Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పత్రికలు పెట్టుబడిదారుల విషపుత్రికలు అని శ్రీశ్రీ ఏనాడో చెప్పారు. పెట్టుబడిదారులకు పాదుకలల్లే తయారైన పాలకులకు నేడు పత్రికలు వందిమాగదులై వంతపాడు తున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని ఒక ''విషపూరితమైన విధానం'' (ఓల్డ్ పెన్షన్ ఈస్ ఏ ఓల్డ్ 'పాయిజన్') అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక భోగి పండుగ రోజు ఎడిటోరియల్‌ని ప్రచురించింది. అంతే కాకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న కొన్ని రాష్ట్రాలను, ఈ అంశంలో తీర్పునిచ్చిన ఢిల్లీ హైకోర్టును కూడా తప్పుపడుతూ అలాంటి ప్రయత్నాలను పూర్తిగా మానుకోవాలంటూ, కొత్త పెన్షన్ విధానానికే కట్టుబడి ఉండాలంటూ ఓ ఆజ్ఞాపనలాంటి సూచన చేసింది. ఇది ఎడిటోరియల్గా వచ్చింది కాబట్టి పత్రిక యాజమాన్యం యొక్క అభిప్రాయంగా మాత్రమే చూడటానికి వీలు లేదు. దీని వెనుక నూతన పెన్షన్ విధాన రూపకర్తల, ప్రభుత్వ పెద్దల హస్తం లేదని కొట్టిపారేయలేం. సదరు పత్రిక కథనం పాత పెన్షన్ విధానం వలన ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని, అందుచేత దానిని విరమించుకుని నూతన పెన్షన్ విధానానికి కట్టుబడాలని తెలిపింది. అయితే ప్రభుత్వ ఖజానాకు పన్నులను వసూలు చేసి అనేక మొత్తాలను సేకరిస్తున్నది ఉద్యోగులేనన్న వాస్తవాన్ని మాత్రం మరుగున పడేసింది.
''ప్రభుత్వంలోనూ, ప్రభుత్వేతర రంగాల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరు కూడా వేరే ఏ రకమైన ఉపాధిని చేపట్టరాదు'' అన్న నిబంధన నియామక పత్రాలలోనే ఉంటుంది. అనగా ఉద్యోగులందరూ తమకు కేటాయించిన పనికి మాత్రమే పరిమితం కావాలి. అలాంటి కట్టుబాటును అమలుజేసిన చోట భవిష్యత్ బాధ్యత ఎవరిది? ఇప్పుడు వృద్ధాప్య సమయంలో ఉద్యోగులకు యాజమాన్యాలు లేదా ప్రభుత్వాలు కనీసం అన్నం పెట్టడానికి కూడా సిద్ధంగా లేవు. ఇది ఎంతటి దారుణం? జీవిత కాలమంతా కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి విధేయత చూపిన ఉద్యోగుల పట్ల, వారి భవిష్యత్తు పట్ల ఇంతటి ఘోరమైన వైఖరిని ప్రదర్శిస్తూ పెన్షన్‌ను 'పాయిజన్'గా వ్యక్తికరించిన వారిది ఒక విషపూరిత భావజాలంగా భావించాల్సిందే. 2004 తర్వాత నియమితులై రిటైర్ అవుతున్న వారికి వందల్లో మాత్రమే నూతన పెన్షన్ అందుతున్న సంగతి సదరు పత్రికకు తెలియదని భావించలేం. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి అవగాహనతో, ఉద్దే శపూర్వ కంగానే పత్రికలను ఇలాంటి రాతలకై పుర మాయిస్తున్నది. పరిపాలన అంటే లాభాపేక్ష కోసం పెట్టుబడిదారులకు వెసులుబాట్లు కల్పించే యంత్రాంగమా? లేదా విశాల ప్రజానీకానికి ఉపయోగపడే సంక్షేమ విధానమా? ఉద్యోగులను వారి యుక్త వయసులో ఉపయోగించుకొని వృద్ధాప్యంలో వదిలివేయడం ఏమాత్రం సమంజసం కాదు. అమలవుతున్న నూతన పెన్షన్ విధానానికి సమకూరుతున్న మొత్తం కూడా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టి ఉద్యోగి పదవి విరమణ పొందిన రోజు ఎంతైతే అందుబాటులో ఉందో దానిని మాత్రమే పెన్షన్‌గా పొందేలా స్టాక్ మార్కెట్ దయాదాక్షిన్యానికి వదిలేశారు. అంటే ఏమాత్రం ఈ విధానంపై ప్రభుత్వానికి కంట్రోల్ లేదన్నమాట. పెట్టుబడిదారుల లాభాలపై పరిమితులు లేవు, వారు ఎగ్గొడుతున్న పన్నులపై నియంత్రణ లేదు, రాజకీయ అవసరాల కోసం పరిపాలనలో జరుగుతున్న తప్పిదాలపై విచారణ లేదు. కానీ శ్రమకోర్చి, జీవిత కాలాన్ని వెచ్చించిన ఉద్యోగుల భవిష్యత్తుపై మాత్రం కక్ష సాధింపు పరిపాటిగా మారింది. పెన్షన్ ఫండ్‌ను, ప్రావిడెంట్ ఫండ్‌ను, ఇతర పొదుపులన్నింటినీ స్టాక్ మార్కెట్‌కి మళ్ళించి కావలసిన మేర స్పెక్యులేషన్ జరిపి మిగిలిన మొత్తాలను సదరు ప్రజల మొహాలపై జల్లే విషపూరిత విధానాన్ని తప్పుబట్టకుండా... సమాజ నిర్మాణానికి పునాదులేసిన వారిని సజీవంగా పూడ్చిపెట్టే ఆలోచనలకు పత్రికలు వంతపాడటం అవివేకం. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే వృద్ధాప్య పథకాల అమలులో భారత్ ఎంతో వెనకబడి ఉన్నది. చిన్న పిల్లలు, వృద్ధుల సంక్షేమం రాజ్యం కాక మరెవ్వరు చూస్తారు? కోవిడ్ మహమ్మారికి బలైన వారిలో అనేకులు వృద్ధులే ఉండటానికి కారణం వారికి సరైన ఆదాయ వనరు లేకపోవడమే!
గుత్త పెట్టుబడిదారులు ఒక చేతితో రాజకీయాన్ని, మరో చేతితో వార్తా మాధ్యమాలను పూర్తిగా నియంత్రిస్తున్నారు. అందు చేత పెట్టుబడిదారులకు ఉపయోగపడే రాజకీయ విధానాలను మాత్రమే ప్రజలకు చేరవేసేందుకు దాదాపు అన్ని మాధ్యమాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి పోకడలను వ్యతిరేకించే వారు ఎవరైనా ఎన్డీటీవీ రూపంలో ఉంటే వాటిని మొత్తానికి మొత్తంగా బలవంతంగానైనా కొనేస్తారన్న వాస్తవం ఈ మధ్యనే బయటపడింది. కేవలం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని మాధ్యమాలు తప్ప, ఉద్యోగుల కార్మికుల కర్షకులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూ మాధ్యమాలే లేకుండా పోయాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రజలలో చీలిక తెచ్చి, ఉద్యోగులపై సామాన్యులను ఉసిగొలిపేలా ఉన్నది. అందుకే సామూహిక అంగీకారానికై(కామన్ కన్సెన్సస్) ప్రయత్నించాలని కూడా సదరు పత్రిక సంపాదకీయం సూచించింది. అనగా మెజారిటీ అభిప్రాయాన్ని కూడగట్టాలని చెప్పకనే చెప్పింది. అయితే ఈ ప్రతిపాదన ఇంతటికే పరిమితవదు. భవిష్యత్తులో పర్మనెంట్ ఉపాధి కల్పనపై కూడా ఇలాంటి వాదనే వినిపిస్తుంది. అగ్నిపథ్ పేర అగ్ని వీరులను నాలుగేండ్ల కోసం సైన్యంలోకి నియమించింది కూడా పెన్షన్‌తో పాటు ప్రావిడెంట్ ఫండ్‌ను కూడా ఎగవేసేందుకే! యువరక్తాన్ని దేశ సరిహద్దుల్లో ముళ్ళ కంచెలవద్ద శత్రువుకు ఎదురు నిలిప,ి వారి భవిష్యత్తును మాత్రం గాలికొదిలేయడం తలదించుకునే అంశం. కానీ ఈ వాస్తవాలను సాధారణ ప్రజానీకం గమనించే స్థితిలో లేకుండా మతం అనే మత్తుమందు ద్వారా మత ఏకీకరణను ఒక ఆయుధంగా వాడుతున్నారు. సామాజిక సమస్యలపైకి ప్రజల దృష్టిని పోనివ్వకుండా తమ అధికార పీఠాన్ని సుస్థిరపరిచు కునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా అధికార పార్టీ విషపూరిత మత కౌగిలిలో ఇరుక్కున్నారు. మనిషిని ఒక వస్తువుగా 'ఉపయోగించి వదిలేసే' (యూజ్ అండ్ త్రో) సంస్కృతి మరింత పెరిగిపోతున్నది. అందుచేతనే ప్రభుత్వా లందించే సంక్షేమ పథకాలపై కోర్టులతో సహా సామాన్యులు సైతం పెదవి విరుస్తుంటారు. ఇది పూర్తిగా అవగాహనా లోపం. వ్యవస్థ అభివృద్ధికి కారకులైన వారి సంక్షేమం సామాజిక బాధ్యత. అందుకే 'పెన్షన్ ఒక వాయిదా వేయబడిన వేతనం'గా అభివర్ణింపబడుతుంది.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016