Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివిధ డిజిటల్ అంతర్జాల మాధ్యమ వేదికల్లో సమాచారాన్ని టైప్ చేయడం, సమాచారాన్ని అన్వేషించడం, సమాచారాన్ని మూల్యాంకనం చేయడం, సమాచారాన్ని వితరణ చేయడం లాంటి ఆధునిక యుగపు పరిజ్ఞానం కలిగిన పౌరులను 'డిజిటల్ లిటరేట్స్'గా వర్గీకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 15-24ఏండ్ల లోపు యువతలో 71శాతం ఇంటర్నెట్ వాడుతున్నారని, డిజిటల్ అసమానతలతో 346మిలియన్ల యువత (పేద అభివృద్ధి చెందిన దేశాలు) ఇంటర్నెట్కు దూరంగా ఉన్నారని తేలింది. ఇండియాలో 38శాతం కుటుంబాలు (61శాతం పట్టణ, 25శాతం గ్రామీణ) డిజిటన్ లిటరసీ కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల ఇంటర్నెట్ లిటరసీ జాబితాలో భారత ర్యాంకు 73గా విశ్లేషించారు. డిజిటల్ టెక్నాలజీతో ఉత్పత్తి, కార్యదక్షత, వనరుల నిర్వహణ, పారదర్శకత, అత్యున్నత ఖచ్చితత్వం, సంతృప్తికర సేవలు, జవాబుదారీతనం, ఇన్నొవేషన్, వేగంగా మార్కెటింగ్, ఆదాయవృద్ధి, సమకాలీనత లాంటి అనేక అభివృద్ధి సాధన ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో అంతకు మించిన సవాళ్ళూ ఉన్నాయి.
డిజిటల్ యుగపు సవాళ్ళు: అంతర్జాల అయోమయ, మాయాజాల, కృత్రిమ వలలో చిక్కిన నేటి యువత తీవ్రమైన బహుమితీయ సవాళ్ళను, ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తున్నది. డిజిటల్ యుగ యువత ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్ళలో సామాజిక(సోషియల్), భౌతిక(ఫిజికల్), మానసిక(సైకలాజికల్), నైతిక(మోరల్) అంశాలు అనేకం దాగి ఉన్నాయి.
సామాజిక (సోషయల్) సవాళ్ళు: చిరుప్రాయం నుంచే ఇంటర్నెట్ అద్భుత వలయంలో గంటల పాటు గడుపుతున్న డిజిటల్ కాలంలో ఏకాంతంలో కంప్యూటర్ గేమ్స్, సామాజిక మాద్యమాల్లో విహారాలతో మానవ సంబంధాలు బలహీణ పడడం, నేత్ర జబ్బులు, అశ్లీల పోస్టుల పరిచయాలు, లైంగిక దురాలోచనలు, అత్యాచారాలు, సైబర్ బుల్లీయింగ్, అక్రమ మానవ రవాణలు, విచిత్ర ప్రవర్తనలు, బాలలపై అత్యాచారాలు, సామాజం నుంచి వెలి వేసిన భావన, అభ్యంతరకర ప్రవర్తన, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆత్మహత్య ధోరిణి, బాల కార్మికులు, వెట్టిచాకిరీ, చదువుపై ఏకాగ్రత లోపించడం, ఆటపాటలకు దూరం కావడం, వ్యక్తిత్వ వికాసం ఆగి/తరిగి పోవడం, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం కావడం, సామాజిక ఘర్షణలు లాంటి అవలక్షణాలు కలుగుతాయి.
శారీరక (ఫిజికల్) సవాళ్ళు: గంటల తరబడి అంతర్జాలాన్ని పట్టుకొని సోఫాలు, కుర్చీలు, బెడ్స్కు వేలాడడం వల్ల శారీరక వ్యాయామాలు లోపించడంతో బాల్యంలోనే స్థూలకాయ సమస్యలు, ఫాస్ట్ ఫుడ్స్ పట్ల వ్యామోహం, కదలిక లేని నిశ్చల జీవనశైలితో నేటి బాలలు, మానసిక ఒత్తిడి, నేర ప్రవృత్తి, ఆన్లైన్ మోసాలు, ఆత్మన్వూనత భావన, వ్యక్తిగత సమాచారాన్ని దాచి పెట్టడం లాంటి పలు తీవ్రమైన శారీరక మానసిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. డిజిటల్ ఉపకరణాల వలలో చిక్కి దృష్టి, కీళ్ళు, కండరాలు, వెన్నెముక, ఒత్తిడి, చర్మ, శ్వాస, మానసిక, నిద్రలేమి సమస్యలకు దారి తీస్తున్నాయి.
మానసిక (సైకలాజికల్) సవాళ్ళు: డిజిటల్ వలయ దుష్ప్రభావంతో పిల్లల్లో పలు మానసిక సమస్యలు కనిపిస్తాయి. అసాంఘిక ప్రవర్తనలు, లైంగిక వికృతాలోచనలు, కులమత వివక్షలు, వికృత క్రీడలు, మహిళల పట్ల విపరీత ధోరిణి, మానసిక విపరీతాలు లాంటి అనేక సమస్యలు యువత భవితకు అడ్డుగా నిలుస్తున్నాయి.
నైతిక, మతపర (మోరల్, రిలిజియస్) సవాళ్ళు: సాంస్కృతిక, నైతిక, మతపరమైన విపరీత ప్రవర్తనలతో పాటు ఛాందస వాదనలు, మత విద్వేషాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు, భావ కాలుష్యాలు, జాతి వర్ణ వర్గ వివక్షలు, అసహనం, తీవ్రవాద ఆలోచనలు, ఉగ్రవాద భావనలు, అశాంతి, అస్థిర సమాజం లాంటి సమస్యలు పిల్లల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అశ్లీల మాద్యమాలు అరచేతిలో అందుబాటులో ఉన్నందున ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ కన్న అతి ప్రమాదకరమైన దుష్పరిణామాలైన లైంగిక హింసలు, మహిళ వేధింపులు, అత్యాచార హత్యలు లాంటి అనైతిక సమస్యలు పెరుగుతున్నాయి. స్మార్ట్ట ఫోన్ రూపంలో నీలి వీడియోలు అందుబాటులోకి రావడంతో బాలికల్లో 33శాతం, బాలల్లో 13శాతం లైంగిక హింసకు గురికావడం జరిగినట్లు తేలింది.
డిజిటల్ యుగంలో అద్భుత అవకాశాలు: విద్య, డిజిటల్ నైపుణ్యం, ఆశావహ దృక్ఫథం కలిగిన యువతకు డిజిటల్ ప్రపంచం రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతోంది. పుట్టుకతోనే ఇంటర్నెట్ అనుభవిస్తున్న పిల్లల్ని 'డిజిటల్ నేటివ్స్', ఇంటర్నెట్ వినియోగాన్ని నేర్చుకుంటున్న పెద్దల్ని 'డిజిటల్ ఇమ్మిగ్రాంట్స్'గా తరాలను వర్గీకరించాల్సి వస్తున్నది. డిజిటల్ ప్రపంచంలో విహరిస్తున్న నేటి బాలబాలికలు, యువతీయువకులు తీవ్రమైన సమస్యలతో సంసారం చేస్తూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భావోద్వోగ రోగులుగా మిగిలి పోవడంతో ప్రపంచ మానవాళి భవిత ప్రశ్నార్థకం అవుతున్నది. డిజిటల్ విప్లవ సునామీతో యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ఆధునిక యువత మారుతున్న శాస్త్ర సాంకేతికతలను ఆకలింపు చేసుకొని, క్రమం తప్పకుండా శాస్త్రసాంకేతికత లను ఒంటపట్టించుకొని, ఇందులోని సాను కూలతలను ప్రతికూలతను ఆకళింపుకుని వ్యవహరిస్తేనే పురోగమనం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి , సెల్: 9949700037