Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉన్నది. మన దేశ జనాభా చైనాను అధిగమించి అగ్రస్థానాన్ని అధిష్టించనున్నది. 140కోట్లకు పైగా చేరే జనాభాలో 60శాతం మంది, 30సంవత్సరాల లోపు వయసువారని లెక్కలు చెబుతు న్నాయి. అంటే 84కోట్ల మంది ప్రజానీకం పిల్లలు, యువత అన్నమాట. అందుకే మనదేశాన్ని యువ భారత్ (యంగ్ ఇండియా) అని పిలుస్తారు.
ఈ యువతను, పిల్లలను సహజసిద్ధంగా మానవీయకోణంలో ఎదగనీయకుండా దోపిడీ శక్తులు ఎంత చేయాలో అంతా చేస్తూనే ఉన్నాయి. అటు సామ్రాజ్యవాద శక్తులు, ఇటు మతోన్మాద శక్తులు ఆ పసిహృదయాల్లో విషసంస్కృతి బీజాలు నాటుతూనే ఉన్నాయి.
యువత ఆలోచించకూడదు, ప్రశ్నించ కూడదు, నిత్య జోగుతూ, స్వార్థహింసా ప్రవృత్తులతో అరాచకంగా వ్యవహరించేలా అంతర్జాతీయ స్థాయిలో పథకాలు రచిస్తున్నాయి. ఇంటర్నెట్ను అందుకు సాధనంగా ఉపయోగి స్తున్నాయి. యంగ్ ఇండియాను డ్రగ్ ఇండియా (మత్తు భారత్)లా మార్చేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. సాటి మనిషిపట్ల ప్రేమ కరుణ కన్నా క్రౌర్యం ద్వేషం నూరిపోయడమే వీటిపని. ఇందుకు భిన్నంగా యువతను సృజనాత్మక పౌరులుగా, సామాజిక బాధ్యత గల పౌరులుగా నిర్మించే కృషికి ఓ గొప్ప స్ఫూర్తి.
ఈ అస్తవ్యవస్థ వ్యవస్థలో మనిషిని మనిషిగా నిలబెట్టేందుకు పాటు పడటమే కళాసాహిత్యాల విధి. చరిత్ర చెప్పిన పాఠం ఇది. ప్రజాకళాకారుడు సప్థర్ హష్మి తను రూపొందించిన వీటి నాటిక ప్రక్రియలో నూతన ఒరవడి సృష్టించిన విషయం విధితమే. ఆధునిక వీధినాటకాన్ని పోరాటా యుధంగా మలిచి, దిశా నిర్దేశం చేసి ప్రజాకళకు మార్గదర్శకుడయ్యాడు.
హష్మి సహచరుడు సుధన్వా దేశ్ పాండే రచన 'హల్లాబోల్ - సప్దర్ హష్మీ మరణం-జీవితం' (అనువాదం - సత్యరంజన్) అను గ్రంథం ఈ విషయాన్ని విస్పష్టం చేసింది.
హష్మి అమరుడయ్యాడని ఎవరన్నారు? ప్రజా కళాకారుల హృదయాల్లో అంతర్వాహినిలా నిత్యం ప్రవహిస్తూనే ఉంటాడు. రాజకీయ లక్ష్యసాధనలో కళాత్మకతను విడిచిపెట్టకుండా భావితరాలకు కొనిపోవడమే హష్మికిచ్చే నివాళి అని ఎంతోమంది నేడు భావిస్తున్నారు. గతం కంటే ఇప్పుడు హష్మీ కార్యాచరణ అనివార్యమైంది.
'ఇప్పటికే కాలాతీతమైంది. త్వరగా పని మొదలు పెట్టాలి. పాటల దళం, వీధినాటక దళాలను స్థిరపరుచుకోవాలి. అభివృద్ధి పరచు కోవాలి, విస్తరించుకోవాలి. మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మన బలాన్ని దృఢ పరుచుకోవాలి. నూతనో త్తేజంతో పనిచేయాలి. మన కళా సామర్థ్యాలకు పదునుపెట్టుకోవాలి. అభ్యుదయాంశాలే కాదు, క్లాసికల్ కళారూపాల అధ్యయనం సాగాలి. విరివిగా ప్రదర్శనలు ఇవ్వాలి. ముఖ్యంగా అట్టడుగు ప్రజానీకాన్ని మన కళారూపాలు ఆకర్షించాలి.'
ఎమర్జెన్సీ రోజుల్లో హష్మి రాసుకున్న ఈ డైరీనోట్స్ ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజాకళాకారులకు శిరోధార్యమే. 1989 జనవరి 1న ఢిల్లీకి సమీపాన ఘజియాబాద్‌లో హల్లాబోల్ వీధినాటిక ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ గూండాలు హష్మిని హతమార్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల అనంతరం హష్మి సతీమణి మలయశ్రీ హష్మి (మాలా) సారధ్యంలో అదే 'హల్లాబోల్' నాటికను ఆ హత్యాస్థలిలో ప్రదర్శించి ప్రజాకళకు మరణంలేదని సింహనాదం చేయడం అపూర్వం. ఆమె మనోనిబ్బరం ఎనలేనిది. బిగిసడలని భావోద్వేగంతో ఈ ఘటనలకు అక్షరరూపం ఇచ్చాడు సుధన్వా.
నాటి హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తూ నటప్రయోక్త ఎం.కె. రైనా ''కళాకారులమైన మేం అందరం ఇలా ఒక్కటిగా నిలబడ్డామంటే హష్మి అవిరళకృషే కారణం. గత 13ఏండ్లుగా నేను హష్మి నాటికలు చూస్తున్నాను. అవి ఒకనాటి కంటే ఒకనాడు ప్రాసంగికత కలిగి ఉంటున్నాయి. వర్తమాన దుస్థితిని సవాల్ చేస్తాయి. మత సామరస్యాం అనివార్యతను చాటుతాయి. జాతీయ సమైక్యతను ప్రభోదిస్తాయి. ఇంతకన్నా ఓ కళాకారుడి నుండి ప్రజలు ఏం ఆశిస్తారు? ఓ కవి, ఓ కళాకారుడు ఓ సృజన కారుడ్ని కిరాయి గూండాలచే హత్య చేయిస్తారు? అదీ రాజధానికి సమీపాన... మంచితనం, మానవత్వం ఏం మిగిలింది?'' అంటూ ఊగిపోయాడు.
ఖండించిన వారిలో భారత రంగస్థల దిగ్గజం హబీబ్ తన్వీర్ కూడా ఉన్నాడు. అప్పటి ఆ కళాకారుల భావోద్వేగాలు అంతదగ్గరగా చూసాక అవేవీ వార్తల్లో పేర్చే అక్షరాల్లో ప్రతిఫలించవు, ప్రతిధ్వనించవు అని సుధన్వా పేర్కొంటాడు.
కళాప్రదర్శనల్లో మాలా, హష్మికన్నా ఓ అడుగు ముందే ఉంటుంది. ప్రదర్శనా నిర్వహణలో, సమన్వయంతో ఆమె పాత్ర అమోఘం. ఎక్కడా ఎలాంటి రాజీగాని, నిరుత్సాహంగాని కనిపించదు.
1975లో కర్నాటక కోలార్ జిల్లాలో నీల్బాగ్ కాలేజీలో టీచర్ ట్రైనింగ్ పొందారు ఆమె. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ ఇండియా రాయల్ ఎయిర్పోర్స్లో పనిచేయడానికి వచ్చిన విద్యావేత్త డేవిడ్ హార్స్బరో స్థాపించిన కాలేజి అది. ఆయన సతీమణి డోరిస్‌తో కలసి పిల్లల కోసం గ్రామీణ ప్రయోగాత్మక పాఠశాలలు నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పిల్లల్ని అర్థం చేసుకోవడం, విద్యగరపడం, సమగ్ర వికాసంకై పాటుపడటం వారి ముఖ్యోద్దేశ్యం. ఆ బోధనా, శిక్షణా మెళుకువలను మాలా యుక్తవయసులో నేర్చుకోవడం కలిసివచ్చింది. అలా హష్మికి మరింత చేరువయింది. ఒకరికొకరు తోడయ్యారు. 1979లో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. జమిలిగా అల్లుకుపోయి పనిచేశారు. ఎమర్జెన్సీ అనంతరం రాజకీయ వాతావరణంలో పెద్దమార్పు వచ్చింది. ప్రజాస్వామ్య భావనలు ఉరకలేస్తున్న కాలం. ఆ ఉత్సాహాన్ని కళాకారులు ఒడిసిపట్టుకోవాలి.
'మనం ఆడాలనుకున్న నాటకాలు మనకు మనమే రాసుకోవాలి. ప్రదర్శించాలి' అనే నిర్ణయానికి వచ్చాడు హష్మి. అప్పుడో సీనియర్ కామ్రేడ్ ఓ ఘటన చెప్పాడు...
''హెరిటేజ్ ఇండియా అనే సంస్థ ఉన్నది. ఆ సంస్థలో పనిచేసే కార్మికులకు సంఘం లేదు. వారివి చాలా చిన్న కోర్కెలు, సైకిళ్ళు పెట్టు కోవడానికి చిన్న స్థలం, తెచ్చుకున్న భోజనం, టీ వెచ్చబెట్టుకునేందుకు కొంత సౌకర్యం అడిగారు. యాజమాన్యం ఒప్పుకోలేదు. సరికదా సెక్యూరిటీ గార్డులను, గూండాలను ఉసికొల్పి మారణ హౌమం సృష్టించింది. అంతా భయోత్పాతం. బీభత్సం. ఆరుగురు నేలకొరిగారు. కార్మికులు మనుషులు కారా..? ఎంత అమానుషం? బడు గుల ప్రాణాలంటే లెక్కేలేదు'' అని వివరించాడు.
హష్మి చలించిపోయాడు. ఇలాంటి ఘటన లపై మనం ఎందుకు నాటకం ఆడకూడదు. బల మైన ఇతివృత్తాలు ఎక్కడి నుండి వస్తాయి. కష్ట జీవుల జీవితాల్లో నుంచి కాదా..? బృందంలో చర్చ పెట్టాడు. ఆ మదనంలో నుండి పుట్టిన నాటికే 'మిషన్.'
'నాటకం జనానికి ఎక్కేవిధంగా సరళంగా ఉండాలి. ఆకట్టుకోవాలి. ప్రత్యేకతనుండి సాధారణ స్థితికి చేరుకోవాలి. యావత్ కార్మికవర్గం అన్వయించుకునేలా రచన, దర్శకత్వం, నటనా ఉండాలి. దోపిడీ క్రౌర్యం అతిభయంకరమైనది. అనూహ్యమైనది. కళాకారులుగా ముందు మనం ఇది అర్థం చేసుకోవాలి. ప్రజలకు అర్థం చేయించేందుకు ఘర్షణ పడాలి. ప్రజా చైతన్యమే అంతిమ లక్ష్యం.' అని హష్మి పదే పదే చెప్పేవాడు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ గ్రంథం లో. వ్యక్తిజీవితం, కళాజీవితం వేర్వేరు కాదని స్పష్టం చేస్తుందీ పుస్తకం. వీధినాటికను ఓ ఆయుధంలా మలచుకుని పిల్లల్లో యువతలో పనిచేసేవారికి హష్మి స్ఫూర్తి ఓ ఆరని అగ్నిజ్వాలలా నిత్యం రగిలిస్తూనే ఉంటుంది.
- కె. శాంతారావు
సెల్: 9959745723