Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ధనిక రాష్ట్రం-అధ్వాన్న సూచికలు: కర్నాటక నివేదిక'' అంటూ డెక్కన్ హెరాల్డ్ దినపత్రిక 2022 డిసెంబరు ఏడవ తేదీన ఒక విశ్లేషణను ప్రచురించింది. దానిలో కొన్ని అంశాల సారం ఇలా ఉంది. వర్తమాన సంవత్సర బడ్జెట్లో కర్నాటక ప్రభుత్వం ఆరోగ్య శాఖకు 5.8, విద్యకు 12.9శాతం కేటాయించింది. ఇది జాతీయ సగటు 6, 15.2శాతాల కంటే తక్కువ. దేశ తలసరి సగటు రాబడి రూ.1.51లక్షలు కాగా కర్నాటకలో రూ.2.49 లక్షలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిటి అయోగ్ ప్రకటించిన 2021 ఆకలి సూచిక దేశ సగటు 47 కాగా, కర్నాటకలో 53 ఉంది. తమిళనాడు 66, కేరళ 80పాయింట్లతో ఎగువున ఉన్నాయి. ఐదు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి రాబడిలో తెలంగాణ తరువాత కర్నాటక రెండవ స్థానంలో ఉంది. కానీ ఆకలి సూచికలో మాత్రం రాజస్థాన్‌కు దగ్గరగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలో దీన్ని, ఇతర మానవాభివృద్ధి సూచికల గురించి ఆలోచించాల్సిన బీజేపీ పెద్దలు వాటిని విస్మరించి రాష్ట్ర ప్రజలకు తక్షణం కావాల్సింది లవ్ జీహాద్ నిరోధం అని, అందుకు గాను తమను ఎన్నుకోవాలని చెబుతున్నారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టుకు అవే ఫలాలు వస్తాయి. ధనిక రాష్ట్రాలలో ఒకటైన కర్నాటక దానికి అనుగుణంగా వివిధ సూచికల్లో లేదు.
కేరళతో పోలిస్తే తల్లీ, పిల్లల మరణాలను తగ్గించేందుకు కర్నాటక ప్రభుత్వం చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా దాని ఊసు లేకుండా మీ పిల్లలను లవ్ జీహాద్ నుంచి రక్షిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంటే వారికి సున్నితమైన అంశాలను రెచ్చగొట్టి ఓట్లు పొందటం మీద ఉన్న శ్రద్ధ తల్లీ, పిల్లల సంక్షేమం మీద లేదన్నది వేరే చెప్పనవసరం లేదు. కర్నాటకకు ఇతర సూచికల్లో కూడా అంత ఘనమైన రికార్డేమీ లేదు. 2019 సూచిక ప్రకారం మానవాభివృద్ధి సూచికలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మూడు తరగతులుగా వర్గీకరించారు. వాటిలో కర్నాటక మధ్యతరహా జాబితాలో 0.683తో ఐదవ స్థానంలో, మొత్తంలో 19వ స్థానంలో ఉంది. దేశ సగటు 0.646కు దగ్గరగా ఉంది. కేరళ 0.782తో ప్రథమ స్థానంలో ఉంది. కర్నాటక స్థానాన్ని మెరుగు పరచటం అనే ఎజెండా బీజేపీకి లేదు.
దేశంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కర్నాటక ఒకటి. ఇక ఐ.టి రంగంలో దేశానికి రాజధానిగా, మేథో కేంద్రంగా ఉంది. అలాంటి చోట 60శాతం మంది పిల్లలు పదకొండవ తరగతిలో చేరకుండానే చదువు మానేస్తున్నారు. 2021-22 వివరాల ప్రకారం తమిళనాడులో 81, కేరళలో 85శాతం మంది పన్నెండేండ్ల పాటు విద్య నేర్చుకున్న వారు ఉండగా, కర్నాటకలో 40శాతానికి మించి లేరు. వారి చదువు సంధ్యల గురించిగాక లవ్‌జీహాద్ గురించి బీజేపీ తల్లిదండ్రులకు చెబుతున్నది.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న బీజేపీ అక్కడ రెండు ఇంజన్ల గురించి చెప్పటం లేదు. ఎందుకంటే రెండు ఇంజన్లు పని చేస్తున్నా అక్కడ స్థితి ఎలా ఉందో చూశాం. అందువలన దాని కేంద్రీకరణ అంతా హిజాబ్, హలాల్, లవ్ జీహాద్ మీదనే ఉంది. మెజారిటీ హిందువులను మనోభావాలతో సంతుష్టీకరించి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నది. ఇటీవల కర్నాటక వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా మాండ్యలో జరిగిన సభలో మాట్లాడుతూ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించిన, కాశీ, కేదారనాధ్, బదరీనాధ్‌లను అభివృద్ధి చేసిన నరేంద్రమోడీ కావాలా? టిప్పు సుల్తాన్‌ను గొప్పగా చూపిన వారు కావాలో తేల్చుకోవాలని ఓటర్లను కోరారు. ఆ తరువాతే కొనసాగింపుగా రాష్ట్ర నేత నళిన్ లవ్‌జీహాద్ నివారణకు బీజేపీని ఎంచుకోవాలన్నారు.
కర్నాటకలో హిజాబ్ వివాదాన్ని ముందుకు తెచ్చిన తీరుతెన్నులను చూశాం. దాని వలన రాష్ట్ర జీఎస్డీపీ పెరగలేదు, ఉపాధి అవకాశాలు రాలేదు, ధరలు తగ్గలేదు గానీ జనాల బుర్రలు ఖరాబు చేశారు. వచ్చే ఎన్నికల్లో దానిపని అది చేస్తుంది. ప్రభుత్వ హిజబ్ నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. దాని మీద సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లగా గతేడాది అక్టోబరులో ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు సమర్థించగా మరొకరు తిరస్కరించటంతో అది పెద్ద డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. దాని మీద తీర్పు వచ్చే వరకు నిషేధం కానసాగుతుంది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. హిజాబ్ వివాదం కొనసాగింపుగా హలాల్‌ను ముందుకు తెచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న వారు అధికార పక్షం అంగీకరించకపోతే కొన్ని అంశాలపై ప్రయివేటు బిల్లులు పెట్టటం, వాటి మీద జనంలో చర్చ రేపటం తెలిసిందే. కానీ అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు ప్రయివేటు బిల్లులు పెట్టటం ఏమిటి? అదీ అలాంటిదే. ఒక పెద్ద నాటకం, దానిలో భాగంగానే బీజేపీ ఎంఎల్‌సి రవి కుమార్ హలాల్ ధృవీకరణ పత్రాల జారీ మీద ఒక బిల్లును పెడతానని ప్రకటించారు. ముస్లిం సంస్థలు హలాల్ పత్రాల జారీకి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఒక నిర్ణీత అధికార వ్యవస్థను ఏర్పాటు చేసేంత వరకు ముస్లిం సంస్థలు ధృవీకరణ పత్రాల జారీ నిలిపివేయాలని కోరనున్నట్లు వార్తలు. దీని గురించి ఇంతకు ముందు రవికుమార్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వమే హలాల్ పత్రాలను జారీ చేస్తే ఖజానాకు ఐదువేల కోట్ల మేరకు రాబడి వస్తుందని దానిలో పేర్కొన్నట్లు వార్తలు. మరొకవైపు హలాల్ మాంస ఉత్పత్తులను బహిష్కరించాలని అనేక హిందూత్వ సంస్థలు పిలుపునిచ్చాయి. సర్టిఫికెట్ల జారీ మీద నిషేధం వేరు, హలాల్ మాంసం మీద నిషేధం వేరు అన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రజాప్రతినిధి సర్టిఫికెట్ల మీద నిషేధం పెట్టాలని కోరుతుండగా, సంఫ్‌ు పరివార్ తెరవెనుక ఉండి నడిపిస్తున్న సంస్థలు అసలు మాంసాన్నే నిషేధించాలని రోడ్లకు ఎక్కుతున్నాయి. దీంతో కొన్ని పత్రికల్లో హలాల్ మాంసం మీద నిషేధం విధించే దిశగా కర్నాటక బీజేపీ సర్కార్ ఉన్నట్లు వార్తలు ఇచ్చాయి. అవన్నీ బీజేపీకి కొమ్ముకాసేవే కనుక అంతరంగం ఎరగకుండా అలా రాసినట్లు భావించలేం. పోనీ వాటిని ప్రభుత్వం స్పష్టంగా ఖండించిందా అంటే అదీ లేదు, అందుకనే అనేక అనుమానాలు తలెత్తాయి.
నిజానికి ఇది మనోభావాలతో ఆడుకొనే దుష్ట ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ప్రతి మతానికి కొన్ని క్రతువులు ఉన్నాయి. ఇస్లాం ఆచారాలు, నిబంధనల ప్రకారం తయారు చేసిన ఆహారం మాత్రమే తినాలని, అలా లేనిదాన్ని తినకూడదని ఆ మతంలో నిషేధించారు. అందుకే ఇది తినవచ్చు అని చెప్పేందుకు గాను హలాల్ ధృవీకరణ పత్రం ఉందని ఉత్పత్తుల మీద ముద్రిస్తున్నారు. అరబ్బు దేశాలలో హలాల్ పత్రాల జారీకి చట్టబద్దమైన సంస్థలు ఉంటాయి. మన దేశంలో అలాంటివి లేవు. హలాల్ సర్టిఫికెట్, మతం పేరుతో వసూలు చేస్తున్న పెద్ద మొత్తాలను విద్రోహ కార్యకలాపాలకు వినియోగిస్తు న్నారంటూ హిందూ జనజాగృతి సమితి (హెచ్‌జెఎస్) పేరుతో ఉన్న సంస్థ ప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. ఇస్లాం మత ఆచారం ప్రకారం తయారైన ఉత్పత్తులను తినాలా లేదా అన్నది ఇతర మతస్థులు ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. దాని మీద బలవంతం ఏమీ లేదు. కానీ దీన్ని కూడా వివాదం చేశారు. గతంలో మాంసం మీద మాత్రమే అలాంటి సర్టిఫికెట్ ఉండేదని, ఇప్పుడు అనేక ఉత్పత్తులకు వాటిని జారీ చేస్తున్నారన్నది బీజేపీ, హిందూత్వ శక్తుల దుగ్ద. హలాల్ చేసినట్లు తాము చెప్పిందే తినాలి. లేనిది తినకూడదని ఇస్లామిక్ మతం చెబుతున్నది. దాన్ని అనుకరిస్తున్న లేదా అనుససరిస్తున్న కాషాయ దళాలు హలాల్ మాంసం తినకూడదని, అమ్మకూడదని చెబుతున్నాయి. ఒకే నాణానికి బొమ్మ బొరుసూ అంటే ఇదే కదా!
- ఎం. శారద