Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబర్ 2021 మాసంతో పోల్చితే అక్టోబర్ 2022లో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 4శాతం పడిపోయింది. సహజంగానే దీని గురించి చర్చ జరుగుతోంది. ఇలా పడిపోవడానికి కోవిడ్ లాక్డౌన్ కారణం అంటూ సాకులను ఇప్పుడు చూపించడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ కాలంలో కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఏమీ లేదు. కాబట్టి ఈ మారు పారిశ్రామిక ఉత్పత్తి ఈ విధంగా పడిపోవడం మన దేశ ఆర్థిక వ్యవస్థలో లోతుగా వేళ్ళూనుకునివున్న ఏదో రోగాన్ని సూచిస్తోంది.
అయితే, తక్షణం కనిపిస్తున్న ఈ పారిశ్రామిక ఉత్పత్తి పతనాన్ని మాత్రమే చూస్తే గత కొంత కాలంనుంచీ మన పారిశ్రామిక ఉత్పత్తిలో ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటున్నదన్న వాస్తవం మరుగున పడిపోతుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచికను లెక్కించేందుకు ప్రాతిపదికగా ఒకానొక సంవత్సరపు ఉత్పత్తిని మూల సంవత్సరంగా ఎంచుకుంటారు. అయితే, మన ప్రభుత్వం ఆ మూల సంవత్సరాన్ని పదే పదే మార్చేస్తూ వుంటుంది. అందువలన వేర్వేరు మూల సంవత్సరాల ప్రాతిపదికలన లెక్కించే పారిశ్రామిక సూచికలను పోల్చి చూడడం గందరగోళంగా ఉంటుంది. దానిని నివారించేందుకు మనం 2011-12 మూల సంవత్సరంగా లెక్కించిన సూచికను ప్రాతిపదికగా తీసుకుందాం. మన దగ్గర ఉన్న తాజా ప్రాతిపదిక అదే.
2011-12 నుంచి 1091-20 వరకూ, అంటే కరోనా మహమ్మారి కన్నా ముందరి కాలంలో, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 29శాతం మాత్రమే పెరిగింది. అంటే సగటున ఏడాదికి 3.2శాతం పెరుగుదల మాత్రమే ఉంది. ఇది చాలా తక్కువ. అంతకు మునుపటి ఏ కాలానికి సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తితో పోల్చినా ఇది చాలా తక్కువ. మన నయా ఉదారవాద మేథావులు 1951-1965 సంవత్సరాల మధ్య కాలాన్ని ''హిందూ వృద్ధి రేటు కాలం''గా పరిగణిస్తారు. ప్రభుత్వ జోక్యం మితిమీరిపోయివున్నందున ఆ కాలంలో దేశంలో ఆర్థికవృద్ధి చాలా తక్కువగా నమోదైందని విమర్శిస్తారు. ఎదుగూ బొదుగూ లేని ఆర్థికవృద్ధి అని చెప్పడానికి వెటకారంగా ''హిందూ వృద్ధిరేటు'' అని అంటారు. అయితే, అటువంటి కాలంలో కూడా వృద్ధి 7 శాతం మించి ఉంది (1956 ప్రాతిపదికన). 2004-05 మూల సంవత్సరంగా లెక్కిస్తే 2004 నుంచి 2014-15 మధ్య కాలంలో పారిశ్రామిక వృద్ధి 5.87శాతం ఉంది.
అంటే ఇటీవల కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు బాగా పడిపోయిందని స్పష్టం అవుతోంది. ఇంతకాలమూ నయా ఉదారవాద మేథావులు దేశ ఆర్థిక వృద్ధి గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ వేగంగా సాగుతోందని, దేశం ముందుకు దూసుకుపోతోందని చెప్పుకుంటూ వచ్చిన దానికి వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. స్వాతంత్య్రానంతరం నయా ఉదారవాద విధానాలు అమలైన కాలంలో పారిశ్రామిక వృద్ధి అంతకు ముందరి కాలపు సగటు వృద్ధి కన్నా తక్కువగా ఉంది. అంతేగాక, నయా ఉదారవాద కాలంలో కూడా ఇటీవల వేగం మరీ తగ్గింది. ఈ పారిశ్రామిక వృద్ధి సూచికను లెక్క వేయడంలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లను పరిగణనలోకి తగిన విధంగా తీసుకోరు. ఇటీవలి కాలంలో ఆ చిన్న, మధ్య తరహా యూనిట్లు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. నయా ఉదారవాద విధానాల కారణంగా వాటికి ప్రభుత్వ మద్దతు నిలిచిపోయింది. అయితే, అది ఒక్కటే వాటి సంక్షోభానికి కారణం కాదు. దానికి తోడు మోడీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పుడు విధానాలతో వాటిని మరింత సంక్షోభంలోకి నెట్టింది. ఆ యూనిట్ల పరిస్థితిని కూడా లెక్కలోకి తీసుకుంటే వాస్తవ పారిశ్రామిక వృద్ధి సూచిక ఇంకా తక్కువగా ఉంటుంది.
కోవిడ్ అనంతర కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి కోలుకోవడం చాలా బలహీనంగా ఉంది. మామూలుగానైతే, సరుకుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినప్పుడు ఆ సరుకులకు డిమాండ్ వాయిదా పడుతుంది. అనంతరం మళ్ళీ వృద్ధి సంభవించి వేగం పుంజుకున్నప్పుడు అంతవరకూ బిగబట్టుకున్న డిమాండ్ సాధారణ డిమాండ్‌కు అదనంగా తోడవుతుంది. అందుకే యుద్ధం జరిగిన కాలంలో ఉత్పత్తికి అంతరాయం కలిగిన తర్వాత యుద్ధానంతర కాలంలో ఉత్పత్తి ఒక్కసారి పుంజుకుంటుంది. కాని కోవిడ్ అనంతర కాలంలో మాత్రం అటువంటి పుంజుకోవడం అనేది ఏదీ జరగలేదు. అంతేగాక, అంతవరకూ కొనసాగిన మాంద్యం ఆతర్వాత కూడా కొనసాగడమే గాక, మరింత దిగజారింది. ఆ విధంగా పారిశ్రామిక మాంద్యం మన ఆర్థిక వ్యవస్థ సహజ స్వభావం కింద మారిపోయింది. ఈ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు తయారైంది?
ఇక్కడ రెండు అంశాలు అత్యంత ప్రాధాన్యతను కలిగివున్నాయి. ఆదాయాలలో పెరుగుతున్న అసమానతల ఫలితంగా పారిశ్రామిక సరుకులకు డిమాండ్ అంతకంతకూ కుంచించుకు పోతోంది. అత్యధికులుగా ఉన్న ప్రజానీకపు కొనుగోలుశక్తి పరిమితంగా ఉండడమే గాక, పెరుగుతున్న ఆదాయాల అసమానతల కారణంగా. వాళ్ళ కొనుగోలుశక్తి సాపేక్షంగా తగ్గుతోంది కూడా. ఇది నయా ఉదారవాద విధానాల పుణ్యమే. నాలుగేండ్లకోమారు నిర్వహించే సర్వేల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ తలసరి ఖర్చు 2011-12కి, 2017-18 సంవత్సరాల మధ్య 9శాతం మేరకు తగ్గిపోయింది. ఇందులో శ్రామిక ప్రజల తలసరి ఖర్చు ఇంకా ఎక్కువే తగ్గిపోయింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోని భూస్వాములకు, ధనిక రైతులకు ఆదాయాలు తగ్గిపోయింది ఏమీ లేదు. వారిని మినహాయించి లెక్క వేస్తే గ్రామీణ పేదల తలసరి ఖర్చు మరీ తక్కువగా ఉంటుంది. గ్రామీణ భారతంలో తలసరి ఖర్చు తగ్గడంతో పారిశ్రామిక సరుకుల డిమాండ్ తగ్గడం అనివార్యంగా జరుగుతుంది.
గ్రామీణ పేదల ఆదాయాలు తగ్గడానికి, పట్టణాల్లోని శ్రామికుల ఆదాయాలు తగ్గడానికి లింకు ఉండడం నయా ఉదారవాదకాలపు లక్షణం. గ్రామీణ పేదరికం పెరిగితే అక్కడివారు పట్టణాలకు వలసలు వస్తారు. దాంతో పట్టణాల్లో ఉద్యోగాల కోసం పోటీ పడేవాళ్ళు పెరుగుతారు. దానివలన పట్టణ కార్మికుల వేతనాలు కూడా తగ్గిపోతాయి. అందువలన కూడా పారిశ్రామిక సరుకుల డిమాండ్ తగ్గిపోయి మాంద్యం పెరుగుదలకు దోహదం చేస్తుంది.
చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాలను ఊపిరాడకుండా చేయడం కూడా అసమానతల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. నయా ఉదారవాద విధానాలు మాత్రమే కాక, ప్రస్తుత ప్రభుత్వపు తప్పుడు విధానాలు కూడా దీనికి కారణం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చేసే ఉత్పత్తుల స్థానాన్ని బడా పరిశ్రమలు ఉత్పత్తులు ఆక్రమిస్తాయి. అవే సరుకులు చిన్న పరిశ్రమల్లో గనుక తయారైతే, వాటిని తయారు చేయడానికి ఎక్కువమంది కార్మికులు అవసరం అవుతారు. వాటిని ఇప్పుడు బడా పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నారు గనుక అందుకు తక్కువమంది కార్మికులు సరిపోతారు. ఆ విధంగా కూడా కార్మికవర్గపు స్థూల ఆదాయం తగ్గిపోతుంది. అది వారి కొనుగోలుశక్తిని మరింత దెబ్బ తీస్తుంది. అందువలన పారిశ్రామిక సరుకుల డిమాండ్ మరింత తగ్గుతుంది.
సంపద ఉత్పత్తి క్రమంలో ఏర్పడే అదనపు విలువలో అంతకు మునుపటికన్నా అధికంగా వాటా పొందిన వర్గాలవారు కూడా ఉన్నారు కదా? మరి వారు అంతకు ముందుకన్నా అదనంగా పారిశ్రామిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు కదా? అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. నయా ఉదారవాద విధానాలు అమలు మొదలైన తొలి సంవత్సరాలలో ఇటువంటి పరిస్థితి ఉండేది. నయా ఉదారవాద విధానాలు మొదలుకాక మునుపు పలు పారిశ్రామిక సరుకులు దేశీయంగా ఉత్పత్తి అయ్యేవి కావు. వాటి దిగుమతుల మీద కూడా ఆంక్షలు ఉండేవి. అటువంటి సరుకులకు డిమాండ్ చాలా ఉండేది. అలా పేరుకుపోయిన డిమాండ్ నయా ఉదారవాద విధానాలు మొదలై, ఆంక్షలు తొలగిపోగానే ఒక్కసారిగా బైటకు తన్నుకొచ్చింది. దాని వలన మొదట్లో ఆర్థిక వృద్ధి కొద్ది సంవత్సరాలపాటు వేగంగా సాగింది. అయితే, ఆ క్రమంలో దేశంలోని మిగులు సంపదలో చాలా భాగం విదేశాల సరుకుల కొనుగోలుకు బైటకు తరలిపోయింది కూడా. ఇప్పుడు దాని పర్యవసానాలు కనిపిస్తున్నాయి. 'యంత్రాలు, విడిభాగాలు' రంగం, వినిమయ సరుకుల రంగం-ఈ రెండింటిలోనూ వృద్ధిరేటు తక్కిన రంగాలకన్నా మరీ తక్కువగా ఉంది. అక్టోబర్ 2022లో వినిమయ సరుకుల రంగంలో వృద్ధి 2011-2012 నాటికన్నా కూడా తక్కువగా ఉంది. ఇక యంత్రాలు విడిభాగాల రంగం దాదాపు 2011-12 నాటి స్థితిలోనే ఉండిపోయింది. దీనికి కారణం ఆ రంగాల్లో ఉత్పత్తి అయ్యే సరుకులు విదేశాల నుండి కూడా దిగుమతి అవుతూ ఉండడమే.
కాబట్టి పారిశ్రామిక మాంద్యం నెలకొనడానికి కారణం నయా ఉదారవాద విధానాలే. ఆ విధానాల కారణంగా ఆదాయాల్లో శ్రామిక ప్రజల వాటా తగ్గిపోయి వారి కొనుగోలుశక్తి పడిపోయింది. దానికి తోడు దిగుమతులు కూడా పెరిగిపోయాయి.
ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ ప్రభుత్వం చేసిందేమిటి? మౌలిక వసతుల కల్పన రంగంలో (ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రయివేటు రంగ వ్యయాన్ని పెంచడానికి వీలుగా ప్రయివేటు రంగానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి రుణాలు విరివిగా ఇప్పించింది. ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికా? లేకపోతే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అమలు చేయడంలో భాగమా? అన్నది అటుంచితే ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులవద్ద నిరర్ధక ఆస్తులు విపరీతంగా పేరుకుపోడానికి దారి తీసింది. పైగా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నది కూడా ఏమీ లేదు. మొత్తానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం తీవ్రమైన ఆర్థిక వత్తిడికి లోనవుతున్నాయి. ఇది మోడీ ప్రభుత్వ పుణ్యమే.
(స్వేచ్ఛానువాదం)
- ప్రభాత్ పట్నాయక్