Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇదే అదను లెనిన్ కథను
రచించెదను నేను
లెనిన్ బతుకు జనం కొరకు
ధ్వనించెదను నేడు
మనోవేదన నాలోన
నశించెనని కాదు
విశాలమగు విషాద గుహ
వసించితిని నేడు
లెనిన్ కథాక్రమం సదా
జపించితిని నేను
విషాదాశ్రు తుషారాల
నిషా నాకు లేదు
లెనిన్ నేడు లేడూ? చూడు
జనంలో ఉన్నాడు
లెనిన్ వేడి లెనిన్ వాడి
జగంనాడి, ధమని
లెనిన్ శాంతి లెనిన్ కాంతి
లెనిన్ మనకు ద్యుమణి
కామ్రేడ్ లెనిన్ ఛత్రం. ప్రేమ
సామ్రాజ్యానికి చిహ్నం,
కామ్రేడ్ లెనిన్ క్షాత్రం, శాత్రవ
దుర్మార్గాల విత్రం
లెనిన్ పరాకాష్ట లెనిన్
లెనిన్ మన పరాక్రమం
కామ్రేడ్ లెనిన్ ఆయుధం
మన ఆసరా, మన జ్ఞానం
లెనిన్ దృష్టి లెనిన్ సృష్టి
లెనిన్ మన విధానం...
లెనిన్ లెనిన్ లెనిన్ లెనిన్
లెనిన్ మన ప్రమాణం
లెనిన్ మనం మనం లెనిన్
లెనిన్ మనం ప్రయాణం
నీలో నాలో నీతో నాతో
లెనిన్ మహా ప్రవాహం
మయకోవ్స్కీ
అనువాదం: శ్రీశ్రీ