Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రేఖకవతలి వారంతా నేరగాళ్ళు
రేఖను రక్షించడానికే
న్యాయస్థానాలు, రక్షక భటవర్గాలు
చెరసాలలు, ఉరికొయ్యలు'' ఎన్ని అనుభవాల్ని వడబోస్తే శ్రీశ్రీ ఆ మాటలు చెప్పగలిగాడో! ప్రతికార్మికుడికీ, ప్రతి కార్మిక సంఘానికీ ఇవన్నీ నిత్యానుభవాలే! కొందరికీమాటలు ఆశ్చర్యంగా తోస్తాయి. ఇప్పుడు చెరసాలలెక్కడున్నాయి? ఉరికొయ్యలు అసలే లేవుకదా!? అనే చొప్పదంటు ప్రశ్నలకు కొదవేముంది? నేడు పని గంటలు పెరిగాయి. యంత్రాల వేగమూ పెరిగింది. అంటే పని తీవ్రతా పెరిగింది. దోపిడీ ఎన్నోరెట్లు పెరిగింది. అది ఒక బొగ్గుగనిలోనో, ఒక స్పిన్నింగ్ మిల్లులోనో, ఒక జ్యూట్ ఫ్యాక్టరీలోనో మాత్రమే కాదు. సర్వే, సర్వత్రా ఇదే! యంత్రాల్లో యంత్రాలై నలిగిపోవడమే కాదు, యంత్రంలేకపోయినా ఆశాలు, అంగన్వాడీలు, ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులూ... ఇలా అన్ని రంగాల్లోనూ బారెడు చాకిరీతో, మూరెడు జీతాలతో సమస్తరంగాల కార్మికులూ సతమతమవుతున్నారు. జీతాలు పెరిగే మార్గాలు కనపడక కొందరు, అధికారుల వేధింపులు తాళలేక మరికొందరు జీవితాలు అస్తవ్యస్తమై సీలింగ్ ఫ్యాన్లే 'ఉరికొయ్య'లుగా వేలాడుతూంటే ఇక 'గవర్నమెంట్' ఉరికొయ్యలెందుకు? సర్వవ్యాపితమైన కాంట్రాక్టు బతుకులకు తెలంగాణ వచ్చిన తరువాత 'ఆంధ్ర పాలకులు' 2012లో ఇచ్చిన జీవోకి రెక్కలొచ్చి పైకెగురుతుందేమోనన్న కార్మికుల లక్షల కళ్ళు ఎదురు చూసి చూసి కాయలు కాసి, ఎండిపోయి, రాలిపోతున్నాయే గాని, ఒక్కపైసా కొత్తగా 'మొలిచింది' లేదు. తెలంగాణ కార్మికులకు వొరిగిందీ లేదు. ఈలోగా 2014లో బ్రిటిష్ ఆర్థికవేత్త గైస్టాండింగ్ రాసిన 'ప్రికేరియట్' మన దేశమంతా విస్తరించింది. అప్పుడు లేని (2014లో) స్విగ్గి, జొమాటోలు ఇప్పుడొచ్చాయి. లేదా ఇప్పుడు విస్తరించాయి. 'ఔట్ సోర్సింగ్' ఉద్యోగాలు పెరిగాయి. ప్రిన్సిపుల్ యజమాని ప్రెమిసెస్‌లో, వారి యంత్రాలపై పనిచేసే వారిని ఔట్సోర్సింగ్ కార్మికులనరాదన్న తర్కం పట్టించుకునే వారేరీ? అనేక ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో రిటైర్డ్ అధికార్లే ఔట్సోర్సింగ్ యజమానులని ఈ రచయిత స్వంత అనుభవం. మోడీ పుణ్యాన అవతరించిన నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్హాన్స్మెంట్ మిషన్ క్రమంగా అనేక పరిశ్రమల్లో విస్తరిస్తున్నది. అప్రంటీస్ చట్టాన్ని సవరించి ఉత్పత్తి నిండా అప్రంటీస్లను నింపుతున్నారు. గతంలో వాజ్‌పారు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్‌ను అమల్లోకి తెచ్చింది. వామపక్షాల మీద ఆధారపడినందువల్ల యూపీఏ-1 ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మళ్ళీ మోడీ సర్కార్ దీనినే అమల్లోకి తెచ్చింది. అనేక సంఘటిత రంగ పరిశ్రమల్లో శాశ్వత కార్మికులకు మించి పైమూడు క్యాటగిరీలు కుప్పలు తెప్పలుగా కనపడుతున్నారు. వీరిని సంఘటితం చేసే మార్గాలు అన్వేషించడం తప్ప మరో మార్గం లేదని సిఐటియు రాష్ట్ర 4వ మహాసభలో ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ అన్నారు. అదే సిఐటియు మార్గమన్నారు. ముప్పయ్యేండ్ల క్రితం ఒక ఫ్యాక్టరీలో అత్యధిక మంది శాశ్వత కార్మికులు, కొద్దిగా క్యాజువల్, కాంట్రాక్టు కార్మికులు. నేడు ఆపరిస్థితి రివర్స్ అయ్యిందని పై పరిస్థితి తెలియజేస్తున్నది. కార్మికుల్లో అంతర్గతంగా యాజమాన్యాలు నిర్మించిన గోడలవి. వాటిని కూల్చి కార్మికుల్ని ఐక్యం చేయకపోతే ఆ గోడల మధ్య, ఇరుకు గదుల్లో ఊపిరాడక కార్మికులు దెబ్బతింటారు. ఆ విధంగా నాశనం అయ్యే కార్మికుల కోసం చెరసాలలెందుకు? ఉరికొయ్యెలెందుకు?!
జాతీయోద్యమ వారసత్వాన్ని కొనసాగిద్దాం!
ఫ్రొఫెసర్ ఇందు మల్హోత్రా చెప్పింది నిజం. సంఫ్‌ు పరివార్ చెపుతున్నట్లు భారతీయులు పోరాడింది విదేశస్తుల మీద కాదు, బ్రిటిష్ సామ్రాజ్యవాదంపైన! వారు మన దేశాన్ని కొల్లగొట్టిన విధానంపైనా! తక్కువ ధరకి పత్తి, చెరకు వంటి ముడి సరుకుల్ని కొల్లగొట్టి, వారి దేశంలో తయారైన పారిశ్రామిక ఉత్పత్తులను డంప్ చేయడం వారి దోపిడీలో కీలకమైంది. వారిదేశంలోకి వెళ్ళే మన చేనేత బట్టపై అధిక సుంకాలు విధించి, ఇంగ్లండు నుండి మన దేశంలోకి వచ్చే మిషన్ బట్టపై దానికంటే అనేక రెట్లు తక్కువగా సుంకం విధించి మన చేనేతను ధ్వంసం చేశారు. (సుకుమల్సేన్ ప్రామాణిక గ్రంథం 'భారత కార్మికోద్యమ చరిత్ర'లో దాన్ని సోదాహరణంగా వివరించారు) ఉదాహరణకు 1818- 1836 మధ్య భారతదేశం నుండి ఒక గజం ఎగుమతి అయితే ఇంగ్లండ్ నుండి 5,200 గజాలు దిగుమతి అయ్యింది. ఇది మన రాట్నాన్ని ధ్వంసం చేసిందని 'బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా'లో1853లోనే కార్ల్‌మార్క్స్ రాశారు. ఇదీ సామ్రాజ్యవాద దోపిడీ. దీన్ని దాదాపు 200 ఏండ్లు మన జాతీయోద్యమం వ్యతిరేకించింది. మన కార్మికులు, రైతులు సంపద సృష్టించుకుంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాన్ని హస్తగతం చేసుకుంటోందనే వాదన కోట్లాదిమంది భారతీయులు చేశారు. జాతీయోద్యమంలో అది రణ నినాదమయ్యింది.
దాంతో ఏ సంబంధం లేని పార్టీ నేడు గద్దెనెక్కింది. 'అంబానీ, అదానీ పలుకుల్ని ఉచ్ఛరించే చిలుక నోట్లోంచి 'కార్పొరేట్లే సంపద సృష్టికర్త'లనే మాటకాక ఇంకేమొస్తుంది. మన దేశం తన కాళ్ళపై తాను నిలబడాలనే స్పృహ జాతీయోద్యమంలో నుండే వచ్చింది. బ్రిటన్ దోపిడీపై పోరాడిన చైతన్యంలో నుండి వచ్చినదది. ఆ చైతన్యమే ప్రభుత్వరంగమై విలసిల్లింది. కీలక పరిశ్రమలు, బొగ్గు, ఇతర గనులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగం వంటివి ప్రభుత్వరంగంలో ఉండటం వల్లే మన దేశం అమెరికా హుకుంలకు ఏనాడూ తలదించలేదు. నేడు హౌల్‌సేల్ ప్రయివేటీకరణకి నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా దేశ సంపదను పెట్టుబడిదార్ల దొడ్లోకి తోడిపోస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండా విద్యుత్ రంగం, టెలికమ్యూ నికేషన్లు, బొగ్గుగనులు, ఎయిర్ పోర్టులు, చివరికి క్రీడామైదానాలు వంటి వాటిని ముప్పయేండ్లు కిరాయికిస్తారట! తాము ప్రయివేటు చేయడం లేదని మోడీ బృందం వాదన! ''అత్తసొమ్ము అల్లుడి దానం'' అంటే ఇదే కదా!
ఈ ఆదాన ప్రదానాలను అనుమతించరాదని దేశ కార్మికవర్గం గత ముప్పయ్యేండ్లుగా చేస్తున్న ఆందోళన నూతన దశకి చేరుకుంది. పెద్ద ఎత్తున సామాన్య ప్రజానీకాన్ని చైతన్య పరిచి ఈ ప్రతిఘటనోద్యంలో అంతర్భాగం చేయాలని సిఐటియు రాష్ట్ర మహాసభ నిర్ణయించడం అత్యంత ముదావహం. లేకుంటే ప్రభుత్వ విద్యా, వైద్యంతో పాటు రవాణరంగం కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయే ప్రమాదం మన ముంగిట్లోనే ఉంది.
అడ్డుగావున్న గోడలు తుత్తునీయలు చేద్దాం!
మన దేశంలో కుల వ్యవస్థ హిందూ సమాజాన్ని అడ్డంగా చీల్చి దొంతర్లుగా పేర్చింది. దీన్నే అంబేద్కర్ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అన్నారు. దీన్ని యథాతథంగా కాపాడుతూ నిలువు గోడలు నిర్మించడానికి అంటే మతాల వారీ చీల్చడానికి సంఫ్‌ు పరివార్ ప్రయత్నిస్తున్నది. అగ్రకులోన్మాదం బుసలు కొడుతున్నది. ఈ దశలో సామాజిక సమస్యలపై పనిచేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగింది సిఐటియు. సిఐటియు గుర్తింపు సంఘంగా ఉన్నచోట బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేయాలని డిమాండ్ చేయడం, దళితుల పట్ల ఏ రూపంలో వివక్ష కనపడ్డా ప్రతిఘటించడం సిఐటియు అనుబంధ యూనియన్లే చేస్తున్నాయి. కెవిపిఎస్కు ఆర్థికంగా చేయూత నివ్వడమే గాక వారు నిర్వహించే కార్యక్రమాల్లో సాధారణ కార్మికులను భాగస్వాములను చేసింది సిఐటియు రాష్ట్రంలో. సామాజిక సమస్యలను వర్గ ప్లాట్ఫార్మ్ నుండే అంటే సిఐటియు వేదిక నుండే చేపట్టాలనే అఖిల భారత మహాసభల నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు జరిపే ప్రయత్నం జరిగింది. శతాబ్దాల అణిచివేత నిర్మించిన గోడలు ధ్వంసం కాకపోతే కార్మికవర్గ ఐక్యత అసాధ్యమన్న స్పృహ సిఐటియుకు ఉన్నది.
పోరాడే ప్రపంచం మనతో ఉంది!
నయా ఉదారవాదం ముగింపు దశకి వచ్చిందని ఇటీవల ఐ.ఎం.ఎఫ్. పేర్కొన్న విషయాన్ని తపన్‌సేన్ అన్నది సత్యం. అందుకే దీన్ని వ్యవస్థాగత సంక్షోభం అంటున్నారు. ఇది కొద్దిరోజుల్లో సమసిపోయే సైక్లిక్ సంక్షోభం కాదు. దీనికి లేపనాలు చాలవు. ఆపరేషన్ తక్షణావసరం. లాటిన్ అమెరికా కార్మికులు పోరాడటమే కాదు, ప్రత్యామ్నాయాలు సృష్టిస్తు న్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులు ప్రభుత్వాలను బోడ్లో వేలేసి నిలేస్తున్నారు. జోసెఫ్ స్టిగ్లిడ్జ్, థామస్ పిక్కెటి వంటి పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలుకూడా ఈ సంక్షోభాన్ని నివారించకపోతే పెట్టుబడిదారీ విధానమే కుప్పకూలిపో తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే మనదేశ కార్మికవర్గానికి వారు ఒంటరిగాలేరనే చైతన్యం కల్పించాలన్న ప్రయత్నం విజయవంతమవ్వాలి.
గరిష్ట ఐక్యతతో పటిష్ట పోరాటం
వారి జెండా రంగు లేవైనా అందరం ఐక్యంగా పోరాడదామనడంతో పాటు అందుకు సిఐటియునే చొరవ చేయాలని దాదాపు అన్ని కార్మిక సంఘాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం వెనుక పెరుగుతున్న ఐక్యతావాంఛ ఉంది. కార్మికులెదుర్కొనే సమస్యలకు పాలకుల విధానాలే కారణమనే విశ్వాసం ఉంది. మోడీ సర్కార్ తెచ్చిన కోడ్లను వెనక్కి కొట్టాలన్నా, కేసీఆర్ ప్రభుత్వం కనీస వేతనాలను సవరించా లన్నా నేడు కార్మికోద్యమ ఐక్యత కీలకం. కార్మిక సంఘాల మధ్య సైద్ధాంతిక ఐక్యతే కాదు, కార్మికుల్లో సైద్ధాంతిక కృషి చేయాల్సిన ఆవశ్యకతని సిఐటియు 4వ మహాసభ నొక్కి చెప్పింది.
- ఆర్. సుధా భాస్కర్