Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మాకెపుడూ ప్రజల గురించే ధ్యాస. వాళ్ళను లివర్లో పెట్టుకొని చూసుకుంటాం'' నాయకుడు చెప్పుకుంటూ పోతున్నాడు. కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా చెప్పుకొస్తున్నాడేమో అని అందరూ వింటున్నారు.
''సార్...!!??'' అసిస్టెంటు అరిచాడు వెనుకనుండి.
''ఏం జరిగిందిర భై'' మైకును మూసేసి అడిగాడు.
''సార్, గుండెల్లో... గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం...'' అన్నాడు ఆ అసిస్టెంటు.
ఇదంతా ప్రజలు వింటున్నారన్న విషయం కనిపెట్టిన నాయకుడు మళ్ళీ మొదలుపెట్టాడు
''నా అసిస్టెంటే లివర్లో కాదు, గుండెలో పెట్టుకుంటాను అని అనమంటున్నాడు. నేను సరిగ్గానే అన్నాను. అందరూ గుండెలో పెట్టుకుంటే కొత్తేముంటుంది. అందుకే నేను లివర్ అన్నాను. తప్పా?'' కొత్తదనం కోసం తాను ఆరాటపడతానని ప్లేటు ఫిరాయించాడు చాకచక్యంగా.
''లేదు లేదు'' తన ప్రతి మీటింగులోనూ ఉండే అనుచరులు గట్టిగా అరిచారు.
''లివరంటే కాలేయం, కాలేయమంటే లివర్, ఇసుమంటి విషయాలు అందరూ తెలుసుకోవాలి మరి...''
సభ మొత్తం చప్పట్లు.
''గద్గదీ లివర్ పవర్. ఎక్కువరిస్తే మా పార్టీ గుర్తు ఇప్పుడున్నది తీసేసి లివర్ గుర్తు పెట్టుకుంటాను. ఎవరికైనా అభ్యంతరమా?''
''లేదు లేదు'' అనుచరులు, తిరిగి చప్పట్ల మోత.
''ఇంతకీ గుండెనా లివరా అని అనుమానం రావచ్చు. నేను మజాకుకైనా మజాకు చేయను. ఈ మధ్యనే లివర్ గురించి చదివాను. ఎవరో ఒకాయన కూతురు తనకు లివర్ దానం చేసిందని ఆయనే చెప్పాడు. మొత్తం లివర్ ఇస్తే ఆ బిడ్డ పరిస్థితి ఏందని, తన జిందగీ అంతా పరేషాన్ కాదా అనీ అడిగా. లివర్ మొత్తం గట్ల తీసేసి గిట్ల పెట్టరంట. కొంచెం కోసి పెడతారంట. గది పెట్టుకున్న నాయనకు మొత్తం లివర్ తయారవుతుందంట. ఈ బిడ్డకీ తను ఇచ్చిన లివర్ తనకొచ్చేస్తుందంట. ఇచిత్రమే కదా...''
చప్పట్ల మోత. అనుచరులు ఆనందపడిపోయారు. మా సారు శంకర్ దాదాకు మించిన తెలివితేటలున్నోడు అని మనసులో అనుకున్నారు. ఈమధ్య పాదయాత్రలు చేస్తూ మా బాసుకు బుద్ధి పెరిగిపోయిందనుకున్నారు కూడా. వాళ్ళలో ఒకడు మెల్లిగా నిజం చెప్పాడు. ''ఈ మధ్య తాగి తాగి సారు కాలేయం బాగా చెడిపోయిందని డాక్టరమ్మ చెప్పిందంట. అందుకే గుండె ఎందుకు లివర్ ఇస్తామంటున్నాడు.''
''మొన్న ఎన్నో వైద్య కళాశాలలు కట్టిస్తామన్నారు. నేనొక్కటే చెబుతున్నా... ఆ కాలేజీలన్నింటిలో లివర్ మార్చే ఏర్పాటు మా పైనోళ్ళకి చెప్పి నేను పెట్టిస్తా...'' అని అనుచరుల వైపు చూశాడు. ఇప్పుడు వారితో పాటు స్టేజి మీద ఉన్నోళ్ళూ ఒకటే చప్పట్లు. పరుగులు పెట్టే బండి ఎలా ఆగదో మన నాయకుడి ఉపన్యాసం కూడా ఆగకుండా పోతోంది. అందుకే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్లేసినారేమో అనుకునేలాగ ఉంది ఆయన జోరు. ఇంతలో ఒక అనుచరుడొచ్చి సార్ మీరు వాళ్ళు కట్టిచ్చే మెడికల్ కాలేజిల గురించి చెబుతున్నారని వెనక కూచున్న సారు చెబుతున్నాడు అనే సరికి స్పీడుతో పోతున్న ఉపన్యాస బండి కొద్దిగా నెమ్మదించింది.
ఎన్నికలనగానే ప్రజలు గుర్తొస్తారు. వాళ్ళను తమ గుండెలో పెట్టుకుంటామన్న డైలాగులూ గుర్తొస్తాయి. నిజంగానే ప్రజలకు సేవ చేస్తున్నోళ్ళను ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, సందేహం లేదు. వారికి చేతనైనంత సహాయమూ చేయాలి. అంతే కాని పొద్దస్తమానమూ ప్రజల్ని ఎలా మింగాలి అనుకునేవాళ్ళ గురించి ప్రజలకు చెప్పాలి. ఎవరేమనుకున్నా సరే. ఇదంతా కూడా ప్రజల కోసమే. ఒక గుండె డాక్టరు మీటింగులో తమాషాగా చెప్పిన విషయం. అదేమంటే... ఎవరినైనా మీది విశాల హృదయం అని పొగడొద్దు అని చెప్పాడాయన. ఎందుకంటే విశాల హృదయమంటే హార్ట్ ఎన్లార్జ్ అని అర్థమట. అంటే ఒక రకమైన గుండె జబ్బులో గుండె తన సైంజును మించి కొద్దిగా పెరుగుతుందన్నమాట. అలా ఎన్నికల రోగాలు వచ్చినప్పుడు ఆటోమ్యాటిక్కుగా నాయకుల గుండెలు పుష్పాల్లాగా విచ్చుకుంటాయి, విశాలమైపోతాయి. ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ ముడుచుకుంటాయవి. అలా కొన్ని పూవ్వులు విచ్చుకోవడం, ముడుచుకోవడం మనం చూడొచ్చు. ఎన్నికలున్నా, లేకున్నా కొన్ని హృదయాలు ఎప్పుడూ విశాలంగానే ఉంటాయి. వారిని గమనించాలి.
అందుకే ఎవరి గుండెలో ప్రజలకు చోటుందో, ఆ ప్రజల గుండెల్లో కూడా నాయకులకు చోటుంటుంది. నాది పుష్పక విమానం లాంటి గుండె, ఎందరికైనా చోటుంటుంది. ఏ రాష్ట్రంలోనైనా ఆ గుండె తెరుచుకుంటుంది అనే రకం నాయకులూ మన చుట్టే ఉంటారు. వాళ్ళ గుండె చప్పుడు లబ్ డబ్ అని కొట్టుకుంటుందా లేక లబ్బు డబ్బు అని కొట్టుకొని తరువాత డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందా! ఆ డబ్బున్నోళ్ళకే అన్నీ కట్టబెట్టి కుబేరుల్ని చేస్తున్నారా! అన్న విషయం కూడా చూడాలి. నీ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని, అని పాడుకున్నట్టు ఆ పరమ భక్తుల గుండెల్లో అలా కనిపించి ఇలా మాయమయ్యే ప్రజలను చూడొచ్చు. తరువాత కొలువై ఉండే బడా బాబులనూ చూడొచ్చు నిరంతరం. సీట్లివ్వడానికి ఆ బడాబాబుల లిస్టులు తయారు చేయడమూ చూడొచ్చు. మా లిస్టులోనూ బడాబాబులున్నారు. మా గుండెల్లో కూడా ఉన్నారు అని వారికంటే కొద్దిగా తేడాగా ఉన్నోళ్ళూ అనొచ్చు.
ప్రజలు ఈ గుండెలను చూస్తూనే ఉంటారు. ఆ గుండెలకు ఎప్పుడు పరీక్షలు చేయాలో, ఎప్పుడు స్టెంట్లు వేయాలో వారికి బాగా తెలుసు. కొత్త సంవత్సరంలో కొత్తగా ఎవరెవరు ఏ ఎత్తులు వేస్తారో, ఎన్ని జిమ్మిక్కులు చేస్తారో ఇంకా బాగా గమనించి ఆ గుండెల్ని కొత్తగా చేసుకునే పవరూ ఉంది ప్రజలకు. అందుకే వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...
- జంధ్యాల రఘుబాబు
9849753298