Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీవ్రమైన శీతాకాలపు తుఫాను గుప్పిట్లో ఉత్తర అమెరికా, కెనడాలు అతలాకుతలం అవుతున్న వార్తలు ప్రపంచ మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకల స్థానంలో దాదాపు 6కోట్ల అమెరికన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అసాధారణ పరిస్థితులు... మరణాల నమోదు
ఇప్పటికే ఉత్తర అమెరికా, కెనడాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు తుఫాన్లతో జనజీవనం అతలాకుతలమవుతోంది. కొంత మంది పౌరులు మరణించడం కూడా జరిగింది. అడుగుల కొద్ది పేరుకు పోయిన మంచు గుట్టలతో ప్రజలు బయటకు రాలేని దుస్థితి ఏర్పడింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరగడంతో పాటు 6,000లకు పైగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడం లేదా దారి మళ్లించడం, హౌటల్స్ మూసివేయడం, దుకాణాల్లో సరుకులు దొరక్క పోవడం, హైవేలు మూసి వేయడం, అడుగు లోతుల్లో కార్లు కూరుకుపోవడం, కార్లలోనే వ్యక్తులు శవాలుగా మారడం, విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో అంధకారాలు కమ్ముకోవడం, దుకాణాలు లూటీ కావడం లాంటి వార్తలు హృదయవిదారకంగా తోస్తున్నాయి.
బాంబ్ సైక్లోన్ - స్నో టెర్రర్
వాతావరణ పీడనం కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇది 'బాంబ్ సైక్లోన్'గా మారి గజగజ వణికిస్తున్నది. డెన్వర్, లాస్‌వేగాస్, షికాగో, అట్లాంటా, బాల్టిమోర్, రాష్ట్రాల్లో హిమపాతం ప్రమాదకరంగా మారిందని అమెరికా ప్రభుత్వమే ప్రకటించే స్థితి రావడం విచారకరం. భీకర మంచు తుఫానుతో సాధారణ ఉష్ణోగ్రతలు మైనస్ 57 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవడంతో ప్రజల కష్టాలు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం మంచు గుట్టల్ని తొలగించే విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. చలి తీవ్రతకు మరిగే నీరు కూడా క్షణాల్లో గడ్డకట్టి పోతున్నది. 'స్నో టెర్రర్' గుప్పిట్లో కోట్లాది ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతున్నది.
'ఆర్కిటిక్ బ్లాస్ట్' పర్యావరణ ప్రకోపమా?
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ ప్రతికూల మార్పులే ఇలాంటి విపత్తులకు కారణమని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఆర్కిటిక్ శీతల గాలులు వెచ్చటి గాలులతో కలవడంతో వాతావరణ పీడనం తగ్గడంతో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేడు చూస్తున్న వాతావరణ విపత్తుకు కారణాలుగా శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాలు, భూతాపం, పర్యావరణ కాలుష్యాలు వంటి అంశాలను పేర్కొంటున్నారు. అమెరికాను ముంచెత్తిన ఈ మంచు తుఫాను ఫలితంగా 2 మిలియన్ల ప్రజలు, 20 లక్షల గృహాలు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. 'ఆర్కిటిక్ కోల్డ్బ్లాస్ట్' కాస్తా 'బాంబ్ సైక్లోన్'గా మారడంతో పెనెంలోంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. దీనిని అమెరికా, కెనడా దేశాల చరిత్రలో కనీవినీ ఎరగని వాతావరణ విపత్తుగా అభివర్ణిస్తున్నారు.
వారం రోజుల్లో తుఫాను ప్రభావం తగ్గవచ్చనే వార్తలు కొంత ఊరట ఇస్తున్నప్పటికీ నేడు అష్టకష్టాల్లో ఉన్న అమెరికన్లకు సత్వరమే ఆపన్నహస్తాలు అందుతూ, ప్రాణాపాయాలు తగ్గాలని కోరుకుందాం. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు వాతావరణ సానుకూల మార్పుల దిశగా వడివడిగా అడుగులు వేయాలి. ఈ బృహత్తర కార్యక్రమానికి అగ్రదేశాలే ముందు పూనుకోవాలి. మనిషి ఉంటేనే అభివృద్ధి అని, ఆరోగ్యంగా ఉంటేనే జీవితమని, పర్యావరణమే మానవ ఉనికి అని ఈ దేశాధినేతలకు ఎప్పుడు బోధపడుతుందో...
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037