Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2022 డిసెంబర్ 19 వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో ఒక సభ. నాస్తికవాద నాయకుడు బైరి నరేష్ అయ్యప్పస్వామి పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మతోన్మాద శక్తుల భౌతికదాడి. 31న ఆసభ నిర్వాహకుడు గుండమల్ల బాలరాజుపై అయ్యప్పస్వామి ముసుగులోఉన్న ఆరెస్సెస్, బీజేపీ శ్రేణుల దాష్టీకం. ఈ భౌతికదాడులు దేనికి సంకేతం? కేవలం బెదిరించడానికో, భయపెట్టించేందుకో అనుకుంటే పొరపొటే. భవిష్య త్తులో తమకు ఎవరూ అడ్డం రాకూడదనే సమయం దొరకగానే దాడులకు తెగబడటం మతోన్మాదుల నైజం. భైరి నరేష్ వ్యాఖ్యలతో అయ్యప్పల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందూ మతం జోలికి వచ్చినా, హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడిన 'తలలు నరుకుతాం..ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాం' అంటూ దూర్భష లాడటం, ఇష్టారీతినా తిట్టడం చూస్తుంటే రాష్ట్రంలో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించడం స్పష్టంగా కనిపిస్తోంది.
వాగ్గేయకారుడు రేంజర్ల రాజేష్ సరస్వతీ దేవిని కించపరిచాడని ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆయన లేని సందర్భంలో అతని తల్లి, భార్య, చిన్నపిల్లలు అని చూడకుండా వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మళ్లీ వారే బాసర బంద్‌కు పిలుపునిచ్చారు. బైరి నరేష్‌పై భౌతిక దాడి తప్పు అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టినందుకు మహబూబాబాద్‌లో ఎస్ఎఫ్ఐ నాయకుడు, గిరిజన విద్యార్థి గుగులోత్ సూర్యప్రకాష్‌పై ఆరెస్సెస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు అతని చొక్కా చింపి భౌతిక దాడి చేశారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? మాట్లాడేవారందరిపై ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల దళిత ఉపాధ్యాయుడు మల్లిఖార్జున్‌ను కులంపేరుతో దూషించారు. బడి నుంచి గుడికి బలవంతంగా లాక్కెళ్లి బొట్టు పెట్టి జైశ్రీరాం అనిపించారు. ఆయన చేసిన తప్పేంటి? పాఠశాలలో శాస్త్రీయతను బోధించాడు. దీన్ని ఆసరాగా చేసుకుని మల్లిఖార్జున్‌కు చావు భయం చూపించారు. బడినుంచి గుడికి తీసుకెళ్లి బొట్టు పెట్టి జైశ్రీరాం అనిపించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం ఆశ్చర్యకరం. దీనికన్నా ముందే అదే ఉపాధ్యాయుని వద్దకు గతేడాది సెప్టెంబర్‌లో వినాయక చందా కోసం కొంతమంది వెళ్లారు. ఆయన 'నేను నాస్తికుడిని ఆకలితో ఉన్నవాడికి నా తోచిన మేరకు అన్నం పెడుతాను' అని జవాబిచ్చాడు. అప్పటినుంచి కక్ష గట్టిన ఆరెస్సెస్, బీజేపీ శ్రేణులు విద్యార్థులకు నాస్తికవాదం బోధిస్తున్నాడనే నెపంతో బెదిరించి దాడి చేశారు.
మన దేశంలో ప్రశ్నించడం నేరం కాకూడదు, ప్రశ్నకు శాస్త్రీయ సమాధానం వెతకాలి. కానీ ప్రశ్ననే నియంత్రించ కూడదు. విశ్వాసాలు, నమ్మకాలు ఉండడం కూడా ఒక ప్రజాస్వామిక హక్కు. దేవుడున్నాడు అనే వారికి ఎంత హక్కు వుందో, లేడని చెప్పే హక్కు కూడా భారత రాజ్యాంగం కల్పించింది. బైరి నరేష్ మాటల్లో వ్యంగ్యం, బూతు ఉంటే కచ్చితంగా తప్పు పట్టాల్సిందే. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని దాడి చేయడం మాత్రం హేయనీయం.
గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవు మాంసం తినే లం....కొడుకులు అని అభ్యంతరకర భాషలో వ్యాఖ్యానించారు అప్పుడు కోట్లాది మంది ఆవుమాంసం తినే వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. అప్పుడు ఆయనపై ఎవ్వరు భౌతిక దాడికి పాల్పడలేదు. చట్టబద్ధంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామీ అస్సలు సమ్మక్క సారలమ్మలు దేవతలు కాదు, వాళ్ళు ఏమైనా బ్రహ్మలోకం నుండి ఉడిపడ్డారా? వాళ్ళు ఒక గ్రామ దేవతలు అంటూ కించపరుస్తూ వ్యాఖ్యానించారు. లక్షలాది మంది ఆదివాసుల ఆరాధ్యదైవం సమ్మక్క సారలమ్మ.. ఆదివాసుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఆదివాసుల చినజీయర్‌పై భౌతిక దాడి చేశారా? మహిళలు బట్టలు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు అని దేశంలోని 70కోట్ల మంది మహిళలను కించపరుస్తూ మాట్లాడిన రాందేవ్ బాబాను ఏ మహిళలు కొట్టారు?
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి ఆరెస్సెస్ పథకం ప్రకారం పని చేస్తోంది. దేశంలో మొత్తంలో సరిహద్దు వివాదాలు విద్వేషాలు రెచ్చగొడుతోంది రాష్ట్రంలో కులం, మతం, దైవం వంటి వాటి చుట్టూ తిప్పి ఎనిమి దేండ్ల బీజేపీ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చడానికి మనోభావాల మాటున మతోన్మాదాన్ని ఉసిగొల్పుతోంది. మన రాష్ట్రంలోనూ దళితులపై దాడులకు పాల్పడింది ఆరెస్సెస్, బీజేపీ శ్రేణులే. రామోజీ పేట, చిన్న కందుకూరు, చండూరు వంటి గ్రామాల్లో దళితవాడలపై దాడులకు పాల్పడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కేంద్రంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇదిగో అని ఏనాడు చెప్పలేదు. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు వెళ్లి రాష్ట్రంలోని 'అన్ని మసీదులను తవ్వుదాం.. శవాలు ఎల్లై మీకిస్తాం. శివాలు వస్తే మాకివ్వండి' అని ఎంతటి విద్వేషాపూరిత వ్యాఖ్యలు చేశాడో తెలంగాణ సమాజం గమనించింది. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతన్నాయనే విషయం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం చాలా సంయమనం పాటించాలి.
ఎవరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? తెలంగాణ సమాజం సరైన దిశలో ఆలోచించాలి. తగు జాగ్రత్తల తీసుకోవాలి. రాష్ట్రాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచడానికి ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా కృషి చేయాలి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని భౌతిక దాడులకు పాల్పడుతున్న ఎంతటివారినైన కఠినంగా శిక్షించాలి. ఒక భావం వ్యక్తపరిచినప్పుడు ప్రతి భావంతో ప్రతిస్పందించాలి కానీ భౌతిక దాడి సమాధానం కాకూడదు. భావసంఘర్షణను సంపూర్ణంగా స్వాగతించాలి. కానీ ప్రజలను రెచ్చగొట్టే వాళ్ళ ఉచ్చులో పడకుండా ఉండాలి. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలి ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలి. దీనికి ప్రజలతో పాటు విద్యావంతులు, మేధావులు సహకరించాలి.
- టి. స్కైలాబ్ బాబు
9177549656