Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాటిన్ అమెరికా వామపక్షశక్తుల్లో కొత్త ఉత్సాహం నింపిన, మితవాద, సామ్రాజ్యవాద శక్తులకు పెద్ద సవాలు విసిన బ్రెజిల్ వర్కర్స్ పార్టీ నేత లూలా డిసిల్వా మూడవసారి ఆదివారంనాడు బ్రెజిల్ అధ్యక్ష పదవిని స్వీకరించారు. ఇలా మూడు సార్లు అధికారంలోకి రావటం ఒక రికార్డు. పచ్చిమితవాది, నియంత్వ పోకడలకు తెరలేపిన అధ్యక్షుడు జైర్ బోల్సనారో మీద అక్టోబరు 30న జరిగిన తుది విడత పోరులో లూలా స్వల్ప మెజారిటీతో గెలిచారు. లూలాకు 50.9శాతం రాగా బోల్సనారోకు 49.1శాతం వచ్చాయి. దేశంలో అణగారిన తరగతులు- ధనికులుగా, మితవాదులు - పురోగామి వాదులుగా చీలిన రెండు వర్గాల మధ్య సమీకరణలు ఎంత తీవ్రంగా ఉన్నదీ స్పష్టం. ఓటమిని అంగీరించేందుకు మొరాయించిన బోల్సనారో చివరి వరకు ఎన్నికలను వమ్ము చేసేందుకు, మిలిటరీ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూశాడు. మొత్తం మీద మిలిటరీ అందుకు సిద్ధం గాకపోవటంతో విధిలేక అధికార మార్పిడికి అంగీకరించాడు. ఆ తతంగానికి హాజరు కాకుండా రెండు రోజుల ముందే తన పరివారంతో సహా అమెరికా వెళ్లాడు. జనవరి 30వ తేదీ వరకు అక్కడ ఉంటారని చెబుతున్నప్పటికీ గడువులోగా తిరిగి స్వదేశానికి వస్తాడా రాడా అన్నది చూడాల్సి ఉంది. తనకు జైలు, చావు లేదా తిరిగి అధికారానికి రావటం రాసిపెట్టి ఉందంటూ మద్దతుదార్లను రెచ్చగొట్టాడు.
ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినప్పటి నుంచి రెండు నెలలుగా బోల్సనారో మద్దతుదారులు రాజధానిలో కీలక కేంద్రాలు, మిలిటరీ కేంద్రాల సమీపంలో తిష్టవేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో అక్రమం జరిగిందని, లూలా ఎన్నికను అంగీకరించరాదని, మిలిటరీ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తనకు వ్యతిరేకంగా మీడియా-ఎన్నికల సంఘం కుట్ర చేసిందని లేకుంటే తాను తొలి దఫా ఎన్నికల్లోనే గెలిచి ఉండేవాడినని, 60లక్షల ఓట్లు తనకు పడకుండా చేశారని బోల్సనారో ఆరోపించాడు. దేశంలో శాంతి భద్రతల సమస్యల సృష్టికి చేయని కుట్ర, దుండగాలు లేవు. అనేక మంది నేరగాళ్లకు అధ్యక్ష, ఇతర అధికార భవనాల్లో రక్షణ కల్పించాడు. డిసెంబరు 12న రాజధానిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసేందుకు చూశారు. ఈ ఉదంతం అనేక అనుమానాలకు దారి తీసింది. అదే రోజు విమానాశ్రయంలో దాడికి బాంబులు తీసుకు వెళుతున్న ఒకడిని పట్టుకున్నారు. ఆ ఉదంతాన్ని డిసెంబరు 30న అమెరికా వెళ్లే ముందు మాత్రమే బోల్సనారో సామాజిక మాధ్యమంలో ఖండించాడు. జనవరి 1న లూలా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు దేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఏదో జరగనుందనే వాతావరణం నెలకొన్నది. శుక్రవారం అర్థరాత్రి విమానమెక్కి అమెరికా వెళ్లేందుకు బోల్సనారో బ్రెజిల్ సరిహద్దులు దాటిన తరువాత మాత్రమే మద్దతుదార్లు ద్రోహి, పిరికి పంద, వంచించాడని తిట్టుకుంటూ తిష్టవేసిన ప్రాంతాల నుంచి వెనుదిరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి పరిస్థితి సాఫీగా ఉన్నట్లు కనిపించినా ఎప్పుడేం జరిగేదీ చెప్పలేని స్థితి.
లక్షలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన లూలాకు పార్లమెంటులో మెజారిటీగా ఉన్న మితవాదులు ఎంత మేరకు సహకరించేదీ చూడాల్సి ఉంది. మరో లాటిన్ అమెరికా దేశమైన పెరూ పార్లమెంటులో మెజారిటీగా ఉన్న మితవాదులు అక్కడి వామపక్ష నేత కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి తొలగించి అరెస్టు చేసి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. అంతెందుకు బ్రెజిల్లో కూడా గతంలో లూలా తరువాత అధికారానికి వచ్చిన వామపక్ష నేత దిల్మా రౌసెఫ్‌ను కూడా తప్పుడు కారణాలు చూసి అభిశంసన ద్వారా పదవి నుంచి తొలగించటం, తప్పుడు కేసులు పెట్టి 2018 ఎన్నికల్లో లూలాను జైలుకు పంపి అడ్డుకున్న సంగతి తెలిసిందే.
లాటిన్ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్ జనాభా 22కోట్లు. అమెరికా మద్దతుతో 1964లో మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకొని 21సంవత్సరాల పాటు ఉక్కుపాదాలతో కార్మికులు, రైతులను అణచివేసింది. దానికి వ్యతిరేకంగా పోరు సాగించిన వారిలో ఒకరైన లూలా తదితరులు 1980లో వర్కర్స్ పార్టీని ఏర్పాటు చేశారు. తమది డెమోక్రటిక్ సోషలిస్టు సిద్ధాంతం అని ప్రకటించారు. 1982లో పార్టీకి గుర్తింపు లభించింది. 1988 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రముఖ పట్టణాల్లో ప్రజాదరణ, విజయాలను సొంతం చేసుకుంది. తరువాత జరిగిన మూడు ఎన్నికలలో లూలా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. 2002 ఎన్నికలు, తరువాత 2006 ఎన్నికల్లో గెలిచాడు. తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్ గెలిచారు. రెండవ సారి ఆమె పదవిలో ఉండగా 2016లో మితవాద శక్తులు కుట్రచేసి తప్పుడు ఆరోపణలతో పార్లమెంటులో తమకున్న మెజారిటీని ఆసరాచేసుకొని ఆమెను అభిశంసించి పదవి నుంచి తొలగించారు. మూడవ సారి గెలిచిన లూలా నాలుగేండ్లు అధికారంలో ఉంటారు. ఒక లోహపరిశ్రమ కార్మికుడిగా పని చేసిన లూలా అంతకు ముందు బూట్లకు పాలిష్ కూడా చేశారు.
పదవీ స్వీకారం తరువాత లూలా మాట్లాడుతూ తమకు ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోవాలని లేదని, అంత మాత్రాన తప్పు చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. చట్టబద్దమైన పద్ధతుల్లోనే తాము చేసిన తప్పిదాలకు సమాధానం చెప్పుకోవాలన్నారు. వైరి పక్షాల సమీకరణలు తీవ్రంగా ఉన్నందున మూడవసారి పాలనా పగ్గాలు చేపట్టిన లూలాకు గతంలో మాదిరి పాలన సజావుగా సాగే అవకాశాలు లేవని అనేక మంది పరిశీలకులు చెబుతున్నారు. తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులకు ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ప్రపంచమంతటా వస్తువులకు పెరిగిన డిమాండ్ కారణంగా గతంలో లూలా అనేక సంక్షేమ పథకాలను అమలు జరిపి కోట్లాది మంది జీవితాలను మెరుగుపరిచారు. ఆ కారణంగానే లూలా అధికారం నుంచి తప్పుకున్న నాటికి జనంలో 83శాతం మద్దతు ఉంది. ఇప్పుడు అంతలేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు అమలు జరపనున్న విధానాలను బట్టి జనం స్పందిస్తారు. ఇటీవలి కాలంలో బ్రెజిల్ రెండుసార్లు తీవ్ర ఆర్థిక వడిదుడుకులను ఎదుర్కొన్నది. ఈ ఏడాది ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర మాంద్యం తలెత్తనుందని అందరూ చెబుతున్నారు. అందువలన ఎగుమతులపై ఆధారపడిన బ్రెజిల్‌ను కూడా అది వదలి పెట్టదు. దిల్మా రౌసెఫ్ పాలనా కాలంలో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా జనంలో తలెత్తిన అసంతృప్తిని మితవాదులు సొమ్ము చేసుకున్నారు. కరోనా మహమ్మారి పట్ల బోల్సనారో అనుసరించిన బాధ్యతా రహిత వైఖరి కారణంగా జనం మరోసారి ఇబ్బంది పడ్డారు. ఈ పరిణామాలతో జనం మరోసారి దారిద్య్రం బారిన పడ్డారు. అందుకే తన ప్రాధాన్యతల్లో దారిద్య్ర నిర్మూలన, విద్య, వైద్య రంగాలపై ఖర్చుకు ప్రాధాన్యత ఇస్తానని, అమెజాన్ అడవులను అక్రమంగా ధ్వంసం చేస్తున్నవారిని అరికడతానని లూలా ప్రకటించారు. గత ప్రభుత్వం జారీ చేసిన అనేక ఉత్తర్వులు, నిర్ణయాలను రద్దు చేస్తూ తొలి రోజే సంతకాలు చేశారు. నెల రోజుల్లో గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అనేక అంశాలను తనకు నివేదించాలని కోరారు. స్కూలు పిల్లలకు సరిపడా పుస్తకాలను ముద్రించలేదు. ఉచిత వైద్యానికి, కరోనా వాక్సిన్లకు నిధులు లేవు, ఉన్నత విద్యాసంస్థలు నిధుల్లేక మూతపడే దశలో ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటికీ మరోసారి మూల్యం చెల్లించాల్సింది ఎవరు? బ్రెజిల్ పౌరులే కదా! అని లూలా ప్రశ్నించగానే ఎవడినీ క్షమించ వద్దు ఎవరినీ క్షమించవద్దు ఎవరినీ క్షమించవద్దు అంటూ జనం స్పందించారు. గతంలో ఎన్నడూలేని విధంగా 37మందితో కూడిన మంత్రివర్గంలో పదకొండు మంది మహిళలను లూలా నియమించటం గమనించాల్సిన పరిణామం.
బోల్సనారో ఓడినా బలుపు తగ్గలేదు. అమెరికా వెళ్లే ముందు తన అనుచరులతో మాట్లాడుతూ ''ఆశాభంగం చెందామంటున్నారు మీరు, ప్రత్యామ్నాయాల గురించి రెండు నెలల పాటు నోరు మూసుకొని ఉండటం ఎంత కష్టం, నా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి, ఈ దేశానికి నాజీవితాన్ని ఇచ్చాను అన్నాడు, బాంబుదాడులను ఖండిస్తున్నానని చెబుతూనే దాడులకు ఇది తరుణం కాదు, దాని బదులు వచ్చే సర్కారుకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించండి. ఒక రంగంలో ఓడాం తప్ప మొత్తం యుద్ధంలో ఓడిపోలేదు. జనవరి 1వ తేదీతో ప్రపంచం అంతం కాదు'' అన్నాడు.
సంక్షోభంలో ఉన్న జనానికి సంక్షేమ చర్యలతో ఉపశమనం కల్పించటం తప్పుకాదు, తప్పని సరి. కానీ అవే వారి విముక్తికి మార్గం కాదు. వాటిని అమలు జరిపిన వామపక్ష దిల్మారౌసెఫ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన కుట్రకు నిరసనగా లబ్దిపొందిన జనం అంతా వీధుల్లోకి రాలేదన్నది వాస్తవం. అదే విధంగా జన జీవితాలను దిగజార్చిన విధానాల పునాదులను కూల్చి కొత్త వాటిని నిర్మించకుండా జనానికి సాధికారత కల్పించకుండా కేవలం సంక్షేమ విధానాలతోనే గడిపితే కుదరదనే చర్చ కూడా ప్రస్తుతం బ్రెజిల్, ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో నడుస్తున్నది. మితవాదులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కూడా గతంలో మాదిరి మొరటు పద్ధతులకు బదులు పార్లమెంట్లలో వామపక్షాలకు బలం తక్కువగా ఉండటాన్ని ఆసరా చేసుకొని ఆటంకాలు కలిగించి జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టేందుకు, ఆ పేరుతో ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చూస్తున్నారు. తాజాగా పెరూలో జరిగింది అదే.
బ్రెజిల్, రష్యా, భారత్, దక్షిణాఫ్రికా, చైనాలతో కూడిన బ్రిక్స్ కూటమి గురించి తెలిసిందే. లూలా గెలుపును అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు కూడా పంపారు. చిత్రం ఏమిటంటే రియో ఒలింపిక్స్ కంటే ఎక్కువ మంది దేశాధి నేతలు, దేశాల ప్రతినిధులు లూలా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. భారత్ నుంచి మాత్రం ప్రతినిధి లేకపోవటం గమనించాల్సిన అంశం. లూలాను జైలు పాలు చేసిన కుట్ర వెనుక ఉన్న అమెరికా తదితర దేశాల ప్రతినిధులు వచ్చినప్పటికీ మన ప్రభుత్వం ఎందుకు దూరంగా ఉందన్నది ప్రశ్న. ప్రపంచబాంకు నివేదిక ప్రకారం లూలా పాలనా కాలంలో 2003-2009 కాలంలో బ్రెజిల్ మధ్యతరగతి కుటుంబాలు 50శాతం పెరిగాయి. గత ఆరు సంవత్సరాల్లో అనేక మంది తిరిగి వెనుకటి స్థితికి వెళ్లారు. బ్రెజిల్‌తో సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, మాంద్యం, వృద్ధి రేట్లు పడిపోవటం వంటి పరిణామాలు, పర్యవసానాల నేపథ్యంలో గతంలో మాదిరి సంక్షేమ పధకాలను లూలా ఎలా అమలు జరుపుతారన్నది అనేక మందిలో ఉన్న సందేహం. ఆదాయం పెరిగినకొద్దీ పన్ను రేట్లు పెంచుతామని, ప్రభుత్వ ఖర్చు మీద విధించిన ఆంక్షలను ఎత్తివేస్తానని, కనీసవేతనాల పెంపుదల ద్వారా అర్థిక అసమానతల తగ్గింపు, సామాజిక న్యాయం అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. సవాళ్లతో పాటు లాటిన్ అమెరికాలో వామపక్షాల విజయపరంపరలో లూలా గెలుపు కార్మికోద్యమాలకు, అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించే శక్తులకు మరింత బలాన్ని ఇస్తుంది. అయితే మితవాదుల సమీకరణలను కూడా తక్కువ అంచనా వేయరాదు!
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288