Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకవర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా రెండుగా చీలిపోయిన మన మీడియాలో వాస్తవాలు తెలుసుకోవడం రానురాను దుస్సహంగా తయారవుతున్నది. దేనికి హైప్ లభిస్తుందో ఏది అవహేళనకు గురవుతుందో తమ తమ ఎజెండాలను బట్టి నిర్ణయించడం తప్ప జరిగిన దాన్నిచెప్పి తర్వాత తమ అభిప్రాయం అనే ప్రాథమికసూత్రం తలకిందులైంది. ఆయా మీడియా సంస్థలు తలుచుకుంటే ఒక పక్షానికి సంబంధించిన అతిచిన్న అంశం కూడా రోజులతరబడి రొదచేస్తుంది. అదేవారికి మింగుడు పడకపోతే వేలు, లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అప్రధానమై పోతుంది. వారి కథనాలు కబుర్లే మొత్తం నిండిపోతాయి. మీడియా అనబడే మోడియాలో ఇది నిత్యకృత్యం. 18వ తేదీన ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభ సందర్భానికి ఇది అక్షరాలా వర్తిస్తుంది. రాష్ట్రాధినేత కేసీఆర్‌తో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక పెద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ జాతీయ కార్యదర్శి, ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులు, ఇంకా ఎందరో నేతలు అపూర్వమైన స్థాయిలో అశేష జనవాహిని పాల్గొన్న ఆ సభ ఇచ్చిన పిలుపు సంకుచిత వ్యాఖ్యలు సత్యదూరమైన విశ్లేషణల మరుగున కప్పిపుచ్చే ప్రయత్నం పెద్దఎత్తునే జరిగింది. వచ్చినవారు ఇచ్చిన పిలుపూ కంటే రానివారిపై రాగాలాపన అధికమైంది. సాధించిన ఫలితాలను పక్కకు నెట్టి అయాచిత రాజకీయ జోస్యాలతో ముంచెత్తడం ప్రహసన ప్రాయంగా సాగుతున్నది. ఉదాహరణకు ఆపరేషన్ ఫాంహౌస్ ఎంత అప్రజాస్వామికమో ఎంత కుట్రపూరితమో చూడకుండా కేసీఆర్ నాటకమని కొట్టిపారేయడం!
బీజేపీపై శంఖారావం
బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు నిజంగానే ఒక ప్రత్యేకత ఉంది. టీఆర్ఎస్గా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధన, వరసగా రెండు సార్లు ఎన్నికల్లో గెలవడం కూడా ప్రత్యేకతలే. అలాంటి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారడం, ఇతర జాతీయ పార్టీలు హాజరుకావడం గతంలో చూడలేదు. కాంగ్రెస్ లేదా బీజేపీలకు వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలు వివిధ చోట్ల శిఖరాగ్రసభలు జరపడం, సభల్లో పాల్గొనడం ఎన్టీఆర్ హయాంలోనూ చూశాం, అయితే అది ప్రాంతీయ పార్టీగానే ఉండి జాతీయ కూటమికి నాయకత్వం వహించింది. కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పాటైనప్పుడు బీజేపీని బయిటే ఉంచడం జరిగేది. కేంద్రంలో ఏర్పడిన మూడు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలలోనూ ఈ రెండు పార్టీలు లేవు. కనుకనే వాటిని బతకనివ్వలేదు. మొదట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్నిపార్టీల ఐక్యత సిద్ధాంతం తెచ్చిన ఎన్టీఆర్ అద్వానీ రథయాత్ర తర్వాత మళ్లీ ఎప్పుడూ బీజేపీతో కలవలేదు. చివరి వరకూ ఆయన రాజకీయం అలాగే ముగిసిపోయింది. చంద్రబాబు నాయుడు మాత్రం అనేకసార్లు అటూ ఇటూ మారుతూ అవకాశవాద ముద్ర వేసుకున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చాలాకాలం రాజ్యాంగ ధర్మం పేరిట బీజేపీతో సఖ్యతగానే ఉన్నా మోడీ సర్కారు నిరంకుశ మతోన్మాద పోకడల కారణంగా కేసీఆర్ గట్టి వ్యతిరేకవైఖరి తీసుకున్నారు. తనతోపాటు ఇతరులనూ కలుపుకువస్తానని ప్రకటించారు. వామపక్షాలను మినహాయిస్తే ఇప్పుడు మరో ముఖ్యమంత్రి ఎవరూ ఈ స్థాయిలో బీజేపీపై సైద్ధాంతిక రాజకీయ ప్రతిఘటన చేయడం లేదనేదివాస్తవం. షరామామూలుగా ఇందుకుగాను ఆయన పార్టీనేతలు కూడా కేంద్ర సంస్థల దాడులూ దర్యాప్తుల తంతును ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా వెనకడుగు వేయకుండా మతతత్వ రాజకీయాలను ఎదుర్కొంటానికే కట్టుబడటం తప్పక గుర్తించాల్సిన విషయం. బిఆర్ఎస్ను ఏపీతో సహా వివిధ చోట్ల విస్తరించే చర్యలూ ఏకకాలంలో కొనసాగించడం ఇందులో భాగమే. ఈ విధంగా వివిధ కోణాలలో బిఆర్ఎస్ విస్తరణ కార్యకలాపాలు పోటీలు వంటివాటిని గరిష్టస్థాయికి చేర్చే తొలి ప్రయత్నం ఖమ్మం సభ.
ఈ సభలో పాల్గొన్న అగ్రనేతలూ, హాజరైన ప్రజా సముద్రమూ చూసినవారెవరరైనా జయప్రదంగా క్రమశిక్షణగా జరిగిందని చెబుతారు. పలువురు జాతీయ నాయకులు ఇతర భాషల్లో మాట్లాడినా, ప్రజలు చెదిరిపోయింది లేదు. ఎక్కువ మంది ఉన్నా విషయం ఒక్కటే అన్న అవగాహనా కనపర్చారు. బీజేపీ కేంద్రీకృత పెత్తనం, మతతత్వం, రాష్ట్రాలపై దాడి వీటిని ఏకోన్ముఖంగా ఎదుర్కోవాలన్నదే వారందరి ప్రసంగాల సారాంశం. కేసీఆర్ ప్రభుత్వ పథకాలు కొన్ని చూసిన మేరకు వారు అభినందించారు. తమ రాష్ట్రాలలో విజయాలు కొన్ని ప్రస్తావించారు. సమాఖ్యతత్వంపై నడిచే విశాల భారతంలో నిజంగా జరగాల్సిందే అది. అక్కడెవరూ కృత్రిమమైన నాటకీయమైన విన్యాసాలు చేయలేదు. అతిశయాలు చెప్పలేదు. మోడీపై వ్యక్తిగత దాడీ చేయలేదు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడాది మొదట్లోనే లోక్‌సభ ఎన్నికలు రానుండగా ప్రతిపక్షాల మధ్య సదవగాహన ఆహ్వానించదగింది. ప్రయోజనకరమైంది. దేశానికి తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్నిచ్చిన కమ్యూనిస్టు కేరళ, దేశంలోనే పెద్దదైన ఉత్తరప్రదేశ్, నూతనశక్తుల ప్రభవానికి ప్రతీకగా పెంపొందుతున్న ఆప్ వంటి పార్టీల నేతలు ఒక వేదికపైకి రావడంలో విలక్షణత చూడటానికి కొందరికి మనస్కరించలేదు. వచ్చిన వారి విశిష్టతను చూడటానికి బదులు రానివారి గురించి ఎక్కువగా మాట్టాడటం మొదలెట్టారు.
కుటిల వ్యాఖ్యానాల బండారం
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు నుంచి స్టాలిన్ రాలేదేంటని ఇలా వెతకడం మొదలెట్టారు. వీరందరినీ వివిధ సందర్భాలలో కేసీఆర్ కలసివచ్చారనేది నిజం. వారిలో ఆయన అనుకున్న వారిని ఇక్కడకు పిలిచారు. మిగిలిన వారిని మరోచోటకి పిలవొచ్చు. లేదా తానే అక్కడకు వెళ్లొచ్చు. కొంతమంది రాకపోవచ్చు కూడా. అయితే దాన్ని బట్టి జరిగిన బ్రహ్మాండమైన సమీకరణ ఇచ్చిన కీలకసందేశం మరుగునపడతాయా? మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో విశాల రాజకీయ సమీకరణల్లో ఇదీ ఒకటి అవుతుంది కదా? అంతేగాక దేశంలో లౌకిక శక్తులను ఒకతాటిపైకి తేవాలనే యత్నంలో ఇదొక ముందడుగుకదా? ఇవన్నీ తెలిసి కూడా సమస్యను కేసీఆర్‌కూ ఆయన కుటుంబానికో లేక తెలంగాణకో పరిమితం చేసి మాట్టాడ్డంలో విజ్ఞత ఎక్కడీ మోడీ ప్రభుత్వం విధానాలపై పోరాటం, వాటివల్ల కలిగిన దుష్ఫలితాలను ఎదుర్కొనే కార్యక్రమం అవగాహన వంటివాటిపై కేంద్రీకరించడం ఇక్కడ ముఖ్యం. విశాలమైన అత్యవసరమైన ఈ జాతీయ పరిస్థితిని విస్మరించి కేవలం తెలంగాణలో ఏం జరిగింది? ఏం జరగలేదు? కేసీఆర్ గతంలో ఏం చెప్పారు? ఏం చేశారు? అనేదానిచుట్టూనే చర్చను గింగిరాలు తిప్పడం దుర్బుద్ధి గాక ఏమిటి? అది కూడా రాజకీయంగా గాక కుటుంబాలు వ్యక్తులపై కేంద్రీకరించడం... మరోవైపున సర్జికల్ స్ట్రయిక్స్, హిందూత్వ రాజకీయాల బెదిరింపులతో బండి సంజరు వంటివారు మాట్లాడే దూషణలను దురహంకార భాషణలను పట్టించుకోకపోవడం! తెలంగాణలో ఏక్దం బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని జోస్యాలు చెప్పి జోష్ పెంచిన వారికి మునుగోడు ఎదురుదెబ్బ తగిలినా కూడా వాస్తవాలను గమనించలేకపోవడం. పైగా అక్కడ టీఆర్ఎస్ విజయానికి కీలకంగా సహకరించిన సీపీఐ(ఎం), సీపీఐలను ఆడిపోసు కోవడం ఏమిటి? బీజేపీపై పోరాటంలో టీఆర్ఎస్ను ఎందుకు ఏ మేరకు బలపరుస్తున్నదీ తమ్మినేని వీరభద్రం వంటివారు ప్రతిసందర్భంలోనూ చెబుతున్నా సరే. ఇదేదో ఎన్నికల రాజకీయంగా ముద్ర వేయడంవారి నిజ స్వరూపాన్నే చెబుతుంది. నిజానికి మొన్నటి సభలోనూ ఆయన అనేక సమస్యలు ప్రస్తావించారని గమనించాలి. కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ మోడల్ వంటివి బిఆర్ఎస్ చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. కాని ఖమ్మం సభ ఉద్దేశం లేదా కమ్యూనిస్టుల లక్ష్యం బీజేపీని ఓడించడం నిరోధించడం. అది అవససరమో కాదో చెప్పకుండా మంచిదో కాదో తేల్చకుండా కెసిఆర్ చుట్టూనే చర్చ తిప్పడం తీరం చేర్చదు.
మౌలిక ప్రశ్న
ఈ నానా రకాల వ్యాఖ్యలు చేసేవారు చెప్పవలసింది ఒకటే - మతతత్వ రాజకీయాలనూ మోడీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను ఓడించాలా? వద్దా? ఆ దిశలో సాధ్యమైనంత ఐక్యతతో లౌకిక పక్షాలు కలసి సాగాలా వద్దా? బిఆర్ఎస్ ఎంత విస్తరిస్తుందనేది భవిష్యత్తు చెబుతుంది. ప్రత్యేకించి ఏపీలో స్పందన ఎలావుండేది కూడా తెలుస్తుంది. కాని అటూ ఇటూ చర్చ దానికే పరిమితం చేయడమేమిటి? తెలంగాణలో జరిగే పోరాటం మాత్రం తక్కువ కీలకమా? దక్షిణాదిన ఉన్న కర్నాటకలో కూడా బీజేపీ మెజార్టి తెచ్చుకోలేకపోవచ్చని సర్వేలు చెబుతుంటే తెలంగాణ గడ్డపై గెలిచే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామిక వాదుల పవిత్ర కర్తవ్యమా? పొత్తులు కలయికల గురించి అక్కడ ఎవరూ మాట్లాడింది లేదు. దాదాపు ముప్పై ఏండ్లలో ఎన్నికల తర్వాతనే ప్రభుత్వాల ఏర్పాటు ప్రధాని అభ్యర్థి వంటివి ముందుకొస్తాయని చరిత్ర చెబుతున్నది. సీతారాం ఏచూరి పదేపదే గుర్తు చేస్తూనే ఉన్నారు. అయినా సరే కృత్రిమంగా దాన్ని ముందుకు తెచ్చి నితీశ్ వర్సెస్ మమత వర్సెస్ కేసీఆర్ వర్సెస్ కేజ్రీవాల్ అంటూ అసందర్భ చర్చలతో పక్కదోవ పట్టించడం బీజేపీకే దోహదకరం. కాంగ్రెస్ పాత్ర గురించి సవాళ్లు తీసుకురావడం. బాగా బలహీనపడినప్పటికీ కాంగ్రెస్ రాజకీయ స్థానం వారి విధానాలపైన ఇతర పార్టీల ప్రభావాన్ని గుర్తించడంపైనా ఆధారపడివుంటుంది. అదీ ఇప్పటి చర్చ కాదు. రేపు తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో మూడు ఉత్తరాది రాష్ట్రాలలోనూ ఈశాన్యంలోనూ అది ఏ మేరకు పోరాడుతుందనే దాన్ని బట్టి ప్రజలకు స్పష్టత వస్తుంది. ఇక త్రిపురలో వామపక్షాలు కాంగ్రెస్ ఒక ప్రాథమికఅవగాహనకు వచ్చినట్టు వార్తలున్నాయి. తెలంగాణ వరకూ బిఆర్ఎస్ను బీజేపీ బిటీం అని కాంగ్రెస్ కొట్టిపారేయడం కనిపిస్తూనే ఉంది. దేశంలో చాలా చోట్ల వారి తీరుకు ఇది భిన్నంగా లేదు. ఖమ్మం సభకూ ఆ సమస్యకూ అసలు సంబంధం లేదు. ఏమైనా దేశంలో లోక్‌సభ ఎన్నికల దిశలో ఏడాది ముందుగానే లౌకిక ప్రతిపక్షాల మధ్య అవగాహన సూచనలు స్వాగతించదగినవి. ఎవరెన్నివిధాల తక్కువ చేసినా తికమక పెట్టినా చెరిగిపోని సత్యమిది. షరా మామూలగా కమ్యూనిస్టుల విధాన స్పష్టతనూ కార్యాచరణ లో ప్రజా నిబద్దతను వెనక్కునెట్టి అకారణ ఆరోపణలూ అవహేళనలకు గురిచేసే కుటిల రాజకీయాలూ ఎప్పటిలాగే విఫలమవడమూ అనివార్యం. ఎందుకంటే ఖమ్మం ఒక శుభారంభం. రాష్ట్రానికి దేశానికీ కూడా!
- తెలకపల్లి రవి