Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటికి సరిగ్గా 67ఏండ్ల క్రితం(19.1.56 న)జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. ఇది దేశ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన ఘట్టం. బీమా రంగ జాతీయీకరణ యధాలాపంగా ఏమీ జరగలేదు. ఒక ప్రభుత్వ విధానంగా జరగలేదు. దానికో చారిత్రిక పునాది ఉంది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిలో జాతీయీకరణ ఒక కీలక పార్శ్వం. రాజకీయ స్వాతంత్య్రం చాలదు, ఆర్థిక స్వాతంత్య్రం కీలకం అనే తాత్విక అవగాహనే జాతీయీకరణ మూల సూత్రం. ఎల్ఐసీ ఆవిర్భావానికి దారి తీసిన బీమా జాతీయకరణ ఆలోచన స్వాతంత్రోద్యమ సమయంలో వెల్లివిరిసిన జాతీయ స్పృహలో అంతర్భాగం. స్వాతంత్రోద్యమం కేవలం వలస పాలన నుండి విముక్తిని పొందడమే కాకుండా, స్వేచ్ఛాయుతమైన సమసామాజ స్థాపనను లక్ష్యంగా పెట్టుకుంది. 'దోపిడీని అంతమొందించాలంటే, రాజకీయ స్వేచ్ఛతో బాటు, ఆకలితో ఉన్న లక్షలాది మందికి నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి' అని 1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సదస్సు తీర్మానించింది. 1934లో జరిగిన కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్ సమావేశంలో తన చార్టర్ ఆఫ్ ఫ్రీడంలో 'ప్రజా పొదుపును జాతీయం చేయాల్సిన అవసరం ఉందనీ, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం వ్యూహాత్మక స్థానాన్ని కలిగివుండాలని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుందని పేర్కొన్నారు. దీనిని బట్టి, ప్రజల పొదుపుపై ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉండాలనేదానిపై, అది ప్రయివేట్ సంస్థల పరం కాకుండా జాతీయాభివృద్ధికి మాత్రమే ఉపయోగించబడాలి అనేదానిపై, స్వాతంత్రోద్యమం చాలా స్పష్టంగా ఉందని మనకు అర్ధమవుతుంది.
జీవిత బీమా అనేది దీర్ఘకాల పెట్టుబడి. జీవిత బీమా వ్యాపారం కేవలం నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. యూరోపియన్ దేశాల్లో ప్రయివేట్ గుత్త సంస్థలు చేసిన ఆర్థిక అరాచకం గుర్తించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బీమా రంగం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని తన స్టేట్స్ అండ్ మైనారిటీస్ గ్రంథంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభ భారతదేశం సమతుల్యంగా అభివృద్ధి చెందాలంటే, దేశ ఆర్థిక రంగంలో ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించాలంది. 'బీమా వ్యాపార నిర్వహణ, యాజమాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వానికి బదిలీ చేసే చట్టాన్ని అమలుచేయడానికి వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఈ సభ అభిప్రాయపడుతుంది' అని రాజ్యాంగ అసెంబ్లీ జనవరి 12, 1948 నాడు తీర్మానించింది.
జులై 1,1951న అఖిత భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏ.ఐ.ఐ.ఈ.ఏ) అవిర్భవిస్తూనే ''ఇన్సూరెన్స్ రంగ జాతీయకరణ ''అనే ప్రధాన డిమాండ్‌ను చేపట్టి తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇన్సూరెన్స్, బ్యాంక్‌లు ప్రజల పొదుపును పోగుచేసి పెట్టుబడిగా తయారు చేసే సాధనాలు. అందుకే పెట్టుబడిదారులు ఒక బ్యాంక్, ఒక ఇన్సూరెన్స్ కంపెనీలను తమ చేతుల్లో ఉంచుకునే వారు.
ఉదాహరణకు 1. టాటా చేతుల్లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, సెంట్రల్ బాంక్ ఆఫ్ ఇండియా ఉండేవి. 2. దాల్మియా చేతుల్లో భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండేవి. 3. బిర్లా చేతుల్లో బాంబే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ ఉండేవి. ప్రజల పొదుపును తమ సొంత పెట్టుబడిగా మార్చుకుని, సొంత లాభాన్ని పెంచుకునే పెట్టుబడిదారుల చేతుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్న రోజులవి.
1953లో 12 కోట్లు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు 318 కోట్లు సంపాదించగలిగారు. ఈ పరిస్థితుల నడుమ 25 జీవిత బీమా కంపెనీలు మూతపడ్డాయి. మరొక 25 కంపెనీలు ఇతర కంపెనీలకు బాదలాయించబడ్డాయి. దాల్మియా నేతృత్వంలోని భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ 2 కోట్లు దగా చేసింది. బొంబాయిలో 30లక్షల గవర్నమెంట్ సెక్యూరిటీలు గల్లంతయ్యాయి. వ్యయ శాతం అమాంతం పెరిగిపోయింది. కంపెనీలు పాలసీ అమ్మిన తర్వాత, ఎలాంటి సేవ ఇచ్చేవారు కాదు, భద్రత లేని రంగాలకు అప్పులు ఇచ్ఛేవారు. దాంతో వేలాదిమంది పట్టదారులు రోడ్డున పడ్డారు.
1955 నాటికి 66 కంపెనీలు తమ అకౌంట్స్ కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరెన్స్‌కు సమర్పించలేదు. 23 కంపెనీలు 1954 నాటికే వాల్యుయేషన్ రిపోర్ట్స్ సమర్పించవలసి ఉంది. ప్రయివేట్ వారి చేతుల్లో జీవిత బీమా పెరిగింది. లాభాలు వారి సొంతమయ్యాయి. పాలసీ దారులకు మాత్రం పంగనామాలు పెట్టారు. ఉద్యోగులు నికృష్టంగా బతికారు.
ఆ రోజుల్లో బీమా కంపెనీల మధ్య కుత్తుకలు కోసే పోటీ ఉండేది. ఈ పోటీలలో నెగ్గడానికి బీమా కంపెనీలు ప్రీమియంలను తగ్గించడం మొదలు పెట్టాయి. ప్రీమియంలను తగ్గించిన నేపథ్యంలో కంపెనీ లాభాలు నిలబెట్టుకోవడం కోసం, సిబ్బందిని తగ్గించడం మొదలు పెట్టారు. ఈ పోటీలో నెగ్గలేని చిన్న కంపెనీలు మూతపడి ఉద్యోగులు వీధుల్లో పడ్డారు. దీంతో ఉద్యోగ భద్రత ప్రధాన సమస్య అయ్యింది. పరిశ్రమలో వచ్చిన సంక్షోభానికి ఉద్యోగులు బలిపశువులు అయ్యేవారు. దీన్నిఏఐఐఈఏ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతి సంవత్సరం వ్యాపారం పెరుగుతున్నప్పుడు ఉద్యోగుల తొలగింపుకు అర్థం లేనిదని ఏఐఐఈఏ వాదించింది.
ఈ నేపథ్యంలోనే జీవిత బీమా రంగంలో పట్టదారుల సొమ్ముకు భద్రత ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో మృగ్యం అని, పట్టదారుల సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయీకరణ ఒక్కటే పరిష్కారమని 1951 నుంచి 1956 వరకు ఏ.ఐ.ఐ.ఈ.ఏ సమర శీల పోరాటాలు నిర్వహించింది. ఏ.ఐ.ఐ.ఈ.ఏ ఉద్యమంతో ప్రయివేట్ కంపెనీలు బెంబేలెత్తి మరిన్ని అక్రమాలకు తెరతీసాయి. పరిస్థితి చేయిదాటి పోతోందని గమనించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం జనవరి19, 1956న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది. జనవరి 20, 1956న నెహ్రూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏ.ఐ.ఐ.ఈ.ఏ ఒక టెలిగ్రామ్‌ను పంపింది. సాధారణ బీమా రంగాన్ని కూడా జాతీయం చేయాలి అని ఏ.ఐ.ఐ.ఈ.ఏ కోరింది.
అందుకే జనవరి 19 స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ఇచ్చే రోజు. బీమా ఉద్యోగులు జాతీయీకరణ లక్ష్యాలకు పునరంకితం అయ్యే రోజు. 1.9.1956న 245 ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను మిళితం చేసి 5కోట్ల ప్రభుత్వ మూల ధనంతో ఎల్ఐసీను ఏర్పరిచారు. 1956 జనవరి 19 నుండి దేశంలో బీమా రంగ జాతీయీకరణ అమల్లోకి రావడంలో ఏ.ఐ.ఐ.ఈ.ఏ పాత్ర చాల ప్రాధాన్యత కలిగినది. 1951లో జాతీయకరణ, సమాన వేతనాలు లక్ష్యాలుగా అనేక బీమా కంపెనీలకు సంబందించిన ఉద్యోగులు ముంబైలో సమావేశం జరుపుకుని ఏ.ఐ.ఐ.ఈ.ఏని ఏర్పాటు చేసుకున్నారు. ఏ హక్కులూ లేని కంపెనీలలో పని చేసే ఉద్యోగులు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం అంటే ఆషామాషీ కాని రోజులవి. వామపక్షాలు, మరి కొన్ని పార్టీలు, కొందరు ప్రగతిశీల కాంగ్రెస్ నాయకులూ ఈ డిమాండ్లను సమర్థించారు. ఈ డిమాండ్లను ప్రజల డిమాండ్లుగా మార్చడంలో శైశవ దశలో ఉన్న ఏ.ఐ.ఐ.ఈ.ఏ ఒక సైద్ధాంతిక బలిమితో పనిచేసింది. అన్నీ అనుకూలించి 1956లో ఎల్ఐసీ ఒక ప్రభుత్వరంగ సంస్థగా ఏర్పాటు అయ్యింది. దశాబ్దాల వెట్టిచాకిరీకి తెరపడి బీమా ఉద్యోగులకు ఆత్మ గౌరవంతో కూడిన జీవితానికి పునాదులు పడ్డాయి. ఎల్ఐసీ దేశాభివృద్ధికి నిధులు అందిస్తోంది. పాలసీదారులకు మెరుగైన రాబడిని, తిరుగులేని భద్రతనూ అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకూ తన సేవలను విస్తరించింది. ఫిర్యాదులు లేకుండా క్లెయిమ్స్ పరిష్కరిస్తోంది. నమ్మకమే పునాదిగా పనిచేస్తున్నది.
పాలసీదారుల సంక్షేమం ధ్యేయంగా 1956 నుండి పనిచేయబట్టే, అంతై ఇంతై వటుడింతింతైనట్లు నేడు 42 లక్షల కోట్ల ఆస్తులున్న సంస్థగా ఎల్ఐసీ ఎదిగింది. 27 కోట్ల మంది పాలసీదారుల సేవలో తరిస్తున్నది. 135కోట్ల మంది భారతీయుల ఆదరణ చూరగొన్నది. ప్రయివేటు బీమా కంపెనీలయొక్క అనైతిక పోటీని తట్టుకుని 70శాతం వాటాతో మార్కెట్ లీడర్‌గా, మార్కెట్ మేకర్‌గా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్నది.
కానీ ఇప్పుడు ఎల్ఐసీ లాంటి గొప్ప సంస్థపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాడి పెంచింది. పబ్లిక్ ఆఫర్ రూపేణా ఇప్పటికే ఎల్ఐసీలో 3.5శాతం వాటాలు అమ్మారు. ఐఅర్‌డిఏ ఆదేశాల పేరుతో అనేక తిరోగామి ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి. ''బీమా సుగమ్ పోర్టల్'' అనే ప్రతిపాదన ద్వారా సువిశాలమైన ఎల్ఐసీని ఒక ఇంటర్నెట్ కేఫ్ స్థాయికి కుదించే కుట్ర ప్రారంభమైంది. మల్టిపుల్ ఏజెన్సీ (అనగా ఒక ఏజెంట్ వివిధ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే వెసులుబాటు), ఏజెంట్ పోర్టబిలిటీ, పాలసీ పోర్టబిలిటీ వంటి నష్ట పూరిత ప్రతిపాదనలతో పాటు ఏజెంట్ల కమిషన్ తగ్గించే విధంగా కొన్ని ప్రతిపాదనలు ఐఆర్డిఏఐ ద్వారా పొడచూస్తున్నాయి. ఈ ప్రతిపాదనలన్నీ ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, తద్వారా ఎల్ఐసీ వ్యాపారాన్ని దెబ్బతీసే విధంగా, ప్రయివేటు కంపెనీలకు వంత పాడే విధంగా ఉన్నాయి. అందుచేత మరిన్ని వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం తెగబడకుండా అడ్డుకోవడానికి, అలాగే ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసే ప్రతిపాదనలను తిప్పికొట్టడానికి అన్నితరగతుల ఉద్యోగులు, ఏజెంట్లు కలిసి సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలను ప్రయివేటీకరించడానికి కూడా ఇదే తరహాలో ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
ఎల్ఐసీ వాటాల ఉపసంహరణ ద్వారా కేవలం 21వేల కోట్ల రూపాయలు మాత్రమే సేకరించిన కేంద్ర ప్రభుత్వం, తద్వారా ఏ మేరకు లాభం జరిగిందో కూడా చెప్పాలి. వాటాల ఉపసంహరణ అనంతరం ఎల్ఐసీ షేర్ యొక్క విలువ తగ్గిపోయింది. కానీ ఎల్ఐసీ వ్యాపారంలో ఎలాంటి తగ్గుదల లేదు, ఎల్ఐసీ పెట్టుబడులకు ఎలాంటి నష్టమూ లేదు, పైపెచ్చు గత సంవత్సరం కన్నా మెరుగైన స్థితిలోనే ఎల్ఐసీ కొనసాగుతున్నది. అయినప్పటికీ వాటా విలువ తగ్గిపోవడానికి కారణమేంటి? వాటాల ఉపసంహరణ ద్వారా ఎల్ఐసీకి గానీ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి గానీ ఎలాంటి ఉపయోగం లేదని ముందునుంచీ చెప్పిన ఏ.ఐ.ఐ.ఈ.ఏ వాదన నేడు రుజువైంది.
పాలసీదారులకు సాటిలేని సేవలు అందించడం, సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా సంస్థ అన్ని విజయాలనూ సమాజంలో ప్రచారం చేయడం ఏ.ఐ.ఐ.ఈ.ఏ విజయాలకు మూలం. ప్రభుత్వ రంగంపై, కార్మికహక్కులపై జరుగుతున్న పాలకుల దాడి నయా ఉదారవాద అజెండాలో భాగమేనని బీమా ఉద్యోగులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిత్య చైతన్యంతో, జాగరూకతతో విశాల కార్మికోద్యమంలో భాగస్వాములు కావాలి. 19.1.2023న జాతీయీకరణ ఆర్డినెన్స్ రోజును పురస్కరిం చుకుని ఎల్ఐసీని ప్రభుత్వ రంగంలో మరింత బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ దాడిని తిప్పికొట్టేందుకు సిద్దమవ్వాలి. ఇందుకు పాలసీదారులతో పాటు విశాలమైన ప్రజా మద్దతును కూడగట్టాలి. ఎల్ఐసీని కాపాడాలి.
- పి. సతీష్
సెల్:9441797900