Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటు నాటు అన్నది ఇప్పుడు ట్రెండుగా అంటే ఒక ధోరణిగా మారిపోయింది. నాటు, వీర నాటు, వీర వీర వీర నాటు... ఇలా దాని కొనసా... గింపులు సాగుతూనే ఉన్నాయి, ఉంటాయి. నాటుకానిది లేదు, నాటు అయితేనే నిలబడుతుందని డార్విన్ సిద్ధాంతాన్ని ఇంకోరకంగా చెప్పొచ్చు. ఆ సిద్ధాంతానికెలా వాడతారు అని రాద్దాంతం చేసే నాటులూ బయలుదేరొచ్చు. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిందన్నట్టు నాటుకూడా నాటెస్టుగా, నాటీయెస్టుగా వచ్చిందన్నది వాస్తవం. నాటు నాటు అంటూ నోటులెన్నో సంపాదించుకున్నారనీ, లోటు పూడ్చుకున్నారనీ అనేవాళ్ళూ ఉండొచ్చుగాని దేనికోసమైనా నాటు నాటు వెలుగులోకొచ్చింది చాలు.
నాటు కానిది ఫారం అని అర్థం చేసుకోవాలి. నాటు కోడికి ఫారం కోడికి ఎంతో తేడా. కాకులు దూరని కారడవిలో ఉన్న సింహానికి జూ పార్కులో ఉన్న సింహానికి కూడా అంతే తేడా ఉంటుంది. ఇప్పుడు రాజకీయం చేయాలంటే కూడా నాటుగా ఉండాలి. నాటు రాజకీయులు ఫారం రాజకీయులు అనుకోవచ్చు. అందుకే ఆ నాటులు వీరనాటులు ఎక్కడ ఉన్నా, ఎన్ని కేసులున్నా వాళ్ళని పట్టుకొచ్చి పార్టీ శాలువా కప్పేయడమే. ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఈ 'ఫారం' నాయకులు ఉన్నారు కాని తరువాత లేరు అనుకోవచ్చు. కాని అప్పటి నాయకులు ఫారం వారిలా కనిపించినా, వాళ్ళు మన స్వాతంత్య్రం తెచ్చే విషయంలో వీర నాటులని గుర్తుపెట్టుకోవాలి. అప్పటి నాటులకు ఇప్పుడు చూస్తున్న నాటులకు ఎంతో తేడా. నక్కకీ డాష్ డాష్ డాష్...
వైద్యుల్లో కూడా కోటు వైద్యులు నాటు వైద్యులు ఉంటారు. మందులు ఇచ్చే విషయంలోనే కాదు రోగం ఏదో కనిపెట్టడంలో కూడా నాటుకు కోటుకు తేడా ఉంటుంది. అయితే కరోనా లాంటివి వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ సంపాదించారు అని కొందరు లెక్కలు తీస్తుంటారు. ఈ డాక్టర్లమీద అభాండాలు వేస్తుంటారు కూడా. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వైద్యం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ సమయంలో ఏ వైద్యమూ చేయకుండా, ఏ వ్యాపారమూ చేయకుండా మిత్రులను పట్టుకొని కొన్ని బిల్లులు ఢిల్లీలో గట్టెంకించుకొని అపర కుబేరులైపోయిన వాళ్ళే అసలైన నాటు వ్యాపారస్తులు. జనాలు ఆ విషయం మరిచిపోతున్నారు.
నల్లకోటు నాటులూ మనకు కనిపిస్తుంటాయి. న్యాయం చేయవలసిన ఆ కోటులే ఒక్కోసారి ఆ పని చేయలేక సతమతమయ్యే సందర్భాలూ చూశాం.
ఈ నాటు అన్నింటిలోకి ప్రవేశించినట్టు క్రికెట్టులోకీ వచ్చేసింది. అరవై ఓవర్లు యాభైగా మారి ఆ తరువాత ఇరవై ఇరవైగా మారిపోయాయి. తక్కువ సమయంలో వీలైనంత నాటుగా ఆడి అందరినీ మెప్పించాలి. ఆ మెప్పించడం కోసం, వ్యాపారం చేసుకునే క్రమంలో క్రీడాకారులు దేశాలు మారి జట్లరూపంలో డబ్బును నాటునాటుగా సృష్టిస్తున్నారు. సంతలో అన్నీ దొరికినట్టు ఈ క్రీడాకారులూ రేటు రేటు అనుకుంటూ మాంచి ధరలకు పోతున్నారు. ఏమంటే నాటునాటు ట్రెండు మీ కర్థం కాదంటారు. అర్థమైనంతలో అర్థమైందేమిటంటే డబ్బు ఎలాంటి రూపాలు ధరిస్తుందనేది!! ఆర్థిక అర్థాలు మానవత్వానికి లేదు చోటు చోటు అనుకుంటూ జనాలని ఆడిస్తున్నది. కనబడని చేయి ఏదో నడుపుతుంది నాటకమని ఎప్పుడో ఓ కవి రాశాడు. అదేమిటో ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఆ నాటు డబ్బుకి జేజేలు కొట్టడమే మనుషులు చేయగలిగింది.
నాటు నాటు అంటే నాటో నాటో అనుకున్నారని, అందుకే దానికి అవార్డు వచ్చిందని వాట్సప్‌ల్లో జోకులు మొదలయ్యాయి. దీనికి ముందు ఎన్ని పాటలు రాలేదు, ఇప్పటికీ ఆ పాటలు వింటూనే ఉన్నారు. దీనికి ఇంత ఆర్భాటం చేయాలా అనీ కొందరంటున్నారు. అదంతా వేరే విషయం. ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. కొత్తవి వస్తుంటాయి. అయినా నాటు నాటు గెలిచిందే కాని ఫారం ఫారం కాదని తెలుసుకోవాలి. దీనికి పేరడీగా నీటునీటు అనీ, బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు లోటు లోటు అనీ, ఎవరినన్నా మంత్రులను తీసేసినప్పుడు వేటు వేటు అనీ, మత్తు మందులు వాడొద్దని చెప్పడానికి చేటు చేటు అనీ ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. అదీ నాటు పవరంటే.
ఇక నాటు పేరు చెప్పి నేను అలాగే మాట్లాడతాననీ, ఇంకేదో రాష్ట్రంలో చేయడానికి చేతకాని పనులన్నీ ఇక్కడ చేసేస్తాననీ, కేటు కేటు మాటలు చెప్పి ప్రజలకు చేటు కాలం తెచ్చేవాళ్ళంటే కూడా ఓ కంట కనిపెట్టి చూస్తూ ఉండాలి.
అసలు నాటు అంటే నాట్లువేసే రైతు గుర్తుకు రావాలి. రైతులు చలిలో వణికి, వానలో తడిసి, ఎండలో ఎండి పండించడమే తెలిసినవాళ్ళని అనుకునేవాళ్ళం. అదే వాతావరణాలలో సంవత్సరం పొడుగునా సమ్మె చేస్తే కనీసం పలకరించని వాళ్ళు కూడా ఇప్పుడు రైతు పక్షాన మాట్లాడుతుంటే వీళ్ళు మహా నాటైపోయారని తెలుస్తూనే ఉంటుంది. రైతులు పండించిన గింజలను గ్రేడింగ్ చేసి తమ బ్రాండు పేరు వేసుకునే వాళ్ళు కోకొల్లలు. వ్యాపారంలో వీళ్ళు వీర నాటులు.
నాటును మించిన నాటైన దీటైన కోళ్ళతో పందెం పోటీలు జరగకూడదని చట్టాలున్నా జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల్లో నిలబడే నాయకుల ఖర్చులు ప్రకటించడం కూడా ఈ కోడి పందేలలాంటిదే. అందుకే అందరికీ నాటు నాటు, నీటు నీటు సంక్రాంతి శుభాకాంక్షలు....
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298