Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్లైన్ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం పెరిగింది. ఏదో ఒకరకంగా మభ్యపెట్టి నగదు దోచేస్తారు. విద్యావంతులు కూడా వీరి వలలో పడుతున్నారు. అలా పోయిన డబ్బు పోలీసులకు, బ్యాంకులకు, ఫిర్యాదు చేస్తే 100శాతం తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమమైన మార్గం.
భారతదేశంలో సైబర్ నేరాలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం 2011లో ఐటి అక్ట్ కింద 1791 సైబర్ నేర కేసులు నమోదైతే, 2012లో 2876 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏడాదిలోనే 60శాతం పెరుగుదల నమోదైంది. 2008లో దేశవ్యాప్తంగా 288 సైబర్ నేరాలు నమోదైతే, 2009లో 420, 2010లో 966, 2011లో 1791, 2012లో 2876 కేసులు నమోదయ్యాయి. అంటే సైబర్ నేరాల తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని స్పష్టమవుతోంది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ సెక్షన్) ప్రకారం 2011లో 422 సైబర్ నేరాలు నమోదైతే, 2012లో 601 సైబర్ నేర కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క ఏడాది వ్యవధిలో 42.4శాతంత పెరుగుదల నమోదయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు వ్యవహారాలు ఆన్లైన్ అయ్యేకొద్దీ, ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. సైబర్ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సైబర్ నేరాల బాధితులను మూడేండ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74శాతం మందికి ఇప్పటికీ డబ్బు వాపస్ కాలేదని తెలిసింది. 33శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్, డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు పాస్వర్డ్స్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లను కంప్యూటర్లో దాచుకున్నారు. 11శాతం మంది ఈ వివరాలు అన్నింటిని మొబైల్లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా వంచకులు, హ్యాకర్ల చేతికి అందడంతో వంచనకు గురవుతున్నారు.
సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని విధాలుగా సైబర్ భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేశంలో వివిధ స్థాయిల్లో సైబర్ భద్రతతకు వాటిల్లే ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని జాతీయ ఇంటర్నెట్ భద్రత విధానం సూచిస్తోంది. సైబర్ భద్రతకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఒక జాతీయ నోడల్ ఏజెన్సీతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ యంత్రాంగాలు పనిచేయాల్సి ఉంటుంది.
''సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి, తస్మాత్ జాగ్రత్త'' అని పోలీసులు సైతం ప్రజలను పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు అమాయకులు వారి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమిషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశచూపి, నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని, ఆధార్ నంబర్ చెప్పండని, మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పండని, మీ ఏటీఎం పనిచేయడం లేదని, మీరు కారు గెలుచుకున్నారని, మనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారు.
ఈ ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పించాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, వివరాలు తెలియజేస్తే 24గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వివరిస్తున్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు. అనవసర సమయాల్లో ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మంచిది. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి. బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దు. వర్క్ ఫ్రం హౌం ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి. బయటి ప్రాంతాల్లో ఉచిత వైఫై ఉపయోగించకపోవడం మంచిది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్లోడ్ చేయకపోవడం ఉత్తమం. గోప్యత పాటించాలి. అప్పుడే సైబర్ నేరాలు తగ్గి, ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటాం.
- మోటె చిరంజీవి, సెల్: 9949194327