Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మంది జనం దేవుళ్లుగా భావిస్తున్న రాముడు, హనుమంతుడు, కృష్ణుడు వంటి వారిని బీజేపీ తమ కార్యకర్తలుగా మార్చిందని, ఆలయాలకు పరిమితం కావాల్సిన వారిని వీధుల్లోకి తెచ్చిందని, ఓట్ల కోసం వాడుకుంటున్నదని ఎవరైనా అంటే తమ మనోభావాలను దెబ్బతీశారని, తమ దేవుళ్లను కించపరుస్తున్నారని ఆ పార్టీ నేతలు, హిందూత్వ శక్తులుగా చెప్పుకొనేవారు వీధులకు ఎక్కుతారు. కానీ బీజేపీ నేత, మధ్య ప్రదేశ్ మాజీ సిఎం, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి ''రాముడు, హనుమంతుడు బీజేపీ కార్యకర్తలు కాదు, బీజేపీకి వారి మీద మేథోపరమైన(పేటెంట్) హక్కు లేదు'' అంటే ఎక్కడా మనోభావాలు దెబ్బతిన్న దాఖలాలు లేవు. వీధుల్లో నిరనసలూ, మీడియాలో ప్రకటనలు లేవు, సన్యాసినులుగా ఉన్నవారు అలా మాట్లాడతారు, పట్టించుకోనవసరం లేదని బీజేపీ నేత సమర్థనకు దిగారు. అంటే కాషాయదుస్తులు వేసుకున్నవారు, హిందూత్వ శక్తులుగా ఉన్న వారు ఏం మాట్లాడేందుకైనా వారికి పేటెంట్ హక్కు ఉన్నదని అనుకోవాలా?
అయ్యప్ప స్వామి పుట్టుక గురించి చాగంటి ప్రవచనాల్లో భక్తిపారవశ్యంతో చెప్పినా, నాస్తిక సంఘం కార్యకర్త బైరి నరేష్ మొరటుగా చెప్పినా భాష తేడా తప్ప పుట్టుక తీరుతెన్నులను, పురాణాల్లో చెప్పినదాన్ని ఇద్దరూ మార్చలేదు. ఒకరు శాస్త్ర విరుద్దమైన దాన్ని అందంగా చెబితే, మరొకరు శాస్త్ర విరుద్దంగా చేస్తున్న ప్రచారాన్ని కటువుగా అవహేళన చేశారు. చాగంటి ప్రవచించినదానిని ఆమోదిస్తున్నట్లు సభ్యసమాజం మౌనంగా ఉంది, అదే సమాజం నాస్తికుడు చెప్పినదాని మీద రచ్చ రచ్చ చేస్తున్నది. అందరినీ పుట్టించేదీ ఆ దేవుడే, అతడి లీలలు ఎప్పుడు ఎలా ఉండేదీ తెలియదు, ఎవరి పాపకర్మములను బట్టి వారికి ప్రాప్తం ఉంటుందని త్రికరణశుద్దిగా నమ్మే వారే నిజమైన హిందువులు అనుకుంటే... చాగంటిని, బైరి నరేష్‌ను పుట్టించిందీ ఆ దేవుడే, అదీ ఒకే గడ్డ మీద అని సరిపెట్టుకోలేదు. తాము నమ్మే విధాతకు వదలి పెట్టలేదు, కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనేందుకూ చూశారు.
ఇక సన్యాసిని ఉమా భారతి సంగతికొస్తే... డిసెంబరు 25న ఆమె భోపాల్ పట్టణంలో లోధీ సామాజిక తరగతికి చెందిన వివాహ వయస్సు వచ్చిన యువతీ, యువకుల సమావేశంలో మాట్లాడారు. ఆమె ప్రవచించిన అంశాల వీడియో రెండు రోజుల తరువాత సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చింది. దాని మీద వచ్చిన వార్తలకు, తరువాత ప్రకటనల మీద మచ్చుకు కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ''ప్రభువు రాముడు, హనుమంతుడు బీజేపీ కార్యకర్తలు కాదు: కాషాయ పార్టీపై అలిగిన ఉమా భారతి ధ్వజం'' ఇండియా టుడే. ''ప్రభువు రాముడు, హనుమంతుడిపై బీజేపీకి పేటెంట్ లేదు : కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి'' టైమ్స్ ఆఫ్ ఇండియా. ''రాముడు, హనుమంతుడిపై పేటెంట్ హక్కు లేదు : బీజేపీపై ఉమా భారతి దురదగొండి వ్యాఖ్య'' హిందూస్తాన్ టైమ్స్.
ఉమా భారతి ఆ సమావేశంలోనూ విడిగా ట్వీట్ల ద్వారా, ఇతరంగా వెలిబుచ్చిన అంశాల సారం ఇలా ఉంది.... ''జన సంఘానికి (జనతా పార్టీ నుంచి ఏర్పడిన బిజెపి పూర్వ పార్టీ) ముందే మొఘలులు, బ్రిటిష్ వారు రాక ముందే ఈ దేవతలు ఉన్నారు. వారికి కులం, మతం లేదు. వారిని ఇతరులెవరూ పూజించ రాదనే తప్పుడు భావనను బీజేపీ వదులుకోవాలి. బీజేపీ వేదిక నుంచి అందరినీ ఓటు అడుగుతాను. లోధీ సామాజిక తరగతి అన్ని వైపులా పరికించి తమకు ఏది ప్రయోజనమో చూసుకొని ఏ పార్టీ వారికైనా ఓటు వేసుకోవచ్చు. మీరు బీజేపీ కార్యకర్తలు కాకుంటే రాజకీయ బంధాలేమీ లేవు. రాముడు, త్రివర్ణాలు, గంగ, ఆవు మీద తనలో భక్తిని పెంపొందించింది బీజేపీ కాదు, అది తనలో అంతకు ముందే అంతర్లీనంగా ఉంది. విశ్వాసాన్ని రాజకీయ లబ్దికి అతీతంగా చూడాలి.''
లోధీ సామాజిక తరగతి బీజేపీకి ఓటు వేయాలన్న కట్టుబాటేమీ లేదన్న ఆమె ప్రకటన ఆ పార్టీకి శుభవార్త కాదు. లోధీ సామాజిక తరగతి సమావేశంలో మాట్లాడిన అంశాల మీద నాలుగు రోజుల తరువాత ఆమె స్పందిస్తూ అలా మాట్లాడినందున వాటిని ఖండించాల్సిన అవసరం లేదన్నారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీలో ప్రచ్చన్న పోరు సాగుతోంది.
తాను తిరిగి మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని చూసిన ఉమా భారతిని అక్కడి నేతలు అంగీకరించలేదు. దాంతో తాను 2019 ఎన్నికల్లో పోటీ చేసేది లేదని అమె బెట్టుచేశారు. ఇదే అదునుగా భావించి సరే మీ ఇష్టం మీ మనోభావాన్ని గౌరవిస్తున్నాం అన్నట్లుగా మరో మాట, బుజ్జగింపుల వంటివేమీ లేకుండా ఆమెను పక్కన పెట్టారు. తరువాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి బిజెపి తిరిగి మధ్య ప్రదేశ్‌లో పాగావేసింది. మరోసారి ఉమా భారతిని వ్యతిరేకించే శివరాజ్ సింగ్ చౌహాన్ సిఎం గద్దెపై కూర్చున్నారు. అప్పటి నుంచి ఆమె తన నిరసన గళాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. ఈ పూర్వరంగంలో ఆమె లోధీ సామాజిక తరగతిని వేరే దారి చూసుకోమని చెప్పడానికి ఉపయోగించిన మాటలివి. ఇవి బీజేపీలో కుమ్ములాటలను మరింతగా పెంచుతాయి. రాష్ట్రంలో ఓబిసి తరగతుల్లో సగం మంది ఉన్న ఈ సామాజిక తరగతి బుందేల్ ఖండ్, ఇతర ప్రాంతాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేదిగా ఉంది.
తనకు దక్కాల్సిన సిఎం పీఠాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ అధిష్టించారన్న కసితో ఉన్న ఉమా భారతి ఒక సందర్భంలో బచ్చా చోర్ అన్నారు. అంతే కాదు, నేను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని మరొకరు నడుపుతున్నారంటూ బహిరంగంగానే చెబుతారు. ప్రధాని మోడీ గురించి కూడా ఆవిడ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు. ''అతను నాకు 1973 నుంచీ తెలుసు. అతను వికాస పురుషుడు కాదు వినాశ పురుషుడు. జీడీపీ వృద్ధి గురించి దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారిని ఎగువకు తెచ్చానని అతను చెప్పుకుంటున్నది బూటకం. గుజరాత్లో రాముడు లేడు రోటీ లేదు. వినాశ పురుషుడి బారి నుంచి దాన్ని విముక్తి చేయాలి. మీడియా కావాలని అతన్ని పెద్దగా చేసింది'' అని మోడీ గురించి చెప్పారు. ఇవన్నీ తెలిసిన నరేంద్రమోడీకి ఆమెపట్ల సానుకూలత లేకున్నా బిసిల ఓట్ల కోసం మంత్రి పదవి కూడా ఇచ్చారు. మోడీ అయినా, ఉమాభారతి అయినా అవసరాలను బట్టి వ్యవహరించడంలో బీజేపీవారి తీరేవేరు కదా..!
- సత్య