Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుద్ధాలు ఏ స్థాయిలో జరిగినా అవి మిగిల్చే విషాదాలు మాత్రం దీర్ఘకాలం పాటు మానవాళిని వెంటాడుతూ పీడిస్తూనే ఉంటాయి. గెలుపోటములు ఎలా ఉన్నా యుద్ధం చేసిన ఇరు పక్షాలు ఆర్థిక నష్టాలతో పాటు జవాన్లు, సామాన్య జనాల మరణాలు, దీర్ఘకాల జబ్బులు, తీవ్ర గాయాలను తలుచుకొని భావోద్వేగంలో దుఃఖించాల్సిందే. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల కుటుంబాలు కన్నీటి సాగరంలో జీవచ్ఛవాల్లా బతుకులు ఈడుస్తుంటారు. యుద్ధాలు, జాతి వివక్ష పోరాటాలు, అంతర్గత సంఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల పిల్లలు అనాధలుగా మిగిలి పోతున్నారు. యుద్ధాలు మిగిల్చిన అనాధలకు చేయూతను ఇవ్వడానికి వేదికగా ప్రతి ఏట జనవరి 6 రోజున 'ప్రపంచ యుద్ధ అనాధల దినం (వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్)' నిర్వహిస్తున్నారు.
రెండు ప్రపంచ యుద్ధాలు - మిలియన్ల అనాధ పిల్లలు
రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాలు అనంతమైనవి. చరిత్ర చవి చూసిన రెండు ఈ విషాదాల్లో మిలియన్ల పిల్లలు అనాధలు అయ్యారు. ప్రతి ఏట యుద్ధ అనాధల సంఖ్య క్రమంగా తగ్గుతూ నేడు ఏడాదికి 0.7 శాతానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 1990లో 146 మిలియన్ల అనాధలు ఉండగా, 2000లో 155 మిలియన్లు, 2015లో 140 మిలియన్ల యుద్ధ అనాధలు (ఆసియాలో 61 మిలియన్లు, ఆఫ్రికాలో 52 మిలియన్లు, లాటిన్ అమెరికాలో 10 మిలియన్లు, యూరెప్లో 7.3 మిలియన్ల అనాధలు) ఉన్నారని తేలింది. ఈ యుద్ధ అనాధలు సమాజం చిన్న చూపుకు, శ్రమ దోపిడీకి గురవడం, సామాజిక భావోద్వేగ వివక్షలు, మానసిక కంగుబాటు, లైంగిక హింసకి గురవడం, బడులకు దూరంగా వెట్టి చాకిరీలో మగ్గడం లాంటి అమానవీయ చర్యల్లో చిక్కుకొని దుర్భర బతుకులు అనుభవిస్తున్నారు. 'వార్ జోన్ల'లోని అసంఖ్యాక యుద్ధ అనాధల కష్టాలు మరింత వర్ణణాతీతంగా ఉంటాయి.
యుద్ధ అనాధలను అక్కున చేర్చుకుందాం
యుద్ధ అనాథల్ని అక్కున చేర్చుకోవడం, ఉచిత విద్య వైద్య సదుపాయాలు కల్పించడం, అర్హత కలిగిన అనాధలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం, మానవీయ కోణంతో వారి కుటుంబాలకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ, ప్రభుత్వేతర, పౌర సమాజ కనీస బాధ్యతగా భావించాలి. అనాధల వ్యధలున్న సమాజం నరక సమానమని భావిస్తూ అనాధలకు అమ్మనాన్నలుగా, ఆర్థిక వనరులుగా పౌరసమాజం గొడుగు పట్టడానికి వెనకడుగు వేయరాదు. కుటుంబ పెద్దను జాతి హితం కోసం కోల్పోయిన కుటుంబాలు అనాధలు కాకుండా చూడటం దేశభక్తుల విధి. అనాథల్ని అలక్ష్యం చేసిన సమాజంలో అశాంతి నెలకొనవచ్చని మరువరాదు. అనాధ బాలల బంగారు భవిష్యత్తును ఆదిలోనే తుంచరాదు. అనాధల ఆక్రందనలు, అమానవీయతకు సాక్ష్యాలని గుర్తుంచుకోవాలి. దేశాభివద్ధిలో యుద్ధ అనాధల్ని భాగస్వాములు చేస్తూ, మానవీయతను వికసింప చేద్దాం.
(జనవరి 6 ''ప్రపంచ యుద్ధ అనాధల దినం'')
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి సెల్:9949700037