Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పార్టీ నూతన పదవులపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసంతృప్తి చెందారు. విమర్శల వర్షాన్ని కురిపించారు. తుదకు చతికిలపడ్డారు. ఇవతలి నుంచి సంపూర్ణ మద్దతు లభించకపోవడంతో వారి కథ కంచికి చేరింది. రివర్సయింది. అధిష్టానం చీవాట్లు పెట్టింది. హెచ్చరికలు చేసింది. అంతేకాకుండా వారు పార్టీ నుంచి పోతేపోనిలే అనే సంకేతాలిచ్చింది. మరోవైపు ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవైపు రేవంత్‌రెడ్డి పాదయాత్ర సమయం దగ్గరపడుతుంది. కచ్చితంగా క్యాడర్ పాదయాత్రలో నడవాల్సిందే. ఎవరు రాకపోయినా రేపటి పరిస్థితి ఏంటి? అనే మీమాంసంలో సీనియర్లు మదనపడుతున్నారు. చివరికి గాంధీభవన్ మెట్లు ఎక్కేందుకు వారికి ఇగో అడ్డుపడుతున్నది. వివిధ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ... చివరికి ఎటుపోతారనే చర్చ మొదలైంది. మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అన్నట్టు రేవంత్‌తో సీనియర్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది సీనియర్లు పరిస్థితి. పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియా పార్టీమార్పుపై హోరెత్తిస్తున్నది. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే రానున్న ఎన్నికల్లో వారి టికెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందనే గుబులు రేగుతున్నది. సందట్లో సడేమియా అన్నట్టుగా వారి నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు దూసుకొస్తున్నారు. మేము సైతం ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ సైరన్ మోగిస్తున్నారు. ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక, అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోలేక 'పెద్ద తలకాయలు' గిలగిల కొట్టుకుంటున్నారు. పార్టీకి దూరమైన నేపథ్యంలో ఎవరైనా రాయబారం చేసి... తమకు ఆపన్న హస్తం అందిస్తే మళ్లీ కార్యక్రమాల్లో చేరాలని వారు తహతహలాడుతున్నారు. లేకపోతే మనసు మార్చుకుని కమలం పువ్వు చెవిలో పెట్టుకునేందుగానీ, కారెక్కేందుకుగానీ వారు వెనుకాడబోరంటూ గాంధీభవన్ కోడై కూస్తున్నది.
- గుడిగ రఘు