Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, ఆయా దేశాలలోని రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ముందు వరుసలో ఉండాలంటే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించేది వైద్య ఆరోగ్య రంగ ఉద్యోగులు. వైద్య ఆరోగ్య రంగం అనేది ఒక ''సేవారంగం.'' ఈ రంగాన్ని మిగతా అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగా చూడకూడదు. ఈ శాఖ మీద పూర్తిగా ప్రభుత్వానికి అజ మాయిషి ఉంటేనే ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటు లో ఉంటుంది. ప్రజలందరికీ పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య చికిత్సలు సంతృప్తికరంగా అందాలంటే ఈ రంగంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు మొదలుకొని ఇతర అన్ని కేడర్ల పారామెడికల్ ఉద్యోగులు, నాలుగో తరగతి సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, డాక్టర్స్ ఇతర స్పెషలిస్టులు, అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న అధికారులు, వైద్య ఆరోగ్య శాఖలోని మొత్తం ఉద్యోగులకు సంబంధించి అన్ని విధాల బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి.
ఇంతటి కీలకమైన వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా నిరాదరణకు గురి అవ్వడం అత్యంత బాధాకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచీకరణలో భాగంగా వైద్య, ఆరోగ్యరంగంలో 2000 సంవత్సరం నుండి ప్రయివేటీకరణ విధానాలు అమలు చేసి, ఈ రంగాన్ని ప్రయోగశాలగా మార్చి, రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, థర్డ్ పార్టీ, హైయిర్డ్, డైలీ వైజెస్ తదితర పేర్లతో సిబ్బందిని నియమించి, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ ఇతర చట్టబద్ధ సౌకర్యాలు ఏవీ అమలు చేయకుండ, గత 23ఏండ్లుగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఈ వెట్టి చాకిరీ విధానం రద్దు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ యధావిధిగా పర్మినెంట్ చేయాలని యూనియన్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
2000 సంవత్సరంలో పట్టణ ప్రాంతాలలోని మురికివాడలలో నివసిస్తున్న పేదలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్సెంటర్లను ఏర్పాటు చేసి, ఇందులో కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ ఆర్గనైజర్, పబ్లిక్ హెల్త్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్, స్వీపర్, వాచ్ మెన్ తదితరులను నియమించారు. 22ఏండ్ల సర్వీసు పూర్తి అయినా వీరిలో ఏ ఒక్కరూ పర్మినెంట్ కాకపోవడం అత్యంత దుర్మార్గం. వీరి సర్వీసులు సంతృప్తికరంగా అందుతున్నాయని భావించిన ప్రభుత్వం గ్రామీణ మారుమూల ఏజెన్సీ గూడాలు, పల్లెలు, గ్రామాలల్లో కూడా వైద్య ఆరోగ్యసేవలు మెరుగుపరచాలని 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో రెండవ ఏఎన్ఎంలను నియమించింది.
2002లో రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ సాక్షండ్ రెగ్యులర్ పోస్టులలో రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించ తకుండా కాంట్రాక్టు పద్ధతిలో డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ మెరిట్ ప్రాతిపదికన 100శాతం గ్రాస్ శాలరీ ఇచ్చి ఉద్యోగులను భర్తీ చేసింది. ఇందులో పని చేస్తున్న ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు ఇతర కాంట్రాక్టు ఉద్యోగులను యధావిధిగా రెగ్యులర్ చేసిన ప్రభుత్వం మీద ఏ మాత్రం భారం పడదు, అయినా ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా కాలయాపన చేస్తున్నది.
వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్, రెండవ ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, యూరోపియన్ ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్స్, సపోర్టింగ్ స్టాప్, స్వీపర్స్, సెక్యూరిటీ, సానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బంది, వాచ్ మెన్స్, 102, 104, 108, ఆరోగ్యశ్రీ, ఆయుష్, నేషనల్ హెల్త్ మిషన్‌లోని ఇతర అన్ని విభాగాలలోని అన్ని క్యాడర్ల సిబ్బంది, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తదితర డైరెక్టరేట్లలోని అన్ని క్యాడర్ల సిబ్బంది అందరూ కూడా గత 23ఏండ్లుగా వైద్య ఆరోగ్యశాఖలో సేవలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త కొత్త రోగాలను అరికట్టడం కోసం పనిచేస్తున్నారు.
ప్రధానంగా 2019 నుండి కోవిడ్‌తో సహవాసం చేస్తూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా రోగులకు సేవలు అందించారు. ఒక రకంగా చెప్పాలంటే అయిన వారు ఎవరు కూడ దగ్గరికి రాని పరిస్థితుల్లో తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా, కరోనా రోగులను అక్కున చేర్చుకుని అన్ని రకాల వైద్య ఆరోగ్య చికిత్సలు అందించి వారి ప్రాణాలను కాపాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆరోగ్య పథకాలను సమర్థవంతంగా ప్రజలకు అందించి, ప్రజల్లో ప్రభుత్వాలకు పేరు తీసుకువస్తున్నారు. ప్రభుత్వం ఏక కాలంలో 36 రకాల పనులు అప్పగించినా సమర్థవంతంగా పూర్తి చేసి, సిబ్బంది తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన కేసీఆర్ మానస పుత్రిక, కేసీఆర్ కిట్ పథకాన్ని 100శాతం ప్రజలకు అందిస్తున్నారు. అదేవిధంగా 2018లో కంటి వెలుగు మొదటి విడతను పూర్తిస్థాయిలో ప్రజలకు అందించి విజయవంతం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో 18ఏండ్లు, ఆ పైన ఉన్న వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు, కంటి ఆపరేషన్లు ఇతర సౌకర్యాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించడం అభినందనీయం. కానీ అదే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తూ రెగ్యులరైజేషన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగు లందరూ తమను రెగ్యులర్ చేసి తమ జీవితాల్లో కూడా ''వెలుగులు'' ప్రసాదించాలని కోరుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించాలి.
- కె. యాద నాయక్
సెల్ :9441011195