Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ఉన్న సుమారు 20 లక్షల మంది రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆర్టీసీ పరిరక్షణ ఈ రెండు ప్రధానమైన డిమాండ్లతో తెలంగాణ పబ్లిక్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF-CITU) ఆధ్వర్యంలో రవాణా రంగ కార్మికుల సంఘర్ష్ యాత్ర జరుగుతోంది. ఈనెల 3న ఖమ్మం జిల్లాలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఈ యాత్రను ప్రారంభించారు. ట్రాన్స్ పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌లు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం యాత్ర కోఆర్డినేటర్‌గా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ వ్యవహరిస్తున్నారు. యాత్రకు కార్మికులు నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కార్మికులు తమ తమ వాహనాలతో స్వాగతం తెలుపుతున్నారు. తమ సమస్యలను వినతి పత్రం రూపంలో అందిస్తున్నారు.
ఆర్టీసీ డిపోల వద్ద, ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల అడ్డాల వద్ద కార్మికుల్ని కలిసి వారి సమస్యలపై చర్చిస్తున్నది. పర్యటించిన ప్రతి చోట కార్మికులు ప్రధానమైన సమస్యగా పార్కింగ్ అడ్డాలు లేవని చెబుతున్నారు. రోడ్ల మీద వాహనాలు అపి ప్రయాణికులను ఎక్కించు కునే సమయంలో మాకు తెలియకుండానే ఫొటోలు తీసి వేల రూపాయలు పెనాల్టీలు వేస్తున్నారని కార్మికులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. పార్కింగ్ స్థలాలు చూపించాల్సిన బాధ్యత, ప్రజలకు అందుబాటు లో రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వీటిని మరిచి రవాణా రంగాన్ని కేవలం ఒక ఆదాయ వనరుగా మలుచుకొని కార్మికుల వద్ద నుండి వేల రూపాయలు గుంజుకుంటున్నారు. వాస్తవానికి జనసాంద్రత ఉన్నచోటనే బస్టాండ్ ఆవరణలో, రైల్వే స్టేషన్ ఆవరణలో, వ్యాపారాలు జరిగే చోట, షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ స్థలాలు కేటాయిస్తేనే ప్రయాణికు లకు సౌకర్యంగా ఉంటుంది. ప్రజా రవాణాతో పాటు సరుకుల రవాణా కూడా సరైన సమయంలో జరుగుతుంది. కానీ ప్రభుత్వం ట్రాఫిక్ జామ్ తదితర కారణాలు చూపి పట్టణానికి అవతల, నగర చివర్లో అడ్డాలు కల్పించడం వల్ల అటు ప్రజలకు, ఇటు కార్మికులకు ఎవరికి ఉపయోగం లేకుండా పోతోంది.
దేశంలో రాష్ట్రంలో సరకు రవాణా 80శాతం రోడ్డు మార్గాన్నే జరుగుతుంది. దీంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం అనేక ట్యాక్స్‌ల రూపాల్లో ఈ కార్మికులు సమకూరుస్తున్నారు. లారీ, ఇతర గూడ్స్ డ్రైవర్లు, సరుకు రవాణా చేసే కార్మికులు పని గంటలతో నిమిత్తం లేకుండా, వాతావరణ పరిస్థితులు సహకరించక పోయినా రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు ఇతర ప్రాంతాలకు సరుకులు రవాణా చేస్తేనే ప్రజలకు సమయానికి నిత్యవసర సరుకులు అందుతున్నాయి. కానీ రోడ్ల నిర్మాణం సరిగా లేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. 2006లో వి.వి.గిరి నేషనల్ ఇన్సిటిట్యూట్ సంస్థ సర్వే చేసి ఇచ్చిన నివేదిక దూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసే కార్మికులకు మార్గ మధ్యలో షెడ్లను ఏర్పాటు చేసి, విశ్రాంతి గదులు ఇవ్వాలని, సబ్సిడీతో భోజన సౌకర్యం కల్పించాలని సూచించింది. ఇవేవీ చేయకపోగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పుండు మీద కారం చల్లినట్లు మోటార్ వాహన చట్టంతో మొదటికే ఎసరు తెచ్చింది. ఒకటో రెండో వాహనాలున్న చిన్న చిన్న యజమానులను కార్పొరేట్ కంపెనీలో పనిచేసే డ్రైవర్లుగా, కూలీలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఓనర్లుగా ఉన్నావారు, ఓనర్ కం డ్రైవర్లుగా ఉన్నవారు, తమ వాహనాలన్నీ ఇకపై కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టి వారిచ్చే దయాదాక్షణ్యాలతో బతకాలని చట్టంలో మార్పు చేశారు. లేదు ''నా వాహనం నేనే నడుపుకుంటూ ఎ కంపెనీలో వాహనాన్ని అప్ప చెప్పను.'' అంటే వాహనం స్టార్ట్ చెసి రోడ్డు మీదకు వెళ్ళిన ఒక్క క్షణం లోనే పోలీసులు అరేస్ట్ చేసి జైల్లో పెడతారు. వాహనాన్ని సీజ్ చేసి గ్యారెజీలో ఉంచుతారు. ఇంతటి దుర్మార్గానికి వొడిగట్టింది. బీజేపీ ప్రభుత్వం.
వేల్పర్ బోర్డు లేని కారణంగా వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయి. మహబూబాబాద్ జిల్లాలో యాత్ర పర్యటిస్తున్న సందర్భంగా మా దృష్టికి వచ్చిన ఒక సంఘటనను చూద్దాం... 2022 డిసెంబర్ 31న సాయంత్రం పూట 7 మంది ఆటో డ్రైవర్లు తమ యజమాని దగ్గర జీతం డబ్బులు అడుక్కుందామని ఒకే వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు గ్రానైట్ సరఫరా చేస్తున్న వాహనాన్ని ఢకొీని అక్కడికక్కడే ముగ్గురు డ్రైవర్లు గుర్తుపట్టలేని విధంగా మరణించిన యధార్థ ఘటన మా దృష్టికి వచ్చింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? వారిని ఎవరు ఆదుకోవాలి? మిర్యాలగూడలో మారో సమస్య యాత్ర బృందానికి తెలిపారు. సొంత వాహనం కొందామాని ఒక ప్రయివేట్ ఫైనాన్స్ యాజమాన్యం దగ్గర లోన్ తీసుకుని వాహనాలు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నారు. కరోనా తర్వాత సక్రమంగా కిరాయిలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్మికులు ఇఎంఐ చెల్లించడంలో ఆలస్యం జరిగిందని ఆ ప్రయివేట్ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం కార్మికుల ఇండ్లు జప్తు చేస్తోంది. అదే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రయివేట్ ఫైనాన్స్ యాజమాన్యాల వేదింపులు భరించలేక ముగ్గురు డ్రైవర్లు తమ వాహనానికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోని తనువు చాలించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చెయ్యాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా అదనంగా ఖర్చు కాదు. ఎందుకంటే ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కొత్త వాహనాలు షోరూమ్ నుండి బయటకి వస్తున్నాయి. ప్రతి కొత్త వాహనానికి వెల్ఫేర్ బోర్డు సెస్ కింద 1శాతం, 2శాతం వసూలు చేసి ఆ డబ్బులను వెల్ఫేర్ బోర్డులో జమ చేస్తే కోట్ల రూపాయలు ఈరోజు కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కార్మికుల ఆత్మహత్యలు ఆపవచ్చు, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవచ్చు, ఇలా అనేక సౌకర్యాలు బోర్డు ద్వారా కార్మికులకు కల్పించవచ్చు. అందుకే ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని ఈ సంఘర్ష యాత్ర డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయంల్లో, హాస్పటలల్లో కంపెనీలలో, ట్రావెల్స్ యజమానుల వద్ద పనిచేసే డ్రైవర్లు అలాగే అన్లైన్ సంస్థల్లో పని చేసే డ్రైవర్లు లక్షలలో ఉన్నారు. వీరికి ఎలాంటి కనీస వేతనాలు అమలు కావడం లేదు. కేవలం రూ.10,000 నుండి 13వేల లోపే వీళ్లకు వేతనాలు ఇస్తారు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఎలాంటి పని భద్రత లేకుండా వీళ్ళు పనిచేస్తున్నారు. ప్రభుత్వం గత సంవత్సరం జూన్ 23న రవాణా రంగ కార్మికుల కనీస వేతనాలు సవరిస్తూ జీవో ఎంఎస్ నెం.25ను విడుదల చేసింది. కానీ ఇప్పటికీ ఆ జీవోను గెజిట్‌గా మార్చి అమలు చేయకుండా రవాణా రంగ కార్మికుల్ని మోసం చేస్తున్నది. ఇది కేవలం యాజమాన్యాలకు తలోగ్గి కార్మికులకు అన్యాయం చేయడమే. తక్షణమే జీఓ నెం.25ను గెజిట్‌గా మార్చి అమలు చేయాలని, వీరికి పని గంటలు కల్పించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని సంఘర్ష యాత్ర కోరుతున్నది.
వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోలో వద్దకు సంఘర్ష యాత్ర చేరుకోగానే యాత్రకు కార్మికులు అపూర్వ సాగతం పలుకుతున్నారు. తమ వద్దకు రావాలని 55రోజుల సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులపైన పని ఒత్తిడి పెంచుతున్నారు. అనేక రకమైన పనులు చేయిస్తున్నారు. సిసిఎస్ లోన్లు ఇవ్వడం లేదు. కార్మిక సంఘాల్ని అనుమతించడం లేదు. కార్మికులను భయపెట్టి, బెదిరించి పనిచేయి స్తున్న పరిస్థితి నేడు ఆర్టిసిలో కనిపిస్తోంది.
సంఘర్షయాత్ర ఇంకా కొనసాగుతున్నది. ఈనెల 11న సంగారెడ్డిలో యాత్ర మూగిసే లోపు, ప్రభుత్వం స్పందించి యాత్ర బృందం తో, సిఐటియు రాష్ట్ర నాయకత్వంతో చర్చల ద్వారా సానుకూలంగా సమస్యలు పరిష్కరించా లని డిమాండ్ చేస్తూన్నాం. లేని పక్షంలో యాత్ర అనంతరం రవాణా రంగా హక్కుల కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం, సంక్షేమ బోర్డు కోసం, ప్రమాద బీమా కోసం, ఈఎస్, ఐపిఎఫ్ కోసం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం, పెద్ద ఎత్తున పోరాటాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
- పుప్పాల శ్రీకాంత్
సెల్: 9490098328