Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2016లో కేంద్రం చేసిన నోట్ల రద్దు సక్రమమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2.1.2023న తీర్పిచ్చింది. అయితే ఐదుగురి ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి బి.వి. నాగరత్న నోట్లరద్దు చట్ట విరుద్ధమని, కేంద్రం పరిధిలోనిది కాదని అసమ్మతి తీర్పిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నోట్లరద్దుపై ఆర్.బి.ఐ.తో 6 నెలల నుండి సంప్రదింపుల్లో ఉండిందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. బహుశా కేంద్రం ఇచ్చిన ధృవీకరణపత్రం ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. కాని 2016 సెప్టెంబర్ దాకా ఆర్.బి.ఐ. గవర్నర్గా పనిచేసిన రఘురాం రాజన్, నోట్లరద్దు గురించి ప్రభుత్వం తన పదవీ కాలంలో ఆర్.బి.ఐ.ని సంప్రదించ లేదని తన పుస్తకంలో రాశారు.
చైనా అభివృద్ధిని నిలువరించడానికి అమెరికా, భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ వ్యూహంలో అమెరికా అభివృద్ధి సంస్థ (యు.ఎస్.ఎ.ఐ.డి), మన ఆర్థిక మంత్రిత్వశాఖతో అనేక సహకార ఆర్థిక ఒప్పందాలను చేసుకుంది. భారత్లో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం, నగదు తగ్గింపు వాటిలో ఒకటి. భారత నగదురహిత ఆర్థిక వ్యవస్థ అమలులో వాడే డిజిటల్ కార్డులు, కార్యక్రమాలు, యంత్రాల ద్వారా వాటి తయారీదారులైన అమెరికా బహుళజాతి సంస్థలు విపరీతంగా లాభపడతాయి. భారత్లో నగదురహిత చెల్లింపులకు 'కాటలిస్ట్' అనే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు 14.10.2016న విలేకరుల సమావేశంలో యు.ఎస్.ఎ.ఐ.డి. ప్రకటించింది. దాని కొనసాగింపుగా 8.11.2016న ప్రధాని నోట్లరద్దును ప్రకటించారు. తర్వాత దాన్ని నగదురహితంగా మార్చారు. నోట్లరద్దు తొందరపాటన్నవారిని మోడీయులు దేశ ద్రోహులుగా, పాకిస్థానీయులుగా ముద్రిస్తున్నారని అమర్త్యసేన్ ఆవేదన చెందారు.
''ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని శుద్ధిచేసే కఠిననిర్ణయమే నోట్లరద్దు. నీతి, రణనీతి వేరు వేరు. ఎత్తుకు పైఎత్తు వేయగలను. నా రాజకీయలబ్ధి, ప్రజల ఇబ్బందులు ఒకేసారి ఎలా సాధ్యం? అవినీతిని రాజకీయాలతో ముడివేయడం తప్పు'' అని 29.12.2016న 'ఇండియా టుడే' ఇంటర్వ్యూలో మోడీ తాత్వీకరించారు. ఇస్లాం, క్రైస్తవ సమాజాలను శుద్ధిచేసి హిందువులుగా మార్చాలని హిందుత్వవాది దీన్ దయాళ్ ఉపాధ్యాయ బోధించేవారు. అదే మాట మోడీ చెప్పారు. ప్రజాప్రయోజనాలలో రణనీతి ఎందుకు? ఎత్తులు పైఎత్తులేమిటి? రాజకీయుల స్వలాభంలో జననష్టాలుండవా? నోట్లరద్దు రాద్దాంతంలో అవి ఏకకాలంలో జరిగాయని ప్రపంచ ప్రఖ్యాత ప్రజాపక్ష ఆర్థికవేత్తలంతా ఆక్రోశించారు. అవినీతిలో రాజకీయ అవినీతి ఘనమైనదని ఆర్థికనిపుణులు నివేదించారు.
కేంద్ర ప్రభుత్వం నుండి ద్రవ్య నిర్వహణను స్వాధీన పర్చుకోవడానికి, బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 అధికరణ 3(1) ప్రకారం 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఏర్పాటుచేయబడింది. అధికరణ 24(1) ప్రకారం ఆర్.బి.ఐ. సెంట్రల్ బోర్డ్ సిఫారసుతో 10,000 రూపాయల లోపు విలువ గల నోట్లను కేంద్రప్రభుత్వం ముద్రించవచ్చు. రూపాయి నోటు ముద్రణ చట్టసవరణతోనే జరిగింది. ఈ అధికరణలో అనుమతించిన నోట్లలో 2000 నోటులేదు. సెంట్రల్ బోర్డ్ సలహా మేరకు కొన్ని డెనామినేషన్ నోట్లను జారీచేయవద్దని కాని, కొనసాగించవద్దని కాని (రద్దు చేయమని కాదు) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించవచ్చని అధికరణ 24(2) చెపుతుంది. 500, 1000 నోట్ల రద్దుకు గాని, 2000 నోటు ముద్రణకు గాని సెంట్రల్ బోర్డ్ సిఫారసు చేసినట్లు, లేదా అనుమతించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తన 8.11.2016 నాటి ఎస్.ఒ. 3408 (ఇ) ప్రకటనలో ప్రస్తావించలేదు. అసలు ఈ సందర్భంలో సెంట్రల్ బోర్డ్ సమావేశమే జరగలేదని రిజర్వ్ బ్యాంక్ కార్యాచరణ తెలుపుతోంది. సెంట్రల్ బోర్డ్ సలహా మేరకు నిర్దిష్ట డెనామినేషన్ నోట్లను ముద్రించవద్దని కాని, ఆపమని కాని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించవచ్చని అధికరణ 24(1) చెపుతుంది. ఏ డెనామినేషన్ నోట్లలోనైనా, ఏ సీరీస్ నైనా, సెంట్రల్ బోర్డ్ సిఫార్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ద అమలును నిలుపుచేయవచ్చని అధికరణ 26(2) వివరిస్తుంది.
ప్రతి డెనామినేషన్లో 5డీఆర్, 9బిక్యూ, 6విఎస్., 9 పిహెచ్ వగైరా అనేక సీరీస్ నోట్లు జారీ చేయబడుతాయి. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డుకు ఒకటి లేదా కొన్ని సీరీస్ నోట్లను మాత్రమే రద్దుపరచమని సలహా చెప్పే హక్కుంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వ అధికారాలు పరిమితమే. మొత్తం డెనామినేషన్ నోట్లను రద్దుచేయాలంటే పార్లమెంటు చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని 26వ అధికరణానికి సవరణచేయాలి. 1946లో ఆ అధికరణాన్ని సవరించి ప్రభుత్వం 26(ఎ)ను చేర్చింది. 13.1.1946కు ముందు జారీచేసిన 500, 1000, 10000 డెనామినేషన్ల నోట్లను రద్దుపరిచింది. 1978లో కొన్ని డెనామినేషన్ నోట్లను మొత్తంగా రద్దుచేయవలసి వచ్చినప్పుడు, అప్పటి ప్రధాని మొరార్జీ దేశారు, అధికరణ 26ను సవరించడానికి బదులుగా 'హై డెనామినేషన్ బ్యాంక్ నోట్ (డిమానెటైజేషన్) యాక్ట్, 1978' చట్టాన్ని చేశారు. ఇప్పటి 500, 1000 నోట్ల రద్దుకు కూడా పార్లమెంటు ఆమోదం, ఆర్.బి.ఐ. చట్టం అధికరణ 26 సవరణ అవసరం. కానీ ఇవి జరగలేదు. పైపెచ్చు సెంట్రల్ బోర్డ్ ఇవ్వవలసిన చట్టబద్ద సలహాను ఇచ్చిన దాఖలాలు లేవు. మొత్తంగా ప్రహసనంలో అనేక విధాన లోపాలతో పాటు చట్ట ఉల్లంఘన జరిగింది. భారత రాజ్యాంగ అధికరణ 343(1) ప్రకారం, అధికారిక కార్యక్రమాలలో భారతీయ అంకెల అంతర్జా తీయ రూపా లను వినియోగించాలి. 2000 నోటు మీద దేవనాగరి అంకెలను, హిందీ స్థానం లో మరాఠీని వాడి రాజ్యాంగాన్ని ధిక్కరించారు.
ఆర్.బి.ఐ. సలహాను కేంద్రం పాటించాలి. నోట్లరద్దులో కార్యనిర్వాహక ఆదేశం ద్వారా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. రూ.500, 1000 నోట్లను రద్దుచేసిన ఈ ప్రభుత్వ చట్టవ్యతిరేక పద్ధతి, విధానంపై న్యాయపరిశీలన జరపకుండా న్యాయస్థానం ఉండలేదని న్యాయమూర్తి నాగరత్న వ్యాఖ్యానించారు.
- సంగిశెట్టి హనుమంతరెడ్డి
సెల్: 9490204545