Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది నుండి ఆధిపత్యానికి - ప్రజాస్వామ్యానికి ఓ సాంస్కృతిక కేంద్ర వైరుధ్యం నెలకొని ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని జీవన విధానంగా మలచుకున్నవారు కుటుంబంలోనూ, సమాజంలోనూ నిరంకుశ పోకడల జోలికిపోరు. శ్రమ జీవులను గుర్తిస్తూ, గౌరవిస్తూ నిరంతరం బాధితుల పక్షానే నిలబడతారున. ప్రజాస్వామ్య పాలనా శకంలో జీవిస్తున్న మనకు ఇటీవల పెచ్చరిల్లుతున్న నియంత ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి.
నియంతల చుట్టూ చేరే మూర్ఖపు భజన రాయళ్ళకు, వారు చేపట్టే మూకదాడుల దౌర్జన్యానికి కొదవే ముంటుంది? తిమ్మిని బమ్మిని చేయడం, బమ్మిని తిమ్మిని చేయడమే వాళ్ళ పని.
మొన్నటికి మొన్న బ్రెజిల్ దేశంలో జరిగింది అదే. ప్రజల ఓట్ల బలంతో ఎన్నికల్లో గెలుపొందిన లూలా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ఓడిపోయిన నియంత బొల్సినారో అనుచరగణం సృష్టించిన విధ్వంస కాండ అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచం దిగ్భ్రమకు లోనయింది. రాజధాని బ్రెసీలియాలోని పార్లమెంటు, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టులపై దాడులుకు దిగింది. ఆ సమయంలో (జనవరి 8 మధ్యాహ్నం) లూలా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులని పరామర్శిస్తున్నారు.
దాడుల గురించి తెలుసుకున్న లూలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. ఫాసిస్టులు తప్పు చేస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. క్రమేపీ సద్దుమణిగినా నివురుగప్పిన నిప్పులా ఆ ప్రమాదం పొంచే ఉన్నది.
దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించి, ప్రజలను భయబ్రాంతులను గావించేందుకే ఈ దాడులు జరిగాయని వేరుగా చెప్పక్కర్లేదు. ప్రజల తీర్పును గౌరవించకుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగించే ఫాసిస్టుల దుష్టతలంపుగా పరిశీలకులు ఈ ఘటనలను అభివర్ణిస్తున్నారు.
రెండేండ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి ట్రంప్ ఓటమి పాలైనప్పుడు కూడా ఇదే తంతు జరిగింది. ట్రంప్ అనుచర గణం కూడా వాషింగ్టన్ లోని పార్లమెంట్లో ఇలానే దాడి చేసింది. ఏమిటీ ఈ అప్రజాస్వామిక దాడులు? వాటి వెనుక ఉన్న రహస్య శక్తులు ఎవరు? ఎజెండా ఏమిటి? ఏ మూర్ఖత్వం ఇందుకు పనిచేస్తున్నది? ఇవన్నీ శోధిస్తున్న విషయాలు.
కొత్త సంవత్సరం ఆరంభం జనవరి 1న లూలా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఇది తెలిసీ రెండ్రోజుల ముందే, ఓడిన బోల్స్నారో అమెరికా చెక్కేసాడు. హుందాగా ప్రవర్తించలేదు. కొత్త అధ్యక్షునికి అధికార దండాన్ని అందించే సంప్రదాయాన్ని పాటించలేదు. మొఖం చాటేసాడు. ఇదంతా ఓటమిని జీర్ణించుకోలేక పోవడమే.
'తానంటూ తిరిగి అధికారంలోకి రాకపోతే, ఎన్నికల్లో మోసం జరిగినట్లేనని' గతంలోనే బొల్సినారో పదే పదే ప్రకటించాడు. అంటే ఓడిపోతానని తెలిసినా, ముందుగానే సమర్థింపు చర్యలకు పాల్పడటం, అనుచరణ గణానికి మూకదాడుల సంకేతాలివ్వడం పథకం ప్రకారమే సాగినట్టు తెలుస్తున్నది. అనుచర గణంలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, సంపన్నులు, మధ్య తరగతివారు, అరాచకులు, ముఖ్యంగా సొంత బుర్రని ఉపయోగించనివారు ఉన్నారు.
కాగా, పార్లమెంటుపై దాడిచేసిన చర్యలతో తన కెలాంటి సంబంధం లేదని బోల్సనారో నిసిగ్గుగా చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవాలను అంగీకరించని ఫాసిస్టు నాటకం అంటే ఇదే మరి. రాజకీయ ప్రత్యర్థులను దుర్మార్గులుగా చిత్రీకరించడం, ఓడిపోతే అల్లకల్లోలం సృష్టించడం ఫాసిస్టుల పని. మూకదాడులు, విధ్వంసక చర్యలు పథకం ప్రకారమే జరుగుతున్నట్టు వాట్సప్, టెలిగ్రామ్ మెస్సేజ్లతో సోషల్ మీడియా కోడైకూస్తున్నది ఒక ప్రక్క.
లూలా సాధారణ నాయకుడు కాదు. శ్రామిక జన పక్షపాతి. గతంలో రెండుసార్లు దేశాధ్యక్షునిగా పనిచేసి రెండున్నర కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి చేసాడు. ఆ దేశ జనాభా 22 కోట్ల మంది అంటే పదిశాతం ప్రజానీకం పేదరికం నుండి బయటపడ్డారు. అందుకే మితవాద బూర్జువా శక్తులన్నీ లూలా పై కత్తిగట్టిన విషయం కాదనలేం. లూలాపై ఆశక్తులు అవినీతి ముద్రవేసి ఎప్పటికీ అధికారంలోకి రాకుండా చేయాలనే వారి పాచిక ఇప్పుడు నెరవేరలేదు.
బొల్సినారోకు ట్రంప్ ఆదర్శం. సైనిక నియంతృత్వంపైనే మక్కువ ఎక్కువ అని పరిశీలకులు చెబుతున్నారు.
దక్షిణ అమెరికా ఖండంలోనే అతిపెద్ద దేశం బ్రెజిల్. విస్తీర్ణంలో రష్యా, కెనడా, చైనా, అమెరికా తర్వాత స్థానం బ్రెజిల్దే. ప్రపంచంలోనే ఐదవ పెద్ద దేశం. మూడవ సారి అధ్యక్ష పీఠం అధిష్టించిన లూలా జనవరి 1న ప్రమాణస్వీ కారోత్సవం నాడే ముఖ్యప్రకటన చేసాడు.
దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న తుపాకుల సంస్కృతిని కట్టడి చేస్తానని, తమ దేశ అమెజాన్ అడవుల్లో సాగే విచక్షణారహిత బంగారు గనుల త్రవ్వకాన్ని అడ్డుకుంటానని చెప్పాడు.
తుపాకుల మరణాల్లో బ్రెజిల్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. సగటున ఏడాదికి తుపాకుల కాల్పుల్లో నలభైవేల మంది మరణిస్తున్నారు. ప్రస్తుతం మూడింట రెండొంతుల మంది తుపాకీ సంస్కృతి వ్యతిరేకిస్తూ శాంతిని కోరుకుంటున్నట్టు అక్కడి సర్వేలు తెలుపుతున్నాయి. ఇదో మంచి మార్పు.
అలాగే అమెజాన్ అటవీ ప్రాంతం అరవై శాతం బ్రెజిల్ దేశంలోనే ఉన్నది. పచ్చని పర్యావరణంతో పదిశాతం ప్రాణవాయువు (ఆక్సిజన్) ఇక్కడి నుండే ప్రపంచానికి అందుతుంది. గనుల త్రవ్వకంతో కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి ప్రమాదం అని వేరుగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఇరవైశాతం బంగారం ఈ గనుల నుండే ఉత్పత్తి అవుతుంది. అందుకే లూలా మాటలు ఫాసిస్టు దోపిడీ శక్తులకు మింగుడుపడటం లేదు. ఇప్పుడు ఈ శక్తులు బాహాటంగానే, రాజ్యాంగ విధి విధానాలను లక్ష్యపెట్టకుండా ప్రజా స్వామ్యంపైనే ఏకంగా దాడి చేస్తున్నాయి. మూర్ఖపు మూకదాడులను అందుకు ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ప్రజలపై రాజ్యాంగ సంస్థలపై ఉసికొల్పుతున్నాయి.
ఓడినా, గెలిచినా తమ ఆధిపత్యమే నెగ్గాలనే నిరంకుశ ధోరణి ఇది. ప్రజాతీర్పును గౌరవించాలనే కనీస రాజకీయ పరిణిత స్పృహ వారికి ఉండదు. ప్రజల మానప్రాణాలకు పూచిక పుల్లంత విలువ నివ్వరు. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాపోరాటమే శరణ్యం. ఎక్కడైనా...
'ప్రజలను అలక్ష్యం చేయడం కన్నా మించిన అపరాధం మరొకటి ఉండదు. మన పతనానికి అదో ముఖ్య కారణం. ప్రజలకు మంచి విద్య, జీవన సౌకర్యాలు కల్పించి, కడుపు నిండా తిండిపెట్టి వారి శ్రేయస్సుకు కృషి చేయనంత కాలం ఆ రాజకీయాలు నిష్ప్రయోజనాలు కాక మానవు' అని చెప్పిన స్వామి వివేకానంద మాటలు ఎక్కడో దూరంగా ఉన్న బ్రెజిల్ నేతలకే కాదు, ఇక్కడ భారతనేతలకూ వర్తిస్తాయి. ప్రజలకు మేలు చేయడంలోనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది.
- కె. శాంతారావు
సెల్: 9959745723