Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళ ఆర్థిక వ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రశంసనీయమైన వృద్ధిరేటు సాధించిందని జాతీయ గణాంకాల కార్యాలయ నివేదిక వెల్లడించింది. అంటే కరోనాకు ముందు సంవత్సరం 2018-19లోని వృద్ధిరేటుతో పోలిస్తే 14.4శాతం వృద్ధి రేటు పెరగడం కేరళ సంపూర్ణ సాఫల్యతకు మరింత సొబగులు అద్దాయి. రాష్ట్ర అభివృద్ధి పనితీరును ప్రముఖంగా ప్రస్తావించడానికి ఇక్కడ మరో కారణం కూడా ఉంది. ఇదే కాలంలో మైనింగ్, క్వారీయింగ్ రంగాల తర్వాత రెండో అతిపెద్ద వృద్ధి చెందుతున్న ఉప రంగంగా తయారీ రంగం ఆవిర్భవించింది. గత కొన్నేళ్ళ కాలంలో మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులతో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవలు ఈ పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. 2021-22లో రాష్ట్ర తలసరి ఆదాయం 12.5శాతం పెరగడాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. 2020-21లో కేరళ స్థూల దేశీయోత్పత్తి రూ.7,99,571 కోట్లు నుండి 2021-22లో రూ.9,01,998కోట్లకు పెరిగింది (ప్రస్తుత ధరల వద్ద). రెండుసార్లు బీభత్సంగా వచ్చిన వరదలు, కోవిడ్ మహమ్మారి తర్వాత ఎదుర్కొన్న ఆర్థిక మాంద్యం నుండి రాష్ట్రం బయట పడిందనడాన్ని ఇది సూచిస్తోంది. అభివృద్ధి రంగంలో కేరళ సాధించిన ఈ పురోగతి వెనుక గుర్తించాల్సిన కోణమేమిటంటే, అనేక రకాల ఎదురు దెబ్బల నుండి బయట పడేందుకు అటు జాతీయ, ఇటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు పొరాడుతున్న నేపథ్యంలో కేరళ ఈ పరిస్థితిని సాధించడం విశేషం.
అంతర్జాతీయ ఆర్థిక ప్రతిష్టంభన
అంక్టాడ్ (ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివద్ది సంస్థ), డబ్ల్యుటిఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ), ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి), ఒఇసిడి (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ)వంటి పలు అంతర్జాతీయ సంస్థలు ఈ ఏడాది అక్టోబరులో విడుదల చేసిన నివేదికల్లో ఇచ్చిన అంచనాలు, విశ్లేషణ చూసినట్లైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా ఆర్ధిక మాంద్యం గుప్పెట్లో నలుగుతోందని, పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు, కేంద్ర బ్యాంకులు పెంచిన వడ్డీరేట్లు, ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఇవన్నీ కలిసి అంతర్జాతీయ వస్తు వాణిజ్యాన్ని 2023లో ఒక శాతం మేర తగ్గిస్తాయని డబ్ల్యుటిఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ఇచ్చిన నివేదిక ప్రకారం, 2023లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7శాతం మాత్రమే వృద్ధి చెందుతుంది. 2021లో సాధించిన ఆరు శాతంతో పోలిస్తే, 2022 సంవత్సరానికి వృద్ధి అంచనాలు కూడా నిరాశజనకంగానే ఉన్నాయి. రాబోయే రెండు త్రైమాసికాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడోవంతు మేర క్షీణించగలదని ఆ నివేదిక పేర్కొంది. 2026వరకు అంతర్జాతీయ ఉత్పత్తి పరిస్థితులను మనం పరిగణనలోకి తీసుకున్నట్లైతే, 4లక్షల కోట్ల డాలర్ల మేరకు నష్టం ఉండగలదని ఐఎంఎఫ్ పేర్కొంటోంది. ఆ రకంగా చూస్తే, 2001 తర్వాత ఇదే అత్యంత అధ్వానమైన ఆర్థిక పరిస్థితి కానుంది. అన్ని దేశాల్లోనూ వృద్ధి తగ్గుతుందని ఆంక్టాడ్ నివేదిక హెచ్చరిస్తోంది. 60శాతం తక్కువ ఆదాయ దేశాలు, 30శాతం వర్ధమాన దేశాలు రుణాల చెల్లింపులో డీఫాల్ట్ అవకాశాన్ని ఎదుర్కొంటున్నాయి, ఇది సామాజిక అశాంతికి, అభద్రతకు దారితీస్తుంది. 2022, 2023 సంవత్సరాలకు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేట్లు వరుసగా 3.1శాతం, 2.3శాతం ఉంటాయని ఒఇసిడి అంచనా. 1970 తర్వాత అతిపెద్దదైన రీతిలో ఇంధన సంక్షోభాన్ని, ధరల పెరుగుదలను ప్రపంచం చూస్తోందని కూడా నివేదిక పేర్కొంది.
భారత్ పరిస్థితి
దేశంలోనూ పరిస్థితులేమీ అంత ఆశాజనకంగా లేవన్న వాస్తవాన్ని భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూచికలు పేర్కొంటున్నాయి. రూపాయి తన విలువను నిరంతరంగా కోల్పోతూనే ఉంది. 2022 నవంబరు 24 నాటికి, రూపాయి మారకం రేటు డాలరుతో 81.71గా ఉంది. గతేడాది కాలంలో రూపాయి విలువ 10శాతం పడిపోయింది. వాణిజ్యం, కరెంట్ అకౌంట్ లోట్లు కూడా ఆందోళనకర రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. దీంతో విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో పెద్దలోటు కనిపిస్తోంది. 2022 అక్టోబరులో ఎగుమతులు 17శాతం తగ్గి 29.78 బిలియన్ల డాలర్లకు చేరాయి. ఆ నెలకు వాణిజ్య లోటు 26.91 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఆర్బిఐ చాలా తరచుగా రెపో రేట్ల పెంపు చర్యలు చేపట్టినప్పటికీ, ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు. అక్టోబరు మాసంలో ద్రవ్యోల్బణం రేటు 6.77గా ఉంది. గత 9మాసాలకు ఆర్బిఐ విధించిన గరిష్ట పరిమితి 6శాతానికి పైనే ఉంటోంది. భారత్‌కు సంబంధించి పరిస్థితులంతా బాగుంటాయనే అంచనాలను అంతర్జాతీయ ఆర్థిక సూచికలు కూడా ఇవ్వలేదు. అంతర్జాతీయ ఆకలి సూచీలో మన స్థానం 107కి పడిపోయింది. దక్షిణాసియా దేశాల్లో చూసినట్లైతే యుద్ధంతో అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే మనకన్నా వెనుకబడి ఉంది. రువాండా (102), నైజీరియా (103), ఇథియోపియా(104), సూడాన్ (106) వంటి దేశాలు కూడా ర్యాంకింగ్‌లో మనకన్నా ముందున్నాయి.
కేరళ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ
2018, 2019ల్లో వరుసగా వచ్చిన రెండు వరదల కారణంగా కేరళ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. అందులో ఒకటి గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని రీతిలో సంభవించిన జల ప్రళయం. ఆ తర్వాత పెద్దనోట్ల ఉపసంహరణతో తలెత్తిన సంక్షోభం, కోవిడ్ కేసులు భారీగా విస్తరించడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అయినప్పటికీ 12.8 శాతం వృద్ధి రేటును సాధించి కేరళ ఈ అనూహ్యమైన సంక్షోభాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది. ఈ విజయం ప్రత్యేక స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే, ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా దేశంలో ఆర్థికంగా ముందంజలో ఉన్న రాష్ట్రాలతో పోల్చుకోవాల్సి వస్తుంది. 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గుజరాత్లో 39శాతం మంది పిల్లలు ఎత్తుకు తగిన బరువు లేక, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అదే సమయంలో కేరళలో ఆ సంఖ్య 23.4శాతంగా మాత్రమే ఉంది. భారత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ లేదు. గుజరాత్లో బాలల మరణాల సంఖ్య ప్రతి వెయ్యి జననాలకు 31.2గా ఉంది. అదే సమయంలో కేరళలో కేవలం 4.4గా ఉంది. మరే ఇతర ముఖ్యమైన సామాజికాభివృద్ధి సూచీలను పరిశీలించి చూసినా దేశంలోని మరే ఇతర రాష్ట్రాల కన్నా కేరళ కచ్చితంగా ముందుంటుంది. దినసరి వేతన కార్మికులకు వివిధ రాష్ట్రాల్లో చెల్లించే వేతనాలపై ఇండియన్ లేబర్ జర్నల్ నుండి సేకరించిన వివరాల ఆధారంగా ఆర్బిఐ ఇటీవల సిద్ధం చేసిన నివేదికలో గరిష్ట వేతనాలు ఇచ్చే రాష్ట్రంగా కేరళ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అదే సమయంలో గుజరాత్లో అందరికన్నా తక్కువ చెల్లిస్తున్నారు. అలాగే వ్యవసాయంలో, వ్యవసాయేతర రంగంలో, తయారీ రంగాల్లో కూడా వేతనాలను చూసినట్లైతే కేరళలోనే అత్యధికంగా ఉన్నాయి. కేరళలో వ్యవసాయ రంగ వేతనం రూ.726.8గా ఉంది. ఇదే రంగంలో మెరుగైన వేతనాలు అందచేయడంలో జమ్మూ కాశ్మీర్ రెండో స్థానంలో ఉంది. అక్కడ రూ.524.6 వేతనంగా చెల్లిస్తున్నారు. అలాగే తయారీ రంగంలో సగటు వేతనం చూసినట్లైతే దేశంలోనే అత్యధికంగా కేరళలో రూ.737.7గా ఉంది. ఇక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రూ.519.8తో రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో వేతనం రూ.478.6గా ఉంది. ఇవన్నీ చూస్తుంటే, కేరళలో మాత్రమే సంపద కొంత సక్రమంగా పంపిణీ జరుగుతోందన్న వాస్తవం స్పష్టమవుతోంది. మిగిలిన రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పిఎస్సి) ద్వారా ఉద్యోగార్ధులకు ఉపాధి కల్పించడంలో కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళ రికార్డు ఉత్తమంగా ఉంది. 2016-2021 కాలంలో ఎల్డిఎఫ్ ప్రభుత్వ హయాంలో, పబ్లిక్ సర్వీస్ కమిషనన్ ద్వారా 1,65,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎల్డిఎఫ్ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2022 నవంబరు వరకు 37,840 పిఎస్సి నియామకాలు జరిగాయి. ఇదే కాలంలో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయు లకు వేతన సవరణ కూడా అమలు చేశారు. కొట్టాయంలో ఉన్న హిందూస్తాన్ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్‌ను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తన అధీనంలోకి తీసుకుంది. ఈ ఏడాది నవంబరు 1 నుండి ఆ సంస్థలో ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. దానికి కేరళ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని పేరు కూడా మార్చారు. ఈ తరహాలో కేంద్ర ప్రభుత్వం మూసివేయాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ఎల్డిఎఫ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ రంగాల్లో అద్భుతమైన పనితీరు కనబరిచి నందుకు కేరళ అనేక అవార్డులను గెలుచుకుంది. ఎక్కువమందికి ఉచిత వైద్య చికిత్సనందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య మందాన్ బహుమతిని సైతం కేరళే గెలుచుకుంది. అలాగే ఇండియా టుడే న్యూస్ మేగజైన్ ఇచ్చిన అత్యంత సంతోషకరమైన రాష్ట్రం అవార్డును కూడా గెలుచుకుంది. వృద్ధుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వయోశ్రేష్ట అవార్డు, చిన్నారులకు పోషకాహార కార్యక్రమం కుటుంబశ్రీని అమలు చేసినందుకు గ్లెన్‌మార్క్ అవార్డు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అవార్డులు కేరళ స్వంతమయ్యాయి. కేరళ విజయవంతమైన అభివృద్ధి పంథాకు ఈ గుర్తింపులన్నీ తిరుగులేని సాక్ష్యాధారాలుగా నిలిచాయి.
జాతీయ పరిస్థితులతో పోల్చినట్లైతే, కేరళ తక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. ఆగస్టు మాసానికి దేశవ్యాప్తంగా వినిమయ ధరల సూచీ 7శాతం పెరగగా, కేరళలో కేవలం 5.73శాతమే పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి, పటిష్టమైన ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యలే ఇందుకు కారణం. రెండు భయంకరమైన వరదల కారణంగా జరిగిన విధ్వంసం నుండి కేరళను తిరిగి పునర్నిర్మించేందుకు రూపొందించిన ది రీబిల్డ్ కేరళ ప్రాజెక్టు, అలాగే కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మద్దతివ్వడానికి రూ.20వేల కోట్ల చొప్పున రెండు ప్యాకేజీలు, చిన్న పరిశ్రమలకు మద్దతును అందివ్వడం, కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లు, సామాజిక భద్రతా పెన్షన్‌ను సకాలంలో, క్రమం తప్పక పంపిణీ చేయడం ఇవన్నీ కూడా కేరళ ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు దోహదపడ్డాయి.
పన్ను ఆదాయాల నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటాలో కోత విధించడం, జీఎస్టీ నష్టపరిహారాన్ని ఎత్తివేయడం, ఏటికేడాది రెవెన్యూలోటు గ్రాంట్‌ను తగ్గించడం, రుణాల పరిమితిని కుదించడం వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని వివక్షాపూరితమైన చర్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.25వేల కోట్ల మేరకు లోటు ఏర్పడినా దానితో నిమిత్తం లేకుండా కేరళ ఈ విజయాలన్నీ సాధించింది. కేరళ సాధించిన ఈ విజయాలన్నింటి వెనుక చారిత్రక, రాజకీయ కారణాలు వున్నాయి. రాష్ట్రం అమలు చేసిన ప్రత్యామ్నాయ విధానాల ఫలితంగా మానవ వికాస సూచికల్లో రాష్ట్రం అద్భుతమైన పనితీరు కనబరిచింది. సమగ్ర, సమాన అభివృద్ధి లక్ష్యంగా అనుసరించిన అభివృద్ధి దృక్పథం, ప్రజా ప్రాతినిధ్యంతో కూడిన పాలనా వ్యవస్థ ఈ రెండూ రాష్ట్రం విజయవంతంగా సాధించిన అభివృద్ధి ప్రయాణానికి గట్టి పునాదులుగా ఉన్నాయి. ప్రజలకు న్యాయం, మరింత మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
- కె.ఎల్.గోపాలన్