Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజా సంక్షేమ పథకాల, వాటిని అమలుచేసే పాలకుల, ప్రభుత్వాల రాజకీయ పక్షపాత విమర్శ జరుగుతోంది. నేటి కేంద్రపాలక పక్షం ఎన్నికల సంక్షేమ పథకాలను ప్రకటించింది. పాక్షికంగా అమలు చేసి రాజకీయ లబ్ధి పొందింది. ఏరు దాటి తెప్ప తగలేసినట్లు ప్రతిపక్షాల పాలనలలోని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మాత్రం ఈ కేంద్ర నాయకులు పక్షపాతంతో విమర్శి స్తున్నారు. సహేతుక సంక్షేమం సంపూర్ణాభివద్ధికి దారిదీపమని మరిచారు. మరొక వైపు మేము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని అమలుచేస్తున్నారని, మా సొమ్ము అలగా జనానికి ఖర్చవుతోందని, మాకు అన్యాయం జరుగుతోందని నూతన మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజలు వాదిస్తున్నారు.
సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగవేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తికార సంస్థలు చాలా ఉన్నాయి. పేదలు, క్రింది మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీసిగరెట్లు, మద్యం, సబ్బు షాంపూలు, బియ్యం, ఉప్పు పప్పులపై పన్నులు పరోక్ష పన్నులే. వినియోగదారులు వీటిని తప్పించుకోలేరు. మనం సమాజం నుండి ప్రాథమిక అవసరాలను తీర్చుకుంటాము. సౌకర్యాలను పొందుతాము. మనం రోజూ వాడే రోడ్లు, కార్యాలయాల భవనాలు, గ్రంథాలయాలు, బళ్ళు, ఆస్పత్రులు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి, అని తేల్చటం కష్టం. అందుకే పాలకులు పౌరసంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు. పెట్టుబడిదారీ ప్రభుత్వాలు సంపన్ను లపై పన్నులలో పక్షపాతాలకు, పేదలపై పన్నులలో అసమంజస తలకు, అన్యాయాలకు పాల్పడతాయి.
శ్రమ శక్తి మాత్రమే గల కార్మికులు సామాజిక వనరులను, సౌకర్యాలను తక్కువగా వాడుకుంటారు. స్థానిక ప్రయాణాలే చేస్తారు. వాళ్ళ సుదీర్ఘ దీర్ఘకాల యాత్రలు బతుకుదెరువు కోసమే. చదువుకోనివారు విద్యాలయాలను, గ్రంథాలయాలను వాడరు. సంపన్నులతో పోల్చితే ఆరోగ్యసౌకర్యాలను తక్కువే వాడుతారు. చదువరులపై, ప్రత్యేకించి వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం వగైరా వృత్తి విద్యలను అభ్యసించేవారిపై ఎక్కువ ప్రజాధనం ఖర్చవుతుంది. విద్యావంతులు సమాజం నుండి అధికంగా నేర్చుకుంటారు. సమాజ సంపద, మౌలిక సదుపాయాలనూ ఎక్కువగా వినియోగిస్తారు. వీరిలో బుద్ధీజీవులు మేధోవలసతో సొంత అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వాల అసమర్థ విధానాలు వీరికి దోహదపడతాయి. పేదల కంటే, వత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాని వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లిచవలసినదాని కంటే తక్కువే చెల్లిస్తారు. రైతు కంటే చిరుద్యోగి స్థిరాదాయం పొందుతాడు. అందుకే ప్రజలు చపరాసి ఉద్యోగమైనా కోరుకుంటారు. సంపన్నులు విలాసాలకు సహజ వనరులను ఖర్చుచేస్తారు. కాలుష్యాలను పెంచుతారు. పేదలు ఈ పనులు చేయరు. మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాం. మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారన్న సంపన్నుల ప్రచారంలో వాస్తవం లేదు. వ్యవసాయదారులకు, సామాజికంగా వెనుకబడ్డవారికి, కూలీలకు ఇచ్చే సంక్షేమ పథకాలు సామాజిక ప్రయోజనాలే. ఉత్పత్తి ఉత్ప్రేరకాలే.
ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల చేత ప్రజాపాలన జరుగుతుంది. పాలనలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రాజకీయ పార్టీకి నిర్దిష్ట సిద్ధాంతాలు, పాలనా పద్దతులు ఉంటాయి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి, ఎక్కువ స్థానాలు పొందిన పార్టీ, లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రాష్ట్రాన్ని, దేశాన్ని రాజ్యాంగబద్దంగా పాలించాలి. ఎన్నికల వాగ్దానాలను, ప్రకటించిన ప్రణాళికలను ప్రజలకు అనుకూలంగా అమలుచేయాలి. ప్రజా పక్షాలయిన వామపక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు పేదల, సామాన్యుల సంక్షేమం చూస్తాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి కార్పొరేట్ పార్టీలు వాణిజ్యవేత్తల, సంపన్నుల ప్రయోజనాలను కాపాడుతాయి.
కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు సమాజం నుండి పలు రూపాలలో అపార సమాచార జ్ఞాన సంపదలను పొందుతారు. నిజానికి వీరికి ప్రోత్సాహకాలు అవసరం లేదు. కాని వత్తి వాణిజ్య సంస్థల, పరిశ్రమల స్థాపన, నిర్వహణలలో సమాజం నుండి ఎక్కువ సౌకర్యసహకారాలను పొందేది వీరే. ప్రభుత్వాల నుండి మౌలిక సదుపాయాలను, బ్యాంకుల నుండి ఆర్థిక సహాయంగా ప్రజాధనాన్ని అప్పులుగా పొందుతారు. తమ వాణిజ్య సంస్థల్లో ప్రజలకు భాగస్వామ్య కల్పన నెపంతో ప్రజల డబ్బును సేకరిస్తారు. నామమాత్రపు సొంత సొమ్ముతో అధిక లాభాలు సంపాదిస్తారు. చాలా మంది ప్రభుత్వ బ్యాంకుల అప్పులు ఎగరగొట్టి నల్ల సంపాదన పెంచుకుంటారు. వీళ్ళు ఎంత ఎక్కువగా ప్రభుత్వ సౌకర్యాలు, రాయితీలు పొందితే అంత ఎక్కువగా శ్రామిక శ్రమ శక్తి దోపిడి జరుగుతుంది. అంతగా వారి లాభాలు, సంపదలు పెరుగుతాయి.
పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు వారి శ్రమ శక్తి ఉపయోగాన్ని, సౌకర్యాల వెసులుబాట్లను మాత్రమే పెంచుతాయి. వారి నిత్యావసరాల వెంపర్లాటను కొంత తగ్గిస్తాయి. దీనితో వారి దిన కూలీ పెరగదు. కాని వారి శ్రమ సాంద్రత, సామర్థ్యం, ఉత్పత్తి స్థాయి, యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివద్ధిచెందుతాయి. అందువల్ల సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు, దేశోన్నతి, దేశాభివృద్ధి సాధనాలే.
ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టివిలు వాడేవారు పేదలుకారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలు, సాధనాలు. సెల్ఫోన్ దినకూలి పని సంపాదనలో, అందుకు అవసరమైన సాధనాల సమకూర్పులో, పనిస్థలాల నిర్ణయంలో, పనిస్థలాలకు చేరడానికి ఉపయోగపడుతుంది. నగరీకరణలో కార్మిక వాడలు ఊరి బయట, పనిస్థలాలు వాటికి దూరంగా ఉంటాయి. ఇది వరకు ఊరిలోనేపని. అక్కడికి కాలినడకతో లేదా సైకిళ్లపై చేరుకునేవారు. నేటి సుదూర పనిస్థలాలకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేరడానికి మోటర్ సైకిళ్ళు అవసరం. కూలీలు బ్యాంకు అప్పుతో మోటర్ సైకిళ్ళు కొంటారు. విలాస వినోదాల కోసం వినోద కేంద్రాలకు, సినిమా థియేటర్లకు పేదలు ఖర్చుపెట్టలేరు. నెలకు 2, 3 వందల ఖర్చుతో టివిలో పలు రకాల వినోద కార్యక్రమాలను మాత్రం చూడగలరు. వీటిల్లోనూ ప్రజలను మత్తుల్లో ముంచే ప్రదర్శనలే ఎక్కువన్నది వేరు వాస్తవం.
రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు జనజీవితాలను సంపద్వంతుల కోణం లో కాక శ్రామిక దృక్పథంతో చూడాలి. పేదలను, కార్మికులను మనుషులుగా గుర్తించాలి. మానవు లుగా పరిగణించాలి. సంక్షేమ వాగ్దానాలతో కుర్చీనెక్కిన రాజకీయులు అప్పులు, అపాత్రాల బూచితో సంక్షేమాలకు అడ్డుతగులరాదు. రాజకీయ వ్యక్తిగత కక్షలను ప్రజలపై తీర్చుకోరాదు. ప్రత్యర్థు లను రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతేగానీ వారిని ఓడించడానికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు గండికొట్టరాదు. కేంద్ర సహాయాలను తగ్గించరాదు. ఆపరాదు. రాజకీయ విజ్ఞతను ప్రదర్శించాలి కాని అల్పత్వాన్ని కాదు.
-సంగిరెడ్డి హనుమంత రెడ్డి
సెల్: 9490204545