Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి) పరిశోధన, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఎంపిక నిమిత్తం సంవత్సరానికి రెండు పర్యాయాలు నేషనల్ ఎలిజిబిటీ పరీక్ష (నెట్) నిర్వహిస్తుంది. ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్) సాధించడానికి ప్రస్తుతం అమలులో ఉన్న 30ఏండ్ల గరిష్ట వయసు నిబంధన వలన అభ్యర్థులకు సరైన న్యాయం జరగడం లేదు. నెట్ ప్రశ్నాపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉండి ఒక రకంగా సివిల్ సర్వీసెస్ పరీక్షతో సరిసమానంగా ఉండడం, కేవలం ఆరుశాతం మాత్రమే అర్హత సాధించే విధంగా నిబంధనలు రూపొందించడం వలన కూడా అభ్యర్థులు ఆశించిన లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. అందువలన ఈ ప్రాయోగిక పరీక్షని ఆయా ప్రాంతీయ భాషలలో నిర్వహించే దిశగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఆరుశాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వలన ఆ ఆరుశాతం దరిదాపులోకి చేరుకోలేని అభ్యర్థులు ప్రతిసారి మరో ప్రకటన కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అలా ప్రతిసారి చెల్లించాల్సిన ఫీజులు అభ్యర్థులకు తడిసి మోపెడు అవుతున్నాయి. ఒక రకంగా అత్యధిక ధనంతో పాటు విలువైన సమయం కూడా వృధా అవుతున్నది. అభ్యర్థులు నిరంతర సాధనతో లెక్చరర్ షిప్కి స్వల్ప మార్కులతో అర్హతని సాధించినప్పటికీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ని సాధించలేక పరిశోధనా విద్యకు దూరం అవుతున్నారు. నిజానికి విద్య అంటేనే నిరంతర ప్రక్రియ. అలాంటి విద్యపై ముఖ్యంగా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ కోర్స్‌లో పరిశోధన నిమిత్తం పరిశోధకులకు నిధులు చేకూర్చే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పరీక్షపై గరిష్ట వయసు నిబంధనని విధించడం ఏమాత్రం సహేతుకం కాదు. ఈ గరిష్ట వయోపరిమితి నిబంధన వలన పరిశోధనపై ఆసక్తివున్నా అనేక మంది ఔత్సహికులు పరిశోధనా విద్యకు దూరం అవుతున్నారు. ఇలా పరిశోధనా విద్యకు నోచుకోని వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ విషయాన్ని అనేక సందర్భాలలో అనేక గణాంకాలు వెల్లడిస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా 2022 సంవత్సరంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) ఎంబిబిఎస్ విద్యలో ప్రవేశాలకు సంబంధించి గతంలో రూపొందింపబడి ఉన్న గరిష్ట వయోపరిమితిని ఎత్తివేసి వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ వైద్య విద్యని ఆర్జించే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అలాగే నేడు ఆసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పోటీపడేవారికి కూడా గరిష్ట వయసు నిబంధన లేదు. కేవలం డాక్టరేట్ పరిశోధనా కోర్స్‌లలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే అర్హతా పరీక్షకు గరిష్ట వయోపరిమితిని విధించడం అనేది ఏరకంగా చూసినా సహేతుకం కాదు. అందువలన ఇప్పటికైనా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిటీ టెస్టు ద్వారా నిర్వహించే జూనియర్ లెక్చరర్ షిప్ అర్హతా పరీక్షని రాయడానికి గరిష్ట వయోపరిమితిని తక్షణమే ఎత్తివేయాలి. తత్ఫలితంగా ఎంతోమంది పరిశోధక ఔత్సాహికులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుంది. మరెన్నో పరిశోధనలు ప్రజా బాహుళ్యంలో వెలుగు చూడగలవు.
- జె.జె.సి.పి. బాబూరావు సెల్: 9493319690