Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెనిన్... మరో ప్రపంచపు విజయ గీతిక
''జెండాల ఎర్రని కనురెప్పల నుంచి
కన్నీటి మంచు పడుతోంది
ఎక్కడి నుండి వచ్చాడు? ఎవరాయన?
ఏం చేశాడు?
మానవులందరి కన్నా మానవత్వం ఉన్న
ఈ మహామనిషి.''
సోవియట్ విప్లవ సాధకుడు కామ్రేడ్ లెనిన్ మరణించిన రోజున ప్రముఖ కవి మయకోవ్స్కీీ అన్న మాటలివి. కామ్రేడ్ లెనిన్ 1924 జనవరి 21న మరణించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున లెనిన్ వర్థంతి జరుగుతుంది. ఈ సందర్భంగా లెనిన్‌ను స్మరించుకోవడం అంటే అదొక గొప్ప బాధ్యత. ఎందుకంటే ఆయనకు నివాళి అర్పించడం అంటే ఆయన ప్రాపంచిక దృష్టిని (సిద్ధాంతాన్ని), విప్లవ కార్యాచరణను (ఆచరణని) అర్థం చేసుకోవడం. మారుతున్న ప్రతి పరిస్థితికీ, ప్రతి మలుపుకూ లెనిన్ మార్క్సిజాన్ని అన్వయించాడు. అలాంటి సైద్ధాంతిక ఆలోచనలతోనే తన ఆచరణను సాగించాడు. అందుకే ఆ సిద్ధాంత ఆచరణల మేలు కలయికే మార్క్సిజం - లెనినిజమయ్యింది. అందుకే శ్రామికవర్గ విముక్తి కోసం పనిచేసే ప్రతి కమ్యూనిస్టు లెనిన్‌ను అధ్యనం చేయాలి. ఆ అధ్యయనాన్ని తమ కార్యాచరణకు అన్వయం చేసుకోవాలి.
సునిశిత పరిశీలన, పరిశోధన లెనిన్ అధ్యయన పద్ధతులు
లెనిన్ తన జీవితకాలంలో ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించేవాడు. పరిశోధించేవాడు. లెనిన్ తన మొదటి రచన ''రష్యన్ రైతాంగ జీవితంలో నూతన ఆర్థిక పరిణామాలు'' అనే గ్రంథాన్ని 1893లో రాశాడు. 1894లో ''ప్రజామిత్రుల నిజ స్వరూపం'' అనే మరో గ్రంథాన్ని రాశాడు. వాటి రచన కోసం ఆయన మొత్తం రష్యన్ గ్రామీణ సమాజాన్ని అధ్యయనం చేశాడు. అందుకు అవసరమైన విస్తారమైన సమాచారాన్ని సేకరించాడు. రష్యన్ రైతాంగం ఏకవర్గంగా లేదని, రైతాంగంలో వర్గ విభజన ఉందని నిరూపించాడు. వేల ఎకరాలతో కూడిన ఎస్టేట్ల యజమా నులుగా ధనిక రైతాంగం, అతిస్వల్ప భూమితో పెద్ద, మధ్య తరగతి రైతాంగం, అసలు భూమేలేని గ్రామీణ ప్రజలు... ఇలా రష్యన్ రైతాంగంలో అంతర్‌వర్గ విభజన కనపడుతోందని వాదించాడు. భూమి లేని పేదలు, పేద రైతులు క్రమంగా పట్టణ కార్మికులుగా మారుతున్నారని తెలిపాడు. కేవలం రైతాంగమే విప్లవం తెస్తుందనే సిద్ధాంతాన్నీ తప్పుపట్టాడు. సంఖ్య రీత్యా చిన్నదైనా, కార్మికవర్గం చైతన్యంతో కూడి ఉంటుందన్నాడు. రష్యన్ పేద, మధ్యతరగతి రైతాంగాన్ని కలుపుకుని కార్మికవర్గం విప్లవానికి నాయకత్వం వహించాలని సూత్రీకరిం చాడు. కార్మిక కర్షక మైత్రి చారిత్రక అవసరమని నిర్దారించాడు. దానిలో భాగంగానే లెనిన్ 1895లో నాటి రష్యా రాజధాని సెయింట్ పీటర్స్ బర్గ్ పట్టణం కేంద్రంగా తన విప్లవ కార్యాచరణను ప్రారంభించాడు. దేశంలోని అన్ని రకాల మార్క్సి స్టు కారిక్మ, కర్షక బృందాలన్నింటినీ ఒప్పించి ఐక్య ''శ్రామిక విమోచనా పోరాట సమితి'' అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది ఒక రకంగా రష్యాలో విప్లవకర కార్మికవర్గ పార్టీ ఆవిర్భావానికి పునాదిగా భావించవచ్చు. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా మార్క్సిజాన్ని ప్రచారం చేశాడు లెనిన్. అందుకోసం తానే సంపాదకుడిగా ఉంటూ అనేక ప్రాంతీయ పత్రికలను ముద్రించాడు. కరపత్రాలను రాశాడు. కార్మి, కర్షకులను సంస్థలో చేరేలా పర్యటనలు చేశాడు. నిర్మాణ స్వరూపాన్ని సాధించేందుకు కృషి చేశాడు. అందుకే లెనిన్ ప్రజలలో పనిచేసిన తీరును, సమాజ పరిశీలన పద్ధతులను, విప్లవ కార్యాచరణ అనుభవాలను ప్రతి కమ్యూనిస్టు, కార్యకర్త నాయకుడు అధ్యయనం చేయాలి. ఆచరణకు అన్వయించుకోవాలి.
శత్రువు వేటాడుతున్నా విప్లవ కాగడా వదలలేదు
రష్యాలోని నిరంకుశ జారు ప్రభుత్వం నిత్యం లెనిన్‌ను వేటాడుతూ ఉండేది. లెనిన్ విప్లవ కార్యాచరణకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేసేది. అందులో భాగంగా 1897 ఫిబ్రవరి 13 నుంచి 1900 జనవరి 29 వరకు, అంటే మూడు సంవత్సరాల పాటు ఆయనకు తూర్పు నైజేరియాలో ప్రవాస (జైలు) శిక్షను విధించింది. అది చాలదన్నట్టు చివరికి లెనిన్‌ను హత్య చేయాలని జారు పోలీసు యంత్రాంగం కుట్ర పన్నింది. దీన్ని తప్పించుకోవడం కోసం లెనిన్ జర్మనీలోని మ్యానిచ్, లండన్ తదితర యూరప్ దేశాలకు వలసవెళ్ళి ఐదుసంవత్సరాల పాటు అజ్ఞాత జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అయితే శత్రువు నిత్యం వేటాడుతున్నా విప్లవ కాగడాను వదల లేదు. ఈ ఐదు సంవత్స రాల అజ్ఞాత జీవితాన్ని, మూడు సంవత్సరాల ప్రవాస కాలాన్ని విప్లవ పాఠశాలగా మలచుకున్నాడు. ఈ కాలంలోనే 1899లో ''రష్యాలో పెట్టుబడిదారీ విధానం - అభివృద్ధి'' అనే మహత్తర గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం ఒక రకంగా మార్క్స్ పెట్టుబడి గ్రంథానికి ఒక కొనసాగింపుగా చెప్పవచ్చు. ఈ రచన ద్వారా రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ పరిశ్రమలలోనే కాక, వ్యవసాయంలో కూడా ముందుకొస్తుందని నిరూపించాడు. మొత్తం తన ప్రవాస కాలంలో ముప్ఫైకి పైగా రచనలు చేశాడు. వాటిలో విశిష్టమైనది ''రష్యన్ సోషల్ డెమోక్రట్ల (కమ్యూనిస్టుల) కర్తవ్యాలు'' అనే పుస్తకం. దీని ద్వారా ఆయన విప్లవ కార్యాచరణకు ఐక్య కార్మికవర్గ పార్టీ అవసరాన్ని నొక్కి చెప్పాడు. ఆ పార్టీ కర్తవ్యాలు, నిర్మాణం ఎలా ఉండాలో ఆలోచించాడు. అందుకు అవసరమైన సైద్ధాంతిక రచన చేయాలని పూనుకున్నాడు. అదే ఆయన 1902లో రాసిన మహత్తర ప్రామాణిక గ్రంథం ''ఏమి చేయాలి?''. కార్మికవర్గం కేవలం ఆర్థిక పోరాటాలు చేయాలని, రాజకీయ పోరాటాన్ని బూర్జువావర్గానికి వదిలి వేయాలని ''ఆర్థికవాదులు'' చేసే అశాస్త్రీయ వాదనలను లెనిన్ ఈ గ్రంథంలో తిప్పికొట్టాడు. కేవలం ట్రేడ్ యూనియన్ల కార్యకలా పాలతోనే విప్లవం రాదని, విప్లవ సాధనకు రాజకీయ సంస్థ (పార్టీ) అవసరమని నిర్దారించాడు. అది కార్మిక అగ్రగామి దళంగా ఉండే కమ్యునిస్టు పార్టీ కావాలన్నాడు. పార్టీ కార్మికవర్గానికి అవసరమైన సోషలిస్టు చైతన్యాన్ని నిత్యం అందిస్తూ ఉండాలన్నాడు. పార్టీ నిర్మాణం రెండు భాగాలుగా ఉండాలని ప్రతిపాదించాడు. ఒక భాగం విప్లవానికి పూర్తిగా అంకితమైన వృత్తి విప్లవకారుల పరిమితి బృందంగా, మరో భాగం స్థానిక పార్టీ శాఖల విస్తారమైన భాగంగా ఉండాలన్నాడు. ప్రపంచంలో ఈనాడు శ్రామికవర్గ విముక్తి కోసం పనిచేస్తున్న అన్ని కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం, ఆనాటి లెనిన్ ప్రతిపాదనల లోంచి జరిగినదే. కష్టకాలన్ని, ప్రవాస - జైలు జీవిత కాలాన్ని, వలస కాలాన్ని లెనిన్ సైద్ధాంతిక రచనల కోసం, పటిష్ట విప్లవ కార్యాచరణ కోసం అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. శత్రువు వేటకు చిక్కకుండా, రహస్య కార్యకలాపాలను కొనసాగిస్తూ రష్యన్ కార్మిక వర్గానికి స్ఫూర్తినిచ్చాడు.
ప్రతి మలుపునూ గెలుపువైపు నడిపించాడు
1905లో వలస జీవితం ముగిసిన తర్వాత లెనిన్ పార్టీకి, రష్యన్ విప్లవ పోరాటానికి ప్రత్యక్ష నాయకత్వం వహించాడు. ముందు పీఠిన నిలబడి అశేష కార్మికవర్గానికి అంతులేని విశ్వాసాన్ని అందించాడు. 1905లో రష్యాలో జరిగిన బూర్జువా విప్లవాన్ని ఆయన రష్యన్ సోషలిస్టు విప్లవానికి ''డ్రస్ రిహార్సల్స్''గా పేర్కొన్నాడు. దాని విజయాలను, వైఫల్యాలను శాస్త్రీయంగా విశ్లేషించి మరింత వేగంగా లెనిన్ ముందుకు నడిచాడు. ఉక్కు క్రమశిక్షణ కలిగిన బోల్షివిక్ (కమ్యూనిస్టు) పార్టీని నిర్మించాడు. రివెజనిజానికి వ్యతిరేకంగా పార్టీని నిలిపాడు. 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధాన్ని యూరప్‌లోని అనేక సోషల్ డెమెక్రటిక్ (కమ్యూనిస్టు) పార్టీలు జాతీయవాద యుద్ధాలుగా భావించాయి. ఇది తప్పుడు అవగాహన అని, ఈ యుద్ధం సామ్రాజ్యవాద యుద్ధమని లెనిన్ సూత్రీకరించాడు. కుహనా జాతీయవాదాన్ని, దేశభక్తిని ఎదిరించి ఎంతో సాహసంతో ఆయన ఈ సూత్రీకరణ చేశాడు. దీనిని నిరూపించి, ప్రపంచ కార్మికవర్గాన్ని చైతన్యం చేయడం కోసం ''సామ్రాజ్యవాదం - పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ'' అన్న మహత్తర గ్రంథాన్ని రాశాడు. ప్రపంచ యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో విప్లవ కార్యాచరణలో తలమునకలైన సందర్భంలో, (1916లో) లెనిన్ ఈ గ్రంథాన్ని రాయడం అద్భుతమైన విషయం. లెనిన్ ప్రపంచ పరిణామాలలో ముందుకొచ్చిన మలుపును, గెలుపుగా మలిచాడు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రచించాడు. 1917 మార్చి 8వ తేదీన, అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున లెనిన్ మార్గదర్శకత్వంలో రష్యన్ బోల్షివిక్ పార్టీ నాయకత్వంలో కార్మికవర్గం కదంతొక్కింది. తరతరాల దోపిడీ తెరలను నిలువునా చీల్చి, సోషలిస్టు వెలుగులను వెదజల్లేందుకు ముందుకు ఉరికింది. నిరంకుశ జారు ప్రభుత్వాన్ని కూలదోసింది. బూర్జువా ప్రజాతంత్ర విప్లవం విజ యవంతం అయ్యింది. ఈ మలుపులో లెనిన్ మరో పిలుపునిచ్చాడు. విప్లవం బూర్జువా ప్రజాతంత్ర విప్లవ దశతోనే ఆగిపోకూడదు, అది సోషలిస్టు విప్లవంగా మార్చబడాలన్నాడు. అందుకు అవసరమైన కార్యాచరణ పథాన్ని నాటి బోల్షివిక్కు పార్టీ కేంద్ర కమిటీలో ప్రవేశపెట్టాడు. అదే ఏప్రిల్ థీసిస్‌గా ప్రసిద్ధి చెందింది. బూర్జువావర్గం చేతిలోని అధికారాన్ని, అవసరమైతే సాయుధ పోరుతోనైనా శ్రామికవర్గం అందిపుచ్చుకోవాలని కోరాడు. ''శాంతి, భూమి, భుక్తి, సోవియట్లకే సర్వాధికారాలు'' అనే నినాదాలతో కూడిన ప్రతిపాదనలను థీసిస్‌లో పేర్కొన్నాడు. వీటికి ఆటంకంగా ఉండే బూర్జువావర్గ రాజ్యాంగ యంత్ర స్వభావాన్ని తెలుపుతూ ''రాజ్యం - విప్లవం'' అనే మరో గ్రంథాన్ని ఆయన రాశాడు. ఈ నేపథ్యంలోనే లెనిన్ విప్లవానికి ప్రత్యక్ష నాయకత్వం వహించాలని 1917 అక్టోబర్ 7న పెట్రిగాడ్ చేరుకున్నాడు. లెనిన్ అంచనాలు నిజమయ్యాయి. పరిస్థితులు పరిపక్వమయ్యాయి. దీంతో 1917 అక్టోబర్ 25న రష్యన్ రాజ్యాధికారం విప్లవ కార్మికవర్గానికి అందింది. మానవ చరిత్రలో మహత్తర ఘటన జరిగింది. దోపిడీ రహిత సోషలిస్టు సమాజ నిర్మాణానికి ఒక అవకాశం దొరికింది. ప్రతి ఓటమి నుంచి గుణపాఠం తీయడం, ప్రతి ఆచరణలో లోపాలను శాస్త్రీయంగా విశ్లేషించడం, తిరిగి సరైన సైద్ధాంతిక అవగాహనతో కార్యరంగంలోకి దూకడం లెనిన్ ప్రత్యేకత. అందుకే లెనిన్ విప్లవాన్ని విజయవంతం చేయగలిగాడు. సోషలిజం ఫలాలను ప్రజలకు అందించేందుకు తగిన ప్రణాళికలు రచించాడు. వాటికి ఓపికగా ప్రజలను సిద్ధం చేశాడు. ప్రపంచ శ్రామికవర్గానికి స్ఫూర్తినిచ్చాడు. వలస దేశాలలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాలకు గుండె ధైర్యమయ్యాడు. చివరకు 1924, జనవరి 21న తుదిశ్వాస విడిచాడు. లెనిన్ మరణించి దాదాపు వంద సంవత్సరాలు అవుతున్నా, ప్రపంచంలో జరుగుతున్న ప్రతీ ప్రజాపోరాటంలో లెనిన్ కనిపిస్తున్నాడు. లెనిన్ వినిపిస్తున్నాడు. లెనిన్ జీవిస్తున్నాడు. తన లాగే మానవత్వం ఉన్న మనుషులుగా మారమని, మనకు పిలుపునిస్తున్నాడు.
(జనవరి 21, లెనిన్ వర్థంతి సందర్భంగా)
- బండారు రమేష్, 9490098251