Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ సమాజ వికాసానికి, దేశ సర్వతో ముఖాభివృద్ధికి మూలాధారం విద్య. ఇలాంటి విద్యావ్యవస్థలోని తొలి అడుగైన పాఠశాల విద్యకు సర్వహంగులతో పరిపుష్టి నింపి, రేపటి తరం మేలైన భవిష్యత్తుకు పాలకులు బాటలు వేయాల్సి ఉంది. కానీ 1991లో వచ్చిన నూతన ఆర్థిక సంస్కరణలు, పాలకులు అనుసరిస్తున్న విధానాలతో విద్యావ్యవస్థలోకి వ్యాపార ధోరుణులు ప్రవేశించాయి. దీంతో ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన విద్య అంగడి సరుకుగా మారింది. ఇలా ప్రయివేటీకరణ, కార్పొరేటీ కరణతో నేడు ''చదువుకుంటే రావడం కాస్త- చదువును కొనుక్కుంటేనే'' వస్తుందనే పరిస్థితి దాపురించింది. 1964లోని ''కొఠారి కమిషన్'' మన దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థ పరిస్థితులను అధ్యయనం చేసి, విద్యాభివృద్ధికి కొన్ని అతి విలువైన, ఆచరణాత్మక సూచనలు చేసింది. వీటిని అమలు చేయకపోవడంతో పాటు మారిన పాలకుల పాలనా విధానాల వలన విద్యా వ్యాపార ధోరణులు పెరిగి లాభార్జన ధ్యేయంగా కొనసాగు తోంది. విద్యావ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, ఉచితంగా నిర్బంధంగా నాణ్యమైన విద్యను అందించాలని రాజ్యాంగం లో పొందుపరచుకున్న విధానాలు నేడు అమలవడం లేదు. గత కొన్నాళ్లుగా ప్రభుత్వాలలో ప్రభుత్వ విద్యారంగాన్ని బతికించుకోవాలనే స్ఫూర్తి, చిత్తశుద్ధి లోపించడం వలన సర్కారీ విద్య అష్ట కష్టాలు, అరకొర వసతులతో కూనరిల్లు తోంది.
ఎక్కడ ఉన్న విద్య అక్కడే...
ఒకవైపు ప్రభుత్వాలు విద్యను వ్యాపార వస్తువుగా చేసి మరోవైపు సమాజంలో విలువలు సామాజిక స్పృహ నైతికత ఆశించడం వృథా ప్రయత్నమే. ఇది సరిపోదు అన్నట్టు అరకొర మౌలిక వసతులు, కనీస అవసరాలు తీర్చ కుండా నిధులు, నియామకాలు చేయకుండా పాలకులు దశాబ్దాలుగా కాలం వెల్లదీస్తున్నారు. ఎన్నో పథకాలు, మరెన్నో ఆర్భాట ప్రకటనలు జోరు ప్రచార హౌరు చేస్తూ సంవత్సరానికో కొత్త బోధనా విధానాలు ప్రభుత్వ విద్యలో ప్రవేశ పెడుతూ ప్రయోగశాలగా మార్చారు. నూతన విద్యా విధానం 1986లో ఓబిబి (ఆపరేషన్ బ్లాక్ బోర్డ్) ఆ తర్వాత గుణాత్మక విద్య పేరుతో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం, 2005-06లో సిఎల్ఐపి చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం, 2008-09లో సిఎల్ఎపి చిల్డ్రన్ లెర్నింగ్ ఎన్ హాన్స్ మెంట్ ప్రోగ్రాం, వీటిలో భాగంగా ''ఏ బి సి ప్రోగ్రాం, ఎల్ ఈ పి, 2020లో రీడ్ ఎంజారు డెవలప్మెంట్. నేడు తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి)పునాది స్థాయి అక్షరాస్యత, గణిత సామర్థ్యాలు, భాషా సామర్థ్యాలు పిల్లలు సాధించాలని ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. వీటితోపాటు పిల్లలు తాము చదువుతున్న తరగతుల సామర్థ్యాలను అన్నింటిని కూడా కొనసాగింపుగా సాధించాలంటున్నారు. గతం నుండి ఈ విధానాలు తెస్తూ, ప్రతిసారి ప్రారంభంలో బోధనా విధానాలు అద్భుతంగా అనిపిస్తూ, క్షేత్రస్థాయిలో విఫలం అవుతున్నాయి. ఇవి గత అను భవాలు నిజమే కదా! ఆ తర్వాత మళ్లీ కొత్త ప్రయోగం, పాత విధాన లోపాలను ఏకరువు పెడుతున్నారు. ఇలా 75ఏండ్లలో విద్యారంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వాలు చెప్పుతున్నట్లు ఇవి మంచి విధానాలే అయినప్పుడు వీటిని ప్రయివేటు, కార్పొరేట్ విద్యా రంగాల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు. వారికేమో బోధనలో స్వేచ్ఛ, వారి బోధన విధానాలపై, పర్యవేక్షణ పైగాని ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రభుత్వాలు చూసీ చూడనట్టు వ్యవహరించడం నిజం కాదా! ప్రభుత్వ రంగంలో విఫల ప్రయత్నాలు, ప్రయోగాలు ఫలితం లేని వాటిని ప్రయోగించి పిల్లల భవిష్యత్తును అంధకారం చేయడం భావ్యమా? మరి నేడు పాఠశాల విద్య నుంచి మన సమాజం ఏం ఆశిస్తున్నది? నేటి చిన్నారులు రేపటి బాధ్యతగల పౌరులుగా ఎదిగేందుకు నైతిక విలువలు ఉగ్గుపాలతో ప్రాథమిక స్థాయి నుంచి పట్టించడం, విద్యార్థుల ఆసక్తులు, అంతర్గత నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం అవసరం. పేజీల కొద్దీ అనవసర విషయాలను పిల్లల మెదల్లోకి నెట్టకుండా ఉండటం, సమకాలీన పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలో నేర్పడం ముఖ్యం. విమర్శనాత్మక ఆలోచన.. సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడం, పిల్లల భావోద్వేగ వైఖరులను మెరుగుపరచడం చేయాలి. అలాగే క్రమం తప్పని వ్యాయామం, క్రీడలు, ఆరోగ్య స్పృహ కల్పించడం వంటివి మొదలగు పాఠశాలలు వాస్తవంగా వేదికలు కావలసి ఉంది. కానీ పాలకులు మారినప్పుడల్లా వారి ఆలోచనలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు మార్చుతున్నారు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు విద్యారంగంలో పిల్లల సృజనాత్మకతను, వినూత్నతను వెలికి తీసే కార్యశాలకు బడులనే ఆదర్శంగా మార్చు కున్నాయి. దక్షిణకొరియా, ఫిన్లాండ్ సింగపూర్, జపాన్, కెనడా, డెన్మార్క్, పోలాండ్, స్విట్జర్లాండ్ దేశాలు ప్రపంచంలోనే విద్యా రంగంలో అత్యు న్నత స్థానాల్లో నిలిచి ఆచరణాత్మక విద్యకు నిదర్శంగా నిలిచాయి. చక్కటి చదువులతో పిల్లల సమగ్ర ఎదుగుదలకు బాటలు పరుస్తున్నాయి. అణు విస్ఫోటనం నుంచి తేరుకొని అద్భుతాలను సృష్టిస్తున్నాయి. వాటి నుంచి స్ఫూర్తి పొందాల్సిన మన పాలకులు ఏం చేస్తున్నారు? ఏ మేరకు బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. ఇది పాలకుల లోపం కాదా!
సమస్యలతో కునారిల్లుతున్న విద్యవ్యవస్థ
మనదేశంలో 75ఏండ్ల స్వాతంత్య్ర అమృత ఉత్సవాలు జరుపుకున్నాం. కానీ విద్యారంగం నేటికీ ఏడాదికో కొత్త పథకం, నూతన విధానాలతో విఫల ప్రయత్నాల ప్రయోగశాలగా ప్రభుత్వ విద్యారంగాన్ని మార్చుచున్నారు. విద్యారంగంలో ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు వ్యాపార ధోరణితో లాభాలు ఆర్జిస్తూ ''మూడు పువ్వులు 36 కాయలుగా'' వర్థిల్లుతుంటే ప్రభుత్వ విద్య మాత్రం పాతాలంలోకి పయనిస్తున్నది. దీనికి కూడా అనేక కారణాలున్నాఇయ. అభ్యసన సంక్షోభం, మౌలిక వసతుల లేమి, నిధులు, నియామకాలు కనీస అవసరాలు తీర్చలేని దుర్భర స్థితిలో గందరగోళంలో విద్య కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు నియామకాలు, నిధులు, పారిశుద్ధ్యం, కార్యాలయ నిర్వ హణకు అవసరమైన స్వీపర్లు, అటెండర్లు, వాచ్మెన్లు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, లైబ్రరియన్ పోస్టులు, పర్యవేక్షణ అధికారులు, హెడ్మాస్టర్లు, ఎంఈఓ, డిప్యుటి డిఓలు, డిఇఓ పోస్టులు ఇలా అనేక ఖాళీలతో ప్రభుత్వ విధానాలను వెక్కిరిస్తున్నాయి. ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు ఒత్తిడితో విధులు నిర్వహి స్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యలో ఇకనైనా విఫల ప్రయోగాలను ఆపాలి. ప్రభుత్వాలు ఇన్నాళ్ల నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే ప్రభుత్వ విద్యా పరిరక్షణకు పూనుకోవాలి. టైం బాండ్ కార్యక్రమంతో ముందుకెళ్లాలి. ఉపాధ్యాయులు వృత్తి నిబద్దతతో విధులు నిర్వహించాలి. తల్లిదండ్రులు, సమాజం విద్యను వ్యాపారంగా మారుస్తుంటే చూస్తూ ఉండి, ఆ తర్వాత విలువలు సామాజిక స్పృహ, నైతికతలను పిల్లల నుండి ఆశించడం అంటే? ''ఇసుక నుండి తైలం తీయడం లాంటిదే'' అని గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ బాధ్యతను పాలకులు ఒకరిపై ఒకరు ఆ నెపాన్ని తోసేసే విధానాలు విడనాడాలి. జీవితాంతం గుర్తుండేలా ప్రాథమిక అంశాలపై లోతైన అవగాహన కల్పించే, సొంత కాళ్లపై నిలబడే శక్తిని కలిగించే విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందాలి. ఆ విధానాలు చదువు లకు సార్ధకత చేకూర్చాలి. పాఠశాల విద్యకు పరిపుష్టి నింపకుండా ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా ఆర్భాటంగా ఎన్ని పథకాలు ఎన్ని విధానాలు వచ్చినా కనీస ఫలితాలు ఇవ్వలేవనే విషయాన్ని గ్రహించాలి. ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను గ్రహించి, రాబోవు 50ఏండ్లలో అవసరాలను శాస్త్రీయంగా మదింపు చేసి ఆయా రంగాల్లో విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యతను పాలకులు తీసుకున్నప్పుడే దేశం మరింత అభివృద్ధిలోకి వస్తుంది.
- మేకిరి దామోదర్
సెల్:9573666650