Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజులు సాధారణంగా గడిచాయి.. నెలలు అలా అలా దొర్లాయి.. షరా మామూలుగా మరో ఏడాది కాలగర్భంలో కలిసి పోయింది. నేటి నుంచి కొత్త సంవత్సరం గమనంలోకి వచ్చి చేరింది. కొన్ని దేశాల మధ్య యుద్ధాలు.. రాజకీయ సంక్షోభాలు... ఆకలి... దరిద్రాలు... నిరుద్యోగుల ఎదురు చూపులు... రైతన్నల ఆత్మహత్యలు... హక్కుల కోసం కార్మికుల రణ నినాదాలు గతేడాది మార్మోగాయి. మతోన్మాదుల విద్వేషాగ్నులు... మహిళలపై విషనాగుల అరాచకాలు విలయతాండవం చేశాయి. పాలకుల విధానాలతో ధరలు ఆకాశాన్నంటి... సామాన్యుడికి చుక్కలు చూపించాయి. ఇలాంటి ఆశనిపాతాలు, ఆశ నిరాశాల మధ్య 2022కి వీడ్కోలు పలికాం. 'ఉదయం కానే కాదనుకోవటం నిరాశ... ఉదయించి అట్లానే ఉందనుకోవటం దురాశ.. ఈ చీకటి ఉండదు... సూర్యుడు తప్పక ఉదయిస్తాడు...' అని ఓ కవి రాసుకున్నట్టు వ్యక్తిగత జీవితంతోపాటు వ్యవస్థీకృతంగానూ ప్రతీయేటా అనేక ఎత్తుపల్లాలు... ఒడిదుడుకులు సహజం. వాటన్నింటినీ తట్టుకుని మనిషి, సమాజం నిలబడాలి. అలా నిలబడి ముందుకు... మున్ముందుకు సాగాలి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ తాత బోసి నవ్వుల నుంచి ఇప్పుడిప్పుడే భూమ్మీదకొచ్చిన నవజాత శిశువుల అమాయకపు చిరునవ్వుల దాకా అందరి మోముల్లో సంతోషం వెల్లివిరియాలి. అందుకనుగుణంగా ప్రజల మధ్య చీలికల తెచ్చే పాలకుల కుయుక్తులను తిప్పికొట్టాలి. జై జవాన్... జై కిసాన్.. అనే నినాద స్ఫూర్తితో దేశ రక్షణ, రైతు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరమూ కంకణబద్ధులం కావాలి. భగత్‌సింగ్ ఇచ్చిన 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే రణ నినాదాన్ని మోగిస్తూ హక్కుల సాధన కోసం అకుంఠిత దీక్ష బూనాలి. తద్వారా మనుషుల మధ్య ప్రేమాభిమానాలు, ప్రజల మధ్య ఐక్యత, దేశాల మధ్య సుహృద్భావాన్ని పాదుకొల్పాయి. అప్పుడే నూతన సంవత్సరం శోభాయమానం అవుతుంది. నవ వసంతం వెల్లి విరుస్తుంది. ఆ వసంత శోభ రావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం... ఆకాంక్షిద్దాం...
-బి.వి.యన్.పద్మరాజు