Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నత విద్యాసంస్థలు, విద్యార్థులు, అధ్యాపకుల కోసం ధ్యాన సమావేశాలను నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కోరుకుంటోంది. శ్రీశ్రీ రవిశంకర్ ఏజెన్సీ 'ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్' అభివృద్ధిపరచిన ధ్యాన విధానాన్ని అనుసరించాలని నవంబర్ 24న జారీ చేసిన సర్క్యులర్‌లో యూజీసీ స్పష్టం చేసింది. ఆ సంస్థకు ప్రచారం కల్పించే సంస్థగా యూజీసీ మారిందేమిటని ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ముందు ఇలాంటి ఆజ్ఞలు ఆశ్చర్యాన్ని కలిగించేవి. యూనివర్సిటీలో ఎటువంటి కార్యక్రమాలను, సెమినార్లను నిర్వహించాలనే ఆదేశాలు జారీ చేసే పని యూజీసీది కాదు. ఉన్నత విద్యను ప్రోత్సా హించడం, ఉన్నత విద్యారంగాన్ని సమన్వ యపరచడం, ఉన్నత విద్యా శ్రేష్టతను, స్థాయిని నిలబెట్టే విధంగా యూజీసీ ఆదేశాలు ఉండాలి.
విద్యార్థులకు ఏం బోధించాలి, ఎలాంటి కోర్సులకు రూపకల్పన చేయాలి, విద్యార్థులనెలా చేర్చుకోవాలి, అధ్యాపకులనెలా నియమించుకోవాలి, యూనివర్సిటీ బయట నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏమిటి, లాంటి అంశాలను యూనివర్సిటీలు వేటికవి నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమావేశా లను, సెమినార్లను, సాంస్కృతిక కార్యక్రమాలను వివిధ శాఖలు నిర్వహించాలనే విషయాల్ని నిర్ణయించే స్వేచ్ఛ యూనివర్సిటీలకు ఉంటుంది. ప్రతీ యూనివర్సిటీ స్వంత చట్టాల ద్వారా నిర్వహింపబడుతుంది కాబట్టి, యూని వర్సిటీ సంబంధిత విషయాల్లో యూజీసీ ఎట్టి పరిస్థితు ల్లోనూ జోక్యం చేసుకోకూడదు. యూనివర్సిటీ చట్టాలను పరిశీలిస్తే ఆఖరికి ప్రభుత్వాలు కూడా వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని మనకు స్పష్టమవుతుంది.
2014 నుండి ఈ పరిస్థితి మారుతూ వస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కార్యక్రమాలను యూజీసీ ఎలా ప్రోత్సహిస్తుందని ఆశ్చర్యపోతున్నవారు, గడచిన 8ఏండ్లలో యూజీసీ రికార్డ్‌ను చూడాలి. భారత ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పాలక పార్టీ సైద్ధాంతిక కార్యక్రమాలు లేదా దాని ప్యాట్రన్ ఆరెస్సెస్ కోసం ప్రచారకర్తగా యూజీసీ పని చేస్తుంది. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిననాటి నుండి ఇలాంటి కార్యక్రమాలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి.
ప్రచార సంస్థలుగా యూనివర్సిటీలు
ప్రభుత్వం, హిందూత్వ జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ, యూనివర్సిటీలు ఈ భావజాల ప్రచార కేంద్రాలుగా మారాలని కోరుకుంటుంది. రవిశంకర్ 'ధ్యాన ప్రచారానికి' కొద్ది రోజుల ముందు, నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంనాడు ''ఇండియా: మదర్ ఆఫ్ డెమోక్రసీ''పై సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశాలను యూజీసీ విద్యా సంస్థలకు పంపింది. గతంలో ఎన్నడూ ఇలాంటి మార్గదర్శకాలను జారీచేసిన సందర్భం ఎవరికీ గుర్తు లేదు. యూనివర్సిటీలను స్వతంత్ర ఆలోచనలున్న సంస్థలుగా పరిగణించేవారు. కానీ పరిస్థితులు మారాయి. ధ్యానానికి సంబంధించిన లేఖ లాంటిదే, ఇక్కడ కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్(ఐసీహెచ్ఆర్) తయారు చేసిన ఒక నోట్‌ను యూజీసీ పంపింది. ఆ నోట్లోని ఆదేశాల కనుగుణంగానే విషయంపై చర్చ నిర్వహించాల్సి వచ్చింది. భారతదేశం, ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం, దాని ప్రజాస్వామిక సాంప్రదాయాలను కాప్ పంచాయతీల్లోనే చూడవచ్చని ఆ నోట్ చెపుతుంది. ఆ ప్రజాస్వామ్యం దాని మూలాలను వేద కాలంలోనే కలిగి ఉందనీ, ఈ భూమిపై భారతదేశం మనుషుల జ్ఞప్తికి అందనంత కాలం నుండి ఉనికిలో ఉంటుంది కాబట్టి భారతదేశం చాలా గొప్పదట. ఐసీహెచ్ఆర్ నుండి వచ్చిన ఈ నోట్‌ను మీడియాలో చర్చకు పెట్టారు. ప్రకటనను విమర్శిస్తూ అభిప్రాయాలను కార్యక్రమాల్లోనే వ్యక్తం చేయడం సాధ్యమేనా? చర్చా ప్రక్రియ, ఐసీహెచ్ఆర్ ప్రకటించిన అధికార వైఖరినే అనుసరించాలి కాబట్టి చర్చలో విమర్శ, సంవాదం, వాదనల ప్రశ్నే తలెత్తదని యూజీసీ స్పష్టం చేసింది.
అందువల్ల దాన్ని చర్చ అనే దానికంటే ప్రచారమని అనడం సముచితంగా ఉంటుంది. ఒక భావాన్ని ప్రచారం చేయడం యూనివర్సిటీల పని కాదు. అన్ని భావాలను, భావజాలాలను, పరిశీలించి దానిని విమర్శనాత్మకంగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయించడం యూనివర్సిటీల పని. ఒక తత్వవేత్తను, లేదా ఒక భావజాలాన్ని విశ్వసించే విధంగా విద్యార్థులకు బోధించడం అధ్యాపకుని పని కాదు. విద్యార్థులు అందరిలో ఒక విమర్శనాత్మక సామర్థ్యాన్ని అభివృద్ధిచేయడం యూనివర్సిటీల పని. అందుకే, యూనివర్సిటీలు ఒకే విషయం పైన భిన్నాభిప్రాయాలను, భిన్న వైఖరులను విద్యార్థులకు పరిచయం చేస్తాయి. ప్రతీ భావాన్ని, ప్రతీ ఆలోచనను పరిశీలించడానికి విద్యార్థులకు మేధోపరమైన సాధనాలను లేదా విధానాలను సమకూర్చి పెట్టడం వాటి బాధ్యత. అధ్యాపకునికి తనకంటూ ఒక స్వంత అభిప్రాయం ఉండవచ్చు, కానీ అది విద్యార్థులు అంగీకరించకుండా ఉండలేని అధికారిక అభిప్రాయం కాదు. కానీ, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ భావజాలంపై ఏకాభిప్రాయాన్ని సృష్టించి, ఏకాభిప్రాయాన్ని నిర్మించాలని యూజీసీ యూనివర్సిటీల్ని అడుగుతుండడంతో అక్కడ ఎలాంటి భిన్న స్వరానికి చోటు లేదు.
ఇది యూనివర్సిటీలు చేయాల్సిన పనికి ఖచ్చితంగా వ్యతిరేకం. ప్రపంచ వ్యాప్తంగా విద్యావేత్తలు, మన యూనివర్సిటీలపై చేస్తున్న ఈ అదుపును విమర్శించారు. ప్రభుత్వ భావజాలానికనుగుణంగా విద్యార్థులను సామాజీకరణ చేయడానికి వాటిని ఉపయోగించు కుంటున్నారని తప్పుపట్టారు. ఉన్నత విద్య అంటే ఎప్పటికీ స్వేచ్ఛ అనే అర్థాన్ని ఇస్తుంది. అధ్యాపకుల పని, తరగతి గదుల పని విద్యార్థుల మనసులను ప్రత్యేకమైన ఆకారంలోకి రూపొందించడం కాదు, కానీ ప్రభుత్వం ఇప్పుడు యూజీసీ ద్వారా ఖచ్చితంగా అదే పని చేస్తుంది.
పైకి చూడడానికి ఈ మార్గదర్శకాలు చాలా నిష్కపటంగానే కనిపిస్తాయి. కానీ వాటిని విశాలమైన సందర్భంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను, ప్రతీ దాన్ని కేంద్రీకృతం చేసి, భిన్న విద్యాసంస్థల్లో ఏకరీతి(యూనీఫామిటీ)ని రూపొందించే లక్ష్యాలు గల ఇతర ఆదేశాలతో పాటు కలిపి అర్థంచేసుకోవాల్సి ఉంటుంది. విద్యాసంస్థలు వాటికవే ఆలోచించి, నిర్ణయాలు చేయడానికి అనుమతించబడ్డం లేదు. కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కేంద్రీకృతం చేయబడుతుంది. ఏకరీతి ప్రమాణాల ద్వారా అధ్యాపకులు, వైస్ ఛాన్సలర్ల ఎంపిక ఇప్పుడు చట్టం అయింది. కోర్సులన్నీ ఏకరీతిగానే రూపొందించ బడుతు న్నాయి. పాలనా వ్యవహారాలు, విద్యావిషయక అంశాల్లో యూనివర్సిటీల స్వతంత్ర ప్రతిపత్తిని లాగేసుకుంటున్నారు.
ఏకరీతి పిలుపు ఒక జనరంజకమైన విన్నపాన్ని కలిగి ఉంటుంది. కుర్రాళ్ళను జాతీయవాదులుగా తయారు చేయాలనే ఆలోచనకు దుర్బుద్ధిని పుట్టించే లక్షణం ఉంటుంది. అదే సమయంలో నీవు ప్రపంచ స్థాయి జాతీయవాదివి కాలేవు. ప్రపంచంలోని ఏ గొప్ప యూనివర్సిటీ కూడా తన విద్యార్థుల్లో జాతీయవాదాన్ని నాటుకొనేట్లు చేసే ప్రయత్నం చేయదు.
సమాజం దృష్టిలో యూనివర్సిటీ అనే భావనను మార్చేయడమే అలాంటి ఉత్తర్వుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అసలు ఒక ఉన్నత విద్యా సంస్థ లక్ష్యం ఏమిటి? విజ్ఞానం, దాని అభివృద్ధే యూనివర్సిటీల లక్ష్యమైతే, మరి విద్య ఏమిటి? విజ్ఞానాన్నందించేది ఏమిటి? పురాతన కాలాల నాటి గొప్ప విజ్ఞానం గురించి విజయ గీతాలనాలపించి, దాన్ని పునరుద్ధరించడమా?
కోమాలో ఉన్న రోగులపై మహామృత్యుంజయ జాప్ ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ప్రయోగాలు చేసినప్పుడు, లేదా సైంటిఫిక్ వ్యాలిడేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ పంచగావ్య (ఎస్వీఏఆర్ఓపీ) (ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవుపాలు, పెరుగు, నెయ్యిల మిశ్రమం)కింద పరిశోధనా ప్రతిపాదనలను ఐఐటీ ఆహ్వానించినప్పుడు, లేదా అయోధ్యలోని రామాలయంలో రాముని విగ్రహంపై సూర్యకిరణాలు పడతాయని ఖాయపరచడానికి శాస్త్రజ్ఞులు కలిసి పని చేసినప్పుడు, లేదా భారతీయ సంస్కృతికి 12 వేల సంవత్సరాల వయస్సు ఉంటుందని స్థిరపరచడానికి ఐసీహెచ్ఆర్ పరిశోధన మొదలు పెట్టినప్పుడు, వాస్తవానికి ఈ విషయాలన్నీ విజ్ఞానం, పరిశోధన అనే భావనను అల్పమైన విషయాలుగా పరిగణిస్తాయని అర్థం చేసుకోవాలి.
ఉన్నతవిద్యా సంస్థలు ఇప్పుడు మనసులను భారతీయీకరణ చేసే యంత్రాలుగా తయారయ్యాయి. కొద్ది సంవత్సరాల క్రితం ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులు కొందరు నన్ను కలిసేందుకు వచ్చారు. వారు పునశ్చరణ విధాన దిశా(ఓరియెంటేషన్), నవీకరణ పాఠ్య బోధనా క్రమం(రీఫ్రెషర్) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు, అధ్యాపకులకు వారి వారి విషయ సంబంధిత అంశాల్లో నూతన పరిశోధనా పద్ధతులను పరిచయం చేయడానికి ఉద్దేశించబడతాయి. కానీ అధ్యాపకులు హాజరైన ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలకు చెందిన నాయకులను ఉపన్యాసాలు ఇవ్వడానికి పిలిపించారు. అంతా లేచి నిలబడి ''చైనా వస్తువులు, తలాక్, తలాక్, తలాక్'' అని నినాదాలివ్వాలని ఒక ఉపన్యాసకుడు అధ్యాపకులను అడిగాడు. ''మాకు అఖండ భారత్‌లోనే చావు రానివ్వండి'' అనే ప్రమాణాన్ని అధ్యాపకులందరిచేత బలవంతంగా చెప్పించారు.
ఇలాంటి అసంగతమైన విషయాలు సర్వసాధారణ మయి, అధ్యాపకులు ఫిర్యాదులు చేయడం కూడా ఆపేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో నిర్వహించబడిన ఆరెస్సెస్ నాయకుల ప్రసంగాలను వినేందుకు అధ్యాపకులు హాజరవ్వాలని పిలుపిచ్చారు. ఆరెస్సెస్ నాయకత్వానికి తెలిసే విధంగా ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు, డీన్లు, వివిధ శాఖాధిపతులు ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండానే వారి కార్యక్రమా లకు హాజరవుతున్నారు. బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తు చేసుకుంటున్న స్కాలర్లు అలాంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం లేదా ఆరెస్సెస్‌కు విశ్వాసంగా ఉన్నారని రుజువు చేసుకునేందుకు అలాంటి కార్యక్రమాలను వారే నిర్వహిస్తున్నారు. వీరు ఆరెస్సెస్ కార్యక్రమాల కోసం విద్యార్థులు, అధ్యాపకులతో కూడిన జాబితాను తయారు చేసి, వారిని సమీకరిస్తున్నారు.
ఫలితంగా విద్య, విజ్ఞానం, పరిశోధనల భావం లేదా అర్థం మన సమాజం దృష్టిలో నుండి మాయమైపోతున్నది. యూనివర్సిటీ అనేది జాతీయవాద భావనల సంస్థ కాదు. అది అంతర్జాతీయ విజ్ఞాన సంఘంలో ఒక భాగంగా ఉండాల్సి ఉంటుంది, అక్కడ తన ఉనికిని చాటుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు, మనం దీనిని మర్చి పోతున్నాం. మన యూనివర్సిటీలు ఇప్పుడు సంకుచిత వ్యవస్థలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నూతన భావాలు ఉద్భవించే అవకాశాలు చాలా కొద్దిగానే ఉన్నాయి. సంకుచిత హిందూత్వ ఆధారిత మతోన్మాద దృష్టిని ప్రోత్సాహించడం ద్వారా యూనివర్సిటీలు కూడా హిందూ యేతరులకు పరాయి ప్రాంతాలుగా మారుతున్నాయి.
- అపూర్వానంద్
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451