Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తమైన విప్లవ ప్రతీక 'చే'.
అతడో ఉత్తేజం, ఉద్వేగం,
మానవీయ చైతన్యపు శబ్ధం!
అతనిని తలచుకుంటేనే వేలరెట్ల శక్తి గుండె నిండుతుంది.
ఆశయం, లక్ష్యం జెండాలై ఎగురుతాయి.
ఆయన స్మృతి కవాతు గీతం పాడుతుంది.
లాంగ్ మార్చ్ నినాదమై మ్రోగుతుంది.
ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి యువ హృదయంపై
కదలాడే సజీవ స్ఫూర్తి చిత్రం 'చే'.
విప్లవవాదులకే కాదు, సమస్త ప్రజల సమరస్వరం 'చే'ను ప్రతిధ్వనిస్తోంది.
'చే' చరిత్రలో గొప్ప స్థానం ఆక్రమించాడు. ఎందుకంటే జన విముక్తి కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించాడు. ఆలోచనను, ఆచరణను, జ్ఞానాన్ని ప్రతి నిముషం మానవాళి మహాభాగ్యం కోసం వెచ్చించిన ఘన గుణసంపన్నుడతడు. మనుషుల స్వేచ్ఛకు ముళ్ల కంచెలు చుడుతున్న వ్యవస్థపై, బతుకులను దుఃఖమయం చేస్తున్న దుర్మార్గంపై, సామ్రాజ్యవాదపు కొండచిలువపై విప్లవ గండ్రగొడ్డలినెత్తిన ధీరుడతడు. అందువల్లనే ఆయన జీవితం ఇతిహాసమే కాదు, నిత్య చైతన్య ప్రేరణ.
అర్జెంటీనాలో జన్మించినా లాటిన్ అమెరికా అంతటికీ విస్తరించిన విప్లవ కెరటమై ఎగిసిపడ్డాడు. అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎంతోకాలంగా లాటిన్ అమెరికా దేశాలపై దోపిడీని, ఆధిపత్యాన్ని సాగిస్తూ అక్కడి ప్రజల సంపదను కొల్లగొడుతున్న అన్యాయంపై తుపాకీలా పేలిన దళపతి చేగువేరా. ఫిడెల్ కాస్ట్రోతో కలిసి క్యూబా నియంతృత్వ బతిస్తా వ్యతిరేక పోరాటంలో, విప్లవ సాధనలో అగ్రభాగాన నిలిచి విముక్తి సాధించిన సమూహ నాయకుడు చే. క్యూబాలో సమసమాజ నిర్మాణంలో కాస్ట్రోతోపాటుగా కష్టించి పనిచేసిన నిర్మాణదక్షుడు. అర్జెంటీనా, బొలీవియా, పెరూ, గ్వాటిమాలా, హైతి, చిలీ, కొలంబియా, మెక్సికో మొదలైన ప్రాంతాల విప్లవ సమూహాలకు స్ఫూర్తి శిఖరం 'చే'.
అందుకే అంత పెద్ద అమెరికా సామ్రాజ్యవాద డేగను సైతం ఎదిరిస్తూ నిలబడ్డ ఎర్రపావురం క్యూబా. ఈరోజు ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. స్వావలంబనను కాపాడుకుంటూనే ప్రపంచ ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తోంది. మొన్న అగ్రరాజ్యాలలోని ప్రజలను కరోనా అల్లకల్లోలపరిస్తే కనీస బాధ్యతను వహించలేకపోయిన సంపన్న దేశాలు దీనపరిస్థితికి భిన్నంగా క్యూబా ప్రపంచ దేశాలకు వైద్యం, మందులు అందజేసి ఆదుకున్నది. అది 'చే', కాస్ట్రోల కమ్యూనిస్టు స్పృహ ఫలితం. నిత్యం సామ్రాజ్యవాదం ఆ అరుణ స్పృహను హత్యగావించేందుకు తన కుట్రను సాగిస్తూనే ఉంది. 'చే'ను హతమార్చిందీ అదే. కాస్ట్రోపై వందలసార్లు దాడులు చేసిందీ అదే. ఇప్పుడు యుద్ధాలకు సూత్రధారి, ప్రపంచ దోపిడీదారు, ప్రపంచశాంతి విఘాతక కేంద్రం అమెరికన్ సామ్రాజ్యవాదం. ప్రపంచీకరణ పేరుతో తన నెత్తుటి కాళ్లను భూమినంతా మోపుతున్న తరుణంలో చేగువేరాను తలుచుకోవటం - ఆ దుష్టత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటానికి మహౌత్తేజాన్ని నింపుతుంది.
చేగువేరా క్యూబా విప్లవానంతరం భారతదేశాన్ని సందర్శించాడు. భారత జాతీయోద్యమ నాయకుడు మహాత్మాగాంధీని ఎంతగానో ప్రేమించినవాడు. గాంధీని హతమార్చిన మతోన్మాద శక్తులు నేడు ఆధిపత్యంలో ఉన్న సందర్భంలో 'చే'ను స్మరణకు తెస్తూ ఆయన కుమార్తె కామ్రేడ్ అలైదా గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా మన దేశంలోకి వచ్చారు. మతోన్మాదమూ, కార్పొరేట్లు ఏకమై ఒక ఫాసిస్టు తరహా పాలన సాగుతున్న తరుణాన క్యూబా దేశపు ఆచరణ, ఆలోచన దేశ ప్రజలందరికీ అనుసరణీయం. ఆ నేలనుండి, చే వారసత్వం నుండి వచ్చిన కామ్రేడ్ అలైదా గువేరా, ప్రొ|| ఎస్తెఫినా గువేరా మనలో పోరాటశీలతకు, ప్రజాస్వామిక చైతన్యానికి మరింత ప్రేరణ ఇవ్వనున్నారు. ఆమెకు సాదరంగా ఆహ్వానం పలుకుదాం. 'చే' స్ఫూర్తిని మళ్లీ మళ్లీ నింపుకుందాం. తిరోగమన మతోన్మాద శక్తులపై పోరాటానికి పదును పెడదాం.
- నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా - ఐప్సో