Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండక్కి ఇంకా వారం రోజులు టైముంది. అయితే చుట్టాలు, ఇంటివాళ్ళకి టైము అవసరం లేదు కదా! అంతా వారం ముందుగానే వచ్చేస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళింటికి రావటానికి ఆలస్యం దేనికంటూ దిగిపోయారు నందినీ, చరణ్ ఇద్దరూ.
''అమ్మమ్మా ఎక్కడున్నావే!'' అంటూ ఇద్దరూ ఒక రేంజ్లో అరిచారు!
అమ్మమ్మ లోపల్నించి చెమట తుడుచుకుంటూ వచ్చింది. మనవడిని, మనవరాలిని చూడగానే ఆమెకు పట్టరాని సంతోషమయ్యింది. ఇద్దర్ని దగ్గరికి తీసుకుని చాలా సంతోషపడిపోయింది. వాళ్ళిద్దర్ని అట్లాగే చూస్తుండిపోయింది.
''అమ్మమ్మా ఎంత సేపు మమ్మల్ని మా ఆకలి తీరలేదు!'' అన్నారు ఇద్దరూ.
''అయ్యో! నా మతిమండ! మిమ్మల్ని చూసిన సంతోషంలో అన్ని మరిచిపోయాను! పదండి ముందు తిందురుగాని!'' అంటూ వాళ్ళిద్దర్ని లోపలికి తీసుకెళ్ళి భోజనాలకు ఏర్పాటు చేసింది.
వాళ్ళిద్దరూ అమ్మమ్మ పెట్టినవన్నీ లాగించేస్తున్నారు! కావల్సినవి అడిగి మరీ పెట్టించుకుని తింటున్నారు. అమ్మమ్మ కూడా వారి కోసం ముందే అన్నీ వండి సిద్ధంగా ఉంచింది.
అక్క, తమ్ముడు భోజనాలు అయ్యాక వరండాలో కూర్చుని ఫోన్లు పట్టుకున్నారు. ఇంతలో అమ్మమ్మ కూడా భోజనం చేసి వచ్చి కూర్చున్నది.
''ఏరా చరణ్! నీ శబరిమల యాత్ర ఎలా జరిగింది! ఈసారి ముందుగానే పూర్తి చేశావు!'' అన్నది అమ్మమ్మ.
''ఆఁ వాడి శబరియాత్ర కన్నా ముందే ఫైటింగ్ చేశాడు. ఆ సంగతి కూడా అడుగు చెబుతాడు!'' అన్నది నందిని.
''ఫైటింగ్ ఏమిట్రా! అయ్యప్ప మాల వేసుకున్నావు గదా!'' ఆశ్చర్యంగా అడిగింది అమ్మమ్మ.
''వాడెవడో అయ్యప్పస్వామిని నోటికొచ్చినట్లు అన్నాడు. నేనూరుకుంటానా, ఉరికించి కొట్టాను! మాల వేసుకున్నంత మాత్రాన అయ్యప్పను మాటలంటే సహిస్తానా?'' అన్నాడు చరణ్.
''మాల వేసుకున్నప్పుడు ఇంద్రియ నిగ్రహం పాటించాలి! ప్రతి వ్యక్తిలోనూ అయ్యప్పను చూడాలి! అందుకే మాల ధారులందరూ ఎదుటివారిని అయ్యప్పా, స్వామీ అని అంటారు! మరి నీవేమో ఫైటింగ్ చేశావు! నీకు ఇంద్రియ నిగ్రహం ఏదిరా?'' అన్నది నందిత.
''వాడు మమ్మల్ని రెచ్చగొట్టాడు. పరాయి ఆలోచనా విధానం నాస్తికత్వం. అది ఈ హిందూ దేశంలో చెల్లదు! అంగీకరించం!'' అన్నాడు చరణ్.
అమ్మమ్మా, నందితా ఇద్దరూ నవ్వారు.
''ఎందుకూ నవ్వుతున్నారు?'' చరణ్ ఉడుకుతున్నాడు.
''రేరుఁ. నీ అమాయకత్వానికి నవ్వు వచ్చింది. ఎవడో వచ్చి రెచ్చగొడితే, రెచ్చిపోతే, నీ దీక్షకు, నీ మాలధారణకు అర్థం ఏమిటీ? మండల రోజు ఇంద్రియ నిగ్రహంతో, స్వయం పాకం నేలమీద నిద్ర మొదలైన కఠోర నియమాలు ఎందుకు పాటిస్తారో తెలుసా'' అడిగింది అమ్మమ్మ.
''తెలుసు! మండలం రోజులు నియమాలు పాటిస్తే, శరీరం, మనసు, వాటికి అలవాటు పడుతుందని!'' ఉడుక్కుంటూనే అన్నాడు చరణ్.
''మరి వీరంతా దీక్షలో ఉంటూనే, నియమాలను ఉల్లంఘించారు! అంటే అయ్యప్ప దీక్ష ధారణను కాకుండా మరేదో ఆలోచనకు లొంగిపోయారన్న మాట!'' అన్నది అమ్మమ్మ.
''కన్ఫూజ్ చేయకు అమ్మమ్మా! అయ్యప్పను కాకుండా మరేదో ఎట్లా ఆలోచిస్తాం? అయ్యప్పను మాటలంటేనే స్పందించాం! నాస్తికత్వం మన సంప్రదాయం కాదు! అందుకే బుద్ధి చెప్పాం!'' అన్నాడు చరణ్.
''నేనూ అదే అంటున్నా! నీ ప్రాబ్లెం ఎంటీ నాస్తికత్వమే కదా!'' అన్నది అమ్మమ్మ.
''అవును నాస్తికత్వమే! అది మన దేశ సంప్రదాయం కాదు! ఈ దేశంలో దానికి చోటు లేదు!'' అన్నాడు చరణ్.
''నీవు పొరబడుతున్నావు చరణ్! ఈ దేశంలో అస్థిక భావాజాలానికెంత ప్రాధాన్యత ఉందో, నాస్తిక భావాజాలానికి అంతే ప్రాధాన్యత ఉంది! చార్వాకులు, బౌద్ధులు, జైనులు మొదలైన వారు నాస్తికవాదాన్ని ఎంతో అభివృద్ధి చేశారు! ఆస్తిక, నాస్తిక వాదాలు మన భారతీయ సంప్రదాయిక సిద్ధాంతాలు! వాటిల్లో ఒక్కటే ఉందని చెప్పటం అమాయకత్వం!'' అన్నది అమ్మమ్మ.
''అమ్మమ్మా! నీవు రోజూ పూజలు చేస్తావు కదే!'' అన్నాడు చరణ్ ఆశ్చర్యంగా.
''అవున్రా! నేను పూజలు చేస్తాను! అది నా నమ్మకం. కాని, నా నమ్మకాన్ని ఎవరి మీదో రుద్దను! నీలా ఫైటింగులు చేయను!'' అన్నది అమ్మమ్మ.
''చరణ్ బుర్ర గోక్కున్నాడు! ఇంతకూ అమ్మమ్మ ఏం చెబుతుందో అర్థం కావటం లేదు!
''బుర్రలో ఉన్నదాన్ని కూడా పాడుచేసుకోకు! మనదేశం తాత్వికంగా ఎంతో సుసంపన్నమైంది! ఆస్తిక, నాస్తిక భావనలు అనాదిగా కొనసాగుతున్నవే! మన తాత్విక ధోరణి కొంతైనా తెలియని వాళ్ళే నీలా మాట్లాడుతున్నారు! నేను పూజచేసేది నిజమే! కాని నాస్తికులను కూడా గౌరవిస్తాను. నా నమ్మకం ఎంత బలంగా ఉందో అంతే బలమైన విశ్వాసం కలిగి ఉండే హక్కు వారికీ ఉంది! దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు! ఎవరి అనుభవాలు, విజ్ఞానం మేరకు వారి ఆలోచనా ధోరణి ఏర్పడుతుంది! అంతమాత్రానా దాన్ని తప్పనే అధికారం ఎవరికీ లేదు!'' అన్నది అమ్మమ్మ.
''ఈ తత్వశాస్త్రం ఎప్పుడు చదివావే?'' అమాయకంగా అడిగాడు చరణ్.
''ఎప్పుడు చదివానని కాదురా! చదివింది అర్థమైందా లేదా?'' అన్నది అమ్మమ్మ.
చరణ్‌కి ఏమనాలో తోచలేదు!
''ఒరేరు చరణ్! మళ్ళీ చెబుతున్నా విను! ఎవరి అభిప్రాయాలు వారివి! పక్కవారి అభిప్రాయాలకు దెబ్బతీసే అభిప్రాయాలు చాలా బలహీనమైనవి! దేవుళ్ళ మీద చర్చలు, అభిప్రాయాలు ఈనాటివి కావు! కాని ఇప్పుడే వాటి మీద కోట్లాట వరకూ వెళ్ళిందంటే దానికి కారణం ఏమిటో ఆలోచించు! ఈ రోజు వరకూ నీకు ఉద్యోగం లేదు! ఏట్లా రెండు కోట్లు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఏదో ఒక ఉద్యోగం వచ్చేది కదా! దేశం 100లక్షల కోట్ల అప్పులో మునిగింది. మన అక్కౌంట్లలో 15లక్షల చొప్పున పడకుండా ఇంత అప్పు పెరిగింది! మరి ఈ అప్పు ఎవరి అకౌంట్లలో పడిందో మీలాంటి వారు ఆలోచించకుండా ఉండటానికే ఒకడు దేవుడు లేడంటాడు! ఒకడు ఉన్నాడంటాడు! మధ్యలో నీలాంటి వారు ఫైటింగులు చేస్తారు! అంతే అసలు సమస్య పక్కకి పోతుంది!'' అన్నది అమ్మమ్మ.''అమ్మమ్మా నాకు జ్ఞానోదయం అయ్యింది!'' అన్నాడు చరణ్.
- ఉషాకిరణ్