Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరిగిపోయిన కాలానికి వీడ్కోలు... అరుదెంచే రోజులకు ఆహ్వానం... ఇదో నిరంతర ప్రక్రియ. ప్రవాహం. కాలం విసిరే సవాళ్లకు జవాబు కూడా కాలమే. కాలమంటే కార్యాచరణే. మన కార్యక్రమాలే. ఎవరు కదలినా లేకున్నా కాలం కదలిపోతుంటుంది. గతవారం ముగిసిన 2022ను సమీక్షించుకుంటే ఈ వారం రాబోయే 2023ను స్వాగతించాలి. ఎలావుంటుందో అంచనా వేసి ఎలావుండాలో నిర్వచించుకోవాలి. నిర్ణయించుకోవాలి. ''మంచి గతమున కొంచెమేనేరు మందగించక ముందుకడుగెరు'' అన్న గురజాడ మాటలైనా ''పదండిముందుకు'' అని చెప్పే శ్రీశ్రీ కవిత్వమైనా సందేశమదే. మనుషులు ఎప్పుడూ గతం కన్నా భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తారు. అందుకోసం యథాశక్తి అడుగులు వేస్తారు. ఆశ ఆత్మవిశ్వాసం ఆశయబద్దమైన ఆచరణ ఇవే మానవాళిని ముందుకు నడుపుతాయి. అందుకే ప్రపంచమంతా 2023 ఆగమన వేడుకలు చూస్తాం. అయితే ఈ వేళలో మనదేశంలో మాత్రం మతచాందస సంస్థలు ఇది మనకు సంబంధంలేని వ్యవహారమని ప్రకటిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలపై నిఘా వేస్తామంటున్నారు. 2022 ఏళ్లుగా సాగుతున్న వాటిని కాదని అంతకన్నా వెనక్కు వెళ్లాలనుకోవడం దేనికి సంకేతం? ఏవో సూక్తులు... సుభాషితాలు... వల్లించి మారేకాలంతో మనకు సంబంధంలేదని చెప్పడం, రాతియుగంలో పాతేయాల్సిన పాతకాలపు సరీసృపాలను నెత్తిన పెట్టుకోవడం దేశాన్ని ముందుకు నడిపించదు. ఇంకా ఇంకా ఇంకా వెనక్కు నెడుతుంది. ఇక్కడే మన కొత్త సంవత్సర కర్తవ్యాలు మొదలైపోయినట్టు చెప్పాలి. వాస్తవికతతో పొంతనలేని చాందసాలనూ వొంటెత్తు పోకడలను వదిలించుకోవడం మొదటి కర్తవ్యం.
విశాల భారత వికాసం
మతచాందసం అన్నాక ఒకటేవుండదు. భారతదేశం భిన్నమతాలకు విశ్వాసాలను నిలయం. పల్లె పట్టుల నుంచి పాలనా వ్యవస్థ వరకూ కూడా మతసామరస్యం మన దేశానికి దిక్క్సూచిగా నిలిచింది. హిందూ ముస్లిం తేడా లేకుండా ఉమ్మడి వేడుకలు ఇక్కడ సామరస్యాన్ని సహజీవనాన్ని చాటిచెప్పాయి. బ్రిటిష్వారి పాలనకుముందే ఇక్కడకు క్రైస్తవమూ ప్రవేశించింది. బౌద్ధం, జైనం, సిక్కు వంటివి అంతకుముందే ఉన్నాయి. ఈ భిన్న మతాల నిలయంగా ఈ దేశ సంస్కృతిని చరిత్రను అర్థం చేసుకోకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు. మతాలు అనేకం ఉన్నాయి గనకనే రాజ్యాంగ నిర్మాతలు మతాతీతమైన లౌకికతత్వం ఎంచుకున్నారు. కులం, మతం, ప్రాంతం, స్త్రీ, పురుష తేడాలు వంటివి పాటించని లౌకికతత్వం ఎంచుకున్నారు. రాజ్యాంగం 14వ అధికరణం నుంచి 25వరకూ ఈ సమానతాభావన మనకు గోచరిస్తుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అని గాక రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడమే దేశానికీ మనుషులకూ శ్రేయస్కరం. స్వార్థరాజకీయాల కోసం ఇందుకు భిన్నమైన వాదనలు తెచ్చి అత్యధికంగా ఉన్న మతమే ఆధిక్యత వహించాలని అసహనానికి గురి కావడం అర్థరహితం. రాజకీయంగా ఇలాంటి సిద్ధాంతాలు ఎవరు చెప్పినా తోసిపుచ్చడం ప్రజాస్వామ్య స్పృహగల ప్రతివారి బాధ్యత. తాత్కాలిక అవకాశవాదాలకు అవేశకావేశాలకు గురై తమ మతాన్ని ఇతరులమీద రుద్దాలని చూడటం ప్రజల మద్య చిచ్చు పెడుతుంది. తెలియకుండానే నిన్నటి మిత్రుడు లేదా ఇరుగు పొరుగు కూడా విడిపోయే విషమ పరిస్థితి దాపురిస్తుంది. దానివల్ల ఎవరికీ శాంతి సౌఖ్యాలు లేకుండా పోతాయి. కాబట్టి ప్రజల మధ్య ఐక్యతను సామరస్యాన్ని కాపాడుకోవడం కీలకం. ఇటీవలి అనుభవాలు ముఖ్యంగా గత ఏడాది చేసిన కొన్ని ఘటనలు చెబుతున్నదే. చాపకింద నీరులా చొరబడిన మతతత్వ రాజకీయాలను తోసిపుచ్చాల్సి ఉంటుంది. ఏ ఆధారంలేని కట్టుకథలు, విద్వేష వివాదాలకు మనం లోబడిపోకూండా జాగ్రత్త వహించాలి.
వాళ్లచుట్టే తిరగొద్దు
రాజకీయ రంగంలో ఏవో కొన్ని పాలక పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం, బిఆర్ఎస్... వంటివి) మాత్రమే శరణ్యమన్న భావన పోవాలి. పౌరులెవరైనా తమకూ దేశాన్ని మలచే హక్కు ఉంటుందని గుర్తించాలి. రాష్ట్రాలలోగాని, కేంద్రంలో గాని ఒకరిద్దరు నాయకులు, ఒకటి రెండు పార్టీలు, కొన్ని కులాల చుట్టూనే తిప్పుతూ అసలు సమస్యలు పక్కదోవ పట్టించే కుట్రలను అర్థం చేసుకోవాలి. బడా పార్టీల ఆధ్వర్యంలోని మీడియా సోషల్ మీడియా సంస్థలు పథకం ప్రకారం గుడుగుడు గుంచంలా అవే కథనాల చుట్టూ పరిభ్రమణం చేయిస్తున్నారనేది ప్రజలకు తెలియజెప్పాలి. రైతాంగం కార్మికులు ఉద్యోగులు మహిళలు సామాజికంగా దళితులు వెనకబడినవారిని తమ వలయంలో బందీలను చేయడం తప్ప సమగ్రంగా ఆలోచించే అవకాశం లేకుండా చేయడాన్ని ఛేదించాలి. వృథా వివాదాలు, బూతు పురాణాలు, కులాల కుంపట్లు రగలేసే రాజకీయాలను నిరసించాలి. సామాజిక న్యాయం సాధికారతో పాటు మౌలిక సమస్యలపై సమిష్టిగా పోరాడకుండా ఒరిగేది ఉండబోదని తెలియజెప్పాలి.
సంక్షేమ పథకాలు స్వాగతించినా సమూలమైన పరిష్కారం భూమి, ఉపాధి, జీవిత భద్రత, హక్కుల రక్షణతోనే ముడిపడి ఉంటుందని గుర్తించాలి. కుల, మత విభేదాలు ఏ పరిష్కారం సూచించలేవని స్పష్టంగా తెలుసుకోవాలి. గొప్పలెన్ని చెప్పుకున్నా పాలకపార్టీలు, నాయకులు అంతిమంగా అధికారం కోసం అర్రులు చాచేవారే. మౌలిక సమస్యలపై వారు ఎలాంటి నిర్దిష్ట ప్రతిపాదనలు చేయడం లేదనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. సంక్షేమ పథకాలను అవహేళన చేయడం సరికానట్టే వాటిని ఏ ఒక్కరి దయాభిక్షగానో, వ్యక్తిగత ఉదారతగానో చిత్రించే ప్రయత్నాలనూ తోసిపుచ్చాలి. కేంద్ర రాష్ట్రాల పథకాలేవైనా అన్నీ ప్రజాధనంతో జరిగేవి ఈ పథకాలను ఇష్టానుసారం కుదించడం, కోతలకూ వడపోతలకూ గురిచేయడం నిలదీయాలి. పాలక పార్టీలన్నీ బీజేపీ, వైసీపీ, బిఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ వంటిపార్టీలతో సహా అదికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు రెండు రకాలుగా మాట్లాడే ద్వంద్వనీతిని దుయ్యబట్టాలి. ఇటీవల ఏపీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ సభలో సీపీఐ(ఎం) కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పినట్టు హక్కుల హరింపు విషయంలో టీడీపీ పాలనా కాలం దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తులో తాము ఏ విధంగా వాటిని కాపాడేందుకు కట్టుబడివుంటామో స్పష్టం చేయాలి. తెలంగాణలోనూ బీజేపీపై పోరాటంలో బిఆర్ఎస్తో కలసి వ్యవహరించినా ప్రజల సమస్యలపై రాజీ ఉండబోదని సీపీఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పిందీ అదే. దేశమంతటా ప్రజా ఉద్యమాలపై, రాష్ట్రాల హక్కులపై దాడి చేసే బీజేపీని పల్లెత్తుమాట అనకపోతే అది ఏ విధంగానూ పరిష్కారం కాదన్నది సత్యం. నిరంతర ప్రయివేటీకరణ, బడా సంపన్నులకు లక్షలకోట్ల రాయితీలు బ్యాంకు సొమ్ముల ధారదత్తం, ఆర్థిక అంతరాల తగ్గింపు లక్ష్యాన్ని వమ్ము చేస్తున్నాయి. ఆర్థిక సామాజిక సాంస్కృతిక అణచివేతలు దోపిడీ పీడనలపై జమిలిగా పోరాడాలి తప్ప పెద్ద పార్టీల ప్రచారాలు నేతల కపట వాక్కులతో మోసపోకూడదు. మేడిపండులాంటి గ్లోబల్ మార్కెట్ బుడగలు వరుసగా పగిలిపోతుంటే వాటిపై శృతిమించిన ఆశలు పెంచుకోవడం అర్థరహితమని గ్రహించాలి. అమెరికా ఉపగ్రహం కావడం కాదు, స్వావలంబన తప్ప దేశానికి మరో ప్రత్యామ్నాయం ఉండదనే మెళకువ ఉండాలి. తక్షణ సమస్యగా సవాలు విసురుతున్న కోవిడ్ వేరియంట్లు, ఐటి కుదుపులను తట్టుకోగల వ్యూహం కావాలి. ఇప్పటికే వెనకబడిన ఆర్థికాబివృద్ధి ఉత్పత్తి రంగం, పెరిగిపోయిన దిగుమతులు ,కేంద్ర రాష్ట్రాల రుణ ఊబి గురించి జాగ్రత్త వహించాలి తప్ప మోడీ సర్కారు భజన కీర్తనల బుట్టలో పడకూడదు.
దేశమంటే మనుషులోరు!
సాంకేతిక మార్పుల యాజమాన్య పద్ధతుల మార్పులు, ప్రభుత్వ, ప్రయివేటు నిఘాలలో చిక్కిన వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ, నిర్వహణా స్వేచ్ఛ వంటివి కాపాడుకోవడం ఇక ప్రతివారికి పెద్ద అగ్నిపరీక్ష కాబోతున్నది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది రాజకీయ సామాజిక కార్యకర్తలకో మీడియా వారికో మాత్రమే గాక గొప్ప రచయితలు కళాకారులకు కూడా మృగ్యమైపోతున్నది. ఇంకా విడుదల కాని పఠాన్ సినిమాలో నాయిక బికినీ ఏ రంగులో ఉన్నదనేదాన్ని బట్టి ముందస్తుగా నిషేదించడం గడచిన ఏదాడి చివరపాదంలో చూసిన విపరీతం. ఇందుకు తలవంచడం మొదలెడితే ఇంకా ఇంకా అణచివేత తప్పదు. కనుకనే అన్ని తరగతుల ప్రజలూ అన్ని స్రవంతుల సంఘాలూ సృజనకారులూ కూడా తమ హక్కులను తామే రక్షించుకోవడానికి సిద్ధం కావలసిందే. విద్యార్థులు విద్యా హక్కుకోసం అధ్యాపకులు బోధనా హక్కు కోసం కూడా ఉద్యమించవలిందే. ఉద్యోగ భద్రతకు ఘోరంగా కోతవేసి చాకిరీ పెంచే కొత్తకోడ్లపై కార్మికులు వేతన జీవులు కార్మికులు ఎలుగెత్తవలసిందే. వీటికి సమర్థనగా తెలివైన వాదనల తెచ్చే పరాన్న భుక్కు మేధావుల ప్రచారాలనూ తిప్పికొట్టవలసిందే. అభ్యుదయం, ప్రజాస్వామ్యం లౌకిక తత్వం, సామ్యవాదం, శ్రామిక చైతన్యం వంటి మహత్తర ఆశయాలను అవహేళన చేస్తూ ఆలోచనా పరులను నిరుత్సాహ పరిచేందుకూ ప్రజలను తమ చుట్టూనే తిప్పుకోవడానికి పాలకవర్గాలు పొంచికూచుని ఉంటాయని గుర్తిస్తే ఇందులో ప్రతి అంశం ఎంత ముఖ్యమైందో బోధపడుతుంది. సరైన ప్రారంభమే సగం విజయం. ''దేశమంటే మట్టి కాదోరు... దేశమంటే మనుషులోరు...'' అన్నట్టే ఏడాది మొదట్లోనే సరైన దిశా నిర్దేశం చేసుకోగలిగితే దేశాన్ని సమాజాన్ని సంరక్షించుకోగల సత్తా సంతరించుకోగలం.
- తెలకపల్లి రవి