Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణాది భూగోళంలోని వర్థమాన దేశాల్లో ఉత్పన్నమయ్యే వ్యవసాయ సంక్షోభానికి సామ్రాజ్యవాదపు ఆధిపత్యంతో అనివార్యమైన లింకు ఉంది. ఇంకోవిధంగా చెప్పాలంటే... ఇక్కడ తలెత్తే వ్యవసాయ సంక్షోభం సామ్రాజ్యవాదపు ఆధిపత్యానికి మరో ముఖం మాత్రమే. మన దేశ వ్యవసాయ రంగాన్నే తీసుకుంటే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశం వలస పాలనలో మగ్గుతున్న కాలంలో వ్యవసాయ సంక్షోభం నిరంతరమూ కొనసాగుతూనే ఉండేది. పదే పదే తలెత్తే కరువుల రూపంలో ఇది వ్యక్తం అయేది. 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి బెంగాల్ ప్రాంతంలో భూమి శిస్తు వసూలు చేసే హక్కును ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుక్కుంది. ఐదేండ్లు తిరిగేసరికి, 1770 నాటికల్లా బెంగాల్ కరువులతో నాశనం అయిపోయింది. 1770 నాటి కరువులో కంపెనీ అధికారుల అంచనాలను బట్టే ఒక కోటి మంది బెంగాల్ ప్రజలు మరణించారు. అప్పటి బెంగాల్ మొత్తం జనాభాయే 3కోట్లు! బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత భయంకరమైన కరువుగా పేర్కొనవచ్చు. బ్రిటిష్ వాళ్ళ పాలన ముగింపునకు వస్తున్న కాలంలో, 1943-44 నాటి బెంగాల్ కరువులో 30లక్షల మందికి పైగా మరణించారు.
బ్రిటిష్ పాలన మొదలయ్యేటప్పటి కరువుకు కారణం కంపెనీ విధించిన అత్యధికమైన భూమి శిస్తు. మళ్ళీ బ్రిటిష్ పాలన ముగిసే ముందటి కరువుకు కూడా కారణం అప్పటి ప్రభుత్వం ప్రజల నుండి అత్యధికంగా వివిధరూపాల్లో వసూలు చేసిన పన్నులు, మోపిన భారాలు. విపరీతమైనలోటు బడ్జెట్ కారణంగా పెద్దఎత్తున తలెత్తిన ద్రవ్యోల్బణం ఒకవైపు, దక్షిణాసియాలో ఆనాడు మిత్ర రాజ్యాల కూటమి సాగిస్తున్న యుద్ధానికి కావలసిన నిధుల కోసం ప్రజల మీద మోపిన అదనపు భారాలు మరోవైపు ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేశాయి. ఇక కరువు అనేది ఎప్పుడొచ్చినా, దానికి ముందు బలి అయేది గ్రామీణ పేదలే కదా! అందులో ముఖ్యంగా పేదరైతులు, వ్యవసాయ కూలీలు బలిపశువులవుతారు. ఈ కరువు భారాలతోబాటు, వలస పాలనలో రుణభారం, దారిద్య్రం, ఉన్న భూములను కోల్పోవడం అనేవి పరిపాటి అయిపోయాయి.
ఈ విధమైన క్రూర పాలన వలస పాలకులకు యాదృచ్ఛికంగా సంక్రమించిన లక్షణం కాదు. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడానికి, ఇక్కడ సాగిన క్రూర దోపిడీకి లింకు ఉంది. ఇది బ్రిటన్ కే కాదు, తక్కిన సామ్రాజ్యవాద దేశాల విషయంలోనూ వర్తిస్తుంది. ఆ దేశాలలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందాలంటే అందుకు వివిధ రకాల ముడిసరుకులు, ఆహారధాన్యాలు అవసరం. అవి ఆ దేశాల భూముల్లో పండవు. కొన్ని రకాల పంటలను అక్కడ పండించినా, అవి అన్ని కాలాల్లోనూ అక్కడ పండవు, పండినా, ఆ పంటలు వాళ్ళ అవసరాలకు చాలవు.
ప్రపంచంలో మనకు తెలిసిన చమురు నిల్వలలో కేవలం 11శాతం మాత్రమే శీతల దేశాల్లో ఉన్నాయి. కాని ఆ ప్రాంతమే ప్రపంచ పెట్టుబడికి కేంద్ర స్థానంగా ఉంది. ఆ విషయం గురించి మనం తరచూ మాట్లాడుకుంటాం. కాని ఆ దేశాలు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల కోసం తక్కిన ప్రపంచంలోని ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాల మీద ఆధారపడి ఉన్నాయన్న వాస్తవాన్ని పెద్దగా పట్టించుకోం.
18వ శతాబ్దం రెండో భాగంలోను, 19వ శతాబ్దం మొదటి భాగంలోను సంభవించిన పారిశ్రామిక విప్లవంతో పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధిపత్యం సాధించగలిగింది. అప్పుడు పరిశ్రమలకు కేంద్ర స్థానంలో జౌళి పరిశ్రమ ఉండేది. ఆనాటి పారిశ్రామిక విప్లవానికి మొనగాడుగా ఉండిన బ్రిటన్‌లో అసలు పత్తి అనేది పండనే పండదు! ఉష్ణ. సమశీతోష్ణ ప్రదేశాల నుండి పత్తిని బ్రిటన్ దిగుమతి చేసుకోవలసి వచ్చేది. తమ దిగుమతి అవసరాలను ఆ ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలలోని దేశాలు తీర్చాలంటే ముందు ఆ దేశాల్లో వ్యవసాయంలో సరుకుల ఉత్పత్తి విధానాన్ని ప్రవేశపెట్టవలసిన అగత్యం బ్రిటన్‌కు ఏర్పడింది. సరుకుల ఉత్పత్తి విధానం అంటే అన్నింటికన్నా ముందు మార్కెట్ సంకేతాలను బట్టి ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు జరగడం. స్థానికంగా ఆయా దేశాల ఆహార లభ్యత, అక్కడి ప్రజల అవసరాలు అనేవాటితో ఈ నిర్ణయాలకు ఏ మాత్రమూ సంబంధం ఉండదు. ముందు మార్కెట్‌కు అవసరమైన (సంపన్న దేశాలలోని పెట్టుబడిదారులకు అవసరమైన) సరుకుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చి, ఇంకా మిగిలిన భూభాగంలో మాత్రమే ఆ యా దేశాల స్థానిక అవసరాలను తీర్చే ఉత్పత్తులను (ఆహార ధాన్యాలను) పండించాలి.
వలస పాలనలో అమలు జరిపిన పన్నుల విధానంతో ఈ రెండు లక్ష్యాలనూ సామ్రాజ్యవాదులు సాధించు కోగలిగారు. అంతకు మునుపు మొఘల్ చక్రవర్తుల పాలనలో పండిన పంటలో ఒక భాగం పన్నుగా వసూలు చేసే పద్ధతి ఉండేది. డబ్బు రూపంలో చెల్లించాలన్న నిబంధన ఉండేది కాదు. ఆ తర్వాత వలస పాలనలో డబ్బు రూపంలో భూమిశిస్తు చెల్లించాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేశారు. దాంతో రైతులు వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకుని భూమి శిస్తు చెల్లించడం మొదలుపెట్టారు. ఆ వడ్డీ వ్యాపారులు రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడే దానిని తిరిగి చెల్లించడానికి ఏ పంట పండించాలో ముందే షరతు పెట్టేవారు. ఆ పంటకు చెల్లించే రేటును కూడా ముందే నిర్ణయించేవారు. ఆ విధంగా వ్యవసాయంలో సరుకుల ఉత్పత్తి క్రమం ఈ దేశంలో ప్రవేశించింది. ఈ పని నేరుగా వలస పాలకులు చేయలేదు. వ్యాపారుల ద్వారా చేయించారు. ఆ వ్యాపారులు మార్కెట్ సంకేతాలకు అనుగుణంగా వ్యవహరించడం జరిగేది. అదే సమయంలో రైతుల మీద పన్నుల భారాన్ని విపరీతంగా పెంచారు. మరోవైపు పెట్టుబడిదారీ దేశాల నుండి యంత్రాల మీద తయారైన ఉత్పత్తులు పెద్దఎత్తున మన దేశంలోకి దిగుమతి కావడంతో ఇక్కడి స్థానిక వృత్తులన్నీ దెబ్బ తిన్నాయి. దేశీయ పరిశ్రమలు చితికిపోయాయి. దాని ప్రభావం వలన ప్రజల కొనుగోలుశక్తి బాగా క్షీణించింది. అందువలన ఇక్కడ సరుకులు అమ్ముడుపోవడం తగ్గిపోయింది. అప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు ఇక్కడి నుంచి కావలసిన ముడిసరుకులను కారుచవకగా పట్టుకుపోవడానికి మార్గం తేలికైపోయింది. ఆ విధంగా ఇక్కడ అనుసరించిన పన్నుల విధానం ద్వారా వలస పాలకులు తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారు.
వలసపాలన అంతం కావడంతో ఈ ఏర్పాటు కొనసాగడానికి వీలు లేకుండా పోయింది. దానికి తోడు కొత్తగా ఏర్పడిన స్వతంత్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో పోషించిన పాత్ర ఇక్కడ చిరకాలంగా కొనసాగిన వ్యవసాయ సంక్షోభం బారి నుండి రైతాంగానికి ఊరట కల్పించింది. అయితే భూ కేంద్రీకరణ మాత్రం దాదాపు అదే విధంగా కొనసాగింది. ఇక్కడ భూస్వాములు చాలామంది పెట్టుబడిదారీ భూస్వాములుగా పరిణామం చెందారు (ప్రష్యాలోని భూకామందుల మాదిరిగా). రైతాంగం మీద సాగిన దోపిడీ మాత్రం కొనసాగింది. కాని వ్యవసాయ సంక్షోభ లక్షణాలైన నిరంతర కరువులు, నడ్డి విరిగే రుణ భారం, పట్టణాలకు వలసలు పోవడం, సామూహిక ఆత్మహత్యలు వంటివి ఆ కాలంలో ఆగిపోయాయి.
ఆ తర్వాత నయా ఉదారవాద విధానాల అమలు మొదలైంది. నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం అంటేనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని అంగీకరించి దానికి లోబడి వ్యవహరించడం. ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో భారత దేశపు పెట్టుబడిదారీ వర్గం సన్నిహితంగా కలిసిపోయి వ్యవహరిస్తోంది. దాంతో పరిస్థితులు మారిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మీద సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల ఆధిపత్యం మళ్ళీ మొదలైంది. దాంతోబాటు వ్యవసాయ సంక్షోభమూ మొదలైంది. అయితే, ఈ మారు అది కరువుల రూపంలో రాలేదు. కాని రైతులు దివాలా ఎత్తడం, భరించలేని రుణభారం, దాని పర్యవసానంగా ఆత్మహత్యలకు పాల్పడడం, పట్టణాలకు వలసలు పెద్దఎత్తున పోవడం, వ్యవసాయం ఏ మాత్రమూ గిట్టుబాటు కాని వ్యాపకంగా దిగజారడం వంటి రూపాల్లో వచ్చింది. దానికి తోడు అత్యవసర సేవలైన విద్య, వైద్యం ప్రయివేటుపరం కావడం, ఆ సేవల ఖరీదు తలకు మించిన భారం కావడం రైతాంగానికి తలకు మించిన భారం అయిపోయింది.
స్వతంత్ర భారతదేశంలో తొలి దశాబ్దాలలో అమలు జరిగిన వ్యవసాయ విధానం నుండి ఈ విధమైన మార్పు జరగడం వెనుక కారణాలు ఏమిటి? చిన్న తరహా ఉత్పత్తి విధానంలోకి చొరబడడానికి, చిన్నరైతుల వ్యవసాయాన్ని చేజిక్కించుకోడానికి బడా పెట్టుబడి తహతహలాడుతూ వుంటుంది. నయా ఉదారవాద విధానాలు దాని వాంఛ నెరవేరే అవకాశాన్ని కల్పించాయి. ఇంకోపక్క సామ్రాజ్యవాదం మనదేశపు వ్యవసాయ రంగాన్ని తన సరుకుల ఉత్పత్తి చట్రం పరిధిలోకి మళ్ళీ లాక్కురావడానికి ప్రయత్నిస్తోంది. ఆ విధంగా మళ్ళీ జరిగితేనే సంపన్న దేశాల పెట్టుబడిదారుల అవసరాలు (ముడిసరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు కారుచవుకగా మనవద్ద నుండి కాజేయడం) నెరవేరుతాయి. అది జరగాలంటే దేశీయంగా వాటికి ఉన్న డిమాండ్‌ను కుదించాలి. అందుకోసం విశాల ప్రజానీకపు కొనుగోలుశక్తిని కుదించివేయాలి. అందుకోసమే ఐఎంఎఫ్ ద్వారా పొదుపు చర్యల పేరుతో ప్రజా సంక్షేమానికి కోతలు విధించడం జరుగుతోంది. అయితే వలస పాలన కాలంలో వొట్టినే ఇక్కడి సరుకులను దోచుకుపోయినట్టు ఇప్పుడు పట్టుకుపోవడం సాధ్యం కాదు (అసమాన మారకపు రేట్లు, పేటెంట్ హక్కుల పేరుతో అదనంగా వసూలు చేయడం తదితర పద్ధతులతో దోచుకోవడం జరుగుతోంది). కానీ ఆ సంపన్న పెట్టుబడిదారీ దేశాల అవసరాలకు సరిపడా సరుకులు ఇక్కడినుంచి లభ్యమవుతున్నాయి. పైగా ఈ అసమాన వ్యాపారం కారణంగా ద్రవ్యోల్బణం మీద ఏ ప్రభావమూ పడడంలేదు.
ఇక రెండో విషయం: తమ దేశాలలో ఏ సరుకులు అవసరమో వాటిని ఇక్కడ మన దేశాల్లో ఉత్పత్తి చేసే విధంగా నియంత్రించగలగడం. దాని వలన మన దేశపు ఆహార భద్రత లక్ష్యం దెబ్బ తింటోంది. గతానికి ఇప్పటికి ఇంకొక తేడా ఉంది. అప్పటితో పోల్చితే ఇప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులును సాధించాయి. వాటిని అమ్ముకోవాలంటే వర్థమాన దేశాలలో ఆహార స్వయంసమృద్ధి అనేది ఉండకూడదు. అందుకే మన ప్రభుత్వాన్ని తన విధానాలను మార్చుకునేలా వత్తిడి చేస్తాయి. ఇప్పటికే వ్యాపార పంటల (కాఫీ, తేయాకు, రబ్బరు, పొగాకు వంటివి) విషయంలో కనీస మద్దతు ధర గ్యారంటీ చేయడం నుంచి ప్రభుత్వం వెనక్కి తప్పుకుంది. ఇప్పుడు ఆహార పంటల విషయంలో సైతం ధాన్య సేకరణ బాధ్యత నుండి, ప్రజా పంపిణీ నిర్వహణ బాధ్యత నుండి, కనీస మద్దతు ధరను గ్యారంటీ చేసే బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవాల్సిందేనని ప్రపంచ వాణిజ్య సంస్థ ఒత్తిడి చేస్తోంది. అయితే ఆ దిశగా మన ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతోంది. నిజానికి ఏ ప్రభుత్వమూ ఆ ధైర్యం చేయజాలదు.
అయితే మోడీ ప్రభుత్వం తన విచ్ఛిన్నకర హిందూత్వ ఎజండాను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని పక్కకు మరల్చి ప్రపంచ వాణిజ్య సంస్థ వత్తిడికి అనుగుణంగా మార్పులు చేయడానికి పూనుకుంది. దానికి తోడు కరోనా మహమ్మారి ఆవరించడంతో తన పని తేలికగా అయిపోతుందని అనుకుంది. అందకోసమే హడావుడిగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలనూ తీసుకొచ్చింది. ఆ చట్టాల ద్వారా ఆహార ధాన్యాలకు మద్దతు ధరను గ్యారంటీ చేసే విధానం రద్దు అయిపోయి వ్యవసాయరంగ కార్పొరేటీకరణకు మార్గం సుగమం అయిపోతుందని తలిచింది. దాని కుట్రను కప్పిపుచ్చడానికి ఈ చట్టాలు రైతుల సంక్షేమం కోసమేనంటూ ప్రచారం కూడా చేసింది. కాని ఈ దేశ రైతాంగం పట్టుదలగా సాగించిన పోరాటం మోడీ ప్రభుత్వ కుట్రలను సాగన్విలేదు.
ఇప్పుడు ప్రభుత్వం వెనిక్క తగ్గడం కేవలం తాత్కాలిక ఎత్తుగడ మాత్రమే. నయా ఉదారవాద విధానాల అమలుకు మోడీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడివుంది. ఆహారధాన్యాల వ్యాపారంలో ప్రభుత్వం ఏ విధంగానూ జోక్యం చేసుకోకుండా ఉండడానికే ప్రయత్నిస్తోంది. ఆ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు సమర్పించడమే మోడీ ప్రభుత్వ లక్ష్యం. అందుచేత అవకాశం చిక్కిన వెంటనే మళ్ళీ ఆ చట్టాలను ఏదో ఒక విధంగా ముందుకు తెస్తుంది. ''దేశభక్తి'' నినాదంతో సామ్రాజ్యవాదుల డిమాండ్లకు పూర్తిగా తలొగ్గడం మోడీ విధానం. అయితే ఆ విధానాలు దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిని బాగా తగ్గించి వేస్తాయి. దాంతోబాటు ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా రద్దైపోతుంది. ఆహారధాన్యాలను విదేశాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చాక ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ నడపడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఆఫ్రికా దేశాల అనుభవాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఆ దేశాలలో ఆహార స్వయంసమృద్ధిని కోల్పోవడం వలన అక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలు మూలపడ్డాయి. ఆ దేశాలు ఆహార అవసరాలకోసం విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వలన విదేశాల దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ దేశాలు కరువు ముంగిట నిలుచున్నాయి. అందుచేత వ్యవసాయ సంక్షోభం నుండి బైట పడాలన్నా, ఆహార భద్రతను కాపాడుకోవాలన్నా, దేశ రైతాంగం సామ్రాజ్యవాదుల డిమాండ్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎక్కుపెట్టక తప్పదు
(స్వేచ్ఛానువాదం)
- ప్రభాత్‌పట్నాయక్