Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డి.ఎస్. కొఠారి (1964-66) నేతృత్వంలోని విద్యా కమిషన్ అన్ని దశలలో విద్యార్థులను ఏదో ఒక విధమైన సామాజిక సేవతో ముడిపెట్టాలని సిఫారసు చేసింది. భారత ప్రభుత్వం విద్యపై జాతీయ విధానం ప్రకటనలో పని అనుభవం జాతీయ సేవ విద్యలో అంతర్భాగంగా ఉండాలని నిర్దేశించింది. మే, 1969 సంవత్సరంలో విద్యా మంత్రిత్వశాఖ, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల ప్రతినిధుల సమావేశం కూడా ఏకగ్రీవంగా జాతీయ సేవ జాతీయ సమైక్యతకు శక్తివంతమైన సాధనం కాగలదని ప్రకటించింది. దేశ పురోభివృద్ధికి, అభ్యున్నతికి విద్యార్థి సమాజం చేస్తున్న కృషికి చిహ్నంగా ఉంటుందని జాతీయ సేవా పథకం తీసుకరావడం జరిగింది.
కానీ గత నాలుగు సంవత్సరాలుగా జాతీయ సేవ పథకం కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో సేవ తక్కువ ప్రచారం ఎక్కువగా ఉంటున్నది. మానవ సంబంధాలు ఏమాత్రం లేని వారిని ఏరికోరి ప్రోగ్రాం ఆఫిసర్లుగా నియమిస్తున్నారు. ప్రతి విశ్వవిద్యాలయం పరిధిలో కనీసం లక్ష మంది విద్యార్థులు ఉంటున్నారు, మారుమూల ఉన్న ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సైతం కనీసం రెండువేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు సంవత్సరానికి నాలుగు రోజులు, రోజుకు నాలుగు పనిగంటలు అంటే సుమారు పదహారు వేల పనిగంటల సమయంతో ఎన్నో పనులు చేయవచ్చు. ఎన్నో శాశ్విత పథకాలకు రూపకల్పన చేయవచ్చు. గతంలో జాతీయ సేవ పథకానికి ఎంతో గుర్తింపు ఉండేది. గ్రామాలను దత్తత తీసుకునే వారు, గ్రామాభ్యుదయం, ప్రజల జీవన సరళి, వైవిధ్యత, జాతీయ సమైక్యత భావన విద్యార్థులలో ఉండేది. విశ్వవిద్యాలయాలలో యూత్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ జరిగేవి. దేశంలో వివిధ ప్రాంతాల సంస్కృతి, ఆహార అలవాట్లు, ఆచారాలు, కట్టుబాట్లు తెలిసేవి. సమాజం అవసరాలు, సమస్యలను గుర్తించడం వాటి పరిష్కారాలు యోచించడం జరిగేది. తమలో తాము సామాజిక, పౌర బాధ్యతల భావనను పెంపొందించుకోవడం. వ్యక్తిగత, కమ్యూనిటీ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడంలో వారి జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని సమీకరించడంలో నైపుణ్యాలను పొందడం, నాయకత్వ లక్షణాలను, ప్రజాస్వామిక విలువలను పెంచుకోవడం, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యాన్ని అభ్యసించడం ప్రధాన లక్ష్యాలుగా పనిజరిగేది. ఇప్పుడవి మచ్చుకు కూడా కనిపించకపోవడం ఆందోళనకరం. విద్యార్థి దశలోనే అలాంటి ఉన్నత భావాలు పాదుకొల్పినప్పుడే ఉత్తమ పౌర సమాజాన్ని ఆశించవచ్చు. సేవా దృక్పథం లేని సమాజం వృధా!
- డాక్టర్ ముచ్చుకోట సురేష్‌బాబు