Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతనొక ఆదర్శ కమ్యూనిస్టు..నిస్వార్థ నాయకుడు.. పోరాటాల గడ్డపై తనదైన శైలిలో ముద్రవేసిన మార్కిస్టు నేత. మునగాల పరగణా జమీందారి వ్యతిరేక పోరాటం. తదనంతరం సాగిన విరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ చారిత్రాత్మక ఉద్యమంలోంచి ఉద్భవించిన ముఖ్యనేతల్లో కామ్రేడ్ ఉప్పల కాంతారెడ్డి ఒకరు. పువ్వుపుట్టగానే పరిమళించినట్టు ఆయన బాల్యం నుండే పోరాట మార్గాన్ని ఎంచు కున్నాడు. చిన్ననాడే బాలల సంఘాల్లో చేరి విప్లవ రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్నాడు. ఏడు దశాబ్దాల పాటు విరామం ఎరగని పోరాట యోధుడుగా ఎన్ని కష్టాలు,నష్టాలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు. మునగాల పరగణా మార్క్సి స్టు పార్టీ ఉద్యమాల్లో అతివాదాన్ని, మిత వాదాన్ని ముఠా ధోరణులను ఎదిరించి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. మార్క్సిస్టు పార్టీని కంటికి రెప్పలా కాపాడటంలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి తీరనిలోటు. 14జులై1935లో ఉప్పల వెంకయ్య,సీతమ్మ దంపతులకు ధనిక రైతు కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన జీవితాంతం పేద ప్రజల కోసమే పనిచేశాడు. మునగాల పరగణాలోని జగన్నాధపురం గ్రామంలో కేశ బోయిన ముత్తయ్య ద్వారా విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడయ్యారు.పార్టీలో అనేక బాధ్యతలు నిర్వ హిస్తూ సీపీఐ(ఎం) కోదాడ డివిజన్ కార్యదర్శిగా, జిల్లా రైతు సంఘం నాయకుడిగా,1970 నుండి 80 వరకు మున గాల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నిబద్ధతతో కూడిన సేవలందించారు. ఇంకా సింగిల్ విండో చైర్మన్‌గా,లిఫ్ట్ ఇరిగేషన్ ఛైర్మన్‌గా, హుజూర్నగర్, ఎల్ఎంబి. బ్యాంక్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి నీతి,నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు.
నిర్భందాలను ఎదుర్కొని..పోరాటాలు చేసి...
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు మునగాల పరగణా కష్ణా జిల్లాలో అంతర్భాగంగా ఉన్నది. మునగాల జమీందారికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నండూరి ప్రసాద్‌రావు నాయ కత్వంలో సాగిన పోరాటం అనేక విజయాలు సాధించింది. 1959 జులై 1వ తేదీన మునగాల పరగణాను నల్గొండ జిల్లాలో అంత ర్భాగం చేశారు. జమీందారీ వ్యతిరేక పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో పరగణా ప్రజలు భాగస్వాములై మునగాల పరగణా తొలి అమరుడు చీమ గురువయ్య స్ఫూర్తితో సమరశీల పోరాటా లకు నాయకత్వం వహించి అనేక విజయాలు సాధించారు. అనంతరం మార్క్సిస్టు పార్టీ నాయకత్వాన సాగిన భూ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు,కూలీ తిరుగుబాట్లు, రైతాంగ ఉద్యమాలను నడిపించిన ఎర్రజెండాను పరగణా ప్రజలు హక్కున చేర్చుకున్నారు. 1996లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్క్సిస్టు పార్టీ ఉద్యమం విచ్చిన్నానికి గురైనప్పుడు పార్టీని కాపాడటంలో కామ్రేడ్ కాంతారెడ్డి కృషి ఎనలేనిది. కోదాడ ప్రాంతంలో పార్టీ ప్రతి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేది. మార్కిస్టు పార్టీ అభివద్ధిని చూసి ఓర్వలేక ఆనాడు పాలక పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం, అతివాద పార్టీలు సీపీఐ(ఎం)పైన కక్షగట్టి తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగించాయి. దీంతో కోదాడ డివిజన్లో ఉద్యమం అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నది. రెండు దశాబ్దాల పాటు పార్టీ నాయకుల పైన నిర్బంధం సాగింది. వందలాది కేసుల మోపబడ్డాయి. అనేకమంది నాయకులను దారి కాచి అతి దారుణంగా హత్య చేశారు. మెరికల లాంటి యువత తమ ప్రాణాలను తణ పాయంగా అర్పించారు. నరసింహుల గూడెం, జగన్నాధపురం,కలకోవ తాడువాయి,కొక్కిరేణి,రేపాల, మాధవరం, నేలమర్రి సిరిపురం. బందావనపురం తో పాటు మల్లారెడ్డిగూడెం గ్రామాల్లో పార్టీ పైన దాడులు, హత్యల పరంపర సాగింది.నరసింహుల గూడెం గ్రామంలో కామ్రేడ్లు ఆదిరెడ్డి, అమీర్, ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొంత శ్రీనివాస్ రెడ్డి, పులిందర్ రెడ్డి అమరులయ్యారు. మల్లారెడ్డి గూడెం గ్రామంలో కామ్రేడ్ కందుల గురువారెడ్డి, ఎర్రబోలు వెంకటేశ్వర్ రెడ్డి హత్యకు గురయ్యారు. వీరితోపాటు అనేక గ్రామాల్లో కార్యకర్తల పైన నాయకుల పైన దాడులు కొనసాగాయి. పోలీసులు అధికార పార్టీ అండతో అక్రమ కేసులు మోపి జైళ్లలో నిర్బంధించారు. సుదీర్ఘ కాలం పాటు కోదాడ డివిజన్ ఉద్యమం పైన మునగాల పరగణా గ్రామాల పైన మండే కొలిమిలా నిర్బంధం కొనసాగింది. ఎన్నో నిర్బంధాలను,విచ్చిన్నాలను ఎదుర్కొని నాటినుండి నేటి వరకు ప్రజలు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
ప్రజల మదిలోనే పోరాట స్మృతులు...
పరగణా పోరాట స్మతులు నేటికి ప్రజల మదిలో స్మరిస్తూనే ఉన్నాయి. కామ్రేడ్ కాంతారెడ్డి ఉద్యమంపై వస్తున్న నిర్బంధాలను ఎదుర్కొంటూ కార్యకర్తలను కాపాడటంలో ప్రభుత్వం, పోలీసులు కొనసాగిస్తున్న నిర్బంధ కాండ పైన ప్రజలను సమీకరించి గొంతెత్తి నినదించేవారు. కోదాడ డివిజన్ వ్యాప్తంగా విచ్చిన్నలాను, నిర్బంధాలను ఎదుర్కొంటూనే పార్టీ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించాడు.కోదాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకునేందుకు కామ్రేడ్ అరిబండి లక్ష్మీనారాయణ సహకారంతో పార్టీ కార్యాల నిర్మాణం,నడిగూడెం. మునగాల కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కాంతారెడ్డితో పాటు గట్టు వెంకటరామయ్య కషి మరువలేనిది. డివిజన్ వ్యాప్తంగా పార్టీ ప్రాబల్యాన్ని పెంచేందుకు స్థానిక ఎన్నికలతోపాటు నిర్బంధాలు వచ్చినప్పుడల్ల కామ్రేడ్ వి.ఎన్., కామ్రేడ్ మేదరమట్ల సీతా రామయ్య నిరంతరం సంప్రదిస్తూ ఎత్తుగడలు రూపొందించేవాడు. పరగణ గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రావటంలో కాంతారెడ్డి పాత్ర అద్వితీయం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఆకస్మాత్తుగా చనిపోయారు. భౌతికంగా కాంతారెడ్డి మన మధ్య లేకున్నా మునగాల పరగణా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు.ఆయన అంకితభావం, ఉద్యమస్ఫూర్తి, పోరాట పటిమికు విప్లవ జోహార్లు.
- ములకలపల్లి రాములు
9490098338