Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ప్రతిపక్షాల నిరసన ఇప్పుడు జీవో నెంబర్ 1పై కేంద్రీకృతమై ఉన్నాయి. ఇటీవల కందుకూరు, గుంటూరులలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలు సందర్భాలలో సంభవించిన మరణాలను కారణంగా చూపి జగన్ ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. ఆ విషాద ఘటనలు నిస్సందేహంగా చాలా బాధాకరమైనవి. ఆధ్వర్యం వహించిన తెలుగుదేశం, వారి నాయకులు అభిమానులు తప్పక భద్రతా చర్యలు తీసుకోవలసింది. కనీసం రెండవ ఘటనైనా జరగకుండా చూడాల్సింది. అదే సందర్భంలో వరుసగా రెండవసారి కూడా ఇలాంటి తప్పు జరగడానికి పోలీసుల పాత్ర లేదా నిఘా లోపం తక్కువ కాదు. జరిగిన ఈ దుర్ఘటనలను సాకుగా చూపి రాష్ట్రంలో మరెక్కడా రోడ్‌షోలు జరగకూడదని నిర్ణీత ప్రదేశాల్లో, స్థలాల్లో అది కూడా పోలీసులు పూర్తి అనుమతినిచ్చిన తర్వాత మాత్రమే సభలు సమీకరణలు జరుపుకోవాలని ఉత్తర్వునివ్వడం దారుణం. రోగమొకటైతే మందొకటి ఇచ్చిన చందం. చాలా కాలంగా ప్రజా ఉద్యమాలు , కార్మిక ఉద్యోగ నిరసనలు, రాజకీయ పార్టీల పిలుపులు, పర్యటనలు విఫలం చేయడానికి పోలీసులు గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేయడం సర్వసాధారణమైపోయింది. ముందుగానే వాటిని అడ్డుకుంటూ ప్రత్యేక ఉత్తర్వులు ఆంక్షలు, పొలిమేరల్లో అరెస్టు చేయడం జరిగిపోతున్నది. అంగన్వాడీలు, విఎవోలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. ఇటీవలనే విశాఖపట్టణంలో జనసేన అధినేత పర్యటన విషయంలోనూ అదే చూశాం. వామపక్ష నాయకులకు ఇది నిరంతర అనుభవమే. గతంలో తమ పాలనలో ఇదే విధానం అనుసరించిన తెలుగుదేశం ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో జీ.వో1 తీసుకొచ్చిన తర్వాత కదలికలపై ఆంక్షలు తప్పవని అన్ని ప్రతిపక్షాలూ భావిస్తున్నాయి. ఆందోళన చెందుతున్నాయి. నిజానికి ఈ విషాద ఘటనలను ముందు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ అఖిలపక్ష సమావేశం నిర్భంధాలను, ఆంక్షలను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. ఇంతలోనే టీడీపీ సభల్లో ఈ మరణాలు సంభవించాయి. అలాంటివి జరగకుండా అడ్డుకోవాలనే పేరిట జీవో వెలువడింది.
విషాదంపై విచారణ ఏదీ?
టీడీపీ సభలలో నాలుగురోజుల వ్యవధిలోనే రెండు తొక్కిసలాటలు జరిగాయి గనక ఆ పార్టీ నాయకత్వం ప్రధాన బాధ్యత కాదనలేనిది. కందుకూరులో ఇరుకైన స్థలంలో కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టి మరింత ఇరుకు చేయడం పక్కనే డ్రైనేజీ నుంచి భద్రత లేకపోవడం నిర్థ్యక్ష ఫలితాలే. కానీ ఇరుకు రోడ్డలలో సభలు పెట్టి వచ్చిన వారిని ఎక్కువచేసి చూపుతున్నారని ఆరోపించే ప్రభుత్వం పోలీసులు ముందే ఎందుకు చర్య తీసుకోలేదనేది కూడా ప్రశ్నే. నాలుగురోజులలో అదీ నూతన సంవత్సరాన గుంటూరు వంటి కేంద్రంలో దాన ధర్మాలతో కలగలిపి రాజకీయ సభ పెట్టినప్పుడు పోలీసులు మరింత జాగ్రత్త పాటించవలసింది కదా? ఉయ్యూరు ఫౌండేషన్ పేరిట ఈ కార్యక్రమం జరిగినా టీడీపీ ప్రత్యక్ష పాత్ర కనిపిస్తూనే ఉంది. ఉచితాలపై నిరంతర చర్చ జరుగుతుండగా రాజకీయ సభలో దానాలు చేస్తామని టోకెన్లు ఇచ్చి మరీ రప్పించడం తీవ్రమైన విషయమే. వారికి కొద్దిసమయం ఇచ్చి ఆపేయడం మరింత తొక్కిసలాట ఎవరైనా వూహించగలరు. ఘటన జరిగిన తర్వాతనైనా పశ్చాత్తాపంకన్నా ఎదురుదాడి అధికంగా ఉంది. టీడీపీ కావాలనే ఇదంతా చేసిందని వైసీపీ అంటే వైసీపీ వారే కుట్రతో ఇదంతా జరగడానికి కారకులైనారని టీడీపీ తీవ్ర ఆరోపణ చేస్తున్నది. ఉభయులూ తమ ఆధారాలు చెప్పడం లేదు. రెండు ఘటనల నిర్మాహకులను అరెస్టు చేస్తే కోర్టు విడుదల చేసింది.
ఇక్కడే సమస్య ఉత్పన్నమవుతుంది. సభలలో తొక్కిసలాటకు కారణమైన వారిపై దర్యాప్తు న్యాయపరమైన చర్య తీసుకోవడం జరగాలి. పోలీసులు ఎందుకు ఉపేక్షించారా అన్నదీ చూడాల్సిందే. మొత్తంగా ఈ దుర్ఘటనల నుంచి రాజకీయ పార్టీలు సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చర్చ జరిపి సూచనలు చేయొచ్చు. అవసరమైతే అఖిలపక్షం జరపొచ్చు. దానికి బదులు రోడ్లపక్కన సభలే పెట్టరాదనీ, రోడ్ షోలు కుదరవనీ జీవో ఇవ్వడమేమిటి? ఎవరిది తప్పు? ఎవరికి శిక్ష? రెండు చోట్ల జరిగిన ఘటనలకు ఇంకెక్కడా సభలే వద్దనడం ఏం ప్రజాస్వామ్యం?
ఉద్యమాలకే ఎక్కువ నష్టం
కుప్పంలో చంద్రబాబు పర్యటనలో అడ్డుకోవడాన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. రాజకీయ వివాదం నడిచినా, ఆయన యాత్రలూ ప్రసంగాలూ మామూలు కంటే అధికంగా ప్రచారంతో నడిచాయి. పోలీసుల వైఖరిపై ఆయన లేఖలు రాశారు. ఆయనపై పోలీసులు కేసులు పెట్టారు. వీటి తదుపరి మలుపులు చూడవలసివుంది గానీ మొత్తం మీద టీడీపీకి కోరుకున్న ఫోకస్ రానేవచ్చింది. ఒక కార్మిక సంఘానికో అంగన్వాడీలకో ఇంత అనుకూలత అవకాశం ఉండదు. ఇదే సమయంలో భీమవరంలో సిఐటియు రాష్ట్ర మహాసభకు వచ్చే ప్రతినిధులను కూడా ఆపేయడం, దింపేయడం ఇందుకు ఉదాహరణ. తెలుగుదేశం హయాంలోనూ ఇలాంటి అప్రజాస్వామిక ప్రతిబంధకాలు తీవ్రంగానే ఉండేవి. మోడీ ప్రభుత్వం సంగతి చెప్పక్కరలేదు. తెలంగాణలోనూ యాత్రలను అడ్డుకోవడం వంటివి చూశాం. అందుకే హక్కుల రక్షణ అన్నది ఏ ఒక్కరికో లేక ఏ ఒక్క పార్టీకో సంబంధించిన సమస్య కాదు. సరికదా సామాన్య ప్రజానీకానికి మరింత ముఖ్యం. ఒక ధోరణిగా పాలకవర్గాలు దాడి చేస్తున్నప్పుడు మరింత అప్రమత్తతా అవసరమవుతుంది. అనుమతి అంత తేలిగ్గా ఇచ్చేట్టయితే ఇక ప్రత్యేకంగా ఈజీవో అవసరమే అయ్యేది కాదు. ఏ ప్రత్యేకతాలేని ఉత్తుత్తిజీవో అయితే ఎత్తివేయడానికి అభ్యంతరమేమిటి? దీనివల్ల సినిమా వేడుకలకు కూడా అనుమతి నిరాకరిస్తున్నారని మరోసారి సినిమానూ రాజకీయాలను కలగాపులగం చేసే ప్రయత్నమూ జరిగింది. ఎట్టకేలకు బాలకృష్ణ చిత్రం ఫంక్షన్ ముగిసి చిరంజీవి చిత్ర వేడుకకు రంగం సిద్ధమవడం మంచి పరిణామమే.
కందుకూరు, కుప్పం పరిణామాలపై మీడియాలో షరామామూలుగా రెండు రకాల కథనాలూ నడుస్తున్నాయి. ప్రజలు రాకున్నా ఫేక్చిత్రాలతో ఎక్కువ మందిని చూపిస్తున్నారనీ, గాయపడిన వారిని చంద్రబాబు పరామర్శించడం బూటకమేననీ కథనాలు నడుస్తున్నాయి. మరో వంక రాజమండ్రిలో ముఖ్యమంత్రి సభ సందర్భంలోనూ ఒక మహిళ కాలు దెబ్బతిందని వార్తలు. వాటితో సంబంధం లేదని పాలకపక్షం సమర్థన. ఏది నిజమో ఏదికల్పితమో తెలియని సోషల్‌మీడియా యుద్ధాల స్థాయికి వార్తాకథనాలు దిగజారిపోయిన వేళ సత్యాన్ని కూడా కాపాడుకోవలసిన బాధ్యత కూడా ప్రజలపై పరిశీలకులపై పడుతున్నది. ఈ సమయంలోనే రాజ్యాంగపరమైన పాత్రలో ఉండాల్సిన ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు బయిలుదేరి టీడీపీ ఆరోపణలనూ మీడియా కథనాలనూ సంపాదకీయాలనూ ఖండించే బాధ్యత నెత్తిన వేసుకున్నారు. జరిగిన ఘటనల్లో పోలీసుల పాత్ర లోపరహితమని తనే కితాబునివ్వడం విపరీతం. అది ఆయన పని కాదు.
వైసీపీలోనూ అలజడి
ఇలాంటి అత్యుత్సాహాలు, ప్రతిపక్షాల నిరసనలపై ముఖ్యమంత్రి అసహనం ఎలావున్నప్పటికీ పాలకపక్షం లోనూ కలకలం పెరుగుతున్నది. వైసీపీ ఎంఎల్ఎ వసంత కృష్ణ ప్రసాద్ గుంటూరులో సభ నిర్వహించిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడారు. పాలనాలోపాలు దిద్దుకోకుండా ఎన్నికలు త్వరగా వస్తే ఎలా గెలవగలమని ప్రశ్నించిన మాజీ మంత్రి పాలకపక్ష ఎంఎల్ఎ ఆనం రామనారాయణరెడ్డిపై నాయకత్వం చర్య తీసుకుంది. భిన్నాభిప్రాయాలు గల మరో ఎంఎల్ఎ కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ పిలిపించి బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం సందేహంగానే ఉంది. గతంలో ప్రతిపక్షాలపై దాడులు కేసులు వంటివాటికి బాధ్యత వహించిన మాజీ హోం మంత్రి సుచరిత టీడీపీతో సంబంధాలున్న తన భర్త ఏ పార్టీలో చేరితే తనూ అటే ఉంటానని ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రి అభిశంసనకు గురైన సీనియర్ నాయకుడు, ప్రస్తుత రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏకంగా మూడు రాష్ట్రాల గురించిన వివాదం రగిలిస్తుంటే, ప్రభుత్వ స్పందననాస్తి. ఉద్యోగుల జీతభత్యాల జాప్యం నుంచి పెన్షన్ల లబ్దిదారులకు నోటీసులు. రైతాంగ సమస్యలు, వరకూ అనేక సమస్యలు ముందుకొస్తుంటే సమస్యలే లేనట్టు అంతా ప్రతిపక్షాల కల్పన అన్నట్టు కొట్టిపారేయడం, నిరంతర ఆత్మస్తుతి, పరనిందలోనే మునిగితేలడం ఏ ప్రభుత్వానికీ చెల్లుబాటుకాదు. స్వయానా ముఖ్యమంత్రి తమ పార్టీ ఎంఎల్ఎల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం నిజం కాదా?
బిఆర్ఎస్ ప్రవేశం... బీజేపీ వ్యూహాలు
ఈ సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ఏపీలో ప్రవేశిందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. పవన్‌కళ్యాణ్ జనాకర్షణ పోరాటాలతో నాయకులు వరసకట్టి చేరబోతున్నారని జనసేన చెప్పుకుంటుంటే, ఆ పార్టీకి చెందిన కీలకనేతలు తోట చంద్రశేఖర్ వంటివారు, బీజేపీ మాజీ మంత్రి రావెల కిశోర్ వంటివారు బిఆర్ఎస్లో చేరిపోయారు. తోట అధ్యక్షుడుగా నియమితులై అమరావతి రాజధానిగా ఉండాలని తొలి ప్రకటన చేశారు. కేసీఆర్ అభివృద్ధి నమూనాలో పనిచేస్తామన్నారు. బీజేపీ మతతత్వ విధానాలు కేంద్రీకృత పెత్తనం గురించి ప్రధానంగా విమర్శలతో బిఆర్ఎస్ తెచ్చామంటున్న కేసీఆర్ ఈ సందర్భంలో విశాఖ ఉక్కు గురించి మాత్రమే ప్రత్యేకంగా చెప్పారు. వైసీపీ, బిఆర్ఎస్ వస్తే అభ్యంతరం లేదనీ, తమపై ఏ ప్రభావం చూపబోదనీ అంటున్నది. వామపక్షాలు దేశవ్యాపిత నేపథ్యంలో ఇది వరకే బిఆర్ఎస్ను ఆహ్వానించాయి. మిగిలిన పార్టీలేవీ ఇంకా పెద్దగా స్పందించలేదు. రెండు పాలక పార్టీలూ పరస్పర అవగాహనతోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయని మీడియాలో కథనాలు నడవడం కూడా గమనించదగింది. తెలంగాణలో బీజేపీ ఎవరితో పొత్తు ఉండదని ప్రకటిస్తే, టీడీపీ దానికి మేలు చేయడానికే ప్రవేశించిందనే అంచనాలు చాలా ఉన్నాయి. మొత్తంపైన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అనేక విధాల కలసి నడిచే కొత్త వాతావరణం ఏర్పడిందని గతంలో ఈ శీర్షికలో చెప్పుకున్న విషయాలు గుర్తుచేసుకోవాలి. ఈ క్రమంలో బీజేపీ పరోక్ష హస్తం వ్యూహం అడుగడుగునా దర్శనమిస్తున్నది. కేవలం వచ్చే ఎన్నికలలో అధికారానికి రావడమే లక్ష్యంగా అవకాశవాద వ్యూహాలకు పాల్పడే పార్టీలు పొంచికూచున్న బీజేపీ ఎత్తుగడలు విస్మరించడం వాటికీ ప్రజలకూ చేటు తెస్తుంది.
- తెలకపల్లి రవి