Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్'' 26వ అఖిల భారత మహాసభ 2023, జనవరి 8 నుంచి 11 వరకు కలకత్తాలో జరుగుతున్నది. భారత దేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని సరళీకరించక పోతే భారతదేశంపై సూపర్ 301ఆంక్షలు విధిస్తామని యూఎస్ వాణిజ్య ప్రతినిధి కార్ల హిల్స్ మూడు దశాబ్దాల క్రితం చేసిన ప్రకటనల నుండి నేటి వరకు ప్రభుత్వ బీమారంగాన్ని పరిరక్షించుకునేందుకు, అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి ఆంక్షల నుంచి కాపాడుకునేందుకు సమరశీల పోరాట సంఘంగా ''ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్'' చైతన్యవంతమైన ఉద్యమాలను, పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నది.
ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ బీమారంగంపై దాడి అధికమైనది. 2014 వరకు 26శాతానికే పరిమితమైన విదేశీ పెట్టుబడిని 2015నాటికి 49శాతానికి పెంచారు. 2021లో బీజేపీ ప్రభుత్వం దానిని 74శాతానికి పెంచింది. గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ బీమారంగాన్ని బలహీనపరిచేందుకు ప్రయివేటు బీమారంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూనుకుంది.
జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేయడం కోసం పోరాటాన్ని నడిపిన ''ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్'' తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఉద్యమాలతో పాటు విజయాలను సాధించింది. 50వ దశకంలో బీమా ఉద్యోగుల వేతనాల ప్రామాణీకరణ కోసం, 60వ దశకంలో ఉద్యోగ భద్రత కోసం ఆటోమేషన్ వ్యతిరేకంగానూ, 70లో ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎదిరించి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, ఎల్ఐసి డివిజనల్ ఆఫీసుల లాకౌట్‌కు వ్యతిరేకంగానూ, 80లలో ఎల్ఐసిని ముక్కలుగా విభజించాలని చేసిన ప్రయత్నాలను ప్రతిఘటించడం, నూతన ఆర్థిక సంస్కరణలకు నేపథ్యంగా ఉన్న 90వ దశకం నుండి బీమారంగాన్ని ప్రభుత్వరంగంలోనే కొనసాగించేందుకు నడిపిన ప్రచారాందోళన ఉద్యమాలు, వీటితోపాటుగానే ఉద్యోగుల ఆకాంక్షల మేరకు సంస్థ యొక్క అభివృద్ధితో ముడిపడి ఉండేలా వేతన సవరణలు సాధించి ఉద్యోగుల జీవన ప్రమాణ స్థాయిని నిలబెట్టేందుకు సాగిన ప్రస్థానం నేపథ్యంలో 26వ ఏఐఐఇఏ అఖిల భారత మహాసభలు కలకత్తాలో జరుగుతున్నాయి.
ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురయ్యే పరిస్థితులు పరిణమించాయి. పాలక వర్గాలు నిర్భంధ విధానాలను అనుసరిస్తూ ప్రజల వాక్స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను, రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక హక్కులను అడ్డుకుంటున్నాయి. విధానపరమైన అంశాలను, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఎక్కడైతే ప్రజాస్వామ్య హక్కులు కుదించబడతాయో అక్కడ కార్మిక సంఘం హక్కులు సురక్షితంగా ఉండవనేదే ఏఐఐఇఏ అవగాహన.
కార్మిక సంఘాలు ఉద్యోగ, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు మాత్రమే పరిమితం కావు. సామాజిక మార్పుకు సాధనాలుగా సమాజంలో పురోగతిని కోరుతూ, పాలకవర్గాల దోపడీ స్థితిని కొనసాగించే ప్రయత్నాన్ని నిలువరించేందుకు తగిన దిశానిర్థేశం చేస్తాయి. సమాజ మార్పులో అన్ని వర్గాల కార్మికుల సంపూర్ణ భాగస్వామ్యం అనివార్యం. అలాగే ప్రజల మధ్య విశాల ఐక్యత ఆవశ్యకం. ఈ సంక్షిష్ట సమయంలో చైతన్యవంతమైన ఉద్యోగవర్గంగా మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే పని వేగవంతం చేయాలి.
భారత దేశ బీమా రంగంలో ప్రయివేటు, విదేశీ కంపెనీలను అనుమతించి 20సంవత్సరాలు అవుతున్నప్పటికీ 23 ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలతో పోటీపడి 63.25శాతం ప్రీమిమం ఆదాయంను 74.62శాతం మేరకు పాలసీలను కైవసం చేసుకుని ప్రభుత్వ రంగ ఎల్ఐసి ఇన్సూరెన్స్ మార్కెట్ లీడర్‌గా కొనసాగటంలో, క్లైయిముల చెల్లింపు అంశంలోనూ, ఎక్కువ మొత్తం పాలసీదారులు కలిగి ఉన్న విషయంలోనూ ప్రపంచంలోనే ఎల్ఐసి అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించటంలోనూ ఏఐఐఇఏ మార్గదర్శకత్వం ప్రసంశనీయం.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి మొత్తం ఆదాయం 7,21,102.57 కోట్లు, మొత్తం ప్రీమియం ఆదాయం 4,27,419.22 కోట్లుగా నమోదుచేసి పట్టాదారులకు 3,57,464.90 కోట్లు చెల్లింపు లను చేసింది. ఎల్ఐసి మొత్తం ఆస్తుల విలువ 42,30,616.95 కోట్లు గానూ, లైఫ్ ఫండ్ 37,35,759.72 కోట్లను కలిగి ఉంది. ఇది ప్రపంచం రలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల జీడీపి కన్నా ఎక్కువన్నది గమనార్హం.
ఎల్ఐసి ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను తీసుకురావడంలో ఏఐఐఇఏ సాధించిన విజయాలు ఉద్యోగస్తులను ఉదాసీనతా వైఖరికి గురిచేయకూడదు. ఇప్పటికే ఎల్ఐసిలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ రూపంలో 3.5శాతం వాటాలను అమ్మడమైనది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఆథారిటీ (ఐఆర్డిఏ) నియమ నిబంధనల పేరుతో ప్రభుత్వ ఇన్సూరెన్స్ రంగాన్ని బలహీనపరిచే అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తెస్తోంది. జాతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని బలహీన పరచడానికి అనుగుణంగా అనేక చట్టాలను ప్రభుత్వం సవరించింది.
ప్రతికూల ఆర్థిక పరిస్థితులలో ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలతో పోటీని ఎదుర్కొని ఇప్పటికీ మార్కెట్లో లీడర్‌గా కొనసాగుతున్న ప్రభుత్వరంగ ఇన్సూరెన్స్ కంపెనీలవృద్ధిని నియంత్రించే విధంగా నిబంధనలు రూపొందించబడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రయివేటు బీమా కంపెనీలను ప్రోత్సహించేవిగా ఉంటున్నాయి. వీటినుంచి జాతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని కాపాడు కోవాలంటే ప్రభుత్వరంగ ప్రాధాన్యతను, కార్మికవర్గ విశిష్టతను మరింత విస్తృతంగా ప్రజలకు వివరించే ప్రచారోద్యమం నడపాలి.
ఉద్యోగుల స్థానంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని హెచ్చుగా వినియోగించే అవకాశాల నుండి ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పన దిశగా యాజమాన్యాలు ఆలోచించే విధంగా కార్యాచరణ రూపొందించాల్సిన తరుణమిది. కార్మిక చట్టాలను, లేబర్ కోడ్లుగా మార్పులు చేసి కార్మిక హక్కులు హరిస్తున్న ప్రస్తుత పరిణామక్రమంలో, త్యాగాల చరిత్రను నిలుపుకునే నిబద్ధతను పాదుగొల్పే ప్రణాళికలు రూపుదిద్దుకోవాలి. నిర్భంధాలను నిరసించే పోరాట శంఖారావాన్ని పూరించే వేదికగా ఏఐఐఇఏ అఖిలభారత మహాసభల నిర్ణయాలు, తీర్మానాలు ఉంటాయని ఆకాంక్షిద్దాం.
- జి. కిషోర్ కుమార్
9440905501