Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అమ్మా ''కంజోర్'' అంటే ఏమిటమ్మా!'' అడిగాడు చింటూ అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ!
''ఏమోరా! నాకూ అంతబాగా తెలియదు! మీ నాన్న వచ్చాక అడుగుదాంలే ముందు అన్నం తిను!'' అంటూ చింటూ వాళ్ళమ్మ అన్నం పెట్టబోయింది!
''ఉహూ! ముందునాకు చెబితేనే అన్నం తింటా!'' అంటూ మారాం చేశాడు చింటూ.
''ఏమిట్రా? ఏమైంది!'' అంటూ ఎంట్రీ ఇచ్చాడు చింటూ వాళ్ళ నాన్న.
''చూడు నాన్నా! అమ్మను ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పటం లేదు! నాకు తెలియదు! అంటోంది!'' అన్నాడు చింటూ.
''రేరు! చింటూ! మీ అమ్మ 10వ తరగతి వరకే చదివింది! మనమో! డిగ్రీ చదివాం రా! నీ డౌటేంటో అడుగు చిటికెలో చెప్పాస్తాను! తగ్గేదేలే ఆఁ...'' అన్నాడు చింటూ వాళ్ళ నాన్న స్టైల్‌గా.
అంతే! చింటూగాడు తల్లిని విదిలించుకుని వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు.
''ఇప్పుడు చెప్పరా అబ్బారు, నీ డౌటేమిటో!'' మళ్ళీ అడిగాడు తండ్రి, కొడుకుని.
''కంజోర్'' అంటే ఏమిటి నాన్నా!'' మళ్ళీ అడిగాడు చింటూ.
''ఓస్! ఇంతేనా! ఇదో పెద్ద ప్రశ్న! ఈ ప్రశ్నకి కూడా మీ అమ్మకి జవాబు తెలియదు! హ్హు ! నేను చెబుతాను విను. కంజోర్ అంటే బలహీనమైన, చేతగాని అని అర్థం!'' అన్నాడు నాన్న.
''అయితే కంజోర్ హిందీ'' అంటే ఏమిటీ? చేతగాని హిందీ ఉంటుందా!'' మళ్ళీ అడిగాడు చింటూ.
ఒక్క క్షణం తికమక పడ్డాడు. చింటూ వాళ్ళనాన్న మెదడులో రింగులు గిరా గిరా తిరిగాయి. ఆ తర్వాత అర్థమైంది! తాను ఎంతగానో అభిమానించే లీడర్ మాట్లాడందని, అయితే అదంతా చింటూగాడికెలా వివరించాలో అర్థంకాలేదు! మనసులో కొంత ఎక్సర్సైజు చేసుకున్నాడు.
''ఓరే చింటూ! హిందీ చాలా గొప్ప భాష! అది సాధారణ మనుషులకు సరిగ్గా అర్థం కాదు! హిందీ జాతీయభాష అంత గొప్ప భాషను సగం సగం నేర్చుకుని మాట్లాడటం వల్ల కంజోర్ హిందీ అని అన్నారు! వివరించే ప్రయత్నం చేశాడు చింటూ వాళ్ళ నాన్న.
''తెలంగాణ వాళ్ళు కంజోర్ హిందీ మాట్లాడుతారని అన్నారు కదా! దానర్థం ఏమిటి నాన్నా!'' మళ్ళీ అడిగాడు చింటూ.
''ఇందాక చెప్పాను కదరా! సగం సగం నేర్చుకుని మాట్లాడితే కంజోర్ హిందీ అంటారు. తెలంగాణ వాళ్ళకి పూర్తిగా హిందీ రాదు. అందుకే అలా అన్నారు!'' అన్నాడు చిరాగ్గా నాన్న.
''అట్లయితే మన ప్రధాని చాలా సార్లు కంజోర్ తెలుగు మాట్లాడారు కదా! ఆయన కూడా కంజోరేనా?'' అడిగాడు చింటూ అమాయకంగా.
''ఏరా! వెధవా చిన్నా పెద్దా లేదా! దేశ ప్రధానిని పట్టుకుని అంతమాటంటావా? తంతాను జాగ్రత్త!'' అంటూ ఉగ్రరూపం దాల్చాడు. చింటూ వాళ్ళ నాన్న.
''దేశ ప్రధానిని నేనేమీ పట్టుకోలేదు! టీవీల్లో ఆయన మాటలు విన్నాను. ఇప్పుడు చెప్పింది విన్నాను. నాకట్లా అర్థమైంది!'' అన్నాడు చింటూ తండ్రిని విదిలించుకుని తల్లి ఓళ్ళోకెళ్ళి కూచుంటూ.
''ఇదంతా నీ ట్రెయినింగే! కాంగ్రెస్ పార్టీకి ఎప్పట్నించి సపోర్టు చేస్తున్నావు?'' అన్నాడు ఎగతాళిగా భార్యను చూస్తూ...
''బాగుంది వరస! నేను కాంగ్రెస్‌కి సపోర్టు చేస్తున్నానని మీకెవరు చెప్పారు! ముందు చింటూగాడడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి!'' అన్నది చింటూ వాళ్ళమ్మ,
''వెధవ! వేలెడంత లేడు వాడికేమిటీ చెప్పేది!'' కస్సుమన్నాడు చింటూ వాళ్ళనాన్న.
''ఓహౌ! అయితే నీవు కూడా కంజోరేనన్న మాట!'' అన్నాడు చింటూగాడు ఏదో అర్థమైనట్లు.
''ఏమిట్రా ఏమన్నానవు!'' కోపంతో ఊగిపోయాడు తండ్రి.
''మరి! సగం సగం తెలిస్తే కంజోర్ అన్నావు. నేనడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకుండా నన్ను బెదిరిస్తున్నావు'' అన్నాడు చింటూ తల్లి వెనక దాక్కుని.
ఒక్కసారి చల్లబడిపోయాడు తండ్రి! రేవంత్‌రెడ్డి మాట్లాడింది కంజోర్ హిందీ అయితే, మోడీ తన ఉపన్యాసాల్లో మాట్లాడేది కంజోర్ తెలుగు కాదా! అని అడుగుతున్నాడు కొడుకు. ఒకటో రెండో తెలుగు వాక్యాలు హిందీలో ముక్కున పట్టి ఉపన్యాసాల్లో ఆ రెండు తెలుగు వాక్యాలు మాట్లాడేసి, మిగిలిన దంతా హిందీలోనే మాట్లాడు తారు! అది కంజోరే కదా! ఏమి మాట్లాడాలో తోచటం లేదు! తండ్రికి.
''భాషలన్ని సమానమే! రాజ్యాంగం అన్ని భాషలను సమానంగా గౌరవించింది! మన తెలుగు మనకు గొప్ప. హిందీ మనకు గొప్ప కాదు! గొప్పగా రాదు కూడా! ఎందుకంటే మన మాతృభాషలో ఉన్న సౌకర్యం ఇతర భాషల్లో ఉండదు! ఒక భాషలో ఇతర భాషా పదాలు కలవటం, అవి కొద్దో, గొప్పో రూపాంతరం చెంది చక్కని భాషా పదాలు ఏర్పడటం సహజ ప్రక్రియ! ఇంగ్లీష్ నవెల, తెలుగు నవల, ఆక్సీజన్ ఆమ్లజనిగా మారాయి! అంత మాత్రాన ఇంగ్లీషు భాష గొప్పదైపోదు! తెలుగు సమెసా, మిర్చిబజ్జీ ఇంగ్లీషులోకి యథాతథంగా వెళ్ళిపోయాయి! అందుకే తోటి భాషను ముఖ్యంగా తెలంగాణ యాసను గౌరవించటం నేర్చుకోవాలి. ఉర్దూ ప్రభావం తెలంగాణపై చాలా ఉంది. అది చరిత్ర. తెలంగాణ హిందీపై కూడా ఉర్దూ ప్రభావం ఉంటుంది. ఇవేవీ పట్టించుకోని తెలుగింటి తమిళ కోడలు హిందీయే తన మాతృభాష అయినట్లు, తెలంగాణ వాళ్ళని కంజోర్ అని ఎగతాళి చేయట మంటే, తనదెంత కంజోర్ వ్యక్తిత్వమో మీరు తెలుసుకోవటం మంచిది!'' అంది చింటూ వాళ్ళమ్మ.
అర్థమైనట్లు తలూపాడు చింటూ వాళ్ళనాన్న! ఏమీ అర్థం కాకపోయినా చప్పట్లు కొట్టాడు చింటూ.
-ఉషాకిరణ్