Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో నేరస్తులు పెరగడంతో అటు న్యాయ స్థానాలకు, ఇటు పోలీసు, జైళ్ల యంత్రాంగానికి పని భారం పెరుగుతున్నది. శిక్ష పడిన ఖైదీల కంటే, నేరారోపణ ఎదుర్కొంటున్న ఖైదీలే సుమారు 77శాతం మంది జైల్లలో మగ్గుతున్నారు. కాబట్టి ఇప్పుడు నూతన జైళ్ళు నిర్మించాలి అనే మాటలు వినబడుతున్నాయి. నిజానికి ఈ ఆధునిక కాలంలో జైళ్ళు, ఖైదీల సంఖ్య రోజు రోజుకు తగ్గుముఖం పట్టాలి. కానీ పెరుగడం ఆందోళన కలిగించే అంశం. 2020 నుంచి 2021 కాలానికే సుమారు 15శాతం నేరాలు, నేరస్తుల సంఖ్య పెరగటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం విద్య లేకపోవడం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం. రాజ్యాంగం ప్రకారం ప్రతీ ఒక్కరికీ ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్య అందేటట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ రకరకాల జీవోలు, ఎన్ఈపీి-2020 లాంటి విధానాల ద్వారా నాణ్యమైన విద్యను ప్రజలకు దూరం చేస్తున్నారు. నూతన విద్యా ప్రణాళిక ప్రకారం చిన్న తరగతుల నుండే పరీక్షలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి. సంస్కృతం, వృత్తి విద్యలు, వాస్తు విద్యలకు ఎక్కువగా చోటు కల్పించారు. దాంతో సరైన విజ్ఞానం లేక ఉపాధి కోసం వక్రమార్గాలు పడుతూ, అసాంఘిక శక్తులుగా మారే అవకాశం మరింతగా ఏర్పడుతుంది. పేదరికం, కుటుంబ, ఆర్థిక, సామాజిక , ఆరోగ్య పరిస్థితులే అనేక సందర్భాల్లో నేర ప్రవృత్తి పెరగడానికి కారణం అవుతున్నవి. అలాగే సెల్ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా హింసా ప్రవృత్తి, మహిళలుపై అఘాయిత్యాలు, సైబర్ క్రైమ్ వంటివి పెరుగుతూ జైళ్ళు ఖైదీలు, నేరారోపణ ఎదుర్కొంటున్న వారితో కిక్కిరిసి పోతున్నాయి. దీంతో ఖైదీల్లో అనేకులు అనారోగ్యాలకు గురవుతున్నారు. 2020లో 2116మంది జైల్లో ఉన్న ఖైదీలు మరణించారు అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జైల్లలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖైదీల సంఖ్య తగ్గుముఖం పట్టాలి అంటే చదువుతో పాటు యువతకు ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అధిక బడ్జెట్ కేటాయింపులు చేయాలి. నూతన పరిశ్రమలు స్థాపించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలి. సిలబస్లో మతపరమైన అంశాలు తొలగించాలి. సామాజిక శాస్త్రాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలి. సైన్స్, గణితంతో పాటు సాంఘిక శాస్త్రం, ఇతర సామాజిక సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేటట్లు ఇంటి నుంచే తర్ఫీదు ఇవ్వాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుటంతోపాటు సమాజంలో వెనుకబడిన తరగతుల వారికి, మహిళలకు ప్రభుత్వాలు రక్షణగా నిలవటం ద్వారానే మనదేశంలో నేరస్తులు తగ్గి, నూతన జైళ్ళు నిర్మించే పరిస్థితి ఏర్పడదు అని గ్రహించాలి.
- ప్రసాదరావు