Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడువేల ఏండ్లుగా శూద్రులకు, మహిళలకు చదువును నిషేధించిన మనుస్మృతిని ఛేదించిన చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే.1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయగావ్ గ్రామంలో జన్మించింది. సావిత్రిబాయి తన 9వ ఏటనే మహాత్మా జోతిబాఫూలేను వివాహామాడింది. తన భర్త వద్దనే అక్షరజ్ఞానం నేర్చుకొని సమాజంలో అత్యంత ఎక్కువ వివక్ష, అవమానాలు భరిస్తున్న మహిళలకు చదువు నేర్పిన మొట్టమొదటి భారతీయ ఉపాధ్యాయిని ఆమె. ఆ వెలుగులో దేశం ఇంతకాలం ముందుకు నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తిరిగి వెనక్కి నడిపించే కుట్రలు మొదలయ్యాయి.
నేటి కేంద్ర బీజేపీ సర్కార్ పార్లమెంట్లో ఎలాంటి చర్చకు తావియ్యకుండా దొడ్డిదారిన తన మంద బలంతో నూతన జాతీయ విద్యావిధానం 2020 బిల్లును ఆమోదించుకుంది. మూడువేల ఏండ్ల కిందట చదువును మెజార్టీ ప్రజలకు దూరం చేయడం ఎలా జరిగిందో, తిరిగి అలా చేయడమే ఈ బిల్లు అసలు లక్ష్యం. విద్యారంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించి కొనగలిగిన కొందరికే చదువును కట్టబెట్టడడం దాని ఉద్దేశ్యం. నిరుపేదలు, దళితులు చదువులు కొనలేక ఉన్నత విద్యకు దూరం కావడం తప్ప ఈ బిల్లు వల్ల వారికొరిగేదేమీ లేదు. అబద్దాలు మూఢవిశ్వాసాలు తిరోగమన భావాలతో విద్యార్థుల భవిష్యత్‌ను పాడుచేయడం, విద్యార్థులలో మతోన్మాద ఛాందస భావాలు పెంచడం వంటి దుశ్ఛర్యలు బీజేపీ తెచ్చిన ఈ బిల్లులో ప్రధానాంశాలుగా ఉన్నాయి. నూతన జాతీయ విద్యావిధానం అమలు చేయడం ద్వారా కేంద్ర బీజేపీ సర్కార్ ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణ, కేంద్రీకరణ వంటి లక్ష్యాలు సాధించాలని భావిస్తున్నది. అందువల్ల జాతీయ విద్యా విధానం సావిత్రిబాయి ఆశయాలకు, ఆకాంక్షలకు ద్రోహమే చేయనుంది. దీనిని వ్యతిరేకించడం ద్వారా మాత్రమే సమాజంలో మెజార్టీ ప్రజల భవిష్యత్‌ని మనం నిర్మించు కోగలం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా ముందుచూపుతో విద్య, వైద్యం, సంక్షేమరంగంలో మాత్రమే ఉండాలని చెప్పిన మాటలు పాలకులు పట్టించుకోకుండా ఈ రెండు రంగాలనూ కార్పొరేట్ శక్తులకే కట్టబెడుతున్నారు. దీనివల్ల పేదలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారుతున్నాయి.
మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో విద్యా రంగానికి 6శాతం నిధులు కేటాయించాలని, ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర బడ్జెట్లలో 30శాతం నిధులు కేటాయించి దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని, శాస్త్రీయ విలువ లను పెంచుకోవాలని పలువురు విద్యారంగ నిపుణులు అనేక ఏండ్లుగా సూచనలు చేస్తూనే ఉన్నారు. కానీ పాలకులు పెడచెవిన పెట్టారు. దీనివల్ల దేశం అనేక రంగాల్లో నేటికీ వెనుకబడే ఉంది. 75ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కేవలం 64శాతం మాత్రమే అక్షరాస్యత సాధించాం అంటే విద్య పట్ల పాలకుల శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
మెజార్టీ ప్రజలకు అక్షరజ్ఞానం లేకపోవడం వల్లే దేశం అభివృద్ధికి నాగరికతకు అమెడ దూరంలోఉందని ఆరోజుల్లోనే ఫూలే దంపతులు గ్రహించారు. అందుకోసమే అస్పృశ్యులకు, బాలికలకు మొట్టమొదట 1848లో మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక బాలికా పాఠశాల ప్రారంభించారు. కేవలం 9మందితో పాఠశాల ప్రారంభమైంది. ఫూలే దంపతులు శూద్రులకు చదువు చెప్పడాన్ని భరించలేని మహారాష్ట్ర బ్రాహ్మణులు చివరికి ఫూలే దంపతులను హత్యగావించడానికి కూడా వెనుకాడలేదు. ఇద్దరు కిరాయి గుండాలను చెరో రూపాయి ఇస్తాం ఫూలే దంపతులను చంపండని ఇంటిపైకి దాడికి పంపారు. అర్థరాత్రి తమను చంపడానికి వచ్చిన ఆ కిరాయి గుండాలను పిలిచి అన్నం పెట్టి ''మమ్ములను చంపడం ద్వారా మీ కుటుంబ పోషణ సాగుతుంది. కాబట్టి ఇగ నరకండి'' అని వాళ్లెదుట నిలబడ్డారా దంపతులు. వాళ్ళు తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలను కింద పడేసి ఫూలే దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి వెనక్కి తిరిగివెళ్లిపోయారు. సావిత్రిభాయి చదువు చెప్పడానికి వెళితే ఆమెపై రాళ్లు, పేడ మట్టి చల్లారు. పాత చీర కట్టుకొని సంచిలో మరో చీర పెట్టుకొని వెళ్లి అస్పృశ్యులకు, మహిళలకు చదువు నేర్పింది. నేటి సమాజ నాగరికతకు ఆమె నాటిన విత్తనాలమే మనమంతా... వారికి మన దేశం ఎంతో రుణపడి ఉంది. ఫూలే దంపతుల జీవిత లక్ష్యం దేశంలో మెజార్టీ ప్రజలకు చదువు సర్వసంపదలు సమంగా పంచడమే. నేటి పాలకులు ఆ లక్ష్యాలను నెరవేర్చరని 75ఏండ్లుగా మన అనుభవం చెపుతున్నది. మన తరాలు మారుతున్నాయి కానీ మన తల రాతలు మారడంలేదు. మారక పోవడానికి కారణాలను అతీతశక్తులపైకి నెట్టేసి పాలకులు చేతులు దులుపుకుంటున్నారు. మన దేశంలో ఈ వెనుకబాటు తనానికి చదువు అంద రికి దక్కకపోవడం కూడా ఓ ప్రధాన కారణం.
సావిత్రిభాయి ఫూలే జీవితం మనకు రెండు పాఠాలు నేర్పుతుంది. ఒకటి, చదువు యొక్క ఆవశ్యకతా అస్పృశ్యతా నిర్మూలన. రెండు, లక్ష్య సాధనకు అలుపెరుగని పోరాటం. అందుకే వారు గడిపిన జీవితం, వారు నడిపిన సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంపై తీవ్రమైన ప్రభావం వేశాయని మనం గమనించాలి. 1873న ఏర్పాటు చేసిన సత్యశోధక్ సమాజ్ సుమారు 150 శాఖలుగా విస్తరించింది. సత్యశోధక సమాజ్ జరిపిన వితంతువు పునర్వివాహాలు, పూలదండల పెళ్లిళ్లు, నెలకొల్పిన పాఠశాలలు, హాస్పిటళ్లు, శరణాలయాలు, ఇతర పేదల సేవా కేంద్రాలు మహారాష్ట్రలో మెజార్టీ ప్రజలను ప్రభావితం చేశాయి. మహారాష్ట్రలో తీవ్ర కరువు సంభవించింప్పుడు వారు అంబలి కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. ప్లేగు వ్యాధి సోకినప్పుడు వారు నిర్వహించిన మెడికల్ క్యాంపులు, ఆమె స్వయంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సేవలందించడం చూసే పేదల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ మనకు విధితమవుతుంది. 1890 నవంబర్ 28న మహాత్మా జోతిబాఫూలే కన్ను మూశారు. తన భర్త చితికి తానే నిప్పంటించారు. ఆ తరువాత కూడా తాను మరణించే వరకూ సుమారు ఏడేండ్లు సత్యశోధక్ సమాజ్ను తన ప్రాణ స్నేహితురాలు ఫాతిమా షేక్ సహకారంతో ముందకు నడిపించారు. ప్లేగువ్యాధి సోకిన పేద లకు సేవలు చేస్తూ చివరికి అదే ప్లేగు వ్యాధితో 1897 మార్చి 10న ఆమె కన్నుమూసారు.
ఆ మాతృమూర్తి మన దేశ సామాజిక మార్పుకు మార్గం చూపిన మొట్టమొదటి ఉపాధ్యాయిని. వేల సంవత్సరాలుగా మూఢత్వం వేళ్లూనుకొని ఉన్న ఛాందస సమాజం స్త్రీని ద్వితీయ శ్రేణి పౌరురాలిగా చిన్నచూపు చూస్తున్న తరుణంలో... ఒక మహిళగా తను నాటి సమాజం అభ్యున్నతి కోసం చేసిన నిర్విరామ కృషి నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకం. అందరికి విద్య అందడం అసమానతలు అంతం కావడమే పూలే దంపతుల లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే వారు కొవ్వొత్తిలా కరిగి తమ సర్వస్వాన్ని ధారపోసి సమాజ ప్రగతికోసం తుదిశ్వాస వరకు నిర్విరామ కృషి చేశారు. వారి ఆశయాలను మనం ఆచరించాలి. అందుకు విరుద్ధమైన నేటి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. విద్యారంగ ప్రయివేటీకరణ కార్పొరేటీకరణను సంపూర్ణంగా వ్యతిరేకించాలి. కామన్ స్కూల్ విద్యా విధానం కోసం ఉద్యమించాలి. నేడు సావిత్రిబాయి పుట్టిన రోజున అందుకు దీక్ష బూనుదాం. జనవరి 3ను బాలిక అక్షరాస్యత దినంగా పాటించాలని, టీచర్స్ డేగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేద్దాం...
(జనవరి 3న సావిత్రి భాయి పూలే జయంతి)
- టి.స్కైలాబ్‌బాబు
9177549656