Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముగిసిన(2022) సంవత్సరాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి సావధానంగా అవలోకించినట్టయితే ఒక విషయం బోధపడుతుంది. అంతకు ముందు రెండేండ్లు 2020, 2021లో తీవ్ర పతనంలో కూరుకుపోయి, దాని నుండి బయటకు రావడానికి భారత ఆర్థికవ్యవస్థ పోరాటం సాగించిన సంవత్సరం ఇది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పారిశ్రామిక ప్రతిష్టంభన, ఆదాయం, సంపదల్లో పెరుగుతున్న అసమానతలు... ఇవన్నీ కూడా ఈ ఏడాదిలో స్పష్టమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఏడాది ముగిసే సమయానికి, నిరుద్యోగుల సంఖ్య గతంలో కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకుంది. ఏడాదిలో ఎక్కువ భాగం రిటైల్ ద్రవ్యోల్బణం 7శాతానికి పైగా నమోదైంది. దీనికి తోడు పారిశ్రామిక ప్రగతిలో ప్రతిష్టంభన కూడా నమోదైంది. 2022 అక్టోబరులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) అంతకుముందు ఏడాది అక్టోబరుతో పోలిస్తే 4 శాతం తక్కువగా ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్ కొనసాగింది. జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఐపిఓకు వెళ్ళడం ఇందులో ఒక ప్రధాన చర్యగా ఉంది. ఈ చర్యతో అతి పెద్ద బీమా కంపెనీలో ప్రభుత్వ వాటా పలచబడిపోయింది. దేశంలో విద్యుత్ పంపిణీని ప్రయివేటీకరించేందుకు బిల్లును కూడా ప్రభుత్వం తీసుకు వచ్చింది. బడా కార్పొరేట్లకు బ్యాంక్ రుణాలు రద్దు చేయడమనే ప్రక్రియ కొనసాగింది. మొత్తంగా రూ.10.01 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేశారు. 0ప్రభుత్వం అనుసరించిన ఈ విధానాల ఫలితంగా, అసమానతలు మరింత పెరిగిపోయాయి. దేశంలో అగ్ర స్థానంలో ఉన్న ఒక శాతం మంది జనాభా వద్ద మొత్తంగా దేశ సంపదలో 40.6శాతం సంపద పేరుకుపోయింది. 2000 సంవత్సరంలో ఇది 32శాతంగా ఉంది. 2022 సంవత్సరంలో గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద సంపన్నుడుగా, ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా ఆవిర్భవించాడు. అభ్యంతరకరమైన స్థాయిలో సంపద పోగుపడడానికి స్పష్టమైన ఉదాహరణ ఇది.
భారతదేశానికి, భారత రాజకీయాలకు తిరిగి ఒక రూపునివ్వడానికి హిందూత్వ శక్తులు అదేపనిగా సాగించిన ప్రయత్నాలను కూడా ఈ సంవత్సరంలో చూశాం. కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి ఆలయ ఆవరణల పునరుద్ధరణ కార్యక్రమాలకు స్వయంగా ప్రధాని అధ్యక్షత వహించారు. వివిధ మత కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. శ్రీరామనవమి, కొత్తగా తలెత్తిన హనుమాన్ జయంతి ప్రదర్శనలు వంటి మతపరమైన పండుగల సందర్భంగా... మైనారిటీలను లక్ష్యంగా చేసుకునేందుకు నిరంతరంగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. 'నూతన భారతదేశం' అన్న ఆలోచనను తెరపైకి తీసుకు వచ్చేందుకు భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఉపయోగించుకున్నారు. ఇక్కడ నూతన భారతదేశం అంటే 'హిందూ మెజారిటీవాద దేశం' అన్న ఆలోచన తప్ప మరొకటి కాదు.
దేశాన్ని లౌకికవాద భావనలకు దూరంగా తీసుకెళ్ళడం (డీ సెక్యులరైజ్)తో పాటూ సమాఖ్యవాదంపై, రాష్ట్రాల హక్కులపై దాడులు కూడా ఈ ఏడాదిలో ఉధృతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే విషయాల్లో జోక్యం చేసుకోవడానికి బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల గవర్నర్లను దారుణంగా ఉపయోగించుకున్నారు. వైస్ ఛాన్సలర్లుగా తమకు ఇష్టమైన వారిని నియమించుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవిని ఉపయోగించుకున్నారు. నిధులను రుణంగా తీసుకునే హక్కులో తమ వాటా వనరులు రాష్ట్రాలకు రాకుండా చేయడానికి కేంద్రం కొత్త మార్గాలను రూపొందించింది.
ఎన్నికల కమిషన్‌ను, ఇతర సంస్థలను మచ్చిక చేసుకున్న తర్వాత... 2022లో చివరి రెండు మాసాలు ఉన్నత న్యాయ వ్యవస్థ సంఘటిత దాడులను చవిచూసింది. స్వయాన మంత్రే ఈ దాడులకు పాల్పడటం గమనార్హం. వ్యక్తిగత స్వేచ్ఛలను, పౌరుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి నిరంకుశ పాలకులకు ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా అసమ్మతి వెలిబుచ్చిన వారి లేదా హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి పౌర స్వేచ్ఛలను, ప్రజాస్వామిక హక్కులను నియంతృత్వ పాలకులు కాలరాస్తూనే వచ్చారు.
ఏడు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్) అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు గానూ ఐదింటిలో బీజేపీ గెలుపొందింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో పరాజయాన్ని చవి చూసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటమిని మూటగట్టుకుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ఒక హెచ్చరికను చేశాయి. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, దారిద్య్రంతో ప్రజల్లో తీవ్రంగా అసమ్మతి నెలకొన్నప్పటికీ, ఎన్నికల పరంగా బీజేపీ ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి... తీవ్రంగా పదును తేలుతున్న మతోన్మాద ధోరణులు, పాన్ హిందూ ఏకీకరణ ప్రయత్నాలు దోహదపడుతున్నాయి.
ప్రజల జీవనోపాధుల రక్షణ కోసం సాగే పోరాటాలు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగే పోరాటాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సాగే సంఘటిత ప్రచారాలు వీటన్నింటినీ మిళితం చేసి పోరాడాల్సిన ఆవశక్యతను ఇది నొక్కి చెబుతోంది. కార్మికవర్గం, ఇతర వర్గాల ప్రజల నుండి పెరిగిన ప్రతిఘటనను ఈ ఏడాది చవి చూసింది. మార్చి 28-29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రెండు రోజుల సార్వత్రిక సమ్మె ఘన విజయాన్ని సాధించింది. స్వామినాథన్ కమిషన్ ఫార్ములా (సి2 ప్లస్ 50శాతం) ప్రాతిపదికన చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కోసం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. విద్యా రంగంపై ఇతర దాడులకు, నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు సుదీర్ఘమైన పోరాటానికి సమాయత్తమవుతున్నారు. దేశవ్యాప్తంగా సాగే పోరాటాలకు సంబంధించిన కీలక సమస్యల్లో విద్యుత్ (సవరణ) బిల్లు ఒకటి. ఈ బిల్లును ఆమోదించినట్లైతే... రైతులతో సహా సామాన్యులకు, లక్షలాది మంది కార్మికులకు, విద్యుత్ రంగంలోని ఇంజనీర్లకు పెద్ద సమస్యగా మారుతుంది.
లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగనున్నందున 2023 సంవత్సరం చాలా కీలకమైనది. ఈ సంవత్సరం ప్రజా సమస్యలపై పోరాడేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికవాద శక్తులు తమ వనరులన్నింటినీ సమీకరించుకుని, హిందూత్వ-కార్పొరేట్ ప్రభుత్వ రాజకీయ, సైద్ధాంతిక దాడులను సమైక్యంగా ఎదుర్కొనాల్సిన సంవత్సరంగా ఉండాలి.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)