజిక పోరాటాన్ని కొనసాగించారు. రాజ్యాంగ రచనా సంఘానికీ అధ్యక్షుడిగా దాన్ని రూపకల్పనకు కీలకమైన బాబాసాహెబ్నే ప్రభుత్వం బయటకు నెట్టింది. సభ కిమ్మనలేదు. మన నాయకులపై మనుస్మృతి ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఆ పరిణామమే చాటి చెప్పింది.
రాజ్యాంగ సభ నాటికి ఉన్న సభ్యుల్లో కొందరు 1952 ఎన్నికల తర్వాత ఏర్పడిన సభలో లేకపోవచ్చు. కొందరు కొత్త సభ్యులు రావచ్చు. కాని పార్లమెంట్ మౌలిక స్వభావంలో మార్పులేదు కనుక రాజ్యాంగంపై మనుస్మృతే ఆధిక్యత చూపింది. గంగోత్రిలోనే మాలిన్యం ఉన్నప్పుడు గంగ స్వచ్ఛంగా ఎలా ఉంటుంది? స్వాతంత్య్రానికి ముందు ముస్లింల పాలనలోనూ క్రైస్తవ ఆంగ్లేయుల పాలనలోనూ మనుస్మృతే రాజ్యమేలింది. మనుస్మృతి శూద్రులకు, మహిళలకు కనీస మానవ హక్కులను నిరాకరిస్తుంది. అందుకనే 1927లోనే డిసెంబర్ 25న అంబేద్కర్ ఆ గ్రంథాన్ని తగలబెట్టాడు. మనుస్మృతి ప్రతికూల రిజర్వేషన్లను అమలు చేసింది. చదువు, ఆస్తులు, రాజకీయాలు వగైరాలను కొందరికే రిజర్వు చేసింది. మెజారిటీకి గాడిద చాకిరి రిజర్వుచేసి రాచి రంపాన పెట్టింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక అమలయిన రిజర్వేషన్లు దేశ దిశను మార్చాయి. మనుస్మృతిని తగలెట్టడానికి కొద్దికాలం ముందే బొంబాయి ప్రావియెన్స్ అసెంబ్లీలో చెరువులు, బహిరంగ స్థలాలు, వగైరాలను అంటరాని వారు కూడా ఉపయోగించుకోవడానికి అనుమతించాలని బోలె అనే సభ్యుడు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆంగ్లేయ ప్రభుత్వం ఆమోదించి దాన్ని అమలు చేయాలని ఉత్తర్వు ఇచ్చింది. కాని తానుగా ప్రభుత్వం దాని అమలుకు పూనుకోలేదు. ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేయలేదు. ఆ ఉత్తర్వు అమలు కోసమే మహద్ సత్యాగ్రహం, మహద్ పట్టణం పరిధిలోకి వచ్చే చౌదర్ చెరువుపై పోరాటం జరిగాయి. ఆ పోరాటం సందర్భంగానే బాబాసాహెబ్ మానవ హక్కులను నిర్థాక్షిణ్యంగా దేవుడి పేరుతో అణిచి వేసే మనుస్మృతిని తగలబెట్టి చరిత్రను సృష్టించారు. మానవ హక్కులు అన్న దృష్టితో చూసినప్పుడు మహద్ సత్యాగ్రహానికి ఎంతటి చారిత్రక ప్రాముఖ్యత ఉందో, మను స్మృతిని దహనం చేసిన ఘట్టానికీ అంతటి ప్రాముఖ్యం ఉంది.
మహాత్మాగాంధీకి ముందు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన బాల గంగాధర్ తిలక్ తీరును గమనిస్తే ఆయనపై మనుస్మృతి ప్రభావం దేశంలో ఏ స్థాయిలో ఉండిందో మనకు అర్థమవుతుంది. బొంబాయి ప్రావియెన్స్లో ఉవ్వెత్తున ఎగసి పడిన సామాజిక ఉద్యమాల ప్రస్తావనను కూడా తిలక్ తాను నడుపుతున్న 'కేసరి' పత్రికలో రానివ్వలేదు. ఇతర పత్రికల్లో కూడా సామాజిక ఉద్యమాల వార్తలు వచ్చేవి కావు. అంబేద్కర్ తాను నడిపిన పత్రికల గురించి వాణిజ్య ప్రకటనల రూపంలో నయినా 'కేసరి'లో కన్పించాలన్న ప్రయత్నాన్ని కూడా తిలక్ నెరవేరనివ్వలేదు. ఇవేవి కాక తాళీయంగా జరగలేదు. ఆయన పునరుద్ధరణవాద ధోరణే అందుకు కారణం. తిలక్ ఒక వ్యక్తి కాదు. ఆయన పెద్ద సంస్థ. మహారాష్ట్రులకే కాదు జాతీయస్థాయి నాయకుడు. ఆయన ధోరణి చాలామంది స్వాతంత్రోద్యమ నాయకులకు ఉండింది. కాగా మహద్ పోరాటం, పోలీసుల లాఠీచార్జి ఆనాడు ప్రపంచ దృష్టినాకర్షించాయి. భారతదేశంలోని సామాజిక స్థితి ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. తిలక్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రమంగా గాంధీజీ నాయకత్వం నెలకొంది. అప్పటిదాకా తిలక్‌కు శిష్యులుగా ఉన్నవారు కాంగ్రెస్‌ను వదలి ఆర్ఎస్ఎస్లోకి వెళ్లి దాని విస్తరణకు తోడ్పడ్డారు. కనుక ఆనాటి రాజ్యాంగసభలోని సభ్యుల వారసులు అనేక మంది నేడు బీజేపీలో నాయకులు కావడం యాదృశ్చికమేమీకాదు. నాయకులు కార్యకర్తల్లోనే కాదు నేడు సాధారణ జనంలో కూడా మనుస్మృతి భావజాలం బలంగానే ఉందని మీడియాను, సోషల్ మీడియాను గమనిస్తే తెలిసిపోతుంది.
ఈ సందర్భంగా గతవారం బొంబాయి హైకోర్టు వారి సన్మాన సభలో ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనుంజరు యశ్వంత్ చంద్రచూడ్ ప్రసంగాన్ని ప్రస్తావించడం అవసరం. ఆ సభలో ఆయన 'నైతికత చట్టం' అన్న అంశంపై మాట్లాడుతూ కులాంతర వివాహితుల హత్యలు దేశంలో ప్రతి ఏటా వందల - సంఖ్యలో జరుగుతున్నాయని, ఖాఫ్ పంచాయతీలు ఇంకా పనిచేస్తున్నాయని ఎత్తిచూపారు. తమ అమ్మాయి కులాంతర పెండ్లి చేసుకొన్నదని అమ్మాయినో ఆమె భర్తనో తల్లితండ్రులు చంపేస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి హత్యలు న్యాయమేనన్న భావన కొందరు ప్రజల్లో కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కులదురహంకార హత్యలకు పెట్టిన ముద్దు పేరు హానర్ కిల్లింగ్ (పరువు హత్య)ను ఆయన డిస్ హానర్ కిల్లింగ్‌గా అభివర్ణించి తన నిరసనను చాటారు. సమాజంలో ఉండే ఆచారాలను సాంప్రదాయాలను భావనలను చీఫ్ జస్టిస్ నైతికత (మోరల్)గా చెప్పారు. చట్టానికి భిన్నంగా ఉందని అన్నారు. డిస్ హానర్ హత్యలు భారతదేశంలో తప్ప ఇతర దేశాల్లో లేవు. మహిళా స్వేచ్ఛకు ప్రాధాన్యతనివ్వని పాకిస్తాన్‌లోనూ డిస్ హానర్ కిల్లింగ్స్ కన్పించడం లేదని, యూరపు దేశాల్లో ఎప్పుడో అలాంటి హత్యలు ఆగిపోయాయని లెక్కలు చెపుతున్నాయి.
మనదేశంలో సామాజిక మార్పులు వేగంగా రావడం లేదు. వేల ఏండ్లుగా చెలామణి అయిన మనుస్మృతి భావనలు ఆ మార్పును అడ్డు కొంటున్నాయి. భారత పౌరులందరూ సమానమేనంటూ రాజ్యాంగం చెప్తుండగా మనుస్మృతి, దానివల్ల ఏర్పడిన భావనలు అంగీకరించవు. అడుగడుగునా అడ్డుపడ్తున్నాయి. దేశంలో మెజారిటీ కుటుంబాలు ఆ కట్టుబాట్లను దాటి బయటపడలేక పోతున్నాయి. పుట్టుకలోనే ఉచ్చనీచాలుంటాయని మనుస్మృతి నమ్మబలుకుతుంది. కులంతో పాటు మహిళకు కూడా మనుస్మృతి నీచస్థాయిని కల్పించింది. మనుస్మృతిలోని అనేక శోక్లాలు మహిళలు హీనమైన వారని చెప్తాయి. మన ఉపదేశకులు మనుస్మృతి జోలికి వెళ్లరు. దాన్ని ఖండించరు. మనుస్మృతి కాదు రాజ్యాంగం, చట్టం ప్రామాణికమని వారు చెప్పరు. పంచాయితీ నుండి పార్లమెంట్ దాకా రిజర్వేషన్ వల్ల స్త్రీలు ఎంపికయినా, వారిపై రాజకీయ పెత్తనం సాగిస్తున్నది భర్తలే. అతన్నే ప్రజా ప్రతినిధిగా భావించే పౌరులే మన దేశంలో ఎక్కువ. ఈ భావనకు కూడా మనుస్మృతి సృష్టించిన భావజాలమే కారణం.
మనుస్మృతిని విమర్శిస్తే గింజుకొనే వారు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. హిందువులం కనుక మనుస్మృతిలోని ఆచారాలను, ఆంక్షలను పాటించడం తప్పదని అనుకొంటారు. వర్ణం, కులం, మహిళలపై మనుస్మృతి విధించిన ఆంక్షలకు, 1950 నుండి మన దేశంలో అమల్లోకి వచ్చిన రాజ్యాంగానికి పొత్తు కుదరదు. రాజ్యాంగం ఆధునికమైంది. మెజారిటీ ప్రజలకు మేలు చేసేది. మనుస్మృతి వారికి హాని కల్గించేది. అది జన బాహుళ్యాన్ని నిస్తేజితులను చేస్తుంది. కర్మగా భావించి సరిపెట్టుకొమ్మంటుంది. బ్రాహ్మణులు తమ స్వీయ ప్రయోజనం కోసం రాసుకొని మొత్తం సమాజంపై రుద్దిన చట్టం మనుస్మృతి. స్కృతి ఆరంభంలోనే అనేక అంతరాలతో సమాజం ఉండాలని, బహు సంఖ్యాక శ్రమజీవులపై అల్పసంఖ్యాక పరాన్నజీవుల పెత్తనాన్ని రుద్దడం ఎలా అన్నదే మనుధర్మ శాస్త్రం సారాంశమని దాని రెండవ శ్లోకంలో స్పష్టమవుతుంది.
మనుస్మృతి తమను ఎంత దిగజార్చిందో దళితులు గమనించినంతగా, మహిళలు ఇతర శూద్రులు గమనించక పోవడం వల్ల మనుస్మృతిని పాడెనిక్కించే పోరాటం నేడు చాలా వరకు దళితులకే పరిమితమై ఉంది. వేల ఏళ్ల పాటు మనదేశంలో చెలామణి అయిన ఈ రాకాసి చట్టం 'వదల బొమ్మాళి వదల' అన్నట్లు నేటికీ మన సమాజాన్ని వెంటాడుతూనే ఉంది. మనుస్మృతి ఒక కాలంలో ఒక వ్యక్తి రాసింది కాదు. దాదాపు 400 ఏండ్ల పాటు పండితులు తమ అంచనాలను, అవసరాలను అందులో జొప్పించారు. మనకు ఇప్పుడు చట్టసభలు ఆమోదించిన చట్టాలున్నాయి. వాటికి సవరణలు జరుగు తుంటాయి. అది ప్రజాస్వామిక పద్ధతి. కాని ఇప్పుడు అవేవీ పాటించకుండా కేంద్రంలోని ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మందబలంతో చట్టాలను సవరిస్తున్నాయి. కొత్త చట్టాలను ఆమోదించుకొంటున్నాయి. అలా చేయడం వల్ల మరణించాల్సిన మనుస్మృతిని తిరిగి బతికించడమే అవుతుంది. ప్రజాస్వామ్యం పేర అప్రజాస్వామిక మనుస్మృతి ఎలా చెలామణి అవుతుందని చెప్పడానికి అది కూడా ఒక ఉదాహరణ.
మనుషులను నాలుగు వర్ణాలుగా దేవుడే విభజించినట్లు మనువు చెప్పాడట. నాలుగింటిలో బ్రాహ్మణుడు అందరికంటే పై నుంటాడు. శూద్రులు అట్టడుగున ఉంటారు. మనుస్మృతి ప్రకారం శిక్షలు కూడా వర్ణ ప్రాతిపదికపైనే ఉంటాయి. ఇప్పుడు శిక్ష వేయడం మనుస్మృతి ప్రాతిపదిక కాకున్నా జైల్లో శిక్ష అమలు కులం ప్రాతిపదిక గానే ఉంటుందని వింటాం మనం. భర్త చోరుడైనా, జారుడైనా, రోగిష్టి అయినా ఎలాంటి వాడైనా అతనికి భార్య సేవలు చేయాలని, అతన్ని వదిలి పెట్టరాదని మనుస్మృతి శాసిస్తుంది. మగ సంతు లేకపోతే మగవాడికి మరో పెళ్లి చేసుకొనే అవకాశం ఇస్తుంది. అలాంటి అనుమతి మహిళకు లేదు. ఇప్పుడు అధికారికంగా రెండో పెళ్లికి అనుమతి తేలికగా దొరకక పోయినా ఆడశిశవును కడుపులో ఉన్న దశలోనే హత్య చేస్తున్నారు. ఇలా సర్వ అనర్ధాలకు కారణమైన మనుస్మృతినీ, దాని భావనలను అంబేద్కర్ స్ఫూర్తితో తగలబెట్టాలి.
- ఎస్. వినయకుమార్