Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రజలే నేను, ప్రజల వైపే నేను'' అని ప్రకటించిన నిఖార్సైన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్. ''కలబడి నిలబడు... సంతకాలపై కాదు, సొంత కాళ్లపై'' అంటూ యువతకు సందేశం ఇచ్చి ''పాలరాతి బొమ్మయినా పార్లమెంట్ భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం... వాడు కడితేనే ఆకారం'' అంటూ శ్రమజీవి గొప్ప తనం చాటిన కవితా శిఖరం, అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్.
జగిత్యాలలో 1954 జనవరి 12న చిన్న రాజ్యం, లక్ష్మి దంపతులకు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో అలిశెట్టి ప్రభాకర్ జన్మించాడు. చిన్నతనం నుండి తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసాడు. తండ్రి ఉద్యోగ రీత్యా కరీంనగర్లో ఉండటం వల్ల పదవ తరగతి వరకు అక్కడే విద్యాభ్యాసం. తండ్రి మరణానంతరం తిరిగి కుటుంబం జగిత్యాల చేరుకుంది.
ప్రభాకర్ మొదట్లో పెన్సిల్‌తో బొమ్మలు వేసేవాడు. మిత్రుల సలహాతో కవితలకు ఇండియన్ ఇంక్‌తో బొమ్మలు వేయడం నేర్చాడు. కవితాతృష్ణ గల ప్రభాకర్ తెలుగు కవితా వినీలాకాశంలోకి రాకెట్ లా దూసుకొచ్చాడు. 1974లో ఆయన రాసిన ''పరిష్కారం'' అనే కవిత ఆంధ్ర సచిత్ర వార పత్రికలో మొట్టమొదటిసారిగా అచ్చయింది. సామాజిక రుగ్మతల మీద తన అక్షర అస్త్రాలను సంధించటం మొదలుపెట్టాడు. కుటుంబ భారం తన మీద పడటంతో సిరిసిల్లలో ఫొటోగ్రఫీ నేర్చుకుని జగిత్యాలలో 1975లో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు. 1976లో తన ఆదర్శాలకు అనుగుణంగా పేద బీడీ కార్మికురాలు అయిన భాగ్యంను వివాహం చేసుకున్నాడు. చిత్రకారుడిగా, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తూనే యువతను కేంద్రంగా చేసుకొని కష్టజీవి, మహిళ, ఆకలి, కవితలు రాశాడు. కాబట్టే సమాజం ప్రభాకర్‌ను ప్రజాకవిని చేసింది. అల్పాక్షరాల్లో అనంత అర్థాలు ఇచ్చే అద్భుత కవితలు ప్రభాకర్ ప్రత్యేకత. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన కవిత అస్త్రాలు సంధించటం భరించలేని ఒక వర్గం ఆయనపై కక్ష కట్టింది. దీంతో ఆయన1978లో కరీంనగర్‌కి మకాం మార్చి శిల్పి స్టూడియోను నెలకొల్పాడు. కరీంనగర్‌లోని సాహితీ అభిమానులందరికీ ఆ స్టూడియోనే కేంద్రంగా ఉండేది. 1978లో ''ఎర్రపావురాలు'' మొదటి కవితా సంకలనం తదుపరి ''మంటల జెండాలు ''అనే మరో కవితా సంకలనం ఆవిష్కరించాడు. 1981లో వ్యంగ్యం, సామాజిక స్పృహల కలబోతగా గల ''చురకలు'' అనే కవితా సంకలనం విడుదల చేశారు. అందులోనే ''న్యాయాన్ని ఏ కీలుకాకీలు విరిచే వాడే వకీలు'' అంటూ వ్యంగ్యంగా న్యాయవ్యవస్థను వేలెత్తి చూపాడు. తను శవమై... ఒకరికి వశమై... తనువు పుండై... ఒకరికి పండై... ఎప్పుడూ ఎడారై... ఎందరికో ఓయాసిసై... అంటూ కేవలం 12 పదాలతో వేశ్యల హృదయ విదారక జీవితాన్ని కళ్ళముందు ఆవిష్కరించాడు. 1983లో భార్య ఇద్దరు పిల్లలతో హైదరాబాదుకు మకాం మార్చాడు. విద్యానగర్‌లో చిత్రకళ స్టూడియో ఏర్పాటు చేసి హైదరాబాదులో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. కానీ నగర జీవితం ప్రభాకర్‌కి ఏమాత్రం సరిపడలేదు. బతకడం, జీవించడం వేరు వేరు అంటాడు ప్రభాకర్.
నగరాల్లో బ్రతుకుదెరువు కోసం వచ్చిన చితికిన బతుకులు చూసి భరించలేకపోయాడు. కష్టజీవి గురించి ''కాచిగూడ నిన్ను కాచి వడ పోస్తే ఒక నీళ్ల టీ... నారాయణగూడ నీపై నడిచి వెళ్తే ఒక దాల్ రోటీ. పట్నంలో బ్రతక వచ్చిన కష్టజీవి ఇక్కడ నీకు నీవే పోటాపోటీ'' అంటూ నగర జీవితాన్ని కళ్లకు కట్టినట్లు స్పష్టీకరించాడు... ''నగరాల్లో అత్యధికంగా, అత్యద్భుతంగా అస్థిపంజరాన్ని చెక్కే ఉలి ఆకలి'' అంటూ ఆకలికి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. రిక్షా కార్మికులని చూసి ''ఒక ఎముక ఒక మాంసం ముద్దను లాగుతున్నట్లు ఉంది'' అని ఒకే ఒక వాక్యంలో రిక్షాకార్మికుడి జీవితాన్ని ఆవిష్కరించాడు. నాటి యువతరం నాలుకల మీద ప్రభాకర్ కవితలు అలవోకగా కదలాడాయంటే ఆ కవితలు వారి హదయాలను ఎంతగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. నిస్సత్తువగా ఉండే యువతరం అంటే ప్రభాకర్‌కు పరమ అసహ్యం. అందుకే ''అలా సమాధుల్లా అంగుళం మేర కూడా కదలకుండా పడుకుంటే ఎలా... కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డి మొలచి నీ ఉనికి నీకే తెలిసి చావదంటూ'' యువతను హెచ్చరించారు. ''ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంక ఎవరిని మోసం చేయనని... ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిదట తోటి జంతువులను సంహరించనని .ఈ కట్టు కథ విని గొర్రెలు ఇంకా పుర్రెలూపుతూనే ఉన్నాయి'' అంటూ నేటి రాజకీయ నాయకుల తీరును ఏకిపారేసాడు. ఎంత పేదరికాన్ని అనుభవించినా ఏనాడూ ఎవరి సహాయం ఆశించలేదు. ఒకవేళ ఎవరైనా మిత్రుడు సహాయం చేస్తే సున్నితంగానే తిరస్కరించే వాడు. ఏనాడూ సంపద కోసం ఆరాట పడలేదు. ఆత్మాభిమానం గల నిబద్ద కవి ప్రభాకర్. కాబట్టే ''గుడిసెలే మేడలను కడతాయి... అయినా మేడలు గుడిసెలను కొడతాయి'' అంటూ, ఎవరీ హై హిల్స్ బంజారా హిల్స్ అంటూ, ధనస్వామ్య వ్యవస్థను ప్రశ్నించాడు. కవిత్వం సామాజిక ప్రయోజనం కోసమే అని నమ్మిన ప్రభాకర్ అహర్నిశలు అందుకోసం శ్రమించాడు. ఒక పత్రికలో 'సిటీ లైఫ్' పేరుతో ఆరు సంవత్సరాలు మినీ కవితలు రాశాడు. కేవలం ఆ కవితల కోసమే కొందరు ఆ పత్రికను కొనుగోలు చేసేవారు అంటే అతిశయోక్తి కాదు. అనారోగ్యం బారిన పడిన ప్రభాకర్ క్షయకు సరైన చికిత్స తీసుకోక 1993 జనవరి 12న కన్నుమూశారు.''మరణం నా చివరి చరణం కాదు...మౌనం నా చితాభస్మం కాదు... నిర్విరామంగా నిత్య నూతనంగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను'' అంటూ నింగికెగిసిన కవితా కెరటం ప్రభాకర్.
(జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్థంతి)
- ములక సురేష్, 9441327666