Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర పునరావృతమైంది, అదీ మరింత ఆందోళన కలిగించే రీతిలో ఆదివారంనాడు బ్రెజిల్లో జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను నిర్ధారిస్తూ ధృవీకరణ పత్రం ఇవ్వరాదంటూ ఓడిన డోనాల్డ్ ట్రంప్ మద్దతుదార్లు 2021 జనవరి 6న దాడికి తెగబడ్డారు. అమెరికా అధికార కేంద్రమైన పార్లమెంటు ఉభయ సభలు, సుప్రీం కోర్టు భవనాలున్న వాషింగ్టన్‌లోని కాపిటల్ హిల్‌పై దాడి చేశారు. రెండు సంవత్సరాల తరువాత 2023 జనవరి 8న లాటిన్ అమెరికాలో పెద్ద దేశమైన బ్రెజిల్ అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీం కోర్టులపై గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓడిన జైర్ బోల్సనారో మద్దతుదార్లు దాదాపు మూడు వేల మంది దాడికి తెగబడ్డారు. గెలిచిన లూలా ఎన్నికను నిర్థారించి, పదవీ స్వీకారం కూడా జరిగిన తరువాత ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ దాడి చేసి విధ్వంసకాండకు పాల్పడ్డారు. బోల్సనారోకు డోనాల్డ్ ట్రంప్ పెద్ద మద్దతుదారన్నది తెలిసిందే. జనవరి 1న మూడవసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వామపక్ష నేత లూలా డి సిల్వా డాడి జరిగినపుడు అక్కడ లేరు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అని చెప్పుకొనే అమెరికా ఈ దాడి సూత్రధారైన బోల్సనారోకు ఆశ్రయం కల్పించింది. ఖండిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాడి జరిగిన వెంటనే పొత్తి కడుపులో నొప్పి అంటూ బోల్సనారో ఆసుపత్రిలో చేరాడు.
పచ్చి మితవాది, నియంతలకు జేజేలు పలికిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో అక్టోబరు 30న జరిగిన తుది విడత పోరులో లూలా చేతిలో స్వల్ప తేడాతో ఓడారు. గెలిచిన వామపక్ష లూలాకు 50.9శాతం రాగా బోల్సనారోకు 49.1శాతం వచ్చాయి. అమెరికాలో ట్రంప్ మాదిరి ఒక వేళ తాను గనుక ఓడితే ఎన్నికను గుర్తించనని ముందే చెప్పిన అతగాడు ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే తనకు 60లక్షల ఓట్లు అదనంగా వచ్చేవని, ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపించాడు. లూలా ఎన్నికను గుర్తించినట్లు గానీ తాను ఓడినట్లు గానీ ప్రకటించేందుకు ముందుకు రాలేదు. తానే అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికలు సక్రమంగా జరగవని, ఫలితాలను తాను అంగీకరించనని, ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఎన్నికలకు ముందే ధ్వజమెత్తాడు. డిసెంబరు 30 అర్థరాత్రి తన నమ్మిన బంట్లను తీసుకొని ఒక విమానంలో అమెరికాలోని ఫోరిడా రాష్ట్రానికి వెళ్లి అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. సాంప్రదాయకంగా జరిగే అధికార మార్పిడి కార్యక్రమాన్ని బహిష్కరించటం కూడా లూలా ఎన్నికను తాను గుర్తించటం లేదని మద్దతుదారులకు ఇచ్చిన సందేశంలో భాగమే. బ్రెజిల్లో తాజాగా జరిగిన పరిణామాల తీవ్రతను అర్థం చేసుకోవాలంటే బోల్సనారో 2018 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి జరిగిన కొన్ని ఉదంతాలను నెమరు వేసుకోవాల్సి ఉంది.
2019జనవరిలో అధికారానికి రాగానే గత మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ట్రాన్స్ జెండర్లు మొదలైనవారిపై నోరుపారవేసు కున్నాడు. గత ఎన్నికల్లోనే అక్రమాలు జరిగినట్లు, వచ్చే ఎన్నికల్లో తాను ఓడితే ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత మిలిటరీ అప్రమత్తమైందని, 2021జనవరి 6న అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని, వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెప్పారు.
రాజ్యాంగం ప్రకారం తేదీలు ముందే నిర్ణయం జరిగినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో చెప్పటం ఫాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. బాలట్ పత్రాలు లేకపోతే అమెరికా మాదిరి ఎన్నికల అక్రమాలు జరుగుతాయని బోల్సనారో అన్నాడు. గతంలో తాను అధికారానికి వచ్చినప్పటి నుంచి దాన్ని సుస్థిరం చేసుకోవటం మీదనే బోల్సనారో కేంద్రీకరించాడు. కరోనాకు జనాన్ని వదలివేశాడు. బాలట్ పత్రాలను ముద్రించాలన్న తన ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఎన్నికలను అడ్డుకుంటానని బోల్సనారో బెదిరించాడు. దీనికి మిలిటరీ మద్దతు తెలిపింది, పార్లమెంటులో చర్చ సమయంలో రాజధానిలో టాంకులతో ప్రదర్శన జరపాలన్న అతగాడి కోరికను కూడా మన్నించి మిలిటరీ ఆపని చేసింది. అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకుండానే బాలట్ పత్రాల ముద్రణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఇతనికి మీడియా పూర్తిగా మద్దతు ఇచ్చింది. పార్లమెంటు తీర్మానం చేసినా చివరకు ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతోనే జరిపారు.
2022 ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినప్పటి నుంచి బోల్సనారో మద్దతుదారులు రాజధానిలో కీలక కేంద్రాలు, మిలిటరీ కేంద్రాల సమీపంలో తిష్టవేశారు. లూలా ఎన్నికను అంగీకరించరాదని, మిలిటరీ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో శాంతి భద్రతల సమస్యల సృష్టికి తీవ్రంగా ప్రయత్నించారు. బోల్సనారో వీటిని ఒక్కసారి కూడా తప్పు పట్టలేదు. మౌనంగా ఉంటూ ప్రోత్సహించాడు. బోల్సనారో దేశం విడిచి వెళ్లిన తరువాత రాజధానిలోని కొన్ని కేంద్రాల్లో తిష్టవేసిన మద్దతుదార్లు వెనక్కు వెళ్లినట్లు కనిపించినా తిరిగి సమీకృతం కావటానికే అని ఇప్పుడు స్పష్టమైంది. మరి కొందరు అక్కడే ఉన్నారు. ఆదివారంనాడు దాడికి తెగబడిన వారు తమది దండయాత్ర కాదని, పార్లమెంటును ఆక్రమించిన చారిత్రాత్మక ఉదంతమని చెప్పుకున్నారు.
తనకు మద్దతు ఇచ్చేదిగా మిలిటరీని మార్చుకోవాలని చూసిన బోల్సనారోకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా మద్దతుతో 1964 నుంచి 1985వరకు 21ఏండ్ల పాటు అక్కడ మిలిటరీ పాలన సాగింది. దాని బాధితులు, వ్యతిరేకంగా పోరాడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఉక్కుపాదాల కింద నలిగేందుకు సిద్ధంగా లేరు. అందుకే లూలాను సైద్ధాంతికంగా ఆమోదించని వారు కూడా బోల్సనారోను ఓడించేందుకు ఓటు వేశారు. రెండవది లాటిన్ అమెరికాలో మిలిటరీ నియంతలను రుద్దిన అమెరికాకు తీవ్రమైన ఎదురుదెబ్బలే తప్ప తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకోలేపోయింది. అనేక దేశాల్లో సామాజిక, మిలిటరీ వ్యతిరేక, వామపక్ష ఉద్యమాలు పెరగటానికి దాని పోకడలు దోహదం చేశాయి. దానిలో భాగంగానె బ్రెజిల్లో లూలా నేతగా ఉన్న వర్కర్స్ పార్టీ ఉనికిలోకి వచ్చింది. అందువలన పెరుగుతున్న వామపక్ష శక్తులను అడ్డుకొనేందుకు మరోసారి మిలిటరీ మార్గాన్ని అనుసరించేందుకు అమెరికా సిద్దంగా లేక పోవటం, బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు మిలిటరీ అధికారులు సిద్దంగాకపోవటం వంటి అనేక పరిణామాలు ఉన్నాయి.
అయినప్పటికీ మిలిటరీ, పోలీసు యంత్రాంగంలో ఉన్న మితవాద శక్తుల మద్దతు కారణంగానే తాజా దాడి జరిగిందని చెప్పవచ్చు. అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీం కోర్టు మీద దాడికి వచ్చిన వారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే వరకు నిఘా, భద్రతా దళాలు ఏమి చేసినట్లు అన్నది ప్రశ్న. విధుల్లో ఉన్నవారి నుంచి ఆ భవనాల్లో ప్రవేశించిన దుండగులకు ఎలాంటి ప్రతిఘటన లేకపోగా అనుమతించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. దుండగులు మిలిటరీ ప్రధాన కేంద్రం వెలుపలి నుంచే ప్రదర్శనగా వచ్చారని, అప్పుడు ఒక హెలికాప్టర్ ఎగిరిన శబ్దం వినిపించినట్లు, అనేక మంది పోలీసులు ప్రతి చోటా ఉన్నారని, అనేక రోడ్లను మూసివేశారని, తాము లూలాను వదిలించుకొనేందుకే వెళుతున్నట్లు, తమకు బోల్సనారో మద్దతు ఉందని దాడికి వెళ్లిన వారిలోని ఒక మహిళ చెప్పినట్లు లండన్ నుంచి వెలువడే గార్డియన్ విలేకరి కథనం.
అంటే పోలీసులు దుండగుల వెనుక నడిచారు తప్ప అడ్డుకొనేందుకు చూడలేదన్నది స్పష్టం. దీని గురించి అధ్యక్షుడు లూలా మాట్లాడుతూ దుండగులను నిరోధించేందుకు భద్రతా దళాలు చేసిందేమీ లేదని, అనుమతించారని అన్నాడు. బోల్సనారోకు మిలిటరీ పోలీసుల మద్దతు గురించి 2021 ఆగస్టులో జరిగిన ఒక సమావేశంలో 25 రాష్ట్రాల గవర్నర్లు ఆందోళన వెల్లడించినట్లు వెల్లడైంది. గతేడాది రెండవ విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు 550 బస్సుల్లో వస్తున్న లూలా మద్దతుదార్లను మిలిటరీ బలగాలు రోడ్లపై అడ్డుకున్నట్లు వార్తలొచ్చాయి.2020లో సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా తన మద్దతుదార్లతో నిర్వహించిన ప్రదర్శనలో మిలిటరీ గుర్రమెక్కి బోల్సనారో పాల్గొన్నాడు. తనకు మద్దతుగా మిలిటరీ నిలవాలని, తుపాకులు కొని సిద్దంగా ఉంచుకోవాలని మద్దతుదార్లను కోరాడు, ఆయుధాలు ఉన్నవారెవరినీ బానిసలుగా చేసుకోలేరని, అవసరమైతే మనం యుద్ధానికి వెళ్లాలని అన్నాడు. ఎన్నికల ఫలితాల తరువాత అలాంటి పరిణామాలు జరగలేదు గానీ మద్దతుదార్లలో ఎక్కించిన ఉన్మాదం తాజా పరిణామాలకు పురికొల్పిందన్నది స్పష్టం. అందుకే దాడి జరిగిన ఆరుగంటల తరువాత బోల్సనారో ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ భవనాలపై దాడి, విధ్వంసం సరైంది కాదన్నాడు తప్ప ఖండన మాట లేదు.
అందువలన బోల్సనారో బహిరంగంగా పిలుపు ఇచ్చినా ఇవ్వకున్నా పరోక్షంగా అతనే బాధ్యుడు. తన తండ్రి తదుపరి కార్యాచరణ గురించి మార్గదర్శనం చేయాలంటూ నవంబరు నెలలో బోల్సనారో కుమారుడు, బ్రెజిల్ ఎంపీగా ఎడ్వర్డ్ బోల్సనారో ఫ్లోరిడాలో డోనాల్డ్ ట్రంప్‌ను కలుసుకొని చర్చించాడు. తరువాత ఇప్పుడు దాడి జరిగింది. ఈ కారణంగానే అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీకి చెందిన కొందరు పురోగామి ఎంపీలు బోల్సనారో పాస్‌పోర్టును రద్దు చేసి వెనక్కు పంపాలని, ఆశ్రయం ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ట్రంపు మీద అతగాడి మద్దతుదార్ల మీద కాపిటల్ హిల్ దాడి గురించి విచారణ జరుపుతున్న జో బైడెన్ సర్కార్ అలాంటి దుండగానికి పురికొల్పిన బోల్సనారోకు మద్దతు ఇస్తుందా, వెంటనే బ్రెజిల్ వెళ్లాలని ఆదేశిస్తుందా? అధికార భవనాలపై దాడులను ఖండించి, బ్రెజిల్ ప్రజాస్వామిక వ్యవస్థలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, పౌరుల వాంఛలను తక్కువగా చూడరాదని, లూలాతో కలసి పని చేసేందుకే ముందుకు పోతానని పేర్కొన్న జో బైడెన్ ప్రకటనలో ఎక్కడా బోల్సనారో తమ దేశంలో ఉన్నా డన్న ప్రస్తావన లేదు. రానున్న రోజుల్లో బ్రెజిల్లో ఏం జరగనుందన్నది మరింత ప్రశ్నార్ధకంగా మారింది. అమెరికా, బ్రెజిల్ పరిణామాల్లో ఓడిన శక్తులు దాడులకు తెగబడటాన్ని చూసి ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా అదే బాటలో నడిస్తే ప్రజాస్వామ్య భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్న! బోల్సనారో మద్దతుదార్ల దుండగాలను ఖండిస్తూ లక్షలాది మంది లూలా మద్దతుదార్లు వీధుల్లోకి వచ్చారు. ప్రజా ప్రతిఘటన తప్ప మితవాద శక్తులను అడ్డుకొనేందుకు మార్గం లేదు?
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288