Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలలో పాతుకుపోయిన అసాంఘిక మూఢత్వాన్ని నిట్టనిలువునా చీల్చి చెండాడినవాడు ప్రజాకవి వేమన. దాదాపు మూడు శతాబ్దాలు గడుస్తున్నా వేమన కవిత్వం ఏమాత్రం చెక్కుచెదరలేదు. గతం కన్నా ఇప్పుడే వేమన కవిత్వ ప్రాసంగికత, ఆవశ్యకత పెరుగుతున్నది.
'రాతి బొమ్మకేల రంగైన వలువలు / గుళ్ళు గోపురములను కుంభములను / కూడుగుడ్డ తాకోరునా దేవుడు / విశ్వదాభిరామ వినురవేమ.' ప్రజల కష్టార్జితమైన ప్రభుత్వ ధనాన్ని వందల వేల కోట్ల రూపాయలు గుళ్ళు, గోపురాలకు వెచ్చించే పాలకుల దుష్టబుద్ధికి ఇది చెంపపెట్టు కాదా..? మతాన్ని, ప్రజల్లో పరివ్యాప్తమైన మూఢభక్తిని ఆసరాగా చేసుకుని పాలకులు ఓట్లకోసం ప్రజలతో ఆడే చెలగాటమేగా ఇది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కారణాల రీత్యాగాని జనవరి 19వ తేదీని వేమన జయంతిగా అధికార హౌదాలో ప్రకటించడానికి ముందుకు రావడం ముదావహం. తత్సంబంధిత ఉత్తర్వును గత డిసెంబరు 30న విడుదల చేసింది. ఆధునిక యువత, పర్యాటకం, సాంస్కృతికశాఖ నివేదిక ననుసరించి ఇక నుండి ప్రతి ఏటా వేమన జయంతిని ఉత్సవంగా జరుపు కోవచ్చని తెలిపింది. నేడు జరిగేది 351వ జయంతి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రగతి శీలురు, హేతువాదులు, శాస్త్ర విజ్ఞాన ప్రచారకులు ఉత్సాహంతో ముందుకు అడుగిడుతున్నారు. పాఠశాల విద్యార్థులచే వేమన పద్యాలను చదివిస్తున్నారు. కళాశాలలో వేమన భావాలను చర్చకు పెడుతున్నారు. అనంతపురంలో వేమన పౌండేషన్ ఏర్పడి బహుముఖ కార్యక్రమాలు చేపడుతున్నది.
వేమన తెలుగువారందరూ గర్వపడే కవి. పండిత పామరులకైనా, ఆబాల గోపాలానికైనా వేమనపద్యం రానివారు బహుశ ఉండరేమో..! తెలుగు జీవితాల్లో వేమన కవిత్వం అంతగా పెనవేసుకుపోయింది. కవిత్వానికి ప్రాతిపదిక, ప్రామాణికం దేవతార్చన కాదని, మానవ సామాజిక జీవన వాస్తవమేనని కుండిబద్దలు కొట్టాడు. తిక్కన, వేమన, గురజాడలు మహాకవి శ్రీశ్రీకి కవిత్రయం. మధ్యముడు వేమన.
సి.పి.బ్రౌన్‌దొర వెలిగించిన వేమన కవిత్వ కాగడాను పరిశోథకులు ఆరుద్ర, ఆచార్య ఎన్. గోపి వంటివారు ఎత్తిపట్టారు. మర్రిచెట్టు వంటి మహావృక్షమైనా విత్తునుండే మొలకెత్తే రీతిలో అనంతభావాన్ని అల్పాక్షరాల్లో పూరించేలా వందల, వేల పద్యాలు రచించాడు వేమన. ప్రక్షిప్తాలు ఎన్ని ఉన్నా నిక్షిప్తాలకూ కొదవలేదు. కవిత్వానికి పాండిత్య ప్రకర్ష అవసరం లేదని తేల్చిచెప్పాడు. ఓ సత్యాన్వేషిగా, నిత్యాన్వేషిగా, నిత్యం మనుషుల మధ్య తిరుగాడుతూ మానవ జీవన సత్యాలనే అలతి అలతి పదాలతో నిర్భయంగా చెప్పాడు. మట్టిమనుషులు మట్టిపరిమళాన్ని అనుభవించకపోతే ఎలా? తాను అనుభవిస్తూ ఇతరులు అనుభవించేలా చేయగలిగిన గొప్ప దార్శనికుడు వేమన.
భూమిలోన పుట్టు భూసారమెల్లను / తనువులోన పుట్టు తత్వంబు ఎల్లను / శ్రమలోన పుట్టు సర్వంబు తానౌను / విశ్వదాభిరామ వినురవేమ. మానవ జీవన సారమంతా ఈ చిట్టి పద్యంలో ఇమిడిపోయింది. నాలుగేండ్ల క్రితం స్వీడన్ బాలిక గ్రేటా థన్‌బెర్గ్ ప్రపంచ నేతలనే ప్రశ్నించింది. వేల సంవత్సరాలుగా సమస్త జీవరాసులకు ఆలవాలంగా ఉన్న ఈ భూమిని కాలుష్యంతో కాసారం చేయడానికి మీ కెవరిచ్చారు హక్కు? మా అందమైన కలలను, భవితను కొల్లగొట్టడానికి మికెంత ధైర్యం? ఇప్పటికీ సరైన సమాధానం చెప్పలేక అగ్రనేతలు ముఖం చాటేస్తున్న వైనాన్ని లోకం కళ్ళరా చూస్తూన ఉన్నది. అప్పటి ధర్మసూక్ష్మానికి ఇప్పటి ధర్మాగ్రహం ఇది.
వేమన పద్యాలు హృదయాంతరంగాల్లోకి సూటిగా బాణంలా గుచ్చుకుపోతాయి. మార్పుకు సాధనమవుతాయి. అందుకే వేమన సాధకుడు, బోధకుడు, ద్రష్ట స్రష్ట మహాకవి అని ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం అన్నారు. వేమన పద్యాల్లోని తత్వవిలువలకు అబ్బురపడి అప్పుడే ఆంగ్లంలోకి తర్జుమా చేసాడు బ్రౌన్. ఆ తర్వాత సంస్కృతం, కన్నడం, తమిళం భాషల్లోకి అనువాదమయ్యాయి.
1990 నుండి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు ఎల్లెడలా ముమ్మరం అయ్యాయి. ద్రవ్య పెట్టుబడితో యావత్ ప్రపంచమే బహుళ జాతి సంస్థల గుప్పెట్లో బంధీ అయి పోయింది. పాలకులు ఏ జాతి మతం వారైనా వారి కనుసన్నల్లో నడవాల్సిందే. కార్పొరేట్ దిగ్గజాలకు ఊడిగం చేయాల్సిందే. చదువులు ప్రజావిముక్తికి గాక ప్రజా దోపిడీకే సహకరిస్తాయి. అది స్థూల రూపమైతే, దాన్నే సూక్ష్మరూపంలో ఇలా చెప్పాడు వేమన.
కులము గలవాడు, గోత్రము కలవాడు / విద్య చేత విర్రవీగువాడు / పసిడిగల వాని బానిస కొడుకులు రా/ విశ్వదాభిరామ వినురవేమ.
అలాగే అశాస్త్రీయ భావజాలం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నది. జాతకాలు, ముహూర్తాలు, జోతిష్యం చివరకు క్షుద్రపూజలూ విద్యవిధానంలో చోటు చేసుకున్న చేటు కాలమిది.
విప్రులెల్ల జేరి వెర్రి కూతలు గూసి / సతి పతులను గూర్చి సమ్మతమున / మును ముహూర్తముంచ ముండెట్లు మోసెరా / విశ్వదాభిరామ వినురవేమ.
ఇంత నిక్కచ్చి తత్వంగా విమర్శ ఉంటుంది గనుకనే మనువాదులకు ఇప్పటికీ మింగుడుపడడు వేమన, మాల వాని నేల మరి మరి నిందింప / ఒడలునున్న మాంసమొక్కటి కాదె / వానిలోన వెలుగు వాని కులం బేది / విశ్వదాభిరామ వినురవేమ.
ఇలా వర్ణ వ్యవస్థపైనా, అసృశ్యతపైనా నాడే కవితా ఖడ్గాన్ని ఝుళిపించాడు. 'ఉర్వివారికెల్ల నొక్క కంచము బెట్టి / పొత్తుగుడిపి కులము పొలియచేసి / తలను చేయ బెట్టి తగనమ్మ జెప్పరా / విశ్వదాభిరామ వినురవేమ' లోకమంతా ఒక ఇల్లై లోకులంతా ఒక కుటుంబమైతే పంక్తిబాహ్యులు ఎవరుంటారు? అందరూ ఒక కంచాన భుజిస్తే జాతి, మత, కుల, వర్ణబేధాలకు తావే ఉండదు. సఖ్యత నెలకొంటుంది. సమానత్వం పాదుకుంటుంది అని సమతా ధర్మాన్ని ప్రభోదిస్తాడు వేమన. దీనిని షట్ దర్శనాల, సకల మతాల సారంగా అభివర్ణిస్తాడు ఆరుద్ర.
ఇలా సమాజంలోని మూల మూలలకు చొచ్చుకుపోయి ప్రజల అజ్ఞానాంధకారం తొలగించేందుకు అహరహం కృషి చేసాడు వేమన. నిండైన మనస్సుతో ప్రజా శ్రేయస్సు కొరుకునే వారికి నిజమైన మార్గదర్శకుడయ్యాడు. ప్రజల నాల్కలపై సుకవిగా చిరకాలం జీవిస్తూనే ఉంటాడు.
(నేడు వేమన జయంతి)
- కె శాంతారావు
సెల్: 9959745723