Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని ప్రకటిస్తామని 2020-2021 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఆ తరువాత కొద్ది కాలానికే సదరు విధానం వచ్చేసింది. వ్యూహాత్మక రంగాలలో మినహా మిగతా రంగాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రయివేటీ కరించడం ఆ విధానం లక్ష్యం. అందులో కూడా ఒక్కో రంగంలో కేవలం నాలుగు సంస్థలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో వుంటాయి. కానీ వాటిలో ప్రభుత్వ వాటా 26శాతానికి పరిమితం చేయబడుతుంది. మెజారిటీ వాటాలు ప్రయివేటు రంగానికి అమ్మి వేయబడతాయి.
బ్యాంకింగ్ రంగం వ్యూహాత్మక రంగం. నాలుగు బ్యాంకులు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అదీ కేవలం 26శాతం మైనారిటీ వాటాలతో. మిగతావన్నీ పూర్తి ప్రయివేటీకరణకు గురవుతాయి. పల్లెటూళ్ళలో గేదెలను అమ్మబోయే ముందు వాటిని గట్టిగా మేపుతారు. రోజూ కడుగుతూ నున్నగా తయారుచేస్తారు. ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలు ఎగ్టొట్టిన పారు బకాయిలు బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వ బ్యాంకులకు వుండీ వుండీ లాభాల వరద వచ్చి పడింది. నష్టాలు ఎగిరిపోయాయి. అందరికీ అనుమానాలు వచ్చాయి. ఇదెలా సాధ్యమైందని మెదళ్ళు తొలిచివేయ బడుతున్నాయి. మోడీ మంత్రాంగం తెలిసిన వారికి అంత ఆశ్చర్యం కలగదు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకు చెందిన ప్రభుత్వం నడుస్తుంది. మరలా ఎన్నికలు వచ్చేంతవరకు ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ఎవరైనా ఈ ప్రభుత్వంతో తేల్చుకోదల్చుకుంటే ఎన్నికలలో తప్ప మరెక్కడా మాట్లాడకూడదని పాలకులు నూరిపోస్తున్నారు.
నిబంధనల ప్రకారం వసూలు కాని బాకీల మేరకు బ్యాంకులు తమ నిర్వహణ లాభాలను బదిలీ చేయాలి. 2021 డిసెంబర్ 31 నాటికి 43 బడా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ బ్యాంకులకు రూ.5,44,000 కోట్లు బకాయి పడ్డాయి. రాని బాకీలలో బడా రుణ గ్రహీతల వాటా 2020-21 లో 66.4 శాతం. ఈ బాకీల మేరకు నిర్వహణా లాభాలను భవిష్యత్ అవసరాల ఖాతాకు బదిలీ చేయాలి (దీనినే ప్రోవిజనింగ్ అంటారు). అటువంటి బాకీలను కనుక 4 సంవత్సరాలలో తిరిగి రాబట్టుకోలేకపోతే వాటిని రద్దుచేస్తారు.
2016-2017 నుంచి 2021-22 వరకు 6ఏండ్ల కాలంలో ప్రభుత్వ బ్యాంకులు రూ.8,16,421 కోట్ల పారు బకాయిలను రద్దుచేశాయి. బ్యాంకులు తమ ఖాతాలలో ఈ మేరకు భవిష్యత్ అవసరాల ఖాతాకు ఖర్చు రాసుకొని వాటిని బడా కార్పొరేట్ కంపెనీల పారుబకాయిలకు జమచేస్తాయి. 2017-18, 2018-2019 రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో తమ నిర్వహణా లాభాలనే కాకుండా, పెట్టుబడుల నుండి కూడా రూ.లక్ష కోట్లను భవిష్యత్ అవసరాల ఖాతా (ప్రోవిజినింగ్)కు బదిలీ చేశాయి. అంటే మరో కోణంలో చూస్తే బ్యాంకులు రెండు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయల నికర నష్టాలను చవిచూశాయి. ఆ తరువాత మూడు సంవత్సరాలలో 2019- 2020 నుండి 2021-2022 వరకు బ్యాంకులకు రూ.1,24,373 కోట్ల నికర లాభాలు వచ్చిపడ్డాయి. ఇదెలా సాధ్యమైంది? రాని బాకీలు రద్దు చేయబడుతున్నాయి. కాబట్టి నిర్వహణా లాభాలను భవిష్యత్ అవసరాలకు బదిలీ చేయటం బాగా తగ్గింది. నికర లాభాలు బాగా పెరుగుతున్నాయి.
కథ ఇంతటితో ముగిసిపోదు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రిస్కుతో కూడుకున్న రుణాలలో 12శాతం మేరకు బ్యాంకులు తమ పెట్టుబడులను పెంచుకోవాలి. ఈ బడా కార్పొరేట్ కంపెనీలు ఎగ్గొట్టిన పారు బకాయిల స్థానంలో నిర్వహణా లాభాలను బదిలీ చేయటం వలన, వాటిని రద్దు చేయడం వలన ప్రభుత్వ బ్యాంకులు నష్టాలను చవిచూశాయి. వాటి పెట్టుబడులు కరిగిపోతున్నాయి. నిబంధనల మేర పెట్టుబడులను పెంచుకోవాలి. ప్రభుత్వ బ్యాంకుల ఖాతాల దుమ్ము దులిపి శుభ్రం చేయటానికి మోడీ ప్రభుత్వం రెండు మార్గాలను అనుసరించింది. ప్రభుత్వ బ్యాంకు లను బలోపేతం చేయకపోతే ఎవరూ కొనరు. మొదటి పద్ధతి బ్యాంకుల విలీనం. ఒకప్పుడు 27 ఉండే ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పుడు 12కు తగ్గాయి. ఒక గట్టి బ్యాంకుతో రెండో, మూడో ఓడు బ్యాంకులను విలీనం చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను కలిపిన తరువాత రూ.8,339 కోట్లు ఉన్న నష్టం, రెండు సంవత్సరాలు తిరిగే సరికి రూ.828 కోట్ల లాభాలలోకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఓరియెంటల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంకులు విలీనం చేసిన తరువాత ఒక్క సంవత్సరంలోనే రూ.8310కోట్ల నికర నష్టం రూ.2026 కోట్ల నికర లాభంగా మారింది. విలీనాల వలన బ్యాంకుల సంఖ్య, శాఖల సంఖ్య తగ్గుతోంది. ప్రజల సేవలు తగ్గుతాయి.
రెండో పద్ధతి ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడుల శాతాన్ని తగినంతగా పెంచడానికి, నష్టాలను పూడ్చడానికి 2010- 2011 నుండి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి రూ.1,12,000 కోట్లను బదిలీ చేసింది. ఆ తరువాత బడ్జెట్ నుండి బదిలీ చేయటం ఆపేసి, ప్రభుత్వ బ్యాంకులకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చడానికి బాండ్లు జారీ చేయడం మొదలుపెట్టింది. ఏప్రిల్ 2022 వరకు రూ.2,79,000 కోట్ల బాండ్లను జారీచేసింది. అంటే ఆ మేర పెట్టుబడులను సమకూర్చింది.
కేంద్ర ప్రభుత్వం బాండ్లు (అప్పుపత్రాలు) జారీ చేస్తుంది. ప్రభుత్వ బ్యాంకులు తమ వద్ద ఉన్న ప్రజల డిపాజిట్లతో వాటిని కొంటాయి. ఆ బాండ్ల్లు బ్యాంకు పెట్టుబడులుగా మారతాయి. పరోక్షంగా చూస్తే ప్రజల డిపాజిట్లు బ్యాంకు పెట్టుబడులుగా మారతాయి. ఆ బాండ్ల మీద బ్యాంకులకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఏప్రిల్ 2022 వరకు ప్రభుత్వం బాండ్ల రూపంలో బ్యాంకుల నుండి తీసుకున్న అప్పు రూ.2,79,000 కోట్లను 2028 నుండి 2031 మధ్య కాలంలో చెల్లించాలి. ఏ సంవత్సరంలో ఎంత అప్పు తిరిగి చెల్లించాల్సి ఉంటుందో, ఆ అప్పు ఆ సంవత్సరపు బడ్జెట్ నుండి చెల్లించాలి.
2015-2016 నుండి 2021-2022 వరకు ఏడు సంవత్సరాల కాలంలో కేంద్ర బడ్జెట్ నుండి బ్యాంకులకు పెట్టిన పెట్టుబడులు ప్రజల డబ్బులే. బ్యాంకుల నుండి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించేది ప్రజల డబ్బులే. ఈ కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణా లాభాలు రూ.14,91,177 కోట్లు...కార్పొరేట్ కంపెనీలు కట్టాల్సిన పారు బకాయిల స్థానంలోకి తరలించబడ్డాయి. కేంద్ర బడ్జెట్ నుండి ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చింది రూ.3,91,000 కోట్లు. మొత్తంగా ప్రజల డబ్బులతో కార్పొరేట్లు లాభపడింది రుణాల రద్దు రూపంలో రూ.8,16,421 కోట్లు. పైగా కార్పొరేట్ కంపెనీల రాని బాకీల వలన పెట్టుబడుల రూపంలో ప్రభుత్వం సమకూర్చింది రూ.3,91,000 కోట్లు. మొత్తం కలిపి రూ.12,07,421 కోట్లు అవుతుంది. ఇది ఎవరి ప్రభుత్వమో ఇప్పుడు అర్ధమవుతుంది.
బేతాళుడి కథ అంత తొందరగా ముగియదు. బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు సరైన జవాబులు చెప్పేంత వరకు చందమామ సీరియల్ కొనసాగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన ఒక అంకం ముగిసింది. మరో అంకం మొదలవుతుంది. అది మొదలైతే ప్రభుత్వ బ్యాంకుల కథ సమాప్తమవుతుంది. ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణకు అంతా సిద్ధమైంది. ఇక వాటిని ప్రైవేటీకరించడమే తరువాయి. మోడీ ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టం (సవరణ) బిల్లును సిద్ధం చేసింది. 2020-2021 బడ్జెట్ ఉపన్యాసంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను పూర్తిగా ప్రైవేటీకరిస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. అవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులని వార్తల్లో వచ్చాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులో ప్రభుత్వ బ్యాంకులలో ప్రభుత్వ వాటా 26 శాతానికి కుదించబడింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటాలను 33 శాతానికి తగ్గించాలని 1998లో రెండో నరసింహం కమిటీ సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4, 5 బ్యాంకులుగా మార్చాలని 1991లో మొదటి నరసింహం కమిటీ సిఫార్సు చేసింది. ఈ రెంటినీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్నది. ప్రభుత్వ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి ప్రభుత్వ రంగ బ్యాంకులు పోతాయి. ప్రజల దోపిడీ మరింత తీవ్రమవు తుంది.
- పి. అజయ కుమార్