Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైకిలు మీదొస్తున్న గోపన్నని ఆపి రామన్న ఇలా పలకరించాడు. యేంటి బావా! ఈ మధ్యన ఎప్పుడు చూసినా నువ్వు సైకిలు మీదే అవుపడుతున్నావు? కొంపదీసి సైకిలు యాత్ర గిట్ల చేస్తున్నావా ఏంది? అని అడిగేసరికి, నీతోని అదేరా ఇబ్బంది. ప్రతోడినీ అదోరకంగా చూస్తావు. పుట్టుకతో వొచ్చిన బుద్దులు పుడగలతో తప్పితే, అంత తొందరగా పోతాయేంటి? ఇగటానికైనా సగటానికైనా ఒక లెక్కుండాల్రా అని కోప్పడ్డాడు గోపన్న. ఇంకా, నీలాగా నేను జెమీందార్ని కాద్రా బాబూ! ఈ బతుక్కి సైకిలు యాత్రొకటా! ఎవరిని ఉద్ధరించడానికి? నేనేదో నామట్టుకు నా వ్యాపకాల్లో బిజీగా తిరుగు తున్నాను. నా యింటి కష్టాలు నీకేం తెల్సురా! అని నిష్టూరంగా అన్నాడు.
ఓరినీ... ఎందుకట్లా అయిపోతావ్. ఇక మాట్లాడన్లే బావా! ఈ మధ్యన టీవీల్లో వార్తలు చూస్తున్నాను. ఎలక్షన్లు వత్తన్నాయట కదా! నాయికులంతా ఏవోవో యాత్రలు చేసి అలిసిపోతున్నారు. ఒకలు పాదయాత్ర, మరొకలు బస్సుయాత్ర, ఇంకొకలు ఇంకేదో యాత్ర అని ఎడాపెడా తిరెగుస్తున్నారు కదా! అది గుర్తుకొచ్చి జర మజాక్ చేసిన.
ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటుంటే, డేవిడ్ మాస్టారు వచ్చారు. మాస్టారు ఇద్దర్నీ పలకరించారు. ఒకేసారి ఇద్దరూ మాస్టార్ని ఇలా అడిగారు. ఈ యేడాదే ఎలచ్చన్లట నిజమేనాండీ? అని. నిజమే! రానున్న సంవత్సరాంతానికి ఐదేళ్లు నిండుతాయి. అందుకే నాయకుల హడావుడి మొదలయ్యింది అన్నాడాయన. దాంతో రామన్న అందుకొని, అసలీ యాత్రలకు అంత పవరుందా? అని సందేహం వెలిబుచ్చాడు.
రామన్నా! పవరులేకపోతే వారెందుకు అలా ఊరనక వాడనక తిరుగుతారు. అంతంత సొమ్ము ఖర్చుబెట్టుకొని, ఒళ్ళు హూనం చేసుకొంటారు. అవన్నీ భరిస్తున్నారంటే, పవరు కోసమే. పవరుందా! అని అమాయకంగా అడుగుతావేంటి? అని ఎదురు ప్రశ్నవేసారు మాస్టారు. పాదయాత్రకున్న పవరు సంగతి తెలీదు మీకు. ఇంతకుముందు పాదయాత్ర చేసినోళ్ళంతా పదవులు పొందారు. అధికారం వెలగబెట్టారు. అందుకే నాయకులకు పాదయాత్రలపై మోజని సెలవిచ్చారు. ఇంకా దేశమంతా ఎలావుందో! కానీ మన తెలుగోళ్ళకి మాత్రం పాదయాత్రలలో పాల్గొనడం మరీ పిచ్చి.
స్వార్థంతో తాము చేపట్టే యాత్రల ద్వారా తమ ఆధిపత్యాలను, వారసత్వ రాజకీయాలను కలకాలం నిలబెట్టుకోవాలని కలలుకంటారు. అదంతా జనాన్ని తొక్కిపెట్టడానికే. అంతేతప్ప మరొకటి కాదు. అయినా వీరు చేపట్టిన యాత్రలు చూసేందుకు జనం పోగులు పడిపోతున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి వాళ్ళ ప్రాణాలు మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. ఈ జనానికి ఏనాడు బుద్ధొస్తుందో! యేంటో! మరి. అంటూ... ఇంకా గొర్రె కసాయోడ్ని నమ్మినట్లు మాయగాళ్ళనే నేటి ప్రజలు నమ్ముతున్నారని వివరిస్తూ ఆవేదన చెందారు మాస్టారు. దాన్కి ఇద్దరూ అవును సారూ, మీరన్నది ముమ్మాటికీ నిజం. ఇప్పుడంతా సుక్కకి, సొమ్ముకి ఓటు అమ్ముకుంటున్నారు. ఇలాకాపోతే మరి ఎలా తగలబడతది లోకం... అంటూ ముక్తాయింపుగా పలికారు.
- పిల్లా తిరుపతిరావు 7095184846