Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిసెంబర్ 29 నుండి మూడు రోజులపాటు తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర మూడవ మహాసభలు పోరాటాల పురిటి గడ్డ ఖమ్మంలో జరగ నున్నాయి. మహాసభల జయప్రదం కోసం ఆహ్వాన సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. డిసెంబర్ 29న సుమారు లక్ష మందికి పైగా వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు ఈ మహాసభల సందర్భంగా జరిగే ప్రజా ప్రదర్శన బహిరంగ సభ పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కూలి, భూమి, పోడు భూములు, ఉపాధి, నిర్వాసితులు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, తునికాకు, సామాజిక వివక్ష, ఇతర స్థానిక సమస్య లపై పోరాడిన ప్రజలు హక్కులు సాధించుకోవాలనే పట్టుదలతో ఈ మహాసభలకు కదులుతున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు 2011 జనాభా లెక్కల ప్రకారం 80లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం పెరిగిన జనాభా రీత్యా కోటి నలభై లక్షలకు ఈ సంఖ్య చేరింది. దళితులు, ఆదివాసి, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల ప్రజలు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. సన్న, చిన్న కారు రైతులు కూడా కూలీలుగా పనిచేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో జాబ్ కార్డులు 55లక్షలు ఉన్నాయి. ఇందులో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులు కోటి 19లక్షల మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం 40లక్షల నుండి 60లక్షల మంది కార్మికులు పని పొందుతున్నారు. రాష్ట్రంలో వలస కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వ్యవసాయేతర పనులు చేస్తున్న కార్మికులు లక్షల్లో ఉన్నారు. వరి పంటలో పూర్తిగా యంత్రాలను ఉపయోగించటం వలన క్రమేనా పని దినాలు తగ్గుతున్నాయి. మిర్చి, పత్తి, చెరుకు పంటల్లో కూలీలకు పనులు దొరుకుతున్నాయి. చెరుకు కటింగు, మిర్చి తెంపడానికి మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలు కర్నాటక, మహారాష్ట్ర, చత్తీఘడ్, మధ్యప్రదేశ్‌ల నుండి కూలీలు వలసలు వస్తున్నారు. అక్కడక్కడ మిషన్‌తో కట్ చేస్తున్నారు. వరి నాటులో డ్రీమ్ సీడ్ పద్ధతి కలుపు మందులు, విత్తనాలు చల్లడం వలన నాటు వేసే పనులు తగ్గుతున్నాయి. మాగాణి నుండి మెట్ట పంటలకు కొన్ని జిల్లాలలో పంటల మార్పిడి జరుగుతున్నది. మెట్ట, మాగాణి పంటల్లో కొంత కూలి రేట్ల తేడా ఉంది. రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాల మధ్యన వలసలు ఉన్నాయి. వ్యవసాయంలో పని దినాలు 45నుండి 60 రోజులు మాత్రమే దొరుకుతున్నాయి. ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 42 నుండి 60 రోజులు పని దొరుకుతుంది. మొత్తంగా సంవత్సరంలో కుటుంబానికి 80 నుండి 120రోజులు వ్యవసాయంలో, ఉపాధి హామీలో పని దొరుకు తున్నది. మిగతా రోజులు పట్టణాలకు కూలీలు గా, వలస కార్మికులుగా అసంఘటిత రంగంలో వ్యవసాయేతర పనులు చేసుకుని జీవిస్తున్నారు.
ఉపాధి హామీ చట్టంలో నిర్ణయించిన 257 రూపాయలు కూలీ ఎక్కడా అమలు జరగడం లేదు. ఉపాధి పనికి కేరళలో 637, వ్యవసాయ పనులకు వెయ్యి రూపాయలకు పైగా ఇస్తున్నారు. మన దగ్గర సరాసరి 300 రూపాయలు లోపు మాత్రమే కూలీలకు రోజు కూలీ వస్తున్నది. పట్టణ స్వభావం లేకుండా కొన్ని పట్టణాలకు గ్రామాలను కలపడం వల్ల ఆ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు బంద్ అయ్యాయి. ఫలితంగా సుమారు మూడు లక్షల మంది కార్మికులు ఉపాధి హామీకి దూరమయ్యారు. పట్టణాల్లో ఉపాధి హామీ పనులు అమలు జరపాలి.
గత ఎనిమిది సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వం కనీస వేతనాల జీఓను రివైవ్ చేయలేదు. కాలయాపన చేస్తున్నది. అందువలన వ్యవసాయ కార్మికులకు తీరని నష్టం జరుగుతున్నది. వ్యవసాయంలో, ఉపాధి హామీలో మహిళల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉన్నది. వారంతా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా అక్కడ కూడా అన్యాయమే జరుగుతున్నది. వ్యవసాయ పనుల్లో సీజన్లో 250 నుంచి రూ.300లు సాధారణంగా చెల్లిస్తున్నారు. పని ఒత్తిడి, గుత్తా పద్ధతిలో పనులు చేసిన సందర్భంగా రూ.300 నుండి 600లు వస్తున్నాయి. దొరికిన రోజు పని దొరుకుతుంది పని దొరకని రోజు ఖాళీగా ఉంటున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ కూలీల జీవితాలు ఆందోళనకరంగా ఉన్నాయి. విద్య, వైద్యం, కోచింగ్ ఫీజులు, మందులు తదితర ధరల ప్రభావం తీవ్రంగా ఉన్నది. కరోనా ప్రభావం వల్ల ఆర్థికంగా మరింత చితికిపోయారు. వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంపై కూడా ఇది చాలా ప్రభావం చూపుతున్నది. విద్యా, వైద్యం ఖరీదు కావడంతో పిల్లల చదువులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పిల్లలకు పోషకాహారం అందడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆహార భద్రతా ప్రమాణాల్లో 14వ స్థానంలో ఉంది. వీటిని అధిగమించాలంటే వ్యవసాయ కార్మికులకు చేతినిండా పని గ్యారంటీ ఉండాలి. కనీస వేతనాలు అమలు జరగాలి. ధరల ప్రభావం తగ్గించాలి. వీటి కోసం ఉద్యమాలు జరపాలి. ఉపాధి పని ప్రదేశం, నివాస ప్రాంతాలు, గ్రామా లలో రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ జాప్యం ఉన్నది. బియ్యం, పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, కరెంటు చార్జీలు, కేసీఆర్ కిట్టు, హెల్త్‌కార్డు, సంక్షేమ హాస్టల్స్ తదితరాల్లో మాత్రమే కొంత లబ్ధి పొందుతున్నారు. 19 లక్షల మందికి రేషన్ కార్డులు రద్దు చేశారు. సంక్షేమ హాస్టలలో మెస్ చార్జీలు కూడా కోతకు గురవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుకు ఉద్యమాలు జరుగు తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. వీటన్నిటి పరిష్కారానికీ ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచాలి. సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అందుకే మొత్తం వ్యవసాయ కార్మిక సమస్యలపై ఈ మహాసభ దాదాపు 25తీర్మానాలు చేయబోతున్నది. పోరాటా లకు మరింత పదును పెట్టే నిర్ణయాలు జరుగ బోతు న్నాయి. ఆదిశగా ఈ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని ఆశిద్దాం...
- మచ్చా వెంకటేశ్వర్లు
సెల్: 9490098192