Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హ్యేపీ న్యూ ఇయర్.. ఎవడో ఇస్తే..
నోట్లో వేసుకునే మిఠాయి కాదు
ఒక కొత్తదనం.. ఇంకో జవసత్వం
జనం గుండె గొంతుక నుంచి ధ్వనించాలి
దేశం దేహ భక్తి ఒంటి నిండా నింపుకుంటూ
గుండె గదుల్లో చెరగకుండా హత్తుకుంటూ
రండి.. కదం తొక్కండి.. పిడికెళ్ళిత్తి కదలండి
ఆడపిల్ల సింబల్ ఆఫ్ సెక్సు కాదనీ - నీ బతుకునిచ్చిన జన్మ చిహ్నమనీ
గర్వంగా జాతి జెండాగా ఎగరేద్దాం - మత్తు ముఠాల్లో మృగాళ్ల నేరేద్దాం
రేపుల్లేని హ్యాపీ న్యూగా ప్రకటిద్దాం - రండి.. లెగవండి.. ఇక చాటింపేద్దాం
పాలక విధానాల కత్తిపోట్లకు గురై -
ఎరువైన రైతన్న వెన్నెముకను తీసి
నాగలిగా మారుద్దాం .. పొలాన్ని దున్నేద్దాం
చెమట ధారల ఒడిసిపట్టి చేలంతా చల్లేద్దాం
భూమి, పంట, ధర.. రైతు హక్కని ప్రకటిద్దాం
రండి.. కదలండి.. పచ్చ తివాచీలు పరుద్దాం
ప్రజల చెమటే ప్రభుత్వ రంగంగా పెంచినోటిని
కమ్మేసిన కార్పొరేట్ రాబందుల గుంపునకు
కారు చౌక వేలంతో అప్పనంగా అమ్మేస్తుంటే
చూస్తుండే శవాలు లేవిక్కడని చాటింపేద్దాం
అది జనం గుత్త సొత్తని ప్రకటిద్దాం సాధిద్దాం
ఇదే కొత్త సంవత్సర లక్ష్య పతాకగ ఎగరేద్దాం
అప్పుడందాం.. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్
ఇక భవిష్యత్తు.. మనదే మనదే డియర్ అని!
- ఉన్నం వెంకటేశ్వర్లు